Minister Naini narsimhareddy
-
ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గడచిన రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధిని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వంటి రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని అక్కడి రాజకీయ నాయకులు ఎన్నికల హామీ ఇస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో అతి తక్కువ వయస్సు, అనుభవం ఉన్న రాష్ట్రం బృహత్తరమైన కార్యక్రమాలు చేపడుతూ అన్నింటిలో నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. విద్యాభివృద్ధికి కృషి చేసిన 34 మందికి ఉత్తమ లెక్చరర్ అవార్డును, విద్యా సంస్థల అభ్యున్నతికి పాటుపడిన 31 మందికి అబ్దుల్ కలాం అవార్డులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు ప్రైవేట్ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ అధ్యక్షుడు అమరేశ్ పాల్గొన్నారు. -
ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహం:నాయిని
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ సాయుధ యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం బాగ్‌లింగంపల్లిలోని వీఎస్టి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 31 వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం స్పూర్తిదాయకమని, ఆమె పోరాటం, త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రజకులను గ్రామబహిష్కరణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృత్తులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది అసువులు బాసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను జైల్లోపెట్టి కొట్టిన కాంగ్రెస్ నేతలు నేడు ఓడిపోయారన్నారు. కొండూరు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, కాలప్ప, జీవన్, శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య భట్, యాదమ్మ, ముదిగొండ మురళి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నిజాంపాలనలో అభివృద్ధి అమోఘం:హోంమంత్రి
నాంపల్లి: నిజాం నవాబులు తమ పాలనలో అభివృద్ధికి పెద్ద పీట వేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో బద్రివిశాల్ పన్నాలాల్ పిత్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 450 మంది మెరిట్ విద్యార్థులకు రూ.70 లక్షలు ఉపకార వేతనాలు అందజేశారు. ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం మాట్లాడుతున్న డ్రైనేజీ, మంచినీటి వసతి, విద్య, ఆరోగ్యాల పరిరక్షణకు నిజాం పాలన నాటి నుంచే బలమైన బీజాలు పడ్డాయన్నారు. దీనికి అప్పటి నిజాం రాజుకు సలహాదారుగా ఉన్న మోతీలాల్ పిత్తి లాంటి వారి దూరదృష్టి ప్రముఖంగా ఉందన్నారు. నిజాం నవాబుల పాలనలో హైదరాబాదు అభివృద్ధి కోసం సలహాలు అందించి మోతీలాల్ పిత్తి, బద్రివిశాల్ పిత్తి ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. బద్రి విశాల్ పిత్తి అప్పట్లో అన్ని ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలకు నాయకత్వం వహించడమే కాకుండా, పేదలకు ఆర్థిక సాయం అందించేవారని, దీనిని ఆయన తనయుడు శరద్ బి.పిత్తి కొనసాగించడం అభినందనీయమన్నారు. బద్రి విశాల్ పన్నాలాల్ పిత్తి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శరద్ బి.పిత్తి మాట్లాడుతూ ఈ సంవత్సరం 6 నుంచి మొదలుకుని పీజీ విద్య దాకా 1300 మందికి ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. తాము విద్యలో ప్రతిభ ఉన్న పేదలకు మాత్రమే ఉపకార వేతనాలు అందిస్తామన్నారు. ట్రస్టీలు అక్షయ్ ఎ.పిత్తి, జి.విజయ్ కుమార్, అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.