కరీంనగర్‌లో నీరు లేక వెలవెల బోతున్న లోయర్ మానేరు డ్యామ్
డెడ్ స్టోరేజీలో జలాశయాలు కృష్ణా, గోదావరి బేసిన్లలోని 14 ప్రాజెక్టుల్లో అడుగంటిన నీళ్లు
శ్రీశైలం, సాగర్, జూరాలలో కనీస మట్టాలకన్నా దిగువకు..
కృష్ణా ప్రాజెక్టుల్లో నిల్వలు ఇంతగా తగ్గడం ఏడేళ్లలో ఇదే తొలిసారి
శ్రీశైలం, సాగర్‌లకు 2015–16 తర్వాత ఇప్పుడే అతి తక్కువ ఇన్‌ఫ్లోలు
గోదావరి ప్రాజెక్టులకు కూడా మూడేళ్ల తర్వాత తగ్గిన ప్రవాహాలు
ఈసారి తాగునీటికీ కటకట తప్పని పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన జలాశయాల్లో కూడా నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో 2015–16 తర్వాత ఇంతగా నీటి సమస్య రావడం ఇదే తొలిసారి. ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు 2023–24 నీటి సంవత్సరం (వాటర్ ఇయర్ – జూన్ నుంచి మే వరకు)లో తగిన వరద రాలేదు. నిజానికి మొదట్లో రాష్ట్రంలో సాధారణం కంటే 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా.. అక్టోబర్ తర్వాత వానలు జాడ లేకుండా పోయాయి.
గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మధ్య సాధారణ వర్షపాతంతో పోల్చితే.. 56.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనితో జలాశయాల్లోకి కొత్త నీరు చేరక.. ఉన్న నీటి నిల్వలు శరవేగంగా అడుగంటిపోతూ వచ్చాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో 14 ప్రధాన జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయి. దీనితో మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా కటకట తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ జూన్‌లో వానలు ఆలస్యంగా మొదలైతే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
‘కృష్ణా’లో ఏడేళ్ల తర్వాత మళ్లీ కరువు..
ఏడేళ్ల తర్వాత ప్రస్తుత వాటర్ ఇయర్‌లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు అతి తక్కువ ఇన్‌ఫ్లో వచ్చింది. శ్రీశైలం జలాశయానికి ఏటా సగటున వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల వరద వస్తుందని అంచనా. కానీ 2015–16లో అతి తక్కువగా 71 టీఎంసీలే చేరింది. ఆ తర్వాత మళ్లీ 2023–24లో 144.36 టీఎంసీలు మాత్రమే వరద వచ్చింది. ఇక నాగార్జునసాగర్‌కు కూడా సాధారణంగా వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీలు రావాల్సి ఉండగా.. 2015–16లో కేవలం 72 టీఎంసీలు.. ఆ తర్వాత మళ్లీ తక్కువగా ఈసారి 147 టీఎంసీలు వరద మాత్రమే వచ్చింది.
కనీస నిల్వలూ కరువే!
శ్రీశైలం జలాశయంలో సాగునీటి అవసరాలకు ఉండాల్సిన కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 854 అడుగులుకాగా.. ఇప్పటికే 810 అడుగులకు పడిపోయింది. నిల్వలు 34.29 టీఎంసీలకు పడిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 510 అడుగులుకాగా.. ప్రస్తుతం 511.5 అడుగుల వద్ద ఉంది. నిల్వలు 134.23 టీఎంసీలకు తగ్గిపోయాయి. అయితే ఇందులో వాడుకోగల నీళ్లు అతి తక్కువే. ఇక జూరాల ప్రాజెక్టు కనీస మట్టం 1033 అడుగులకుగాను.. ఇప్పటికే 1031.27 అడుగులకు పడిపోయింది.
గోదావరిలో మూడేళ్ల కనిష్టానికి వరదలు
గోదావరి నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ ఏడాది ఇన్‌ఫ్లోలు గణనీయంగా తగ్గాయి. ఇంత తక్కువ వరదలు రావడం మూడేళ్ల తర్వాత ఈసారే. కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2023–24లో 203.73 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20 తర్వాత ఇంత తక్కువ వరద రావడం ఇదే తొలిసారి. 2022–23లో 593 టీఎంసీలు, 2021–22లో 678 టీఎంసీలు, 2020–21లో 368 టీఎంసీలు వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా 2019–20 తర్వాత ఈసారి అతితక్కువగా 396 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది.
ప్రస్తుతం జలాశయంలో 7.53 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. 20.1 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో గత ఏడాది ఇదే సమయానికి 12.26 టీఎంసీల నీళ్లు ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాది మిడ్ మానేరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. దిగువ మానేరుకు సైతం 2019–20 తర్వాత అతితక్కువగా ఈ ఏడాది 78 టీఎంసీలే ఇన్‌ఫ్లో నమోదైంది.
ఒకేసారి వచ్చి.. లాభం లేక..
గోదావరిపై ప్రధాన ప్రాజెక్టుల్లోకి వందల టీఎంసీల్లో నీరు వచ్చినట్టు లెక్కలు చెప్తున్నా.. అదంతా భారీ వరద కొనసాగే కొద్దిరోజుల్లోనే కావడం గమనార్హం. అప్పుడు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో నీరంతా దిగువకు వెళ్లిపోయింది. తర్వాత వానలు లేక ఇన్‌ఫ్లో లేకుండా పోయింది. ప్రాజెక్టులు అడుగంటే పరిస్థితి వచ్చింది.
మంజీరా వెలవెల
సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్‌లోనూ నీళ్లు అడుగంటుతున్నాయి. హైదరాబాద్ జంట నగరాలకు మంజీరా నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. ఏప్రిల్ తొలివారంలోనే ఇలా ఉంటే.. మే వచ్చే సరికి నీటి సరఫరా పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment