భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ). నిజాం నవాబుకూ, ఆయన తొత్తులైన భూస్వాములకూ వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చిందామె. 1895 సెప్టెంబర్ 26న సద్దుల బతుకమ్మ నాడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్ణాపురంలో ఆమె జన్మించింది. చిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన నర్సయ్యతో వివాహం అయింది.
పాలకుర్తి పరిసరాల్లో మల్లంపల్లి దొరవద్ద కొంత భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకొని సాగు చేసింది. ఇది పాల కుర్తి పొరుగునే ఉన్న విస్నూర్ గ్రామానికి చెందిన దేశ్‌ముఖ్ రేపాక రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది. దొర గడీల్లో వంతుల వారీగా వెట్టి చేసే ఐలమ్మ కుటుంబం సొంతంగా భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకోవడం సహించలేక పోయాడు. ఐలమ్మ భూమిని కాజేయాలనీ, ఆమె పండించిన పంటను గూండాలతో కొల్లగొట్టించాలనీ చూశాడు. ఐలమ్మ ‘ఆంధ్ర మహాసభ’ నాయకత్వంలో ఎర్రజెండా పట్టింది. పోరాడింది.‘గుత్పల సంఘం’ సభ్యులు, గ్రామ స్థుల సహకారంతో పంటను తరలించుకు పోవడానికి వచ్చిన గూండాలను తరిమి కొట్టింది. ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణలో భూపోరాటానికి నాంది అయింది. చివరకు రైతాంగ సాయుధ పోరాటం సాగి వేలాది ఎకరాలు సాగు చేసుకునే రైతుల పరం అయ్యాయి. ఐలమ్మ 1985 సెప్టెంబర్ 1న తుది శ్వాస విడిచింది.
ఉద్యమనాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక చొరవతో వేసిన సబ్ కమిటీ తెలంగాణ పాఠశాల విద్యలో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజక వర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌కి ‘చాకలి ఐలమ్మ’ పేరు పెట్టి ప్రభుత్వం ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకొంది.
అంతేకాదు చిట్యాల ఐలమ్మను ‘తెలంగాణ తల్లి’గా గుర్తించి 2021 సెప్టెంబర్ 26 నుండి ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది.
– కొండూరు సత్యనారాయణ, రజక సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన సలహాదారు
Comments
Please login to add a commentAdd a comment