డీపీఆర్‌లపై ఢీ! | Godavari Basin Projects DPR Over AP And TS Serious Discussion | Sakshi
Sakshi News home page

డీపీఆర్‌లపై ఢీ!

Published Sun, Oct 31 2021 3:28 AM | Last Updated on Sun, Oct 31 2021 10:00 AM

Godavari Basin Projects DPR Over AP And TS Serious Discussion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదీ బేసిన్‌లో చేపట్టిన ఎత్తిపోతల పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ల విషయంలో తెలంగాణ, గోదావరి బోర్డుల మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. డీపీఆర్‌లను అధ్యయనం చేసి వాటిని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలనకు పంపించే క్రమంలో అనేక అంశాలపై బోర్డు వివరణలు కోరుతుండటం తెలంగాణ రాష్ట్రానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. డీపీఆర్‌లో పేర్కొన్న నీటి లభ్యత అంశాలు, వ్యయ వివరాలు, ఆయకట్టుకు నీటి మళ్లింపు, విద్యుత్‌ అవసరాలపై సరైన వివరణలు లేవంటూ బోర్డు అంటుంటే..లేని అధికారాలను వాడుతూ డీపీఆర్‌లను కేంద్రానికి పంపకుండా బోర్డు అనవసర జాప్యం చేస్తోందంటూ తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  

వరుస లేఖలు..భిన్న అంశాలపై ప్రశ్నలు 
కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ఆరు నెలల్లో గోదావరి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు అందించడంతో పాటు వీటికి సంబంధించి బోర్డు, సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం సీతారామ, తుపాకులగూడెం, చనాకా–కొరట, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డుకు అందజేసింది. అయితే డీపీఆర్‌లను సునిశితంగా పరిశీలిస్తున్న బోర్డు అనేక అంశాలపై రాష్ట్రం నుంచి వివరణ కోరుతూ లేఖలు రాస్తోంది.

చౌట్‌పల్లి ప్రాజెక్టు విషయంలో..హైడ్రాలజీ వివరాలతో పాటు కాల్వల ఆధునికీకరణ, ప్రవాహ సామర్థ్యాలను పెంచడం ద్వారా పొదుపు అవుతున్న నీటి వివరాలు, కాల్వల డిజైన్, వాటి సామర్థ్యాలు, ఇరిగేషన్‌ ప్లానింగ్, బెనిఫిట్‌ కాస్ట్‌ రేషియో, టోపోషీట్‌ మ్యాపులు, ఈ ప్రాజెక్టు ద్వారా నిండుతున్న చెరువులు, వాటికింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కోరింది. మోదికుంటవాగు విషయంలో జియాలజీ పరిశీలన, డ్యామ్‌ నిర్మిత ప్రాంత అధ్యయనాలు, కేంద్ర జల సంఘం చెప్పిన హైడ్రాలజీ లెక్కలు, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఆమోదించిన డ్రాయింగ్‌ల వివరాలు తమకు సమర్పించాలని అడిగింది.

చనాకా–కొరటకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 2015–16 ధరల ప్రకారం ఒక రకంగా, 2021–22 ధరల ప్రకారం మరోలా ఉన్నాయని ఎత్తిచూపుతూ వివరణ కోరింది. ఇక సీతారామ విషయంలో అయితే వరుసగా లేఖలు రాస్తూనే ఉంది. దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద ఉన్నప్పుడు హెడ్‌ రెగ్యులేటర్‌కు ఉండే ముంపు, ప్రాజెక్టు కింద ప్రతిపాదిస్తున్న కొత్త ఆయకట్టుకు నిర్ణయించిన నీటి కేటాయింపు, విద్యుత్‌ వినియోగ లెక్కల్లో తేడాలు, విద్యుత్‌ ఛార్జీల అంశాల్లో తేడాలపై వివరణలు ఇవ్వాలని కోరింది. దీంతో పాటే ప్రాజెక్టు కింద చేసిన వ్యయం, ఆ పనుల వివరాలు తమకు అందించాలంటూ లేఖలు రాసింది.  

ఆ అధికారం మీకెక్కడిదంటున్న తెలంగాణ 
ఇలా డీపీఆర్‌ల పరిశీలన పేరుతో బోర్డు సంధిస్తున్న ప్రశ్నలు, కోరుతున్న వివరణలపై తెలంగాణ కస్సుమంటోంది. లేని అధికారాలను తమపై ప్రయోగిస్తోందని మండిపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని క్లాజ్‌ 85(8)(డీ) ప్రకారం.. కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులు అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశాలను మాత్రమే బోర్డులు పరిశీలించాల్సి ఉంటుందని, అంతకుమించి అధికారాలేవీ బోర్డులకు లేవంటూ తెలంగాణ ఇటీవల రాసిన లేఖలో తెలిపింది.

హైడ్రాలజీ, ఇరిగేషన్‌ ప్లానింగ్, అంచనా వ్యయాలకు సంబంధించి పరిశీలన చేసి వివరణలు కోరే అధికారం బోర్డులకు ఉండదని, దీనిపై సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్‌లు పరిశీలన చేస్తాయని స్పష్టం చేసింది. లేని అధికారాలతో హద్దుమీరి అతిగా వ్యవహరించొద్దంటూ కాస్త ఘాటుగా స్పందించింది. అనవసర జాప్యం చేయకుండా ప్రాజెక్టుల డీపీఆర్‌లను తక్షణమే సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని కోరింది.

అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని బోర్డు మోదికుంటవాగు, చిన్న కాళేశ్వరం హైడ్రాలజీ, వ్యయాలపై ఇటీవల మళ్లీ లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. దీంతో వ్యవహారం మరింత ముదిరే అవకాశాలున్నట్లు కనబడుతోంది. ఒకవేళ బోర్డు ఇదే వైఖరి కొనసాగిస్తే తెలంగాణ దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని ఇరిగేషన్‌ వర్గాలు అంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement