సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్‌లో ఎగువన ఒడిశా చేపడుతున్న మిడిల్ కొలాబ్ ప్రాజెక్టుపై వివాదం ముగిసింది. రాష్ట్ర వాటా నీటికి గండికొట్టేలా ఒడిశా ప్రభుత్వం మిడిల్ కొలాబ్ చేపడుతోందని తెలంగాణ తొలుత అభ్యంతరాలు లేవనెత్తినా, ఒడిశా వాటా నీటిలోంచే వినియోగం ఉందని నిర్ధారణకు వచ్చిన దృష్ట్యా దీనికి సానుకూలత తెలిపింది. ఏపీ సైతం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని గోదావరి బోర్డు నిర్ణయించింది. గోదావరి బేసిన్‌లోని సమస్యలపై చర్చించేందుకు మంగళవారం బోర్డు అధ్యక్షుడు హెచ్‌కే సాహూ అధ్యక్షతన జలసౌధలో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు, తెలంగాణ సీఈ శంకర్‌నాయక్, డీసీఈ నరహరి బాబు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గోదావరి సబ్ బేసిన్‌లో ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతికి అడ్డుకట్ట వేసి భారీ స్థాయిలో నీటిని వినియోగించుకునేలా చేపట్టిన మిడిల్ కొలాబ్ బహుళార్థ సాధక ప్రాజెక్టుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఒడిశా సుమారు 40 టీఎంసీలకు పైగా నీటిని వాడుకునే ఎత్తుగడ వేస్తోందని తెలంగాణ అభ్యంతరం చెప్పింది. దీనిపై కల్పించుకున్న బోర్డు, ఒడిశాకు 40 టీఎంసీల కేటాయింపులున్నాయని, అందులోంచే 20 టీఎంసీల కన్నా తక్కువ నీటిని వాడుకునేలా దీన్ని చేపడుతోందని తెలిపింది. ఒడిశా తన వాటాల్లోంచే వాడుకుంటే తమకు అభ్యంతరాలు లేవని రెండు తెలుగు రాష్ట్రాలు సమ్మతించాయి.
కొత్త ప్రాజెక్టులపై గరంగరం
గోదావరి బేసిన్‌లో ఇరు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టులపై బోర్డు భేటీలో వాడీవేడి చర్చ జరిగింది. తెలంగాణ అడ్డగోలుగా రీ డిజైన్ పేరిట ప్రాజెక్టులు చేపడుతోందని, ప్రాంతాలు, నీటి వాటాను పెంచేస్తూ ప్రాజెక్టులు కడుతోందని ఏపీ అభ్యంతరం తెలిపింది. కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతలపై నిలదీసింది. ‘సీతారామ ప్రాజెక్టును రీ డిజైన్ చేశారని తెలంగాణ అంటోంది. నిజానికి రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా 33 టీఎంసీల నీటినే తీసుకోవాలని ఉంది. ప్రస్తుత రీ డిజైన్‌లో దాన్ని 70 టీఎంసీలకు పెంచారు. గతంలో ఆయకట్టు 3.24 లక్షల ఎకరాలుండగా, దాన్ని 6.74 లక్షల ఎకరాలకు పెంచారు. వ్యయం రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.3,505 కోట్లుండగా, అది రూ.13,384.80 కోట్లకు పెరిగింది.
ఈ దృష్ట్యా దీన్ని కొత్త ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించరాదు’అని ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపినందున దాన్ని పాత ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించాలని అడిగింది. కొత్త ప్రాజెక్టులన్నింటికీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అన్ని ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులున్నాయని, వాటినే తమకు అనుగుణంగా రీ డిజైన్ చేశామని స్పష్టం చేసింది. ఏపీ కూడా గోదావరి బేసిన్‌లో పురుషోత్తపట్నం సహా అనేక కొత్త నిర్మాణాలు చేపడుతోందని, వాటిని కొత్త ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరింది. అసలు కొత్త ప్రాజెక్టు నిర్వచనం ఏమిటన్న దానిపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని, ఇరు రాష్ట్రాలు తమ ప్రాజెక్టుల జాబితా ఇస్తే, దీనిపై మరోమారు చర్చిద్దామని బోర్డు తెలిపింది. టెలిమెట్రీ పరికరాల అంశంపైనా చర్చ జరిగింది. మొత్తంగా 120 టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించినా, తొలి విడతగా ఎస్సారెస్పీ, ధవళేశ్వరం పరిధిలో నాలుగేసి చొప్పున 8 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment