Godavari basin
-
నీళ్లు.. నేలమట్టం.. డెడ్ స్టోరేజీలో జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన జలాశయాల్లో కూడా నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో 2015–16 తర్వాత ఇంతగా నీటి సమస్య రావడం ఇదే తొలిసారి. ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు 2023–24 నీటి సంవత్సరం (వాటర్ ఇయర్ – జూన్ నుంచి మే వరకు)లో తగిన వరద రాలేదు. నిజానికి మొదట్లో రాష్ట్రంలో సాధారణం కంటే 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా.. అక్టోబర్ తర్వాత వానలు జాడ లేకుండా పోయాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మధ్య సాధారణ వర్షపాతంతో పోల్చితే.. 56.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనితో జలాశయాల్లోకి కొత్త నీరు చేరక.. ఉన్న నీటి నిల్వలు శరవేగంగా అడుగంటిపోతూ వచ్చాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో 14 ప్రధాన జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయి. దీనితో మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా కటకట తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ జూన్‌లో వానలు ఆలస్యంగా మొదలైతే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ‘కృష్ణా’లో ఏడేళ్ల తర్వాత మళ్లీ కరువు.. ఏడేళ్ల తర్వాత ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు అతి తక్కువ ఇన్‌ఫ్లో వచ్చింది. శ్రీశైలం జలాశయానికి ఏటా సగటున వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల వరద వస్తుందని అంచనా. కానీ 2015–16లో అతి తక్కువగా 71 టీఎంసీలే చేరింది. ఆ తర్వాత మళ్లీ 2023–24లో 144.36 టీఎంసీలు మాత్రమే వరద వచ్చింది. ఇక నాగార్జునసాగర్‌కు కూడా సాధారణంగా వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీలు రావాల్సి ఉండగా.. 2015–16లో కేవలం 72 టీఎంసీలు.. ఆ తర్వాత మళ్లీ తక్కువగా ఈసారి 147 టీఎంసీలు వరద మాత్రమే వచ్చింది. కనీస నిల్వలూ కరువే! శ్రీశైలం జలాశయంలో సాగునీటి అవసరాలకు ఉండాల్సిన కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 854 అడుగులుకాగా.. ఇప్పటికే 810 అడుగులకు పడిపోయింది. నిల్వలు 34.29 టీఎంసీలకు పడిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 510 అడుగులుకాగా.. ప్రస్తుతం 511.5 అడుగుల వద్ద ఉంది. నిల్వలు 134.23 టీఎంసీలకు తగ్గిపోయాయి. అయితే ఇందులో వాడుకోగల నీళ్లు అతి తక్కువే. ఇక జూరాల ప్రాజెక్టు కనీస మట్టం 1033 అడుగులకుగాను.. ఇప్పటికే 1031.27 అడుగులకు పడిపోయింది. గోదావరిలో మూడేళ్ల కనిష్టానికి వరదలు గోదావరి నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ ఏడాది ఇన్‌ఫ్లోలు గణనీయంగా తగ్గాయి. ఇంత తక్కువ వరదలు రావడం మూడేళ్ల తర్వాత ఈసారే. కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2023–24లో 203.73 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20 తర్వాత ఇంత తక్కువ వరద రావడం ఇదే తొలిసారి. 2022–23లో 593 టీఎంసీలు, 2021–22లో 678 టీఎంసీలు, 2020–21లో 368 టీఎంసీలు వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా 2019–20 తర్వాత ఈసారి అతితక్కువగా 396 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. ప్రస్తుతం జలాశయంలో 7.53 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. 20.1 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో గత ఏడాది ఇదే సమయానికి 12.26 టీఎంసీల నీళ్లు ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాది మిడ్ మానేరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. దిగువ మానేరుకు సైతం 2019–20 తర్వాత అతితక్కువగా ఈ ఏడాది 78 టీఎంసీలే ఇన్‌ఫ్లో నమోదైంది. ఒకేసారి వచ్చి.. లాభం లేక.. గోదావరిపై ప్రధాన ప్రాజెక్టుల్లోకి వందల టీఎంసీల్లో నీరు వచ్చినట్టు లెక్కలు చెప్తున్నా.. అదంతా భారీ వరద కొనసాగే కొద్దిరోజుల్లోనే కావడం గమనార్హం. అప్పుడు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో నీరంతా దిగువకు వెళ్లిపోయింది. తర్వాత వానలు లేక ఇన్‌ఫ్లో లేకుండా పోయింది. ప్రాజెక్టులు అడుగంటే పరిస్థితి వచ్చింది. మంజీరా వెలవెల సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్‌లోనూ నీళ్లు అడుగంటుతున్నాయి. హైదరాబాద్ జంట నగరాలకు మంజీరా నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. ఏప్రిల్ తొలివారంలోనే ఇలా ఉంటే.. మే వచ్చే సరికి నీటి సరఫరా పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఇంకా మొదలుకాని వరదలు.. జలాశయాలు వెలవెల
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని జలాశయాలు వెలవెలబోతున్నాయి. ప్రధాన జలాశయాల్లో నిల్వలు అడుగంటి పోయాయి. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో మొత్తం 386.8 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 285.21 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఆల్మట్టి డ్యాంలో గతేడాది సరిగ్గా ఇదే సమయానికి 91.35 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 21 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఎట్టకేలకు డ్యాంకు గత మంగళవారం నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రస్తుతం 19,172 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో డ్యాంలోకి వచ్చి చేరుతోంది. రోజుకు 1.66 టీఎంసీల వరద ఆల్మట్టిలో చేరుతుండగా, మరో 108 టీఎంసీల వరద వచ్చిచేరితేనే డ్యాం నిండనుంది. ఇక నారాయణపూర్ జలాశయంలో 17 టీఎంసీలు, తుంగభద్ర డ్యాంలో 6.89 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. జూరాలకు ఇంకా మొదలుకాని ఇన్‌ఫ్లో నారాయణపూర్, జూరాలకు ఇప్పటివరకు ఎలాంటి ఇన్‌ఫ్లో ప్రారంభం కాలేదు. శ్రీశైలంకు 126 క్యూసెక్కుల నామమాత్రపు వరద వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాంలు పూర్తిగా నిండితేనే దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరద నీరు రానుంది. నైరుతి రుతుపవనాలు ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడం, ఇంకా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండడంతో ఈ డ్యాంలు ఇప్పట్లో నిండే సూచనలు కనపడటం లేదు. ప్రాణహితకి స్వల్పంగా పెరిగిన వరద.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాణహిత నదికి స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీకి ప్రస్తుతం 1,23,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,19,878 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీకి వస్తున్న 83,945 క్యూసెక్కులను వచ్చినట్టు కిందికి పంపిస్తున్నారు. -
గడువు ముగిసినా గొడవలే..!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలకు చరమగీతం పాడటానికి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుల అప్పగింత, పరిధిపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నోటిఫికేషన్ అమలును కేంద్రం పొడిగించిన ఆరు నెలల గడువు కూడా జూలై 15కే పూర్తయింది. అయినా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో బోర్డులు విఫలమయ్యాయి. దీనిపై బోర్డులు, కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించడం లేదు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సద్దుమణగడం లేదు. రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కోరారు. గతేడాది శ్రీశైలంలోకి వరద ప్రవాహం లేకున్నా, నీటి నిల్వ కనిష్ట స్థాయిలో ఉన్నా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నప్పటికీ, బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. దీనివల్ల కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాంతో కేంద్రంలో కదలిక వచ్చింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెల్లలో కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆర్నెల్లలో అనుమతి తెచ్చుకోవాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఏపీ భూభాగంలోని శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, తెలంగాణ సర్కారు దాని పరిధిలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ అమలు గడువు జనవరి 15తో పూర్తయినా, ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. దీంతో కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ గడువును జూలై 15 వరకు పొడిగించింది. ఈ క్రమంలోనే విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి (పాతది), నెట్టెంపాడు (పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా పూర్తయి మూడు నెలలు దాటింది. అయినా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్త రామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు డీపీఆర్‌లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ రూపొందించిన విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఇదే అదనుగా తెలంగాణ ఇటీవల వరద తగ్గాక కూడా శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దీనివల్ల పది రోజుల్లోనే సుమారు 32 టీఎంసీల జలాలు ప్రకాశం బ్యారేజి మీదుగా సముద్రంలో కలిసిపోయాయి. అయినా కేంద్ర జల్‌శక్తి శాఖ గానీ, బోర్డులు గానీ పట్టించుకోవడంలేదు. -
10 రోజులు ఏపీ వ్యాప్తంగా అనూహ్య వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 10 రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా అన్ని ప్రాంతాల్లోను పడుతుండడం ప్రత్యేకంగా చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నా గతంలో అది కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేది. కానీ ఈసారి అన్ని జిల్లాల్లోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధికం ఈ నెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 17.69 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ 10 రోజుల్లో 82.3 మిల్లీమీటర్ల వర్షం పడాలి. కానీ 99.99 మిల్లీమీటర్ల వర్షం పడింది. 8 జిల్లాల్లో 50 నుంచి 90 శాతం అధిక వర్షం కురిసింది. బాపట్ల జిల్లాలో 90.4 శాతం అధిక వర్షం పడింది. అక్కడ 84.9 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 161.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో 70 శాతం, విజయనగరం జిల్లాలో 62.2 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61.2, ఏలూరు జిల్లాలో 66.4, కృష్ణాలో 51, గుంటూరు జిల్లాలో 64.5, పల్నాడు జిల్లాలో 50.4 శాతం అధిక వర్షం కురిసింది. ఒక్క నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షం పడింది. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లు కళకళ భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్లలో రిజర్వాయర్లలోకి బాగా నీరు చేరి కళకళలాడుతున్నాయి. గోదావరి బేసిన్లో లక్ష్మి, సమ్మక్క బ్యారేజీల నుంచి దిగువకు భారీగా నీటిని వదులుతున్నారు. కృష్ణా బేసిన్లో తుంగభద్ర, సుంకేశుల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీ నిండిపోవడంతో 10 రోజులుగా వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. పెన్నా బేసిన్లో గండికోట, మైలవరం, సోమశిల రిజర్వాయర్లు కూడా నిండిపోవడంతో నీటిని కిందకు వదులుతున్నారు. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. నైరుతి మురిసింది.. ఈ నైరుతి సీజన్లో రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు 657 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 683.1 మిల్లీమీటర్లు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 41.3 శాతం అధిక వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో 36.6, బాపట్ల జిల్లాలో 30.6 మిల్లీమీటర్ల అధిక వర్షం పడింది. మిగిలిన అన్ని జిల్లాల్లోను సాధారణ వర్షపాతం నమోదైంది. -
తప్పుల వల్లే తిప్పలు
సాక్షి, అమరావతి: బుధవారం 129.98 టీఎంసీలు.. గురువారం 132.98 టీఎంసీలు.. శుక్రవారం 161.99 టీఎంసీలు.. శనివారం 204.20 టీఎంసీలు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిన గోదావరి జలాలు. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 800.75 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. దీన్లో ఈ నాలుగు రోజుల్లోనే 629.15 టీఎంసీలు కడలిలో కలిశాయంటే గోదావరి ఏ స్థాయిలో విశ్వరూపం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 1862 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. గత 160 ఏళ్లలో జూలైలో అదీ ప్రథమార్థంలో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో గోదావరి వరద జలాలు కడలిలో కలిసిన దాఖలాల్లేవు. ఆకస్మిక వరదలతో గోదావరి విశ్వరూపం ప్రదర్శించటానికి వాతావరణ మార్పులు ఎంత కారణమో అడవుల నరికివేత, ఇసుక కోసం నదీ గర్భాన్ని ఎడాపెడా తవ్వేయడం వంటి మానవతప్పిదాలు కూడా అంతే కారణమయ్యాయని వాతావరణ, సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. కర్బన ఉద్గారాల వల్ల కాలుష్యం పెరిగిపోవడంతో వాతావరణంలో భారీమార్పులు జరుగుతున్నాయి. భూమి, సముద్ర ఉష్ణోగ్రతల్లోను అంతేస్థాయిలో మార్పులు వస్తున్నాయి. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో పెరు దేశం వద్ద పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల ఏర్పడే ఎల్‌నినో (సముద్రం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం), లానినో (సముద్ర ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడం) పరిస్థితుల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రం, బంగాళఖాతం, హిందూమహాసముద్రం మీదుగా దేశంలోకి వీచే గాలులు రుతుపవనాలను.. ప్రధానంగా నైరుతి రుతుపవనాల క్రమం, లయను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల దేశంలో తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షం కురిసి అతివృష్టికి దారితీస్తే.. లానినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అనావృష్టికి దారితీస్తోంది. కుంభవృష్టి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్‌కు సమీపంలో త్రయంబకేశ్వర్ వద్ద జన్మించే గోదావరి.. తూర్పు కనుమల మీదుగా 1,465 కిలోమీటర్లు ప్రవహించి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి పరీవాహక ప్రాంతం 3,12,150 చదరపు కిలోమీటర్లు. దీన్లో మహారాష్ట్రలో 48.5 శాతం, తెలంగాణ, ఏపీల్లో 23.30, ఛత్తీస్‌గఢ్‌లో 12.5, మధ్యప్రదేశ్‌లో 8.6, ఒడిశాలో 5.70, కర్ణాటకలో 1.40 శాతం ఉంది. దేశ విస్తీర్ణంలో ఇది 9.5 శాతంతో సమానం. గోదావరి బేసిన్లో గత 30 ఏళ్ల వర్షపాతం ఆధారంగా.. కనిష్టంగా 877 మిల్లీమీటర్లు, గరిష్టంగా 1,493 మిల్లీమీటర్లు, సగటున 1,117 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని కేంద్ర జలసంఘం అంచనా వేసింది. ఇందులో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జూన్ 12 నుంచి సెప్టెంబరు 30 వరకు సగటున 824 మి.మీ. వర్షం కురుస్తుందని అంచనా. గోదావరికి ఉన్న తొమ్మిది సబ్ బేసిన్లలో ఎల్లి సబ్ బేసిన్ (జి–2) (మహారాష్ట్ర)లో కనిష్టంగా 758.34.. కుంట సబ్ బేసిన్ (జి–7) (శబరి–ఒడిశా, ఆంధ్రప్రదేశ్)లో గరిష్టంగా 1,503 మి.మీ. వర్షం కురుస్తుంది. జూలై ప్రథమార్థంలో ప్రాణహిత (జి–2 టెక్రా), గోదావరి (జి–4 మంచిర్యాల), ఇంద్రావతి (జి–5 పాతగూడెం), శబరి (జి–7 కొంటా)లలో సగటున 526 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే.. రుతుపవనాల వల్ల కురవాల్సిన వర్షంలో 63.84 శాతం పది రోజుల్లోనే కురిసింది. సుమారు 60 రోజుల్లో కురవాల్సిన వర్షం పది రోజుల్లోనే పడింది. భూమిలోకి ఇంకని నీరు గోదావరి బేసిన్ విస్తరించిన పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో దశాబ్దాలుగా భారీ ఎత్తున అడవులను నరికేస్తున్నారు. ఇటీవల అడవుల నరికివేత మరింత తీవ్రమైంది. దీనివల్ల గరిష్టంగా వర్షం కురిసినప్పుడు.. భూమిపై పడిన వర్షపు నీరు అదే రీతిలో నదిలోకి చేరుతోంది. అడవులు నరికివేయకపోతే వర్షపు నీరు భూమిలోకి పూర్తిగా ఇంకిన తరువాత మిగిలినది వాగులు, వంకల ద్వారా ఉప నదుల్లోకి చేరి తర్వాత గోదావరిలోకి చేరేది. ఇక గోదావరిలో ఎగువన అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా ఇసుకను తవ్వేయడంతో నదీగర్భం గట్టినేలగా మారిపోయింది. దీంతో నదిలోకి వచ్చిన నీరు వచ్చినట్టుగా ప్రవహిస్తోంది. ఇవే ప్రస్తుతం గోదావరి ఆకస్మిక వరదలకు దారితీశాయని యాక్షన్ పెటర్నా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వై.వి.మల్లారెడ్డి చెప్పారు. -
డీపీఆర్‌లపై కాలయాపన వద్దు
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్‌లోని అయిదు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను కాలయాపన లేకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి పంపాలని తెలంగాణ మరోమారు గోదావరి బోర్డును కోరింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల, మోదికుంటవాగు ప్రాజెక్టులు కొత్తవి కావని.. ఉమ్మడి రాష్ట్రం ఆమోదించి, ప్రారంభించిన ప్రాజెక్టులని లేఖలో తెలిపారు. ఈ దృష్ట్యా అయిదు ప్రాజెక్టులు విభజన చట్టం క్లాజు 85 (8) పరిధిలోకి రావని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు కేటాయించిన నీరు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 967.94 టీఎంసీలో భాగంగా ఉన్నాయన్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు ఏవిధమైన ప్రభావాన్ని కలిగించవని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లో ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా విలువలు, డిజైన్, నీటి లభ్యత తదితర సాంకేతిక అంశాలను పరిశీలించే పరిధి చట్టం ప్రకారం బోర్డులకు లేదని స్పష్టం చేశారు. ఈ అంశాలను పరిశీలించేందుకు కేంద్ర జల సంఘంలో ప్రత్యేకమైన డైరెక్టరేట్లు ఉన్నాయని వివరించారు. రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జల శక్తి మంత్రి సైతం డీపీఆర్‌లను త్వరితగతిన పరిశీలించి ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ దృష్ట్యా గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లను కాలయాపన చేయకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరారు. -
డీపీఆర్‌లపై ఢీ!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ బేసిన్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల విషయంలో తెలంగాణ, గోదావరి బోర్డుల మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. డీపీఆర్‌లను అధ్యయనం చేసి వాటిని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలనకు పంపించే క్రమంలో అనేక అంశాలపై బోర్డు వివరణలు కోరుతుండటం తెలంగాణ రాష్ట్రానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. డీపీఆర్‌లో పేర్కొన్న నీటి లభ్యత అంశాలు, వ్యయ వివరాలు, ఆయకట్టుకు నీటి మళ్లింపు, విద్యుత్ అవసరాలపై సరైన వివరణలు లేవంటూ బోర్డు అంటుంటే..లేని అధికారాలను వాడుతూ డీపీఆర్‌లను కేంద్రానికి పంపకుండా బోర్డు అనవసర జాప్యం చేస్తోందంటూ తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వరుస లేఖలు..భిన్న అంశాలపై ప్రశ్నలు కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆరు నెలల్లో గోదావరి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు అందించడంతో పాటు వీటికి సంబంధించి బోర్డు, సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం సీతారామ, తుపాకులగూడెం, చనాకా–కొరట, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డుకు అందజేసింది. అయితే డీపీఆర్‌లను సునిశితంగా పరిశీలిస్తున్న బోర్డు అనేక అంశాలపై రాష్ట్రం నుంచి వివరణ కోరుతూ లేఖలు రాస్తోంది. చౌట్పల్లి ప్రాజెక్టు విషయంలో..హైడ్రాలజీ వివరాలతో పాటు కాల్వల ఆధునికీకరణ, ప్రవాహ సామర్థ్యాలను పెంచడం ద్వారా పొదుపు అవుతున్న నీటి వివరాలు, కాల్వల డిజైన్, వాటి సామర్థ్యాలు, ఇరిగేషన్ ప్లానింగ్, బెనిఫిట్ కాస్ట్ రేషియో, టోపోషీట్ మ్యాపులు, ఈ ప్రాజెక్టు ద్వారా నిండుతున్న చెరువులు, వాటికింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కోరింది. మోదికుంటవాగు విషయంలో జియాలజీ పరిశీలన, డ్యామ్ నిర్మిత ప్రాంత అధ్యయనాలు, కేంద్ర జల సంఘం చెప్పిన హైడ్రాలజీ లెక్కలు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన డ్రాయింగ్ల వివరాలు తమకు సమర్పించాలని అడిగింది. చనాకా–కొరటకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 2015–16 ధరల ప్రకారం ఒక రకంగా, 2021–22 ధరల ప్రకారం మరోలా ఉన్నాయని ఎత్తిచూపుతూ వివరణ కోరింది. ఇక సీతారామ విషయంలో అయితే వరుసగా లేఖలు రాస్తూనే ఉంది. దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద ఉన్నప్పుడు హెడ్ రెగ్యులేటర్‌కు ఉండే ముంపు, ప్రాజెక్టు కింద ప్రతిపాదిస్తున్న కొత్త ఆయకట్టుకు నిర్ణయించిన నీటి కేటాయింపు, విద్యుత్ వినియోగ లెక్కల్లో తేడాలు, విద్యుత్ ఛార్జీల అంశాల్లో తేడాలపై వివరణలు ఇవ్వాలని కోరింది. దీంతో పాటే ప్రాజెక్టు కింద చేసిన వ్యయం, ఆ పనుల వివరాలు తమకు అందించాలంటూ లేఖలు రాసింది. ఆ అధికారం మీకెక్కడిదంటున్న తెలంగాణ ఇలా డీపీఆర్‌ల పరిశీలన పేరుతో బోర్డు సంధిస్తున్న ప్రశ్నలు, కోరుతున్న వివరణలపై తెలంగాణ కస్సుమంటోంది. లేని అధికారాలను తమపై ప్రయోగిస్తోందని మండిపడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని క్లాజ్ 85(8)(డీ) ప్రకారం.. కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులు అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశాలను మాత్రమే బోర్డులు పరిశీలించాల్సి ఉంటుందని, అంతకుమించి అధికారాలేవీ బోర్డులకు లేవంటూ తెలంగాణ ఇటీవల రాసిన లేఖలో తెలిపింది. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయాలకు సంబంధించి పరిశీలన చేసి వివరణలు కోరే అధికారం బోర్డులకు ఉండదని, దీనిపై సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు పరిశీలన చేస్తాయని స్పష్టం చేసింది. లేని అధికారాలతో హద్దుమీరి అతిగా వ్యవహరించొద్దంటూ కాస్త ఘాటుగా స్పందించింది. అనవసర జాప్యం చేయకుండా ప్రాజెక్టుల డీపీఆర్‌లను తక్షణమే సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని కోరింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని బోర్డు మోదికుంటవాగు, చిన్న కాళేశ్వరం హైడ్రాలజీ, వ్యయాలపై ఇటీవల మళ్లీ లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. దీంతో వ్యవహారం మరింత ముదిరే అవకాశాలున్నట్లు కనబడుతోంది. ఒకవేళ బోర్డు ఇదే వైఖరి కొనసాగిస్తే తెలంగాణ దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని ఇరిగేషన్ వర్గాలు అంటున్నాయి. -
పెద్దవాగుతో మొదలు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లే ప్రాజెక్టులపై కొంత స్పష్టత వచ్చింది. ఇరు రాష్ట్రాల సమ్మతి మేరకు అక్టోబర్ 14 నుంచి గోదావరి బేసిన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును తొలి దశలో బోర్డు తన పరిధిలోకి తీసుకునేందుకు మార్గం సుగమమైంది. శ్రీరాంసాగర్ మొదలు సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నిం టినీ బోర్డు పరిధిలో ఉంచాలన్న ఏపీ డిమాండ్‌పై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో పెద్దవాగు నిర్వహణ బాధ్యతల ను ప్రయోగాత్మకంగా చేట్టాలని సోమవారం జరిగిన బోర్డు భేటీలో నిర్ణయమైంది. పెద్దవాగును అప్పగిస్తూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాక, వీటి నిర్వహణను బోర్డు చేపట్టనుంది. అయితే, దశలవారీగా ప్రాజెక్టులను అధ్యయనం చేసి వాటిని బోర్డు పరిధిలోకి తీసుకురానున్నట్లు గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. పెద్దవాగు.. సీలేరులపైనే కీలక చర్చ ప్రాజెక్టుల పరిధి, సిబ్బంది నియామకం, నిధులు తదితర అంశాలపై చర్చించేందుకు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు పూర్తిస్థాయి భేటీ జరిగింది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన భేటీకి తెలంగాణ, ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, శ్యామలరావుతోపాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. గోదావరిపై తెలంగాణ ఎస్సారెస్పీ నుంచి సీతమ్మసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవా లని ఏపీ పట్టుబట్టింది. దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే బోర్డుపరిధిలో ఉంచాలని కోరింది. పెద్దవాగు కింద ఉన్న 16 వేల ఎకరాల ఆయకట్టులోనూ 13 వేల ఎకరాల మేర ఆయకట్టు ఏపీలో ఉన్నందున నిర్వహణకు వ్యయంలో ఏపీనే 85% చెల్లించాలని కోరింది. అయితే తొలిదశలో ట్రయల్ మాదిరి పెద్దవాగును పరిధిలోకి తెచ్చుకొని, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు చూస్తామని బోర్డు స్పష్టం చేసింది. దశలవారీగా మిగతా ప్రాజెక్టులను అధ్యయనం చేసి బోర్డు పరిధిలోకి తెస్తామంది. ఏ రాష్ట్ర సిబ్బంది ఆ రాష్ట్ర పరిధిలోనే పనిచేస్తారని తెలిపింది. పెద్దవాగుకు అవసరమైన ఉత్తర్వులు వెం టనే విడుదల చేసేందుకు ఏపీ సమ్మతి తెలిపింది. సీలేరు విద్యుదుత్పత్తి ప్రాజెక్టును సైతం బోర్డు పరి ధిలోకి తేవాలని తెలంగాణ కోరింది. సీలేరు విద్యుత్‌లో సగం తెలంగాణకు రావాల్సి ఉన్నా ఏపీ ఇవ్వ డంలేదంది. దీనిపై ఏపీ అభ్యంతరం చెప్పగా, బోర్డు సైతం విద్యుదుత్పత్తి కేంద్రాల అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున.. తోసిపుచ్చింది. బడ్జెట్ ఉద్దేశం చెబితే సీడ్‌మనీ విడుదల బోర్డులుకు ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్‌మనీ అంశంపైనా బోర్డు భేటీలో చర్చ జరిగింది. కేవలం ఒక్క ప్రాజెక్టునే బోర్డు పరిధిలో ఉంచినప్పుడు రూ.200 కోట్ల నిధులు అవసరం ఏముంటుందని రెండు రాష్ట్రాలు ప్రశ్నించాయి. నిధుల విడుదల ఆర్థికశాఖతో ముడిపడి ఉన్నందున బడ్జెట్ ఉద్దేశాలను బోర్డు తమకు చెబితే వాటినే ఆర్థిక శాఖకు తెలియజేస్తామని ఇరు రాష్ట్రాలు వివరించాయి. నేడు కృష్ణా బోర్డు భేటీ కృష్ణా బోర్డు మంగళవారం భేటీ జరుగనుంది. ప్రాజెక్టుల అధీనంతోపాటు నిధులు, సిబ్బంది పై బోర్డులో చర్చించనున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాల చుట్టూనే ప్రధానచర్చ జరిగే అవకాశాలున్నాయి. వీటితోపాటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలోని ఔట్లెట్లపై నిర్ణయాలు వచ్చే అవకాశాలున్నాయి. -
సగానికి చేరిన ఎస్సారెస్పీ
సాక్షి, హైదరాబాద్: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహాలు పెరుగుతున్నాయి. ఎగువ వర్షాలకు రాష్ట్ర పరిధిలోని పరీవాహకంలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. 92 వేల క్యూసెక్కులకుపైగా నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో నీటి నిల్వ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులో నిల్వలు 90 టీఎంసీలకుగానూ 47.70 టీఎంసీలకు చేరగా, ఈ సీజన్లోనే ప్రాజెక్టులోకి కొత్తగా 30 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 33.98 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండగా, ఈ ఏడాది మాత్రం మరో 13 టీఎంసీలు అదనంగా ఉండటం ఆయకట్టు రైతులకు పెద్ద ఊరటనిస్తోంది. గోదావరి బేసిన్లో ఇతర ప్రాజెక్టులకు చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి ప్రవాహాలు వస్తున్నా యి. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో సింగూరు, లోయర్‌మానేరు, కడెం, మిడ్‌మానేరులో ప్రవాహాలు స్ధిరంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కడెం, లోయర్‌మానేరు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. మరో మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో ఈ ప్రవాహాలు మరింత పుంజుకునే అవకాశాలున్నట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టే ప్రాజెక్టు ఇంజనీర్లను అప్రమత్తం చేసింది. కృష్ణా బేసిన్లో అప్రమత్తం ఇక కృష్ణా బేసిన్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కృష్ణా నది జన్మస్థలి అయిన మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో 120 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో దిగువన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లకు భారీ వరద ప్రవాహాలు నమోదయ్యే అవకాశముంది. దీనిపై ఇప్పటికే కేంద్ర జల సంఘం పరీవాహక రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో భారీగా ప్రవాహాలు వచ్చే దృష్ట్యా ప్రాజెక్టుల నిల్వలపై దృష్టి పెట్టాలని, డ్యామ్‌ల్లో నీటి నిల్వలు నిండుగా ఉంచకుండా కొంత ఖాళీగా ఉంచేలా నిర్వహణ చేపట్టాలని సూచించింది. దీంతో ఆల్మట్టిలో 129 టీఎంసీలకుగానూ 93.83 టీఎంసీల నిల్వలు ఉంచి ప్రస్తుతం వస్తున్న 10 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌కి 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ఆ నీటిని దిగువకు వదులుతున్నారు ఈ నీరంతా జూరాలకు చేరనుంది. ప్రస్తుతం జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు కేవలం వందల క్యూసెక్కుల్లో మాత్రమే నీటి ప్రవాహాలు వస్తున్నాయి. -
ఒక్కటి తప్ప అన్ని ప్రాజెక్టుల గేట్లెత్తారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో నిజాంసాగర్ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీ ప్రవాహాలు నమోదు కావడంతో నాలుగేళ్ల తర్వాత బుధవారం సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ నీరంతా నిజాంసాగర్‌కు వెళ్తుండటంతో అక్క డా ప్రవాహాలు పెరిగాయి. నేడో రేపో ఆ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. తెరుచుకున్న సింగూరు గేట్లు... సింగూరు ప్రాజెక్టులో బుధవారం ఉదయం మూడు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకుగానూ 28.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తుండటంతో ఈ నీరంతా నిజాంసాగర్ వైపు పరుగులు పెడుతోంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 41,851 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా నిల్వ 17.80 టీఎంసీలకుగానూ 11.10 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నిల్వ 16 టీఎంసీలకు చేరి, ప్రవాహాలు ఇదే రీతిన ఉంటే గురువారంరాత్రిగానీ, శుక్రవారంగానీ గేట్లు ఎత్తే అవకాశాలున్నాయి. ఎస్సారెస్పీకి కాస్త ప్రవాహాలు తగ్గాయి. బుధవారం 24 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. లోయర్ మానేరుకు 96 వేల క్యూసెక్కులు, మిడ్‌మానేరుకు 29వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 82 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఈ ప్రాజెక్టులన్నీ నిండి ఉండటంతో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇక కృష్ణా బేసిన్లో ప్రవాహ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలంలోకి 3.47 లక్షలు, సాగర్‌లోకి 2.73 లక్షలు, పులిచింతలకు 4.30 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ఈ నీటినంతా దిగువకు విడిచి పెడుతుండటంతో బంగాళాఖాతం వైపు వెళుతోంది. అలుగు దుంకుతున్న 24,192 చెరువులు రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులకు జలకళ వచ్చింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్లో 24,192 చెరువులు అలుగు దుంకుతున్నా యి. మరో 11,972 చెరువులు వందకు వంద శాతం నీటితో అలుగులు దుంకేందుకు సిద్ధంగా ఉన్నాయి. కృష్ణాబేసిన్‌లో 23,301 చెరువులకుగానూ 14,900 చెరువులు నిండగా, మరో 3,766 చెరువులు పూర్తిగా నిండాయి. అత్యధికంగా మెదక్ జిల్లా పరిధిలో 6,993 చెరువులు అలుగు పా రుతుండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 4,644 చెరువులు అలుగు దుంకుతున్నాయి. గోదావరి బేసిన్లో మొత్తంగా 20,111 చెరువులుండగా, ఇందులో 9,292 చెరువులు అలుగు పారుతున్నా యి. మరో 8,206 చెరువులు వంద శాతం మేర నిండాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 2,795 చెరువులు, కరీంనగర్లో 2,578 చెరువులు, వరంగల్ జిల్లాలో 2,209 చెరువులున్నాయి. మంగళ, బుధవారం కురిసిన భారీ వర్షాలకు 152 చెరువులకు గండ్లు పడ్డాయి. మొత్తంగా ఈ సీజ న్లో 661 చెరువులకు గండ్లు, బుంగలు పడటం వంటి నష్టాలు ఏర్పడ్డాయి. -
డీపీఆర్‌లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ పరిధిలో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఈ నెల 10లోగా సమర్పించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో అనుమతిలేని ప్రాజెక్టులపై ముందుకెళ్లరాదని స్పష్టం చేసింది. బోర్డు ఆదేశంతో ప్రాజెక్టుల సాంకేతిక అనుమతి కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘానికి, వాటి ఆమోదం కోసం అపెక్స్ కౌన్సిల్‌కు నివేదికలు సమర్పించేందుకు తెలంగాణ అంగీకరించగా ఏపీ ఇప్పటికే కొన్ని డీపీఆర్‌లను ఇచ్చింది. మిగిలిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను సాంకేతిక అనుమతి బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. గోదా వరి బేసిన్ పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, నీటి వాటాలు, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, మళ్లింపు జలాల్లో వాటా, టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు అంశాలపై చర్చించేందుకు గోదావరి బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లోని ‘జలసౌధ’లో సమావేశమైంది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాథ్దాస్లతోపాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు ఎజెండా అంశాలతోపాటు ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై నాలుగు గంటలపాటు చర్చిం చారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లపై వాడివేడిగా చర్చ జరిగింది. ఆ ప్రాజెక్టులన్నీ రీ ఇంజనీరింగ్ చేసినవే: తెలంగాణ బోర్డు భేటీలో పలు అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు వాదనలు బలంగా వినిపించారు. ముఖ్యంగా గోదావరి నదిలో తమకు 967 టీఎంసీల మేర వాటా ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్ గుర్తుచేశారు. తమ వాటా మేరకే నీటి వినియోగాన్ని చేసుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. తమ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తామన్నారు. అయితే దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. బచావత్ అవార్డు ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయలేదని బోర్డు దృష్టికి తెచ్చింది. కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, తమ్మిడిహెట్టి, ఛనాకా–కొరటా, రాజంపేట, పింపార్డ్ ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని వాదించింది. ఏపీ వాదనపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ... ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులనే రీ ఇంజనీరింగ్ చేశామని, వాటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేసింది. దీన్ని ఏపీ ఖండించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులిచ్చే ముందు దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అదేమీ జరగని దృష్ట్యా తెలంగాణకు ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని కోరుతూ కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసినట్లు వివరించింది. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు ఏపీ మళ్లిస్తున్నందున తమకు 45 టీఎంసీల వాటా రావాలని తెలంగాణ మరోమారు కోరింది. అయితే దీనికి అభ్యంతరం చెప్పిన ఏపీ... ఉమ్మడి రాష్ట్రానికి 45 టీఎంసీలని అవార్డులో ఉందని, ఈ మళ్లింపు జలాల్లో తమకు వాటా దక్కుతుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనకు పంపినందున అక్కడి నుంచి వచ్చే ఆదేశాల వరకు ఆగాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించింది. పోలవరం బ్యాక్ వాటర్ సర్వే చేయాలని తెలంగాణ కోరింది. గరిష్ట వరదలు నమోదైనప్పుడు తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని చెప్పగా ఇప్పటికే కేంద్ర జల సంఘం అధ్యయనం చేసి తెలంగాణకు ఎలాంటి ముంపు లేదని నిర్ధారించిందని ఏపీ స్పష్టం చేసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ టెలిమెట్రీపై నిపుణులతో కమిటీ.. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రధాన ప్రాంతాల్లో నీటి ప్రవాహ లెక్కల నమోదు కోసం టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏయే ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలనే విషయమై ఇరు రాష్ట్రాలతోపాటు సీడబ్ల్యూసీ, పుణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్లోని ఇంజనీర్లతో బోర్డు ఓ కమిటీని నియమించింది. సత్వరమే ‘అపెక్స్’ఎజెండా: చంద్రశేఖర్ అయ్యర్ కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాల గురించి వివరణ ఇవ్వాలని తెలంగాణను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే అపెక్స్ భేటీలో చర్చించాల్సిన ఎజెండా అంశాలను సత్వరమే పంపాలని కోరగా ఇరు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు. తెలంగాణ చేపట్టిన పెద్దవాగు ఆధునీకరణ పనులను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఏపీ ఒప్పుకున్నట్లు తెలిపారు. అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఇదివరకే ఇరు రాష్ట్రాలను కోరామని, అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ డీపీఆర్‌నూ అడగటం విచిత్రం... రాష్ట్రంలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు లేవని బోర్డుకు చెప్పాం. పాత ప్రాజెక్టులకే రీ ఇంజనీరింగ్ చేశాం తప్పితే కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదని వివరించాం. కాళేశ్వరం పాత ప్రాజెక్టేనని కేంద్రం లేఖ సైతం ఇచ్చింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాక తేలుస్తాం. రాష్ట్రానికి 967 టీఎంసీల వాటా ఉంది. ఈ వాటాల్లోంచే నీటిని వినియోగిస్తాం. ఇక ఎస్సారెస్పీ ప్రాజెక్టు డీపీఆర్‌ను అడగటం విచిత్రం. 2014 జూన్ 2కు ముందు పూర్తయిన డీపీఆర్‌లు అడగొద్దని స్పష్టంగా చెప్పాం.– రజత్‌కుమార్, నీటిపారుదల శాఖ కార్యదర్శి -
సాగు కాదు.. తాగు అవసరాలకే!
సాక్షి, హైదరాబాద్: తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్న తమిళనాడు తాగునీటి అవసరాలను తీర్చే దిశగా లోతైన అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గోదావరి బేసిన్లో రాష్ట్ర తాగు, సాగు అవసరాలు తీరాక, వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిలో నుంచే కొంత నీటిని తమిళనాడు తాగునీటి అవసరాలకు ఇవ్వాలని తెలంగాణ సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్రం ప్రతిపాదించిన గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియతో సంబంధం లేకుండా తాగునీటి అవసరాలకే పరిమితమవుతూ సహకార ధోరణితో తమిళనాడుకు చేయూతనిచ్చే దిశగా బాటలు వేసింది. సాగుకైతే నో.. తాగుకైతే ఓకే.. ఏటా వేసవిలో చెన్నై నగర తాగునీటి కష్టాలు తీర్చేందుకు రైల్వే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కించే క్రమంలో ఏప్రిల్ 18, 1983లో తమిళనాడుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు.. చెన్నైకి తాగునీటి అవసరాల కోసం కృష్ణా బేసిన్‌లోని కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చెరో 5 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ వాటా కింద 3.3, తెలంగాణ వాటా కింద 1.7 టీఎంసీలు విడుదల చేయాలి. ఏటా చెన్నై తాగునీటి అవసరాలకు 3 నుంచి 8 టీఎంసీలకు మించి విడుదల కావట్లేదు. దీంతో తాగునీటి కష్టాలు తీరడం కష్ట సాధ్యమవుతోంది. దీన్ని దృష్ట్యా కేంద్రం, గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియను తెరపైకి తెచ్చింది. ఈ అనుసంధానం ద్వారా కనీసం 200 టీఎంసీల నీటిని తమిళనాడు తాగు, సాగు అవసరాలను తీర్చాలని నిర్ణయించింది. దీనికి రూ.60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఈ ప్రతిపాదనకు ఓవైపు చత్తీస్‌గఢ్ అభ్యంతరం చెబుతుండగా, తెలంగాణ, ఏపీలు సైతం తమ అవసరాలు పోయాకే మిగిలిన నీటిని తరలించాలని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు మంత్రుల బృందం కేంద్ర ప్రతిపాదనను ఆమోదించి, తమ కష్టాలు తీర్చాలని సీఎం కేసీఆర్‌ను కలిసింది. సాగు అవసరాలను తెరపైకి తెస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవని, అదీకాక సాగు అవసరాలంటే కేంద్ర సంస్థల నుంచి అనుమతులు అనివార్యం అవుతాయని సీఎం చెప్పినట్లు సమాచారం. అదే తాగు అవసరాలకైతే పొరుగు రాష్ట్రాలు సహా, కేంద్రం సహకారం అందిస్తాయని సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. కృష్ణాలో తగినంత నీటి లభ్యత లేనం దున గోదావరి నీటిని, అదీ వరద ఎక్కువగా ఉండి వృథాగా సముద్రంలోకి వెళ్తున్న సమయంలోనే 50–60 టీఎంసీల నీటిని తమిళనాడుకు తరలిస్తే తమకు అభ్యంతరం ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గోదావరి నుంచి నీటిని ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై అధ్యయనం జరగాలని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికే చెన్నై తాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి తెలుగుగంగ ద్వారా నీటిని విడుదల చేస్తున్నా, అవి చెన్నై వరకు చేరట్లేదు. తెలుగుగంగ కాల్వల పరిధిలో భారీగా వ్యవసాయ మోటార్లు ఉండటంతో 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే అవి తమిళనాడులోని పూండీ రిజర్వాయర్‌కు చేరే వరకు 900 క్యూసెక్కులే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే అంశంపై అధికారుల స్థాయిలో చర్చలు జరగాలని, వారు అంగీకారానికి వచ్చాక ఏపీతో కలసి 3 రాష్ట్రాల సీఎంల సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం చేద్దామని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. -
గోదావరి – కృష్ణా అనుసంధానంపై ముసాయిదా డీపీఆర్ సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నుంచి కృష్ణా, కృష్ణా నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్లింపు కోసం నేషనల్ వాటర్ డవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్లు్యడీఏ) ముసాయిదా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం రాజ్యసభలో వివరించారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆదుకునేందుకు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీరు మళ్లించే అవకాశాలను పరిశీలించవలసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్æ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని వివరించారు. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా సీఎం కోరినట్లు మంత్రి చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై ఎన్‌డబ్లు్యడీఏ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్‌పై తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాలకు పంపించినట్లు షెకావత్ చెప్పారు. గోదావరి–కావేరీ లింక్ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మూడు లింక్‌లు ఉంటాయని, ఆయా ప్రాజెక్ట్‌ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. గోదావరి–కృష్ణా లింక్ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 3.45 లక్షల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూములకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చని చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌పై సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్ రూపొందించి, చట్టపరమైన అనుమతులు పొందిన తరువాత పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. సాగరమాల కింద ఏపీలో 32 రోడ్డు, 21 రైల్ ప్రాజెక్ట్‌లు సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్‌ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్‌ప్రాజెక్ట్‌లు కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. ఏపీలోని 9 జిల్లాల్లో సంప్రదాయ పారిశ్రామిక క్లస్టర్లు సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రత్యేక నిధితో ఒక పథకాన్ని ప్రారంభించినట్లు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రి నితిన్‌గడ్కరీ రాజ్యసభలో చెప్పారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ పథకంలో భాగంగా ఖాదీ, క్వాయర్, విలేజ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని చిత్తూరు (కలంకారీ), విజయనగరం (క్వాయర్ పరుపుల తయారీ), చిత్తూరు (క్వాయర్ ఉత్పాదనలు), కృష్ణా (కొండపల్లి బొమ్మలు), తూర్పుగోదావరి (జొన్నాడ ఫుడ్‌ప్రాసెసింగ్), చిత్తూరు (చింతపండు), గుంటూరు (మంగళగిరి బంగారు ఆభరణాలు), తూర్పు గోదావరి (కడియపులంక కొబ్బరిపీచు ఉత్పాదనలు) జిల్లాల్లో మొత్తం 9 సంప్రదాయ పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
వామ్మో నీటి లోటు..543 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్ : లోటు వర్షపాతం, ఎగువ నుంచి కరువైన ప్రవాహాల కారణంగా గడిచిన ఏడాది నిర్జీవంగా మారిన కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జూన్ నుంచి ఆరంభమైన కొత్త వాటర్ ఇయర్లో నీటి రాకకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాదైనా నైరుతి కరుణిస్తుందనే గంపెడాశతో ఉన్నాయి. ప్రçస్తుతం రెండు బేసిన్ల పరిధిలో 543 టీఎంసీల నీటి లోటు ఉండగా, అవి పూర్తి స్థాయిలో నిండి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే కురిసే వానలపై భవిష్యత్తు ఆధారపడి ఉంది. వానలు కురవకపోతే మాత్రం రెండు బేసిన్ల పరిధిలో 26 లక్షల ఎకరాలపై ప్రభావం పడనుంది. నోరెళ్లబెట్టిన ప్రాజెక్టులు.. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. గతేడాది ఆగస్టు వరకు కూడా నీటి ప్రవాహాలు లేకపోవడంతో కృష్ణాబేసిన్ ప్రాజెక్టులకు నీటి రాక కరువైంది. దీని ప్రభా వం నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాలపై పడింది. ప్రస్తుతం ఈ 3 ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకు గానూ 372.46 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్‌లో 130 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా, ఇదంతా కనీస నీటి మట్టాలకు దిగువన ఉన్నదే. ఇందులో గరిష్టంగా రెండు తెలుగు రాష్ట్రాలు 8 టీఎంసీలకు మించి వాడుకునే అవకాశం లేదు. ఇక శ్రీశైలం లో 215 టీఎంసీలకు గాను 32 టీఎంసీల లభ్యతగా ఉండగా, ఇప్పటికే కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి ఇరు రాష్ట్రాలు నీటిని తీసుకుంటున్నాయి. జూరాలలోనూ 2.31 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. మొత్తంగా 12 టీఎంసీలకు మించి నీటి లభ్యత లేదు. ఇక ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ తీవ్ర నీటి లోటు ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో 223 టీఎంసీల నీరు చేరితే కానీ అవి నిండే పరిస్థితులు లేవు. ఎగువన 180 టీఎంసీల మేర నీరు చేరి తే గానీ దిగువ రాష్ట్ర ప్రాజెక్టులకు వరద వచ్చే అవకాశాలు లేవు. ఈ స్థాయిలో నీటి రాక రావాలంటే జూలై, ఆగస్టు నెలలో ఎగువన వర్షాలు కురవాలి. లేకుంటే దిగువకు ప్రవాహాలు మొదలయ్యేందుకు సెప్టెంబర్, అక్టోబర్ కూడా పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే జరిగితే జూరాల, సాగర్ల కింద ఖరీఫ్ పంటల సాగుపై స్పష్టత కొరవడుతుంది. సాగు నీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పరిస్థితుల్లో మొత్తంగా 11 లక్షల ఎకరాల ఆయ కట్టు పై ప్రభావం పడే అవకాశం ఉంది. గోదావరి నిర్జీవం.. ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూ ర్, కడెం, ఎల్లంపల్లిలలో ప్రస్తుత లభ్యత జలం కేవలం 18 టీఎంసీలు మాత్రమే ఉండటం, 172 టీఎంసీల మేర నీటి లోటు ఉండటం కలవరపెడుతోంది. ఖరీఫ్‌లో ఈ ప్రాజెక్టుల కింద సుమారు 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. తీవ్ర నీటి కొరత దృష్ట్యా ప్రభుత్వం తన తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకేనని తేల్చి చెబుతోంది. మిషన్‌భగీరథ అవసరాలకు రెండు బేసిన్ల ప్రాజెక్టుల నుంచి కనిష్టంగా 60 టీఎంసీల నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు నీటి విడుదల ఉంటుందని స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుతం ఈ రెండు బేసిన్ల పరిధిలో లభ్యత జలం 30 టీఎంసీలకు మించి లేకపోవడం, మరో 30 టీఎంసీల నీరు వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగు అంతా వర్షాలపైనే ఆధారపడి ఉంది. -
ప్రాజెక్టులకు వేసవి గండం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎండలు పుంజుకోకమందే గోదావరి, కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్రమేపీ అడుగంటుతుండగా, గోదావరిలో ఇప్పటికే ప్రాజెక్టులన్నీ వట్టిపోయాయి. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో మరో ఐదు నెలల పాటు నెట్టుకురావాల్సిన పరిస్థితుల నేపథ్యంలో మున్ముందు నీటి ఎద్దడి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గోదావరి బేసిన్‌లోని సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు ఖాళీ అయ్యాయి. నిజాంసాగర్‌లో 17.8 టీఎంసీల నీటి నిల్వలకు గాను ఇప్పుడు అక్కడంతా బురదే కనిపిస్తోంది. కనీసం పశువులు తాగేందుకు నీరు సైతం లేకపోవడంతో ఆ ప్రాంతమంతా మైదానంలా కనిపిస్తోంది. గతేడాదిలో కనిష్టంగా 5.91 టీఎంసీల నిల్వలుండగా ఈ ఏడాది కేవలం 0.65 టీఎంసీలే ఉండటం, పరీవాహకంలో నీటి కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇక సింగూరులోనూ దారుణ పరిస్థితులున్నాయి. ఇక్కడ 29.31 టీఎంసీల నీటి నిల్వలకు గానూ కేవలం 1.17 టీఎంసీల నిల్వలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 9 టీఎంసీల మేర నిల్వలు తక్కువగా ఉండటంతో ఈ ప్రభావం సంగారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇక ఎస్సారెస్పీ పరిధిలో రబీ అవసరాలకు తాగునీటిని విడుదల చేయడంతో అక్కడ ఉండాల్సిన 90 టీఎంసీల నిల్వలకు గాను ప్రస్తుతం 13 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం రబీ అవసరాల కోసం 6,805 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మట్టం మరింత తగ్గేలా ఉంది. ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11 టీఎంసీలే ఉండగా, ఇక్కడి నుంచి నిత్యం 180 క్యూసెక్కులు తాగునీటికి, 1,422 క్యూసెక్కులు సాగునీటికి వినియోగిస్తున్నారు. శ్రీశైలంలో వేగంగా పడిపోతున్న మట్టం కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. శ్రీశైలంలో 885 అడుగులకు గాను, కనీస నీటిమట్టం 834 అడుగులకు దిగువన 826 అడుగుల్లో 45.76 టీఎంసీల నీరు ఉంది. ఇక్కడి నుంచి వెయ్యి క్యూసెక్కుల మేర నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి.ఇప్పటికే 800 అడుగుల దిగువ వరకు నీటిని తీసుకోవాలని ఇటీవలి కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయించారు. 18 టీఎంసీల లభ్యత నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకుంటే త్వరలోనే ప్రాజెక్టు ఖాళీ అయ్యే పరిస్థితులున్నాయి. ఇక సాగర్‌లో ప్రస్తుతం 590 అడుగులకు గానూ,520.8 అడుగుల మట్టంలో 150 టీఎంసీల నీరుంది. కనీస నీటి మట్టం 510 అడుగులకు పైన వినియోగించుకునే నీరు కేవలం 15 టీఎంసీలే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు గానూ కనీస నీటిమట్టం 510 అడుగులకు దిగువన 505 అడుగుల వరకు వెళ్లి మొత్తంగా 33.71 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. ప్రస్తుత నీటితో మూడు నెలల అవసరాలు తీరినా, జూన్ నుంచి నీటి కష్టాలు తప్పవని నీటి పారుదల వర్గాలే చెబుతున్నాయి. -
‘అపెక్స్’లోనే తేల్చుదాం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ కోర్టులోకి నెట్టింది. కృష్ణాబోర్డు ఇప్పటికే తయారు చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న దృష్ట్యా, దీన్ని కేంద్ర జల వనరులశాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో చర్చించి తుది నిర్ణయానికి రావాలని నిర్ణయించింది. కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఉన్న సమస్యలపై గురువారం హోంశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం బోర్డు అధికారులతో చర్చించింది. ఈ భేటీలో బోర్డు సిద్ధంచేసిన వర్కింగ్ మాన్యువల్‌ను సంఘానికి అందించారు. ప్రాజెక్టుల నియంత్రణ తమ పరిధిలో లేనందున శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి వినియోగంలో ఇరు రాష్ట్రాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని, తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదని బోర్డు అధికారులు స్థాయీ సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ దృష్ట్యా ప్రాజెక్టుల నియంత్రణను తమకు అప్పగించాలని కోరడంతో పాటుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో భేటీ జరిపి తుది నిర్ణయం చేద్దామని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఇక టెలీమెట్రీ అంశంపైనా ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని బోర్డు వర్గాలు తెలిపాయి. -
ఖరీఫ్‌కు ఊపిరి.. సాగర్‌కు కృష్ణమ్మ
సాక్షి, హైదరబాద్: ఖరీఫ్ ఆయకట్టు ఆశలను మోస్తూ నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. తడారిన గొంతుల్ని తడిపేందుకు.. ఆయకట్టు పంటలకు ప్రాణం పోసేందుకు వరద పోటెత్తుతోంది. చాలా రోజుల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో 8 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 2.32 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం నమోదైంది. ఈ ప్రవాహం ఆదివారానికి మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వరదకు సాగర్ మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 590 అడుగులకు గానూ 532 అడుగుల్లో 172.27 టీఎంసీల నిల్వలున్నాయి. వచ్చేదంతా సాగర్‌కే.. కృష్ణానదీ బేసిన్లో సాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నా రు. దీంతో జూరాలకు రోజూ స్థిరంగా 1.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. ఈ నీటిని దిగువ శ్రీశైలానికి వదలడం, ఈ ప్రవాహానికి సుం కేసుల నుంచి వస్తున్న వరద తోడవడంతో శ్రీశైలంలోకి 3.53 లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 215 టీఎంసీలకు గానూ 200 టీఎంసీలకు చేరడంతో శనివారం ఉద యం ఆరుగేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 1.59 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. సాయంత్రం మరో 2 గేట్లు ఎత్తారు. దీనికి అదనంగా కుడి, ఎడమ కాల్వల పవర్‌హౌస్‌ల ద్వారా ఏపీ, తెలంగాణ 72 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నాయి. కల్వకుర్తికి 2,400, హంద్రీనీవాకి 2,025, పోతిరెడ్డిపాడు ద్వారా 26 వేల క్యూసెక్కుల నీటి వినియోగం జరుగుతోంది. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో సాగర్‌కు శనివారం సాయంత్రానికి 2.32 లక్షల క్యూసెక్కుల మేర ప్రవా హం వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వలు 312 టీఎంసీలకు గానూ 172.27 టీఎంసీలకు చేరాయి. మరో 140 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండనుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటం, భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇకపై వచ్చిన ప్రవాహాలు వచ్చినట్లుగా సాగర్‌కు చేరనున్నాయి. ఇవే ప్రవా హాలు కొనసాగినా 15 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశాలున్నాయి. ఒకవేళ ఎగువ వరద ఆగినా నదీ గర్భంలోనే 100 నుంచి 120 టీఎంసీలు ఉంటాయ న్న అంచనా సాగర్ ఖరీఫ్ఆశలను సజీవం చేస్తోంది. సాగర్ అవసరం.. 52.50 టీఎంసీలు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నిల్వలు పెరు గుతుండటంతో నీటి అవసరాలపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ సమర్పించింది. మొత్తంగా ఈ సంవత్సరం నవంబర్ వరకు తాగు, సాగు నీటి అవసరాలకు కలిపి 52.50 టీఎంసీలు కావాలని కోరింది. ఇందులో సాగర్ కింద 6.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు 33 టీఎంసీలు, ఎస్ఎల్బీసీ కింద చెరువులను నింపేందుకు 12 టీఎంసీలు, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు 7.50 టీఎంసీలు కలిపి మొత్తంగా 52.50 టీఎంసీలు కేటాయించాలని కోరింది. ఈ అవసరాలపై బోర్డు సోమవారం తర్వాత నిర్ణయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగస్టు వరకు తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణా బోర్డు 30 టీఎంసీలు కేటాయించిన విషయం తెలిసిందే. ఆశలు రేపుతున్న ఎస్సారెస్పీ గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, స్థానిక పరీవాహకంలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 42,520 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు నిల్వ 30 టీఎంసీలకు చేరింది. మరో 60 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. క్రమంగా నిల్వ లు పెరుగుతుండటంతో ఇక్కడి 9.68 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదలపై త్వరలోనే స్ప ష్టత వచ్చే అవకాశం ఉంది. ఎల్లంపల్లికి వరద ఉధృతి కొనసాగుతోంది. 38 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ప్రాజెక్టులో 20 టీఎంసీల పూర్తి మట్టం ఉండటంతో 43 వేల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. కడెంలోకి 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. -
ప్రవాహాలు లేక గోదా‘వర్రీ’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వర ప్రదాయినిగా ఉన్న గోదావరికి ఈ ఏడాది నీటి ప్రవాహాలు కరువయ్యాయి. ఏటా జూన్ చివరి వారానికే ఉధృత రూపం దాల్చే గోదావరిలో ఈ ఏడాది కనీస నీటి ప్రవాహాలు కూడా నమోదవడం లేదు. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ ఎక్కడా పెద్దగా నీరు వచ్చి చేరడం లేదు. ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఇప్పటివరకు కేవలం 32 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ఎగువ మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉండటం, అక్కడ అధిక వర్షాలు నమోదైతే గానీ దిగువకు నీరిచ్చే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. చూపంతా ఎగువ వైపే.. కృష్ణా బేసిన్‌తో పోల్చి చూస్తే గోదావరి బేసిన్లో జూన్, జూలైలో మంచి వర్షాలుంటాయి. కృష్ణాలో కాస్త ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు ఉండటంతో ఆ సమయం నుంచే రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు నమోదవుతాయి. అయితే ఈ ఏడాది గోదావరి బేసిన్లో ఎక్కడా ఆశాజనక పరిస్థితులు లేవు. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా అవి గోదావరి పరీవాహకంలో లేకపోవడంతో దిగువ ఎస్సారెస్పీ, సింగూరుకు నీటి ప్రవాహాలు పెద్దగా లేవు. బాబ్లీ గేట్లు తెరిచి నెల రోజులవుతున్నా దిగువకు వచ్చింది తక్కువే. గోదావరి, ప్రాణహితలు కలిసే కాళేశ్వరం వద్ద మాత్రం ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా 3.50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహాలు నమోదయ్యాయి. అయితే ఈ ప్రవాహాలు ప్రాణహిత నుంచి వచ్చాయే తప్ప గోదావరి నుంచి కాదు. జూన్ చివరి వారం, జూలై తొలి వారంలో ప్రాజెక్టుల్లో కొంతమేర ప్రవాహాలు కొనసాగినా అవి ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయాయి. మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టుకు గడిచిన నాలుగు రోజులుగా మాత్రమే ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ఆ ప్రాజెక్టులో 102 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 50 టీఎంసీల నిల్వలున్నాయి. గతేడాదితో పోలిస్తే అక్కడ 10 టీఎంసీల నిల్వ తక్కువగా ఉంది. ఈ సీజన్లో ప్రాజెక్టులో కేవలం 9.82 టీఎంసీలు మాత్రమే కొత్తనీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నిండితే గానీ దిగువకు ప్రవాహాలుండవు. సింగూరులో 29.91 టీఎంసీలకు వాస్తవ నిల్వకు గానూ గతేడాది 18.10 టీఎంసీల నిల్వ ఉండగా.. ఈ ఏడాది కేవలం 7.66 టీఎంసీల నిల్వలున్నాయి. ఎలాంటి ప్రవాహాలు రావడం లేదు. దీంతో దీనిపై ఆధారపడ్డ 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టు నిండితే కానీ నిజాంసాగర్‌కు నీటి విడుదల కుదరదు. నిజాంసాగర్‌లో కేవలం 0.02 టీఎంసీలు మాత్రమే కొత్త నీరు రావడంతో అక్కడ 17.80 టీఎంసీలకు గానూ 2.39 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. దీంతో ఖరీఫ్‌లో 2 లక్షల ఎకరాలకు నీరందడం సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వర్షాలు, ఎగువ నుంచి వచ్చే వరదతోనే ప్రాజెక్టులు, చెరువులు నిండే అవకాశం ఉంది. ఎస్సారెస్పీలో 15.9 టీఎంసీలే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 9.76 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు వాస్తవ నిల్వ 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.9 టీఎంసీల నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో దీని కింద 9.68 లక్షల ఆయకట్టు అంతా వర్షాలు, భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. గత రబీలో ఈ ప్రాజెక్టు కింద 4.97 లక్షల ఎకరాల ఆయకట్టుకు 40 టీఎంసీ మేర నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉంటుందా అనే దానిపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తంగా ఈ సీజన్లో గోదా వరి ప్రాజెక్టుల్లోకి 32 టీఎంసీలు మాత్రమే కొత్త నీరువచ్చి ఆయకట్టును కలవరపరుస్తోంది. గోదావరి బేసిన్లో 20,121 చెరువులు ఉండగా 8,400 చెరువుల్లో చుక్క నీరు చేరలేదు. 5,500 చెరువుల్లో 50 శాతం కన్నా తక్కువ నీటి లభ్యత ఉంది. -
4 రోజుల్లో 95 టీఎంసీలు!
సాక్షి, హైదరాబాద్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు స్థానికంగా కురుస్తున్న వర్షాలు తోడవడంతో గోదావరి ఉధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండగా, ప్రాణహిత నదిలో వరద అంతకంతకీ పెరుగుతోంది. గోదావరి, ప్రాణహిత కలిసిన అనంతరం దిగువన మేడిగడ్డ వద్ద మంగళవారం 3.55 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యధికం. రెండ్రోజుల కిందట వరకు అక్కడ 2.40 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగినా, అది ఒక్కసారిగా లక్ష క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు రోజుల వ్యవధిలోనే మేడిగడ్డ బ్యారేజీని దాటుతూ 95 టీఎంసీల గోదావరి నీరు దిగువకు వెళ్లింది. సోమవారం ఒక్క రోజే 20 టీఎంసీలు దిగువకు వెళ్లగా, మంగళవారం మరో 30 టీఎంసీలు మేడిగడ్డ బ్యారేజీని దాటి వెళ్లిపోయింది. భారీ వరద నేపథ్యంలో బ్యారేజీలో 85 గేట్లలో 44 గేట్ల (నాలుగు బ్లాక్‌లు) నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేశారు. కాంక్రీట్ పనుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. బేసిన్‌లోని ఎల్లంపల్లికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 13,111 క్యూసెక్కుల నీరు వస్తుం డటంతో అక్కడ నిల్వలు 20 టీఎంసీలకుగాను 7.89 టీఎంసీలకు చేరుకున్నాయి. ఈ సీజన్లో ఎల్లంపల్లిలోకి 4.13 టీఎంసీల కొత్తనీరు రాగా, మరో 12.29 టీఎంసీలు వస్తే ప్రాజెక్టు నిండనుంది. ఇక ఎస్సారెస్పీలోకి ప్రవాహాలు క్రమంగా తగ్గుతున్నాయి. రెండ్రోజుల కిందటి వరకు 10వేల క్యూసెక్కులకు పైగా వరద రాగా ప్రస్తుతం అది 2,401 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ 90.31 టీఎంసీలకు గానూ 12.12 టీఎంసీలకు చేరింది. కడెంలోకి 5,730 క్యూసెక్కులు వస్తుండగా, నిల్వ 7.60 టీఎంసీలకు 6.92 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండటంతో 6,085 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూరులోకి 461 క్యూసెక్కులు వస్తుండగా, నిజాంసాగర్‌లోకి చుక్క నీరు రావడం లేదు. ఆల్మట్టికి పది రోజుల్లో 30 టీఎంసీలు.. కర్ణాటకలో ఉధృతంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా నీరు వస్తోంది. గడిచిన పది రోజులుగా ప్రాజెక్టులోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటంతో ఏకంగా 30 టీఎంసీలకుపైగా కొత్త నీరు వచ్చి చేరింది. మంగళవారం సైతం ప్రాజెక్టులోకి ఏకంగా 52,897 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు నీటి మట్టం 57.73 టీఎంసీలకు చేరింది. 71.99 టీఎంసీల మేర నీటిలోటు కనబడుతోంది.తుంగభద్రలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 38,052 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు నిల్వలు 100 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 46.16 టీఎంసీలకు చేరింది. ఇక నారాయణపూర్‌కు ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ 37 టీఎంసీలకు ప్రస్తు తం 23.81 టీఎంసీల మేర నిల్వలతో ఆశాజనకంగా ఉన్నాయి. రాష్ట్ర పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 5.73, నాగార్జునసాగర్ లో 312 టీఎంసీలకు గానూ 133.37 టీఎం సీలు, శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 29.06 టీఎంసీల నిల్వలున్నాయి. -
ఉధృతంగా ప్రాణహిత!
సాక్షి, హైదరాబాద్: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలోనూ గడిచిన మూడు రోజులుగా స్థిరంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. దీంతో గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం ప్రాంతంలో వరద శనివారం ఏకంగా 84,900 క్యూసెక్కులకు చేరింది. మహారాష్ట్రలోని గడ్చిరోలీతోపాటు ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. గోదావరి ప్రాజెక్టులకు ఊపిరి: గోదావరి ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎస్సారెస్పీలోకి శనివారం 6,160 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగాయి. ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలుగా కాగా, ప్రస్తుతం 11.50 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో ప్రాజెక్టులోకి 5.33 టీఎంసీల కొత్త నీరు చేరింది. కడెం ప్రాజెక్టులోకి 8,742 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో అక్కడ వాస్తవ నిల్వ 7.60 టీఎంసీలకు గానూ 5.53 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లిలోకి 1,068 క్యూసెక్కుల నీరు వస్తుండగా నిల్వలు 20 టీఎంసీలకు గానూ 6.07 టీఎంసీలకు చేరాయి. కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 32 వేల క్యూసెక్కుల ప్రవాహాలు వచ్చాయి. దీంతో ప్రాజెక్టులో నిల్వ 129 టీఎంసీలకు గానూ 43 టీఎంసీలకు చేరింది. తుంగభద్రకు 6 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా అక్కడా నిల్వలు 41 టీఎంసీలకు చేరుకున్నాయి. ప్రాజెక్టుల పనులకు ఆటంకం ప్రస్తుత వాటర్ ఇయర్ మొదలయ్యాక జూన్ రెండో వారంలో ప్రాణహితలో భారీ ప్రవాహాలు నమోదయ్యాయి. అప్పటి నుంచి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నా.. 15 వేల క్యూసెక్కుల నుంచి 25 వేల క్యూసెక్కుల మధ్యే వరద ఉధృతి ఉంటోంది. అయితే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా కురుస్తున్న వర్షాలతో ప్రవాహం మరింత పెరిగింది. ఈ వరద ప్రభావం మేడిగడ్డ బ్యారేజీ పనులపై పడుతోంది. ఇక్కడ శనివారం కేవలం 1,150 క్యూసెక్కుల మట్టి పని మాత్రమే జరిగింది. మొత్తంగా 85 గేట్లు ఉండగా 25 గేట్ల పనులను పూర్తిగా నిలిపివేశారు. మేడిగడ్డ పంప్ హౌజ్ పనులు కొనసాగుతున్నా, గ్రావిటీ కెనాల్ పరిధిలో మట్టి పని పూర్తిగా నిలిచిపోయింది. కాంక్రీట్ పని కేవలం 300 క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే జరిగింది. -
‘మిడిల్ కొలాబ్’కు ఓకే
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్లో ఎగువన ఒడిశా చేపడుతున్న మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుపై వివాదం ముగిసింది. రాష్ట్ర వాటా నీటికి గండికొట్టేలా ఒడిశా ప్రభుత్వం మిడిల్ కొలాబ్ చేపడుతోందని తెలంగాణ తొలుత అభ్యంతరాలు లేవనెత్తినా, ఒడిశా వాటా నీటిలోంచే వినియోగం ఉందని నిర్ధారణకు వచ్చిన దృష్ట్యా దీనికి సానుకూలత తెలిపింది. ఏపీ సైతం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని గోదావరి బోర్డు నిర్ణయించింది. గోదావరి బేసిన్‌లోని సమస్యలపై చర్చించేందుకు మంగళవారం బోర్డు అధ్యక్షుడు హెచ్‌కే సాహూ అధ్యక్షతన జలసౌధలో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు, తెలంగాణ సీఈ శంకర్‌నాయక్, డీసీఈ నరహరి బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోదావరి సబ్ బేసిన్లో ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతికి అడ్డుకట్ట వేసి భారీ స్థాయిలో నీటిని వినియోగించుకునేలా చేపట్టిన మిడిల్ కొలాబ్ బహుళార్థ సాధక ప్రాజెక్టుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఒడిశా సుమారు 40 టీఎంసీలకు పైగా నీటిని వాడుకునే ఎత్తుగడ వేస్తోందని తెలంగాణ అభ్యంతరం చెప్పింది. దీనిపై కల్పించుకున్న బోర్డు, ఒడిశాకు 40 టీఎంసీల కేటాయింపులున్నాయని, అందులోంచే 20 టీఎంసీల కన్నా తక్కువ నీటిని వాడుకునేలా దీన్ని చేపడుతోందని తెలిపింది. ఒడిశా తన వాటాల్లోంచే వాడుకుంటే తమకు అభ్యంతరాలు లేవని రెండు తెలుగు రాష్ట్రాలు సమ్మతించాయి. కొత్త ప్రాజెక్టులపై గరంగరం గోదావరి బేసిన్లో ఇరు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టులపై బోర్డు భేటీలో వాడీవేడి చర్చ జరిగింది. తెలంగాణ అడ్డగోలుగా రీ డిజైన్ పేరిట ప్రాజెక్టులు చేపడుతోందని, ప్రాంతాలు, నీటి వాటాను పెంచేస్తూ ప్రాజెక్టులు కడుతోందని ఏపీ అభ్యంతరం తెలిపింది. కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతలపై నిలదీసింది. ‘సీతారామ ప్రాజెక్టును రీ డిజైన్ చేశారని తెలంగాణ అంటోంది. నిజానికి రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా 33 టీఎంసీల నీటినే తీసుకోవాలని ఉంది. ప్రస్తుత రీ డిజైన్‌లో దాన్ని 70 టీఎంసీలకు పెంచారు. గతంలో ఆయకట్టు 3.24 లక్షల ఎకరాలుండగా, దాన్ని 6.74 లక్షల ఎకరాలకు పెంచారు. వ్యయం రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.3,505 కోట్లుండగా, అది రూ.13,384.80 కోట్లకు పెరిగింది. ఈ దృష్ట్యా దీన్ని కొత్త ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించరాదు’అని ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపినందున దాన్ని పాత ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించాలని అడిగింది. కొత్త ప్రాజెక్టులన్నింటికీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అన్ని ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులున్నాయని, వాటినే తమకు అనుగుణంగా రీ డిజైన్ చేశామని స్పష్టం చేసింది. ఏపీ కూడా గోదావరి బేసిన్లో పురుషోత్తపట్నం సహా అనేక కొత్త నిర్మాణాలు చేపడుతోందని, వాటిని కొత్త ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరింది. అసలు కొత్త ప్రాజెక్టు నిర్వచనం ఏమిటన్న దానిపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని, ఇరు రాష్ట్రాలు తమ ప్రాజెక్టుల జాబితా ఇస్తే, దీనిపై మరోమారు చర్చిద్దామని బోర్డు తెలిపింది. టెలిమెట్రీ పరికరాల అంశంపైనా చర్చ జరిగింది. మొత్తంగా 120 టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించినా, తొలి విడతగా ఎస్సారెస్పీ, ధవళేశ్వరం పరిధిలో నాలుగేసి చొప్పున 8 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మిడిల్ కొలాబ్‌తో నష్టమే!
సాక్షి, హైదరాబాద్: గోదావరి సబ్ బేసిన్లో ప్రధాన ఉప నదిగా ఉన్న ఇంద్రావతి నీటిని ఆధారంగా చేసుకుని ఒడిశా రాష్ట్రం చేపట్టిన మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుతో దిగువ తెలంగాణ ప్రయోజనాలకు నష్టమేనని రాష్ట్ర ఇంజనీర్ల కమిటీ తేల్చింది. ఇంద్రావతికి అడ్డుకట్ట వేసి భారీ స్థాయిలో నీటిని వినియోగించుకుంటూ శబరి నదికి తరలించేలా మిడిల్ కొలాబ్ బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించేందుకు ఒడిశా కసరత్తు చేస్తోందని, దీంతో భవిష్యత్తులో దిగువ ప్రాజెక్టులపై ప్రభావం కచ్చితంగా ఉంటుందని గుర్తించింది. దీనిపై త్వరలోనే కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు తమ అభిప్రాయాలతో నివేదికను సమర్పించనుంది. విద్యుదుత్పత్తి లక్ష్యంగా.. భారీ విద్యుదుత్పత్తి లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం మిడిల్ కొలాబ్ ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఎగువ నుంచి వచ్చే ఇంద్రావతి ఉప నది నీళ్లను జౌరా నాలా ద్వారా ఓ బ్యారేజీలోకి అక్కడి నుంచి పవర్‌హౌస్‌కు తిరిగి అక్కడి నుంచి మరో బ్యారేజీకి తరలించి ఆయకట్టుకు సైతం నీటిని అందించాలని నిర్ణయించింది. మొత్తంగా ఇక్కడ రోజుకు ఒక టీఎంసీ చొప్పున కనిష్టంగా 50 టీఎంసీల మేర వినియోగించుకునేలా ఎత్తులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఇటీవల గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం రాష్ట్ర వివరణ కోరింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులతో చర్చించి అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహారావు, కోటేశ్వర్రావు, ఉదయ్‌శంకర్‌తో కూడిన బృందాన్ని ఒడిశా పంపారు. ఈ బృందం రెండ్రోజుల పాటు మిడిల్ కొలాబ్ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. దీని ప్రకారం.. వాస్తవానికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య 1975లో కుదిరిన ఒప్పందం మేరకు ఇంద్రావతి, కొలాబ్ నది కలిసే ప్రాంతంలో 75 శాతం డిపెండబులిటీ లెక్కన ఒడిశా 8.5 టీఎంసీల మేర వాడుకునే వెసులుబాటు ఉందని, అయితే ఒడిశా ప్రస్తుతం సుమారు 50 టీఎంసీల మేర నీటిని తరలించుకునేలా ప్రణాళికలు వేస్తోందని గుర్తించింది. భవిష్యత్తులో మరో 75 టీఎంసీల నుంచి 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశాలున్నాయని తెలిపింది. జలాలు వృథాగా సముద్రంలోకి ఇప్పటికే శబరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, ప్రస్తుతం మిడిల్ కొలాబ్‌తో ఇంద్రావతి నీటిని శబరికి తరలిస్తే మరిన్ని జలాలు వృథాగా సముద్రంలో కలిసే అవకాశం ఉందని కమిటీ అంటోంది. దీనికి తోడు ఇంద్రావతి జలాలపై ఆధారపడిన దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యత తగ్గి మిడిల్ కొలాబ్‌తో ఇవన్నీ ప్రభావితమయ్యే అవకాశం ఉందని గుర్తించారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఒక సబ్ బేసిన్ పరిధిలో ఉండే రాష్ట్రాల అవసరాలు తీరాకే మరో సబ్ బేసిన్‌కు నీటిని తరలించాలని, అయితే ప్రస్తుతం దిగువ రాష్ట్రమైన తెలంగాణ అవసరాలను పణంగాపెట్టి ఇంద్రావతి నీటిని కొలాబ్ సబ్ బేసిన్‌కు తరలించేలా ఒడిశా ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందని నీటి పారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వానికి, కేంద్రానికి నివేదిక ఇస్తామంటున్నాయి. -
సాగుకు 38.4 తాగుకు 12.6 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) కింద యాసంగి కార్యాచరణను నీటిపారుదల శాఖ ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం కల్పించి, మిగతా లభ్యత నీటితో యాసంగికి నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. లభ్యతగా ఉన్న నీటిలో 38.4 టీఎంసీలను సాగు అవసరాలకు, 12.6 టీఎంసీలను తాగు అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించింది. మొత్తంగా ఎస్సారెస్పీ పరిధిలో 5.60 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించింది. రెండు రోజుల కిందట ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అంశమై సమీక్షించిన ముఖ్యమంత్రి, మిషన్ భగీరథ అవసరాలకు పోనూ, మిగతా నీటితో యాసంగి ప్రణాళిక రూపొందించాలని సూచించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఎస్సారెస్పీలో లభ్యతగా ఉన్న 55.16 టీఎంసీలకు అదనంగా సింగూరు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా మరో 5 టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఎస్సారెస్పీలో నీటి నిల్వలు 60.16 టీఎంసీలకు చేరుతాయి. ఈ నీటిలో 15 టీఎంసీలను లోయర్ మానేరు డ్యామ్(ఎల్ఎండీ)కు కాకతీయ కెనాల్ ద్వారా విడుదల చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో ఆవిరి, సరఫరా నష్టాలు పోనూ 11.5 టీఎంసీల మేర ఎల్ఎండీని చేరినా, ప్రాజెక్టులో ఇప్పటికే లభ్యతగా ఉన్న నీటితో ప్రాజెక్టు నిల్వ 19.39 టీఎంసీలకు చేరనుంది. ఎగువన 4 లక్షలు.. దిగువన 1.60 లక్షలు ఎస్సారెస్పీ, ఎల్ఎండీలో నిల్వలకు అనుగుణంగా ఎల్ఎండీ ఎగువన, దిగువన యాసంగి ప్రణాళిక ఖరారు చేశారు. ఎగువన తాగునీటికి 6.5 టీఎంసీలు పక్కనపెట్టి, 28.88 టీఎంసీలతో ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఏడు తడులకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 4 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయిం చారు. ఇందులో లక్ష్మీ కెనాల్ కింద 16,055 ఎకరాలు, సరస్వతి కెనాల్ కింద 16,300 ఎకరాలు, కాకతీయ కెనాల్ కింద 3,63,645 ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందిం చారు. ఇందులో లక్ష్మీ కెనాల్ కింద ఇవ్వాల్సిన ఆయకట్టులోనే చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం ఆయకట్టు ఉండనుంది. ఇక ఎల్ఎండీ దిగువన మిషన్ భగీరథకు 6.16 టీఎంసీలు పక్కనపెట్టి, 9.53 టీఎంసీలను సాగుకు ఇవ్వనున్నారు. డిసెంబర్ 15 నుంచి మార్చి 14 వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 6 తడుల్లో 1.60 లక్షల ఎకరాలకు నీళ్లివ్వను న్నారు. ఇక వీటితో పాటే సింగూరు కింద 5.7 టీఎంసీలు తాగునీటి అవసరాలకు కేటా యించి, 5 టీఎంసీలు దిగువ నిజాం సాగర్‌కు విడుదల చేయనున్నారు. సింగూరు కింద 2 టీఎంసీలతో 30 వేల ఎకరాలు, నిజాం సాగర్‌లో మొత్తంగా లభ్యమయ్యే 18 టీఎంసీల నీటితో 1.50 లక్షల ఎకరాలు, గుత్పా, అలీసాగర్ ఎత్తిపోతల కింద 2 టీఎంసీ లతో 20 వేల ఎకరాలు కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. -
తాగు తేలాకే సాగు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల కింద యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు సీఎం స్థాయిలో నిర్ణయం జరిగినా.. ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చేది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. మిషన్ భగీరథ కింది తాగు అవసరాలు, అనంతరం కనీస నీటి మట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలు తేలాకే ఆయకట్టు నీటిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలంటే 95 టీఎంసీల మేర అవసరం ఉండగా, లభ్యత జలాలు మాత్రం 56 టీఎంసీలే. ఇందులో 6 టీఎంసీల మేర భగీరథకు పక్కన పెట్టినా మిగతా నీటిని కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్ల పరిధిలో ఎలా సర్దుబాటు చేస్తారన్నది పూర్తిస్థాయి సమీక్షల అనంతరమే తేల్చనున్నారు. 6.58 లక్షల ఎకరాలకు దాటని వైనం ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద 9.68 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఈ ఆయకట్టుకు నీరందించేలా మూడు ప్రధాన కాల్వలను నిర్మించారు. కాకతీయ కాల్వ ఎల్ఎండీ ఎగువన 4,06,080 ఎకరాలు, కాకతీయ కాలువ ఎల్ఎండీ దిగువన 5,05,720 ఎకరాలు, లక్ష్మీ కాలువ కింద 21,870 ఎకరాలు, సరస్వతి కాలువ కింద 34,970 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టులో కీలకమైన కాకతీయ కాల్వ ప్రవాహ సామర్థ్యం 8500 క్యూసెక్కులు. కానీ ఏనాడూ 3–4వేల క్యూసెక్కులకు మించి నీరు పారలేదు. దీంతో 2015–16 వరకు గడిచిన పదేళ్లలో సగటు ఆయకట్టు 6.58 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందింది. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత కాలువల అభివృద్ధి, మరమ్మతులు, లైనింగ్ సహా ఇతర పనులకు రూ.630 కోట్లు ఖర్చు చేశారు. ఫలితంగా ఎల్ఎండీ ఎగువన కాల్వ ప్రవాహ సామర్థ్యం 7 వేల క్యూసెక్కులకు, దిగువన 5 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సారెస్పీ పరిధిలో గతేడాది ఖరీఫ్‌లో 4.97 లక్షలు, రబీలో 6.14 లక్షల ఎకరాల మేర పంటల సాగు జరిగింది. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటలకు అధికారికంగా నీటి విడుదల జరగలేదు. చెరువులు నింపేందుకు గరిష్టంగా 8 టీఎంసీల నీటిని, మిడ్‌మానేరును నింపేందుకు మరో 10 టీఎంసీల నీటిని విడుదల చేశారు. గరిష్టంగా 95.. కనిష్టంగా 70 టీఎంసీలు ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90.31 టీఎంసీల నిల్వలకు గానూ 55.24 టీఎంసీల నిల్వలున్నాయి. 2 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండేందుకు మరో 35.07 టీఎంసీలు అవసరం. అయితే 9.68 లక్షల ఎకరాలకు నీరందించేందుకు గరిష్టంగా 95 టీఎంసీలు, కనిష్టంగా 70 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం లభ్యతగా ఉన్న 54.96 టీఎంసీల్లో మిషన్ భగీరథ అవసరాలకు 6.5 టీఎంసీలు పోగా.. లభ్యతగా మరో 48 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. వాటితో 5 లక్షల ఎకరాలకు మించి సాగుకు ఇచ్చే అవకాశం ఉండదు. ఇందులో ఎల్ఎండీ ఎగువన ఎంత, దిగువన ఎంత అన్నది ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇక సింగూరులో పూర్తిస్థాయిలో 29.5 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడ భగీరథకు 5.7 టీఎంసీలు పక్కనపెట్టినా, ప్రాజెక్టు కింది 40 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఘనపూర్ ఆయకట్టుకు కూడా 40 వేల ఎకరాలకు నీరివ్వవచ్చు. నిజాంసాగర్‌లో ప్రస్తుతం 17 టీఎంసీలకు గానూ 12.9 టీఎంసీల నిల్వలున్నాయి. దీని కింద ఆయకట్టు మాత్రం 2.3 లక్షల ఎకరాల మేర ఉంది. ప్రస్తుతం లభ్యత నీటితో 1.25 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఎంత నీటిని ఎక్కడెక్కడ ఇవ్వాలన్నది పూర్తిస్థాయి సమీక్ష అనంతరం తేల్చనున్నారు. -
గుండె ‘చెరువు’!
► వర్షాల్లేక వట్టిపోతున్న చెరువులు ► 25 శాతం కూడా నిండని చెరువులు 20,681 ► కృష్ణా, గోదావరి బేసిన్లో గడ్డు పరిస్థితులు ► 20 లక్షల ఎకరాలపై ప్రభావం! గ్రామీణ వ్యవసాయానికి పట్టుగొమ్మలాంటి చెరువు చిన్నబోతోంది. ఏటా ఈ సమయానికల్లా నీటి గలగలలతో కళకళలాడాల్సిన చెరువులన్నీ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వట్టిపోతున్నాయి. రాష్ట్రంలో 44 వేలకు పైగా ఉన్న చెరువుల్లో ఏకంగా 20 వేల పైచిలుకు చెరువుల్లో నీటి జాడ కానరావడం లేదు. పూర్వ మహబూబ్‌నగర్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని చెరువులు, వాటికింది ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇది ఏకంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రభావితం చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ పడిపోయిన సాగు విస్తీర్ణం.. నీటి కొరతతో చెరువుల కింద సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. గత ఏడాదితో పోలిస్తే 15 శాతం ఆయకట్టులో కూడా సాగు జరగని పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది విస్తారంగా వర్షాలు కురవడం, ఆ సమయానికే పెద్ద సంఖ్యలో చెరువుల పునరుద్ధరణ జరగడంతో ఏకంగా 13 లక్షల ఎకరాల్లో సాగునీరందించారు. కానీ ప్రస్తుత ఖరీఫ్‌లో అధికారుల అంచనా ప్రకారం చెరువుల కింద సాగు 3.5 లక్షల ఎకరాలు దాటలేదు. నోరెళ్ల బెట్టిన కృష్ణా బేసిన్ చెరువులు కృష్ణా బేసిన్ పరిధిలోని చెరువుల పరిస్థితి దారుణంగా ఉంది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో మొత్తంగా 23,366 చెరువులు ఉండగా ఇందులో 6,800కు పైగా చెరువుల్లో చుక్కనీరు చేరలేదు. 25 శాతం మాత్రమే నీరు చేరిన చెరువులు 8,100 వేల వరకున్నాయి. కేవలం 810 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు చేరింది. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలో 75 శాతం చెరువులు చుక్కనీటికి నోచుకోలేకపోయాయి. జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి లోటు ప్రభావం చెరువులపై పడింది. గతేడాది కల్వకుర్తి కింద 283 చెరువులు నింపగా.. ఈ ఏడాది ఒక్క చెరువుకు నీటి జాడ లేదు. సిద్దిపేట జిల్లాలో 3,256 చెరువులు ఉండగా.. 2,311 చెరువుల్లో 25 శాతం కంటే తక్కువ నీళ్లొచ్చాయి. చెరువుల్లోకి నీరు చేరకపోవడంతో కృష్ణా బేసిన్ పరిధిలో మొత్తంగా 11.13 లక్షల ఎకరాలపై ప్రభావం పడుతోంది. చివరికి గణేశ్ విగ్రహాల నిమజ్జనం కూడా కష్టతరంగా మారింది. గోదావరిలోనూ అంతంతే.. గోదావరి బేసిన్లో కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదు. పాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని చెరువులు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని చెరువుల పరిస్థితి మాత్రం కాస్త మెరుగ్గా ఉంది. ఈ బేసిన్ పరిధిలో మొత్తంగా 20,814 చెరువులు ఉండగా 5,737 చెరువుల్లో 25 శాతం కంటే తక్కువ నీరు చేరింది. 7,380 చెరువుల్లోనే 75 శాతానికి పైగా నీరు చేరింది. మొత్తంగా బేసిన్ పరిధిలో 13.26 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. అందులో సుమారు 9 లక్షల ఎకరాలపై నీటి కొరత ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. చెరువుల పరిస్థితి ఇదీ మొత్తం చెరువులు 44,180 25% లోపు నిండినవి 20,681 25–50% నిండినవి 9,796 50–75% నిండినవి 5,203 75–100% నిండినవి 8,500