హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ సాయుధ యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం బాగ్‌లింగంపల్లిలోని వీఎస్‌టి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 31 వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం స్పూర్తిదాయకమని, ఆమె పోరాటం, త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రజకులను గ్రామబహిష్కరణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృత్తులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది అసువులు బాసారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమకారులను జైల్లోపెట్టి కొట్టిన కాంగ్రెస్ నేతలు నేడు ఓడిపోయారన్నారు. కొండూరు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, కాలప్ప, జీవన్, శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య భట్, యాదమ్మ, ముదిగొండ మురళి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.