సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకులకు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్–వీవోఏ) రక్షాబంధన్ కానుకగా వారి గౌరవ వేతనాలను పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారి వేతనాలు నెలకు రూ. 8 వేలకు పెరగనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకులకు(వీవోఏ) లబ్ధి చేకూరనుంది.
దీనికి సంబంధించి మంత్రులు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై నిర్ణయం ప్రకటించాలని మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. దీంతో సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారులు, పలువురు వీవోఏ మహిళా సంఘాల ప్రతినిధులతో హరీశ్‌రావు సమావేశమై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తెలియజేశారు. ఆ ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల కాపీని మహిళా సంఘాల ప్రతినిధులకు మంత్రులు అందజేయగా వారు మంత్రులకు రాఖీలు కట్టి కృతజ్ఞతలు తెలియజేశారు.
పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అమల్లోకి రానున్నాయి. వేతన పెంపుదల ద్వారా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.106 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా, డ్రెస్ కోడ్ అమలు కోసం నిధులు విడుదల చేయాలన్న వీవోఏల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ.2 కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి మూడు నెలలకోసారి చేసే రెన్యూవల్ విధానాన్ని ఇకపై ఏడాదికి చేసేలా సవరించాలని సీఎం నిర్ణయించారు. జీవిత బీమా కోసం విధివిధానాలు అధ్యయనం చేసి నివేదిక అందించాలని మంత్రి ఎర్రబెల్లిని ఆదేశించారు.
జీతాల పెంపు ఇలా...
ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో పొదుపు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు సహాయకులుగా పనిచేస్తూ సంఘాలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, ఇతర సమాచారాన్ని నమోదు చేసే విధులను వీవోఏలు స్వచ్ఛందంగా నిర్వహించేవారు. వారు సేవ చేస్తున్న మహిళా సంఘాల నుంచి మాత్రమే ‘గ్రూపు లీడర్లు’గా నెలకు రూ. 2 వేల గౌరవ వేతనం ఇచ్చేవారు. వీవోఏల కృషిని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం 2016 నుంచి వారికి నెలకు రూ. 3 వేల గౌరవ వేతనం అందిస్తోంది. ఇటీవలే పెంచిన పీఆర్సీని వీవోఏలకు కూడా వర్తింపజేయడంతో వారి గౌరవ వేతనం రూ. 3900కు పెరిగింది.
దీంతో మహిళా సంఘాల నుంచి అందే రూ.2 వేల తోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే రూ. 3,900 కలిపితే వారి వేతనం రూ. 5,900కు పెరిగింది. అయితే వారి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం మరోసారి వీవోఏలను ఆదుకోవాలని నిర్ణయించి రాఖీ పండుగ కానుకగా వేతనాలను రూ. 8 వేలకు పెంచాలని నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: అంగన్‌వాడీల్లో సమ్మె సైరన్! 11 నుంచి నిరవధిక సమ్మె
Comments
Please login to add a commentAdd a comment