సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల కింద యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు సీఎం స్థాయిలో నిర్ణయం జరిగినా.. ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చేది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. మిషన్ భగీరథ కింది తాగు అవసరాలు, అనంతరం కనీస నీటి మట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలు తేలాకే ఆయకట్టు నీటిపై స్పష్టత రానుంది.
ప్రస్తుతం ఎస్సారెస్పీ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలంటే 95 టీఎంసీల మేర అవసరం ఉండగా, లభ్యత జలాలు మాత్రం 56 టీఎంసీలే. ఇందులో 6 టీఎంసీల మేర భగీరథకు పక్కన పెట్టినా మిగతా నీటిని కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్‌ల పరిధిలో ఎలా సర్దుబాటు చేస్తారన్నది పూర్తిస్థాయి సమీక్షల అనంతరమే తేల్చనున్నారు.
6.58 లక్షల ఎకరాలకు దాటని వైనం
ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద 9.68 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఈ ఆయకట్టుకు నీరందించేలా మూడు ప్రధాన కాల్వలను నిర్మించారు. కాకతీయ కాల్వ ఎల్‌ఎండీ ఎగువన 4,06,080 ఎకరాలు, కాకతీయ కాలువ ఎల్‌ఎండీ దిగువన 5,05,720 ఎకరాలు, లక్ష్మీ కాలువ కింద 21,870 ఎకరాలు, సరస్వతి కాలువ కింద 34,970 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టులో కీలకమైన కాకతీయ కాల్వ ప్రవాహ సామర్థ్యం 8500 క్యూసెక్కులు. కానీ ఏనాడూ 3–4వేల క్యూసెక్కులకు మించి నీరు పారలేదు.
దీంతో 2015–16 వరకు గడిచిన పదేళ్లలో సగటు ఆయకట్టు 6.58 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందింది. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత కాలువల అభివృద్ధి, మరమ్మతులు, లైనింగ్ సహా ఇతర పనులకు రూ.630 కోట్లు ఖర్చు చేశారు. ఫలితంగా ఎల్‌ఎండీ ఎగువన కాల్వ ప్రవాహ సామర్థ్యం 7 వేల క్యూసెక్కులకు, దిగువన 5 వేల క్యూసెక్కులకు పెరిగింది.
దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సారెస్పీ పరిధిలో గతేడాది ఖరీఫ్‌లో 4.97 లక్షలు, రబీలో 6.14 లక్షల ఎకరాల మేర పంటల సాగు జరిగింది. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటలకు అధికారికంగా నీటి విడుదల జరగలేదు. చెరువులు నింపేందుకు గరిష్టంగా 8 టీఎంసీల నీటిని, మిడ్‌మానేరును నింపేందుకు మరో 10 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
గరిష్టంగా 95.. కనిష్టంగా 70 టీఎంసీలు
ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90.31 టీఎంసీల నిల్వలకు గానూ 55.24 టీఎంసీల నిల్వలున్నాయి. 2 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండేందుకు మరో 35.07 టీఎంసీలు అవసరం. అయితే 9.68 లక్షల ఎకరాలకు నీరందించేందుకు గరిష్టంగా 95 టీఎంసీలు, కనిష్టంగా 70 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం లభ్యతగా ఉన్న 54.96 టీఎంసీల్లో మిషన్ భగీరథ అవసరాలకు 6.5 టీఎంసీలు పోగా.. లభ్యతగా మరో 48 టీఎంసీలు మాత్రమే ఉంటాయి.
వాటితో 5 లక్షల ఎకరాలకు మించి సాగుకు ఇచ్చే అవకాశం ఉండదు. ఇందులో ఎల్‌ఎండీ ఎగువన ఎంత, దిగువన ఎంత అన్నది ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇక సింగూరులో పూర్తిస్థాయిలో 29.5 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడ భగీరథకు 5.7 టీఎంసీలు పక్కనపెట్టినా, ప్రాజెక్టు కింది 40 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఘనపూర్ ఆయకట్టుకు కూడా 40 వేల ఎకరాలకు నీరివ్వవచ్చు.
నిజాంసాగర్‌లో ప్రస్తుతం 17 టీఎంసీలకు గానూ 12.9 టీఎంసీల నిల్వలున్నాయి. దీని కింద ఆయకట్టు మాత్రం 2.3 లక్షల ఎకరాల మేర ఉంది. ప్రస్తుతం లభ్యత నీటితో 1.25 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఎంత నీటిని ఎక్కడెక్కడ ఇవ్వాలన్నది పూర్తిస్థాయి సమీక్ష అనంతరం తేల్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment