సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ పరిధిలో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఈ నెల 10లోగా సమర్పించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో అనుమతిలేని ప్రాజెక్టులపై ముందుకెళ్లరాదని స్పష్టం చేసింది. బోర్డు ఆదేశంతో ప్రాజెక్టుల సాంకేతిక అనుమతి కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘానికి, వాటి ఆమోదం కోసం అపెక్స్ కౌన్సిల్‌కు నివేదికలు సమర్పించేందుకు తెలంగాణ అంగీకరించగా ఏపీ ఇప్పటికే కొన్ని డీపీఆర్‌లను ఇచ్చింది. మిగిలిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను సాంకేతిక అనుమతి బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. గోదా వరి బేసిన్ పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, నీటి వాటాలు, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, మళ్లింపు జలాల్లో వాటా, టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు అంశాలపై చర్చించేందుకు గోదావరి బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లోని ‘జలసౌధ’లో సమావేశమైంది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్‌దాస్‌లతోపాటు ఈఎన్‌సీలు మురళీధర్, నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు ఎజెండా అంశాలతోపాటు ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై నాలుగు గంటలపాటు చర్చిం చారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లపై వాడివేడిగా చర్చ జరిగింది.
ఆ ప్రాజెక్టులన్నీ రీ ఇంజనీరింగ్ చేసినవే: తెలంగాణ
బోర్డు భేటీలో పలు అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు వాదనలు బలంగా వినిపించారు. ముఖ్యంగా గోదావరి నదిలో తమకు 967 టీఎంసీల మేర వాటా ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్ గుర్తుచేశారు. తమ వాటా మేరకే నీటి వినియోగాన్ని చేసుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. తమ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తామన్నారు. అయితే దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. బచావత్ అవార్డు ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయలేదని బోర్డు దృష్టికి తెచ్చింది. కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, తమ్మిడిహెట్టి, ఛనాకా–కొరటా, రాజంపేట, పింపార్డ్ ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని వాదించింది. ఏపీ వాదనపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ... ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులనే రీ ఇంజనీరింగ్ చేశామని, వాటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేసింది. దీన్ని ఏపీ ఖండించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులిచ్చే ముందు దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అదేమీ జరగని దృష్ట్యా తెలంగాణకు ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని కోరుతూ కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసినట్లు వివరించింది. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు ఏపీ మళ్లిస్తున్నందున తమకు 45 టీఎంసీల వాటా రావాలని తెలంగాణ మరోమారు కోరింది. అయితే దీనికి అభ్యంతరం చెప్పిన ఏపీ... ఉమ్మడి రాష్ట్రానికి 45 టీఎంసీలని అవార్డులో ఉందని, ఈ మళ్లింపు జలాల్లో తమకు వాటా దక్కుతుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనకు పంపినందున అక్కడి నుంచి వచ్చే ఆదేశాల వరకు ఆగాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించింది. పోలవరం బ్యాక్ వాటర్ సర్వే చేయాలని తెలంగాణ కోరింది. గరిష్ట వరదలు నమోదైనప్పుడు తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని చెప్పగా ఇప్పటికే కేంద్ర జల సంఘం అధ్యయనం చేసి తెలంగాణకు ఎలాంటి ముంపు లేదని నిర్ధారించిందని ఏపీ స్పష్టం చేసింది.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్
టెలిమెట్రీపై నిపుణులతో కమిటీ..
అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రధాన ప్రాంతాల్లో నీటి ప్రవాహ లెక్కల నమోదు కోసం టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏయే ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలనే విషయమై ఇరు రాష్ట్రాలతోపాటు సీడబ్ల్యూసీ, పుణేలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌లోని ఇంజనీర్లతో బోర్డు ఓ కమిటీని నియమించింది.
సత్వరమే ‘అపెక్స్’ఎజెండా: చంద్రశేఖర్ అయ్యర్
కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాల గురించి వివరణ ఇవ్వాలని తెలంగాణను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే అపెక్స్ భేటీలో చర్చించాల్సిన ఎజెండా అంశాలను సత్వరమే పంపాలని కోరగా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు. తెలంగాణ చేపట్టిన పెద్దవాగు ఆధునీకరణ పనులను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఏపీ ఒప్పుకున్నట్లు తెలిపారు. అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఇదివరకే ఇరు రాష్ట్రాలను కోరామని, అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసినట్లు తెలిపారు.
ఎస్సారెస్పీ డీపీఆర్‌నూ అడగటం విచిత్రం...
రాష్ట్రంలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు లేవని బోర్డుకు చెప్పాం. పాత ప్రాజెక్టులకే రీ ఇంజనీరింగ్ చేశాం తప్పితే కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని వివరించాం. కాళేశ్వరం పాత ప్రాజెక్టేనని కేంద్రం లేఖ సైతం ఇచ్చింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాక తేలుస్తాం. రాష్ట్రానికి 967 టీఎంసీల వాటా ఉంది. ఈ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తాం. ఇక ఎస్సారెస్పీ ప్రాజెక్టు డీపీఆర్‌ను అడగటం విచిత్రం. 2014 జూన్ 2కు ముందు పూర్తయిన డీపీఆర్‌లు అడగొద్దని స్పష్టంగా చెప్పాం.– రజత్‌కుమార్, నీటిపారుదల శాఖ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment