సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని జలాశయాలు వెలవెలబోతున్నాయి. ప్రధాన జలాశయాల్లో నిల్వలు అడుగంటి పోయాయి. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో మొత్తం 386.8 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 285.21 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి.
కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఆల్మట్టి డ్యాంలో గతేడాది సరిగ్గా ఇదే సమయానికి 91.35 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 21 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఎట్టకేలకు డ్యాంకు గత మంగళవారం నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రస్తుతం 19,172 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో డ్యాంలోకి వచ్చి చేరుతోంది.
రోజుకు 1.66 టీఎంసీల వరద ఆల్మట్టిలో చేరుతుండగా, మరో 108 టీఎంసీల వరద వచ్చిచేరితేనే డ్యాం నిండనుంది. ఇక నారాయణపూర్ జలాశయంలో 17 టీఎంసీలు, తుంగభద్ర డ్యాంలో 6.89 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి.
జూరాలకు ఇంకా మొదలుకాని ఇన్‌ఫ్లో
నారాయణపూర్, జూరాలకు ఇప్పటివరకు ఎలాంటి ఇన్‌ఫ్లో ప్రారంభం కాలేదు. శ్రీశైలంకు 126 క్యూసెక్కుల నామమాత్రపు వరద వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాంలు పూర్తిగా నిండితేనే దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరద నీరు రానుంది. నైరుతి రుతుపవనాలు ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడం, ఇంకా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండడంతో ఈ డ్యాంలు ఇప్పట్లో నిండే సూచనలు కనపడటం లేదు.
ప్రాణహితకి స్వల్పంగా పెరిగిన వరద..
గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాణహిత నదికి స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీకి ప్రస్తుతం 1,23,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,19,878 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీకి వస్తున్న 83,945 క్యూసెక్కులను వచ్చినట్టు కిందికి పంపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment