సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.1,013 కోట్లు ఇవ్వకపోయినా, పల్లెలు, పట్టణాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,619 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
పల్లె, పట్టణ ప్రగతిపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర అధికారులతో మంత్రులు సోమవారం బీఆర్‌కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు, ఎర్రబెల్లి మాట్లాడుతూ... నాలుగు విడతల పల్లె ప్రగతి కోసం రూ.8,963 కోట్లు, మూడు విడతల పట్టణ ప్రగతి కోసం రూ. 2,748 కోట్లు మొత్తంగా రూ. 11,711 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.514.3కోట్ల చెల్లింపులు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న చెల్లింపులు రూ.285కోట్లను వచ్చే రెండుమూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతోందని, ఇదే స్ఫూర్తితో ఐదో విడత పల్లె ప్రగతి, నాలుగో విడత పట్టణ ప్రగతిలను విజయవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి 15 రోజుల పాటు కార్యక్రమం సాగనున్న నేపథ్యంలో గతంలో చేపట్టిన, తాజాగా చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు.
కేంద్రం నుంచి నయా పైసా రాలేదు...
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు కేంద్రం సుమారు రూ. 1100 కోట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రులు చెప్పారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మే మొదటి వారంలోనే కేంద్రానికి లేఖ రాసిందని, ఆర్థిక సంవత్సరం మొదలై రెండు నెలలు కావొస్తున్నా, నయా పైసా విడుదల చేయలేదని తెలిపారు. దీంతో చేసిన పనులకు బిల్లులు రాక వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
మరొక సారి కేంద్రానికి లేఖ రాయడంతో పాటు ఢిల్లీ వెళ్లి నిధుల విడుదల కోసం తగు చర్యలు తీసుకోవాలని పీఆర్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు. కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే త్వరితగతిన చెల్లింపులు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment