సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం మరో అక్రమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం, పర్యావరణ అనుమతి తీసుకోకుండా అచ్చంపేట ఎత్తిపోతల నిర్మాణానికి సిద్ధమైంది. శ్రీశైలం జలాశయం నుంచి 5 టీఎంసీలను తరలించి అచ్చంపేట నియోజకవర్గంలో 57,200 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా రూ.1,061.39 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. బుధవారం టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
దీనిని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా నదిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కానీ శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించడానికి తెలంగాణ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను 2015లో చేపట్టింది.
ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కారుకు దొరికిపోయిన నాటి సీఎం చంద్రబాబు.. ఈ ఎత్తిపోతలను అడ్డుకోవడంలో, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో విఫలమయ్యారు. ఇప్పుడు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా అదనంగా 5 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించి, వాటిని ఎదుల రిజర్వాయర్‌లో నిల్వ చేసి, అక్కడి నుంచి ఉమామహేశ్వర రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి అచ్చంపేట ఎత్తిపోతల కింద కొత్తగా నిర్మించే రిజర్వాయర్లలోకి తరలించేలా తెలంగాణ నూతన ప్రాజెక్టు చేపట్టింది.
దీనికి పర్యావరణ అనుమతి, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోలేదు. ఈ ఎత్తిపోతలను తక్షణమే నిలిపివేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి శాఖకు, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎన్జీటీలో పిటిషన్ వేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment