ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గడచిన రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధిని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వంటి రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని అక్కడి రాజకీయ నాయకులు ఎన్నికల హామీ ఇస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో అతి తక్కువ వయస్సు, అనుభవం ఉన్న రాష్ట్రం బృహత్తరమైన కార్యక్రమాలు చేపడుతూ అన్నింటిలో నంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. విద్యాభివృద్ధికి కృషి చేసిన 34 మందికి ఉత్తమ లెక్చరర్ అవార్డును, విద్యా సంస్థల అభ్యున్నతికి పాటుపడిన 31 మందికి అబ్దుల్ కలాం అవార్డులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులతోపాటు ప్రైవేట్ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ అధ్యక్షుడు అమరేశ్ పాల్గొన్నారు.