మా సమస్యలపై చర్చించండి | Discuss on our problems | Sakshi
Sakshi News home page

మా సమస్యలపై చర్చించండి

Sep 7 2016 12:51 AM | Updated on Nov 9 2018 5:56 PM

మా సమస్యలపై చర్చించండి - Sakshi

మా సమస్యలపై చర్చించండి

నదీ జలాల వివాద పరిష్కారం కోసం కేంద్రం నిర్వహించనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీలో తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి

- అపెక్స్ కౌన్సిల్ భేటీపై కేంద్రానికి హరీశ్‌రావు విజ్ఞప్తి
- పట్టిసీమ మళ్లింపులో తమకు వాటా రావాలని స్పష్టీకరణ
- పోతిరెడ్డిపాడు లెక్క తేల్చాలని ఉమాభారతికి విన్నపం
- పెసరకు మద్దతు ధరపై రాధామోహన్‌కు విజ్ఞప్తి
- పటాన్‌చెరు రహదారికి నిధులిచ్చేందుకు గడ్కరీ అంగీకారం

సాక్షి, న్యూఢిల్లీ: నదీ జలాల వివాద పరిష్కారం కోసం కేంద్రం నిర్వహించనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీలో తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి రాష్ట్ర నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఉమాభారతి, రాధామోహన్‌సింగ్, నిర్మలా సీతారామన్, గడ్కరీతో హరీశ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లిస్తోందని.. బచావత్ అవార్డు ప్రకారం ఆ మళ్లింపులో తెలంగాణకు వాటా ఉంటుందని  చెప్పారు.

ఈ వాటా సంగతి తేల్చి, తమకు నీటిని కేటాయించే అంశాన్ని అపెక్స్ కౌన్సిల్ భేటీ ఎజెం డాలో పెట్టి, చర్చించాలని కోరామన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ఎక్కువ నీళ్లు తీసుకెళుతూ.. లెక్కల్లో తక్కువగా చూపుతోందని, దీనిపైనా చర్చించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. అసలు ఈ తీరును నివారిం చేందుకు ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు ఇరు రాష్ట్రా ల్లో పర్యవేక్షించేలా సంయుక్త పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలని.. టెలీమెట్రీ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించామన్నారు. ఇందిర మ్మ వరద కాలువ ప్రాజెక్టును సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిందని.. పెట్టుబడి ఆమోద ప్రక్రియ పూర్తయితే కేంద్ర సాయం అందుకునే వీలున్నందున ఆ ప్రక్రియను పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. నిజాంసాగర్ కాలువల ఆధునీకరణకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం వచ్చేలా చూడాలని కోరామన్నారు.

 పెసర పంటకు ‘మద్దతు’
తెలంగాణలో పెసర పంట ఇప్పటికే మార్కెట్లోకి వచ్చినందున... కేంద్రం ప్రకటించిన మద్దతు ధర అక్టోబర్ 1 నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచే అమలయ్యేలా చూడాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను హరీశ్‌రావు కోరారు. ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.3,500కు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉందని.. దీంతో రైతులు నష్టపోతున్నారని వివరించారు. రూ.425 బోనస్‌తో కలిపి రూ.5,225 మద్దతు ధరను తక్షణం అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర మంత్రి అంగీకరించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయించారని భేటీ అనంతరం హరీశ్‌రావు వివరించారు. అలాగే జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ మిషన్ అమలులో ఉన్న సాంకేతిక సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల నిల్వ కోసం నిర్మిస్తున్న గిడ్డంగులకు సబ్సిడీ అందించాలని కోరగా.. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి, ఉత్తర్వులు జారీ చేశారని హరీశ్ వివరించారు. ఇక ముంబై-హైదరాబాద్ జాతీయ రహదారి పటాన్‌చెరు-హైదరాబాద్ మధ్య బాగా పాడైనందున దానిని నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి హరీశ్ విజ్ఞప్తి చేశారు. అందుకు అవసరమైన రూ.48 కోట్ల విడుదలకు గడ్కరీ అంగీకరించారని, రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారని హరీశ్ తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కోల్డ్ స్టోరేజీ యూనిట్లకు కేంద్ర వాటా కింద రూ.65 కోట్లు ఇవ్వాలని నిర్మలా సీతారామన్‌కు హరీశ్‌రావు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement