► కేంద్ర జల వనరుల శాఖకు లేఖలు రాసిన కృష్ణా, గోదావరి బోర్డులు
► తక్షణమే ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్ర జల వనరుల శాఖ నేతృత్వాన ఇరు రాష్ట్రాల సీఎంలతో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించ డమే పరిష్కార మార్గమని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు కేంద్ర జల వనరుల శాఖకు స్పష్టం చేశాయి. కొత్త ప్రాజెక్టులపై వివాదం సమసిపోవాలన్నా, మళ్లింపు జలాలకు పరిష్కారం దొరకాలన్నా, నీటి వాటాలపై స్పష్టత రావాలన్నా అపెక్స్ కౌన్సిల్ భేటీ అత్యావశ్యమని తెలిపాయి. ఈ మేరకు రెండు బోర్డులు శుక్రవారం విడివిడిగా కేంద్ర జల వనరుల శాఖకు లేఖలు రాశాయి.
అన్నింటికీ అదే మందు...
కృష్ణా, గోదావరి బేసిన్‌లోని వివాదాలపై గత రెండేళ్లలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించిన కేంద్రం.. ఇరు రాష్ట్రాల మధ్య ఓ అవగాహన కుదర్చడంతో తాత్కాలిక పరిష్కారం దొరికిం ది. ఈ ఏడాది ఎలాంటి భేటీ జరగలేదు. దీంతో జల వివాదాలు మరింత ముదిరాయి. తెలంగాణ రీ–ఇంజనీరింగ్ చేస్తున్న పాల మూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ, భక్తరామదాస, తుమ్మిళ్ల, కంతనపల్లి వంటి ప్రాజెక్టులను కేంద్రం, బోర్డు అనుమతులు లేవని ఏపీ అంటోంది. ప్రతిగా ఏపీ చేపట్టిన పులికనుమ, సిద్ధాపురం, గాజులదిన్నె, గుండ్రే వుల, శివభాష్యం సాగర్, మున్నేరు, ముచ్చు మర్రి, గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్ కుడి కాల్వ అంశాలని తెలంగాణ తెరపైకి తెచ్చింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని 85(సి) నిబం« ధన కింద ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా, ఎలాంటి అనుమతులు, కేటాయింపు లు లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టులను కేంద్రం నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవా లని కోరింది. దీనిపై బోర్డు ముందు వాదనలు జరిగినప్పటికీ పరిష్కారం దొరకలేదు.
జలాల మళ్లింపు మరింత జటిలం...
ఇక నదీ జలాల మళ్లింపు అంశం మరింత వివాదాస్పదంగా మారింది. పట్టిసీమ ద్వారా ఏపీ తరలిస్తున్న నీటిలో తెలంగాణకు 45 టీఎంసీలు రావాలని, పోలవరం ద్వారా మరో 45 టీఎంసీలు దక్కాలని తెలంగాణ అంటోం ది. దీనికి బదులుగా ఏపీ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు నకు విరుద్ధంగా తెలంగాణ సర్కార్ పలు ప్రాజెక్టుల ద్వారా 163 టీఎంసీల జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తోం దని అంటోంది.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో 14(బీ) క్లాజ్ ప్రకారం 163 టీఎంసీల మళ్లింపు జలాల్లో ఏపీకి వాటా ఇవ్వాలని అంటోంది. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఏపీకి లభించే 811 టీఎంసీల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలు దక్కుతాయని ఒప్పందం ఉంది. గోదావరిలో లభ్యంగా ఉన్న 1,480 టీఎంసీలకు సంబంధించి ఎలాంటి ఒప్పందం లేదు. నీటి లభ్యత, పరీవాహకం ఆధారంగా తెలంగాణకు 954 టీఎంసీ, మిగితావి ఏపీవన్న అవగాహనతో ముందు కెళుతున్నాయి. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ వీటన్నిటికీ మార్గం చూపుతుందని బోర్డులు కేద్రానికి సూచించాయి.