అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ వేర్వేరా? అంటే కశ్చితంగా కాదు అని చెప్పగలిగే ధైర్యం, సమానత్వం ఈ సమాజంలో ఉందా? ఆడవాళ్లకు దేశాన్ని పాలించే సత్తా ఉంది అని టీవీల్లో, పేపర్లో చూసి వాళ్లను మెచ్చకుంటారు..కానీ అలాంటి నైపుణ్యాలు ఉన్న ఆడపిల్ల నీ ఇంట్లోనూ ఉందని ఏనాడైనా తెలుసుకున్నావా?
అబ్బాయిని పై చదువులకు పంపాలంటే ధూమ్‌ధామ్‌గా పంపే తల్లిదండ్రులు అమ్మాయిల చదువులకు మాత్రం ఆలోచిస్తున్నారు. ఆ డబ్బలన్నీ కట్నం కింద పోగేసి పెళ్లి చేసేస్తే పెద్ద బాధ్యత తీరిపోతుంది అనుకునేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఇది ఎంతకాలం? అమ్మాయి తల్లిదండ్రులు ఎప్పటికీ భయపడుతూ, భయపెడుతూ బతకాల్సిందేనా?
నీ దృష్టిలో అబ్బాయే ఆదర్శనీయుడైతే, అమ్మాయి కూడా ఆధునికురాలే. మహిళ దేశాన్ని ఏలగలదు అనుకుంటావు. కానీ నీ కూతుర్ని మాత్రం ఇంకా ఆ పుక్కిడి పురాణాల్లోనే బంధిస్తున్నావు. నువ్వు కనీసం ఒక్కసారైనా ఇలా ఆలోచించలేదు.నువ్వుంటున్న ఆ గాఢాంధకారం వల్లే ఆమె ఇంకా వెలుగులను చూడలేకపోతుందని.ఒక్కసారి ఆ కళ్ళలోతుల్లోకి చూసే ప్రయత్నం చేశావా?
నువ్వు చూసిన ఆ చిన్న చూపే ఆమె కళ్ళలో ఉన్న కలలను చిదిమేశాయని తెలుసుకో.తను ఒంటరై ఏడ్చిన ఆ కన్నీళ్ల బరువు తెలుసుకో.ఏ సమాజమైతే ఆమెను ఇన్నాళ్లు ఛీత్కరించిందో అదే హీన చూపు తనను ఇంకా అభద్రతా భావంలోకి నెట్టేసిందని తెలుసుకో.అయినా గతమంతా ఇదే కదా..అదే కథా!ఇప్పటికే ఆ చీత్కారాలే ఇంకా చెవుల్లో కర్ణకఠోరంగా మ్రోగుతూనే ఉన్నాయి.
ఓ ప్రియ మిత్రమా.. ఇది నీకే ..ఇప్పటికీ నువ్వు పిశాచాల వేటకు బలికావలసిందేనా?నీ జీవితమంతా ఇతరులపై ఆధారపడడమేనా?కానీ వాళ్ళు నీ అసలు సిసలు నిర్వచనాన్ని ఎలా మరిచారు?బహుశా నీతో పోటీ పడలేమని వాళ్ల భయం కావచ్చు. అందుకే నీ లక్ష్యాలను అణచివేయాలని నిర్ణయించుకున్నారు కావచ్చు.
వాళ్ళు ఎలా మరచిపోయారు నిన్ను చేరుకోవడం అసాధ్యం అని.ప్రేమను పంచడంలో ఒక అమ్మ స్థానాన్ని వేరెవరూ భర్తీ చేయలేరని.నిస్వార్థమైన ప్రేమను చూపే కూతురి సంతోషం ముందర ప్రపంచంలో ఉన్న మొత్తం ఆనందాలను తీసుకొచ్చినా సరిపోల్చలేమని.నీ కలల సామ్రాజ్యానికి నువ్వే మహారాణివైతే వేరెవరి విమర్శలు నీ స్థానాన్ని తగ్గించలేరని..
ఇంగ్లీష్ రచన -శ్రీయాన్షు,
సెయింట్ ఆన్స్ స్కూల్,హైదరాబాద్
తెలుగు అనువాదం - శ్రీధర్ కందుకూరి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment