Summer Tips- Chaddannam Health Benefits: చద్దన్నం తినే అలవాటు దాదాపు వెయ్యేళ్ల నాటిది. రకరకాల పద్ధతుల్లో చద్దన్నం తయారు చేసుకుంటారు. ఏ పద్ధతిలో తయారు చేసుకున్నా, చద్దన్నం మేలు కలిగించేదేనని అటు ఆయుర్వేద నిపుణులు, ఇటు ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు.
కొంతకాలం మన దేశంలో చద్దన్నం వినియోగం వెనుకబడింది. ఇది పేదల ఆహారం అనే అపోహ ప్రబలింది. అయితే, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వైద్యం వంటి పురాతన పద్ధతులు మళ్లీ పుంజుకుంటున్న నేపథ్యంలో చద్దన్నానికి కూడా మంచిరోజులొచ్చాయి.
ప్రస్తుతం కొన్ని ఫైవ్‌స్టార్ హోటళ్లు సైతం చద్దన్నాన్ని ప్రత్యేకంగా వడ్డిస్తున్నాయి. ఒడిశాలో చద్దన్నాన్ని ‘పొఖాళొ’ అంటారు. ఒడిశా జనాలు ఏకంగా చద్దన్నానికి ప్రత్యేకంగా ఒకరోజునే కేటాయించారు. ఏడేళ్లుగా వాళ్లు మార్చి 20వ తేదీని ‘పొఖాళొ దిబస్’ (చద్దన్నం దినోత్సవం)గా పాటిస్తున్నారు. ‘పొఖాళొ దిబస్’ నాటి నుంచి వేసవి ముగిసే వరకు చద్దన్నం తింటారు. పూరీలో జగన్నాథుడికి ప్రతిరోజూ నైవేద్యంగా పెట్టే ‘ఛప్పన్న భోగాలు’– యాభై ఆరు పదార్థాలలో ‘పొఖాళొ’ కూడా ఒకటి.
తెలుగు రాష్ట్రాల్లో..
ఇక తెలుగు రాష్ట్రాల్లో చద్దన్నం వాడుక కొంత తక్కువే. ఒడిశాకు అనుకుని ఉండే ఉత్తరాంధ్ర జిల్లాల్లో చద్దన్నాన్ని ‘పకాలన్నం’ అంటారు. రాత్రి వండిన అన్నంలో నీళ్లుపోసి దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు గంటల సేపు నానబెడతారు. మర్నాటి ఉదయానికి ఈ నీరు పులిసి, చద్దన్నానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇలా పులిసిన నీటిని ‘తరవాణి’ అంటారు. సాధారణంగా చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటారు.
కొందరు ఏమీ కలుపుకోకుండానే, కాస్త ఉప్పు వేసుకుని ఉల్లిపాయ, మిరపకాయలు నంజుకుని తింటారు. వెసులుబాటును బట్టి వేయించిన వడియాలు, అప్పడాలు, ఎండుచేపలు, ఆవకాయ వంటివి చద్దన్నంలోకి నంజుకుంటారు. దాదాపు డజను రకాలుగా చద్దన్నం తయారు చేసుకుంటారు. చద్దన్నం పేగుల్లో మేలుచేసే బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుందని, ఫలితంగా పోషకాలను శోషించుకునే శక్తి పెరుగుతుందని అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ పరిశోధనలో తేలింది. కడుపు చల్లగా ఉండాలంటే వేసవిలో చద్దన్నం తిరుగులేని ఆహారం.
చదవండి: Thati Munjalu Health Benefits: తాటిముంజెలు ఎక్కువగా తింటున్నారా.. ఇందులో 80 శాతానికి పైగా!
Comments
Please login to add a commentAdd a comment