
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే తప్ప గవర్నర్ నుంచి బిల్లులు పాస్ కాని పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. శాసనసభ ఓకే చేసిన బిల్లుల విషయంలో మంత్రులు, సీఎస్ వెళ్లి వివరాలు తెలిపినా, సందేహాలను తీర్చినా కూడా.. గవర్నర్ ఏడు నెలలు ఉద్దేశపూర్వకంగా ఆపారని ఆరోపించారు. సోమవారం హరీశ్‌రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలంలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ట్రయల్ రన్ నిర్వహించారు.
హరీశ్‌రావు ఈ సందర్భంగా గవర్నర్, కేంద్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా? కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే.. ఆ బిల్లును ఏడునెలల పాటు ఆపి, ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపామని చెబుతున్నారు. మా పిల్లలకు ప్రొఫెసర్ చదువులు చెప్పొద్దా? పిల్లల భవిష్యత్ కంటే రాజకీయాలు ముఖ్యమా?’’అని ప్రశ్నించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను పాస్ చేయకుండా గవర్నర్ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
మిషన్ భగీరథకు నిధులేవి?
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథకు ప్రోత్సహకాలు ఇవ్వకుండా కేంద్రం పక్షపాతం చూపిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. మిషన్ భగీరథకు రూ.13 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కనీసం 13 పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తోంది. తెలంగాణ పథకాలు అద్భుతమని తీయటి మాటలు చెప్తారు, అవార్డులు కూడా ఇస్తారు.
కానీ నయా పైసా నిధులు మాత్రం ఇవ్వరు’’అని విమర్శించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ పథకం చేపట్టామని, మల్లన్నసాగర్ నుంచి ఆరు జిల్లాల్లో 10 నియోజకవర్గాల పరిధిలోని 1,922 గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును రూపొందించామన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
నిధులు ఇవ్వకుండా మోసం: ఎర్రబెల్లి
కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు డబ్బులిస్తూ.. తెలంగాణపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment