Lift Irrigation Projects
-
‘అపెక్స్’కు పాలమూరు, నక్కలగండి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలపై కర్ణాటక అభ్యంతరాలను అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. శనివారం అమిత్ షా అధ్యక్షతన తిరువనంతపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రాజెక్టులపై చర్చించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా జలాల్లో హక్కుగా రావాల్సిన వాటాను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ (ముందు జలాలు) నుంచి నీటిని తరలించడానికి ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. కర్ణాటక ఆందోళనలు, అభ్యంతరాలకు తావు లేదని పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్‌ను ఇప్పటికే సీడబ్ల్యూసీకి సమర్పించామని, నక్కలగండి డీపీఆర్‌కి తుదిరూపు ఇస్తున్నామని కౌన్సిల్‌కి నివేదించింది. ఈ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కోరగా.. సదరన్ కౌన్సిల్ కేవలం సలహా మండలి మాత్రమేనని, సమస్యను అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని అమిత్ షా సూచించారు. మాకే రూ.17,828 కోట్లు రావాలి ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్ల బకాయిలను పరిగణనలోకి తీసుకోకుండానే.. ఏపీ విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.6,756 కోట్ల బకాయిలను చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ తమను ఏకపక్షంగా ఆదేశించిందని తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ బకాయిలపై సదరన్ కౌన్సిల్లో పరిశీలన జరపాలని గత మార్చి 28న 12వ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నప్పటికీ, కేంద్రం తొందరపడి ఉత్తర్వులిచ్చిందని తప్పుబట్టింది. పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటాం ►ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన సమస్యను పరస్పర అంగీకారంతో ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకుంటాయని తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హామీ ఇచ్చారు. ►మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, అత్యాచారాల కేసుల త్వరితగతిన విచారణ, పురోగతిపై అదనపు డీజీ స్వాతి లక్రా ఇచ్చిన ప్రజెంటేషన్‌ను అమిత్‌షా ప్రశంసించి ఇతర రాష్ట్రాలకు సైతం సహకరించాలని సూచించారు. ►పన్నుల విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కొన్ని నిబంధనలు తెలంగాణకు, మరికొన్ని ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఇప్పుడు చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. చట్ట సవరణ జరపాలని ఏపీ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకించింది. ►సెక్షన్ 10లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజనతోపాటు సెక్షన్ 66పై ఏపీ అభ్యంతరాల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర హోంశాఖను అమిత్ షా ఆదేశించారు. ►షెడ్యూల్–9లోని 90 ప్రభుత్వరంగ సంస్థల విభజనను ఏకకాలంలో జరపాలని ఏపీ కోరగా, ఎలాంటి వివాదా లు లేని 53 సంస్థల విభజనను ముందుగా పూర్తి చేయాలని అమిత్ షా పేర్కొన్నారు. మిగిలిన వివాదాలను క్రమంగా పరిష్కరించుకోవాలని సూచించారు. జల వివాదాలను ఉమ్మడిగా పరిష్కరించుకోండి: అమిత్ షా నీటి వివాదాలకు ఉమ్మడి పరిష్కార మార్గాలు వెదకాలని దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హితవు పలికారు. ఏపీ, తెలంగాణ తమ పెండింగ్ సమస్యలన్నింటినీ పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం, తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపకంపై గొడవలున్నాయని మంత్రి గుర్తు చేశారు. అనంతరం భేటీ విశేషాలపై అధికారిక ప్రకటన వెలువడింది. ‘భేటీలో 26 అంశాలపై చర్చ జరిగింది. తొమ్మిదింటికి పరిష్కారం లభించింది. మిగతా 17 అంశాలపై మళ్లీ చర్చించాలని నిర్ణయం జరిగింది. వీటిలో 9 అంశాలు ఏపీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవే’అని పేర్కొంది. విభజన సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం: హోంమంత్రి మహమూద్ రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతుండటం పట్ల రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా ఉద్యోగుల విభజన, ప్రభుత్వ, ఇతర సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు, ఇతర సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో ఆయన రాష్ట్రం తరపున పాల్గొని మాట్లాడారు. కేంద్ర హోంశాఖ చొరవతో ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు వేగవంతంగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ భేటీలో పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. -
నిధులిస్తే నీళ్లొస్తాయి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులు చివరిదశలో చతికిలపడ్డాయి. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చి పరుగులు పెట్టించిన ఎస్సారెస్పీ రెండో దశ, మహాత్మాగాంధీ కల్వకుర్తి, రాజీవ్ భీమా, జవహర్ నెట్టెంపాడు, జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాల పనులు రెండేళ్లుగా నిధుల కొరత, భూసేకరణ సమస్యల కారణంగా నిలిచిపోయాయి. ఫలితంగా కృష్ణా, గోదావరి నదులకు వస్తున్న భారీ వరదలు సముద్రం పాలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు కేటాయిస్తే వీటి నిర్మాణం పూర్తి చేసుకుని 5,78,463 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశముంది. రూ.500 కోట్లతో కల్వకుర్తి పూర్తి! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం జలాశయం వెనక నుంచి కృష్ణా జలాలను తరలించి అదే జిల్లాలో 4,24,186 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉండగా, ప్రస్తుతం 3,07,00 ఎకరాలకు మాత్రమే అందిస్తున్నారు. ప్రాజెక్టును మూడు దశలుగా విభజించి పనులు ప్రారంభించగా, ప్రస్తుతం ఒకటి, రెండోదశలోని 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే ఐదేసి మోటార్లు పనిచేస్తున్నాయి. మూడోదశ కింద 42.80 కిలోమీటర్ల మేర నీటిని తరలించేందుకు పంప్‌హౌస్, రిజర్వాయర్లను నిర్మించేందుకు 2005–06లో కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. 13 మెగావాట్ల సామర్థ్యంగల ఐదు పంపులు 800 క్యూసెక్కుల నీటిని 117 మీటర్ల ఎత్తుకు పంప్ చేసేలా డిజైన్ చేశారు. ఈ పనులను 2010లోగా పూర్తి చేయాల్సి ఉండగా, జాప్యం కారణంగా గడువు పొడిగిస్తూ వస్తున్నారు. టన్నెల్ లైనింగ్ పనులు పూర్తికాక పంప్‌హౌస్‌లోని సర్జ్పూల్కు సరిపడా నీటిని తరలించడం సాధ్యం కావడం లేదు. రూ.4896.24 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించగా, తర్వాత రూ.5600.40 కోట్లకు పెంచారు. రూ.5,100 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.500 కోట్ల పనులు పూర్తైతే ఈ ప్రాజెక్టు కింద 1,17,816 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నెట్టె్టంపాడు..ముందుకు నెట్టేది ఎవరు? ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి 21.425 టీఎంసీల కృష్ణా జలాలను 110 మీటర్లకు ఎత్తుకు లిఫ్టు చేసి జోగుళాంబ–గద్వాల జిల్లాలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందించడానికి జవహర్ నెట్టెంపాడును 2005లో చేపట్టారు. అప్పట్లో రూ.1,428 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించగా, తర్వాత పలుమార్లు సవరించి చివరకు రూ.2547.69 కోట్లకు పెంచారు. ఇప్పటివరకు రూ.2,300 కోట్ల పనులు పూర్తయ్యాయి. 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. మరో రూ.300 కోట్లను ఖర్చు చేస్తే మిగిలిన 58 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశముంది. 557 ఎకరాల భూసే కరణ పెండింగ్‌లో ఉండటంతో రెండేళ్లుగా పనులు ముందుకు సాగడం లేదు. భూసేకరణలో ఆగిన భీమా కృష్ణానది నుంచి రెండు లిఫ్టుల ద్వారా 20 టీఎంసీలను తరలించి వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని 2.03 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి 2003లో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి నాటి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీని కింద ఇప్పటివరకు 1.58 లక్షల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుతోంది. రూ.2689.25 కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచగా, ఇప్పటివరకు రూ.2,753 కోట్లకుపైగా ఖర్చు చేశారు. 270 ఎకరాల భూసేకరణ పూర్తికాకపోవడంతో మిగిలిన 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. భూసేకరణ పూర్తి చేయడానికి రూ.1,300 కోట్లు కావాల్సి ఉంది. ఎస్సారెస్పీ–2కి అనుమతుల్లో జాప్యం ఎస్సారెస్పీ–2 దశ ప్రాజెక్టు సైతం భూసేకరణ, నిధుల సమస్యలతో చివరిదశలో నిలిచిపోయింది. శ్రీరాంసాగర్ నుంచి ప్రారంభమయ్యే కాకతీయ ప్రధానకాల్వ పొడవును 284 కి.మీ. నుంచి 346 కి.మీ.కు పెంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని 4.4 లక్షల ఎకరాల ఆయ కట్టుకు 24.4 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి రూ.1,220 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టగా, రూ.1,200 కోట్ల పనులు పూర్తయ్యాయి. ప్రధానంగా భూసేకరణ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం, హెచ్‌పీసీఎల్/ గెయిల్, జాతీయ రహదారుల సంస్థ నుంచి అనుమతులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు విస్తరణ పనులకు బ్రేక్ పడింది. మిగులు పనులు పూర్తైతే రూ.32,996 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందనుంది. రూ.6 వేల కోట్లతో దేవాదుల పూర్తి! వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం గంగారం వద్ద గోదావరి నుంచి 60 టీఎంసీలను తరలించి కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ పట్టణ/గ్రామీణ, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని 5,58,722 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని మూడు దశల్లో చేపట్టగా, తొలిదశ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మిగిలిన రెండుదశల పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. రూ.13,445 కోట్ల పనులు ప్రారంభించి రూ.16,645 కోట్లకు పెంచారు. ఇప్పటివరకు రూ.11 వేల కోట్లతో పనులు పూర్తి కాగా, 2,34,071 ఎకరాలకు సాగునీరు అందించగలుగుతున్నారు. మరో రూ.ఐదారు వేల కోట్లను కేటాయించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న 5,357 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తే ఈ ప్రాజెక్టు పనులు పూర్తికానున్నాయి. మరో 3.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించనుంది. -
ముందుకు సాగని మూడో దశ
సాక్షిప్రతినిధి, వరంగల్: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ ముందుకు సాగడం లేదు. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూ పాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతో పాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని 6.21లక్షల ఎకరాలకు నీరిందించే ఈ ప్రాజెక్టు 18 ఏళ్లు కావస్తున్నా పూర్తి కావడం లేదు. రెండున్నర వేల ఎకరాలకు పైగా భూసేకరణ, కొన్నిచోట్ల రిజర్వాయర్లు పూర్తికాలేదు. సొరంగం పనులు పూర్తయినా కాల్వల లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. 2004లో రూ.6,084 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,945 కోట్లకు పైగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. 6.21 లక్షల ఎకరాలకు పెరిగిన లక్ష్యం 3లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 2004 లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తెలంగాణ ప్ర భుత్వం ఏర్పాటైన తర్వాత ఆయకట్టు లక్ష్యం 6.21 లక్షల ఎకరాలకు పెరిగింది. దేవాదుల ఎత్తిపోతల జలాలను ఉమ్మడి వరంగల్ జిల్లాకే వినియోగించాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో 5.61లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యం తో పనులు ప్రారంభించారు. అయితే ఇతర జిల్లాల రైతాంగ అవసరాలను బట్టి ఆయకట్టు లక్ష్యం 6.21 లక్షల ఎకరాలకు చేరింది. మొదటి దశలో 1.23 లక్షలు, రెండోదశలో 1.91 లక్షలు, మూడోదశలో 3.07 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం పనులు మొదలు పెట్టారు. తొలుత 38.182 టీఎంసీలను పంపింగ్ చేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు పెరి గిన ఆయకట్టు దృష్ట్యా దాదాపు 60 టీఎంపీల నీటి ఏటా ఎత్తిపోయాల్సి ఉంది. మొదటి రెండు దశల పనులు దాదాపుగా పూర్తికాగా మూడో దశ పనుల్లో ఎప్పటికప్పుడు తీవ్ర జాప్యం జరుగుతోంది. భూసేకరణకు అడ్డంకిగా కోర్టు కేసులు ఈ ప్రాజెక్టు కోసం 31,383 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 28,793 ఎకరాలు సేకరించారు. మరో 2,590 ఎకరాలను సేకరించాల్సి ఉండగా, కోర్టు కేసుల వంటివి అడ్డంకిగా మారాయి. మరోవైపు పాలకుర్తి, లింగాల గణపురం మండలంలోని నవాబ్‌పేటలో రిజర్వాయర్లు పూర్తి కావలసి ఉంది. ఇక, దేవాదుల ప్రాజెక్టులో కీలకమైంది 49.08 కిలోమీటర్ల హైడ్రాలిక్ అండర్ టన్నెల్. మూడో దశ, మూడో ప్యాకేజీ కింద చేపట్టిన ఈ టన్నెల్ పనులకు 2008 నుంచి 2014 వరకు అవాంతరాలు ఏర్పడ్డాయి. 3 కాంట్రాక్టు ఏజెన్సీలను మార్చారు. తెలం గాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016లో రూ.1,494 కోట్ల అంచనాతో పనులు పునఃప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు సొరంగం పనులు పూర్తయినా, కాల్వల లైనింగ్ పనులు సాగుతున్నాయి. ధర్మసాగర్ చెరువులో నుంచి డిస్ట్రిబ్యూటరీ ద్వారా 1,22,700 ఎకరాలకు కాలువ ద్వారా సాగునీరు అందించేందుకు రెండు (45 అండ్ 46 ) ప్యాకేజీల ద్వారా రూ.150.43 కోట్లతో పనులు చేపట్టారు. -
డీపీఆర్‌లపై ఢీ!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ బేసిన్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల విషయంలో తెలంగాణ, గోదావరి బోర్డుల మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. డీపీఆర్‌లను అధ్యయనం చేసి వాటిని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలనకు పంపించే క్రమంలో అనేక అంశాలపై బోర్డు వివరణలు కోరుతుండటం తెలంగాణ రాష్ట్రానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. డీపీఆర్‌లో పేర్కొన్న నీటి లభ్యత అంశాలు, వ్యయ వివరాలు, ఆయకట్టుకు నీటి మళ్లింపు, విద్యుత్ అవసరాలపై సరైన వివరణలు లేవంటూ బోర్డు అంటుంటే..లేని అధికారాలను వాడుతూ డీపీఆర్‌లను కేంద్రానికి పంపకుండా బోర్డు అనవసర జాప్యం చేస్తోందంటూ తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వరుస లేఖలు..భిన్న అంశాలపై ప్రశ్నలు కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆరు నెలల్లో గోదావరి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు అందించడంతో పాటు వీటికి సంబంధించి బోర్డు, సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం సీతారామ, తుపాకులగూడెం, చనాకా–కొరట, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డుకు అందజేసింది. అయితే డీపీఆర్‌లను సునిశితంగా పరిశీలిస్తున్న బోర్డు అనేక అంశాలపై రాష్ట్రం నుంచి వివరణ కోరుతూ లేఖలు రాస్తోంది. చౌట్పల్లి ప్రాజెక్టు విషయంలో..హైడ్రాలజీ వివరాలతో పాటు కాల్వల ఆధునికీకరణ, ప్రవాహ సామర్థ్యాలను పెంచడం ద్వారా పొదుపు అవుతున్న నీటి వివరాలు, కాల్వల డిజైన్, వాటి సామర్థ్యాలు, ఇరిగేషన్ ప్లానింగ్, బెనిఫిట్ కాస్ట్ రేషియో, టోపోషీట్ మ్యాపులు, ఈ ప్రాజెక్టు ద్వారా నిండుతున్న చెరువులు, వాటికింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కోరింది. మోదికుంటవాగు విషయంలో జియాలజీ పరిశీలన, డ్యామ్ నిర్మిత ప్రాంత అధ్యయనాలు, కేంద్ర జల సంఘం చెప్పిన హైడ్రాలజీ లెక్కలు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన డ్రాయింగ్ల వివరాలు తమకు సమర్పించాలని అడిగింది. చనాకా–కొరటకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 2015–16 ధరల ప్రకారం ఒక రకంగా, 2021–22 ధరల ప్రకారం మరోలా ఉన్నాయని ఎత్తిచూపుతూ వివరణ కోరింది. ఇక సీతారామ విషయంలో అయితే వరుసగా లేఖలు రాస్తూనే ఉంది. దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద ఉన్నప్పుడు హెడ్ రెగ్యులేటర్‌కు ఉండే ముంపు, ప్రాజెక్టు కింద ప్రతిపాదిస్తున్న కొత్త ఆయకట్టుకు నిర్ణయించిన నీటి కేటాయింపు, విద్యుత్ వినియోగ లెక్కల్లో తేడాలు, విద్యుత్ ఛార్జీల అంశాల్లో తేడాలపై వివరణలు ఇవ్వాలని కోరింది. దీంతో పాటే ప్రాజెక్టు కింద చేసిన వ్యయం, ఆ పనుల వివరాలు తమకు అందించాలంటూ లేఖలు రాసింది. ఆ అధికారం మీకెక్కడిదంటున్న తెలంగాణ ఇలా డీపీఆర్‌ల పరిశీలన పేరుతో బోర్డు సంధిస్తున్న ప్రశ్నలు, కోరుతున్న వివరణలపై తెలంగాణ కస్సుమంటోంది. లేని అధికారాలను తమపై ప్రయోగిస్తోందని మండిపడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని క్లాజ్ 85(8)(డీ) ప్రకారం.. కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులు అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశాలను మాత్రమే బోర్డులు పరిశీలించాల్సి ఉంటుందని, అంతకుమించి అధికారాలేవీ బోర్డులకు లేవంటూ తెలంగాణ ఇటీవల రాసిన లేఖలో తెలిపింది. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయాలకు సంబంధించి పరిశీలన చేసి వివరణలు కోరే అధికారం బోర్డులకు ఉండదని, దీనిపై సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు పరిశీలన చేస్తాయని స్పష్టం చేసింది. లేని అధికారాలతో హద్దుమీరి అతిగా వ్యవహరించొద్దంటూ కాస్త ఘాటుగా స్పందించింది. అనవసర జాప్యం చేయకుండా ప్రాజెక్టుల డీపీఆర్‌లను తక్షణమే సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని కోరింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని బోర్డు మోదికుంటవాగు, చిన్న కాళేశ్వరం హైడ్రాలజీ, వ్యయాలపై ఇటీవల మళ్లీ లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. దీంతో వ్యవహారం మరింత ముదిరే అవకాశాలున్నట్లు కనబడుతోంది. ఒకవేళ బోర్డు ఇదే వైఖరి కొనసాగిస్తే తెలంగాణ దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని ఇరిగేషన్ వర్గాలు అంటున్నాయి. -
ప్రతిమూలకు ‘ఎత్తిపోత’
రాష్ట్రంలో ఉన్న ఎత్తైన ప్రాంతాల్లోని సాగు నీరందని ప్రతి ప్రదేశానికి నీరు పారించేలా అవసరమైన చోట చిన్న ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రభుత్వం తాజాగా ప్రణాళిక రచిస్తోంది. రాష్ట్రంలో 1.67 కోట్ల ఎకరాల భూమి సాగుకు అర్హమైనదిగా గుర్తించిన ప్రభుత్వం, ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది పోనూ మిగిలిన మరో 42 లక్షల ఎకరాల భూమిపై దృష్టి పెట్టింది. సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రం హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా కృషిని కొనసాగిస్తున్న ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మూలకూ నీరందించే బృహత్ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన భారీ ఎత్తిపోతల పథకాల పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాల్వల్లోని నీటిని వినియోగిస్తూ.. ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే కొన్ని ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయగా, మరో 100 ఎత్తిపోతల పథకాలు సర్కారు పరిశీలనలో ఉన్నాయి. మొదటగా కరీంనగర్ జిల్లా 13 నియోజకవర్గాల్లోని ప్రతి మండలానికి నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధమవుతుండగా, తదనంతరం ప్రతి జిల్లాకు ఇదేవిధమైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకెళ్లనుంది. 42 లక్షల ఎకరాలపై సర్కారు దృష్టి ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2.76 కోట్ల ఎకరాల విస్తీర్ణం గల భూమి ఉండగా, ఇందులో ప్రస్తుతం చేపట్టిన, చేపట్టనున్న ఎత్తిపోతల పథకాల ద్వారా 1.25 కోట్ల ఎకరాల మేర ఆయకట్టు వృద్ధిలోకి తేవాలని గతంలో ప్రణాళిక ఉంది. ఇందులో ఇప్పటికే భారీ, మధ్య, చిన్నతరహా పథకాల కింద 72 లక్షల ఎకరాల మేర ఆయకట్టు వృధ్ధిలోకి రాగా, మరో 53 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా పనులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో పనులు పూర్తయిన చోట్ల కాల్వలపై ఇప్పటికే 1,200 పైగా చెక్‌డ్యామ్‌లు, మరో 600 తూముల నిర్మాణం జరుగుతోంది. వీటి ద్వారా ఎక్కడికక్కడ నీటిని కట్టడి చేస్తూ సమర్థ వినియోగం జరిగేలా చూస్తున్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గ పరిధిలోని ప్రతి మూలకూ నీరందించేలా కార్యాచరణ మొదలు పెట్టారు. 42 లక్షల ఎకరాలకు సాగు నీరందించడంపై దృష్టి సారించారు. పలు పథకాలకు అనుమతులు నీరు పారే ప్రాంతాలకు ఎత్తున ఉన్న ఈ 42 లక్షల ఎకరాల భూమికి చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారానే సాగునీటిని అందించగలిగే అవకాశం ఉన్న దృష్ట్యా, ఇప్పటికే ప్రజా ప్రతినిధులు కోరిన చోట వాటికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోంది. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి సింగూరుపై రెండు ఎత్తిపోతలు చేపట్టి 3.80 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సర్వే పనులు మొదలయ్యాయి. పాలమూరు ప్రాజెక్టులో రెండో రిజర్వాయర్‌గా ఉన్న ఏదుల నుంచి నీటిని తరలిస్తూ అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనిద్వారా అత్యంత ఎత్తైన ప్రాంతాలైన అచ్చంపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 70 వేల ఎకరాలకు నీరందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. నల్లగొండ జిల్లాలో జాన్‌పహాడ్, నెల్లికల్, ముక్త్యాల వంటి 13 ఎత్తిపోతల పథకాలకు రూ.3 వేల కోట్లతో పరిపాలనా అనుమతులు ఇవ్వగా, నిజాంసాగర్ దిగువన మంజీరా ఎత్తిపోతలకు రూ.700 కోట్లతో అనుమతులు ఇచ్చారు. బాన్సువాడ నియోజకవర్గంలో జకోరా, చండూరు ఎత్తిపోతలకు త్వరలోనే శంకుస్థాపన జరగనుండగా, ఇటీవలే కల్వకుర్తి కాల్వలపై మార్కండేయ ఎత్తిపోతలకు రూ.76 కోట్లతో అనుమతులిచ్చారు. ఇవే కాల్వలపై కర్నెపల్లి తండా ఎత్తిపోతల సర్వే కొనసాగుతోంది. ఇక నిర్మల్ జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వలపై రూ.59 కోట్లతో పిప్రి ఎత్తిపోతలు చేపట్టనుండగా, చెన్నూరు నియోజకవర్గానికి నీరిచ్చేలా కాళేశ్వరంలోని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల కింద ఎత్తిపోతల పథకాలు చేపట్టి 70 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా తుది ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. తాజాగా రూ.6,300 కోట్ల అంచనా వ్యయంతో.. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనల మేరకు సుమారు 100 ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటి ప్రాథమిక అంచనా వ్యయం రూ.6,300 కోట్ల మేర ఉండగా, సుమారు 4.50 లక్షల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవాటిలో భూపాలపల్లి నియోజకవర్గంలో 9, మహబూబాబాద్ 4, చొప్పదండి 15, మంథని 7, రామగుండం 5, పినపాక 15, ధర్మపురి 2, మధిరలో 4 వరకు ఎత్తిపోతలు ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్లో రంగంలోకి ఇంజనీర్లు ఇటీవలి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ సూచనల మేరకు తొలుత కరీంనగర్ జిల్లా నుంచి కార్యాచరణ మొదలు పెట్టారు. జిల్లాలోని లోయర్‌మానేరు, మిడ్‌మానేరు, అప్పర్ మానేరు, ఎల్లంపల్లి సహా కాళేశ్వరం కాల్వల పరిధిలో ప్రస్తుతం సాగులో ఉన్న భూమి, సాగులోకి తేవాల్సిన భూమి, ఉన్న చెరువులు, చెక్‌డ్యామ్‌ల వివరాలు ఇంజనీర్లు సేకరిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి, మంథని, రామగుండం, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్, జగిత్యాల నియోజకవర్గాల్లోని భూముల మ్యాపులు పరిశీలించడంతో పాటు, సాగు నీటిని అందించేలా ఎత్తిపోతలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. -
చంద్రబాబు చేయని పనిని వైఎస్ జగన్ చేపట్టారు..
-
‘టీడీపీ ఇప్పుడు తెలంగాణ దేశం పార్టీగా మారింది’
తాడేపల్లి: చంద్రబాబు నాయుడుడి ఎప్పుడూ రెండుకళ్ల సిద్ధాంతమేనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని అని దుయ్యబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు లేఖ రాయించారని, రాయలసీమ లిఫ్టును ఆపేయాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ ఇప్పుడు తెలంగాణ దేశం పార్టీగా మారిందని, చంద్రబాబు హయాంలోనే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్‌లను కట్టిందని అనిల్ కుమార్ గుర్తుచేశారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు నోరెత్తడం లేదని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా చంద్రబాబు కేసులు వేశారని అన్నారు. -
ఏపీ: ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
చక్రాయపేట/బి.కొత్తకోట: గాలేరు–నగరి సుజల స్రవంతి, ఏవీఆర్ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులను అనుసంధానిస్తూ వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో నిర్మించే ఎత్తిపోతల పథకాల్లో భాగంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని ములకల చెరువు మండలం నాయనిచెరువు వద్ద చేపట్టే పనులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేసి ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నీటి పారుదల రంగానికి సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. రూ.4,373 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్లలో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయించనున్నట్టు చెప్పారు. గండికోట రిజర్వాయర్ నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ ద్వారా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం వరకు కృష్ణా జలాలను తరలిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా, వెంకటేగౌడ పాల్గొన్నారు. 3 లక్షల ఎకరాలకు సాగునీరు రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం కాలేటివాగు వద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ పథకం నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపి కృష్ణా జలాలతో చక్రాయపేట మండలంలోని 45 చెరువులతోపాటు రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లె, వీరబల్లి మండలాల్లోని 90 చెరువులకు కాలేటివాగు నుంచి నీటిని నింపనున్నట్టు వివరించారు. -
రూ.912.84 కోట్లతో పోలవరం ఎత్తిపోతల పనులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి డెల్టాలో రబీ పంటలకు సమృద్ధిగా నీటిని విడుదల చేస్తూనే.. జనవరి నుంచి ఏప్రిల్ మధ్య పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలైన మెట్ట ప్రాంతాల్లో గృహ అవసరాలు తీర్చడం కోసం పోలవరం ఎత్తిపోతలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు రూ.912.84 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలవరం ప్రాజెక్టు కనీస నీటిమట్టం 41.15 మీటర్లు. ప్రాజెక్టులో 35.50 మీటర్ల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోలవరం కుడి కాలువ ద్వారా గ్రావిటీపై నీటిని తరలించవచ్చు. కానీ.. నీటిమట్టం 35.50 మీటర్ల కంటే దిగువకు చేరితే పోలవరం కుడి కాలువలోకి చుక్క నీరు చేరదు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలు వర్షాభావ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నాయి. వేసవిలో ఈ ప్రాంతాల్లో తాగునీరు, గృహ అవసరాల కోసం తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో 35.50 మీటర్ల నుంచి 32 మీటర్ల వరకు ఉన్న నీటిని జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కుడి కాలువ అనుసంధానంలోకి ఎత్తిపోసి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో గృహ అవసరాలకు సరఫరా చేయవచ్చని జనవరి 22న పోలవరం సీఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పోలవరం ప్రాజెక్టులో 32 మీటర్లకు దిగువన ఉన్న నీటిని గోదావరి డెల్టాలో రబీ పంటలకు సమృద్ధిగా సరఫరా చేయవచ్చు. ఈ ఎత్తిపోతల పనులు చేపట్టడానికి, 15 ఏళ్లు ఆ పథకం నిర్వహణకు రూ.912.84 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. చదవండి: సాగునీటి పనుల్లో స్పీడ్ పెరగాలి -
సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీరు అందని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు కీలక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సింగూరు రిజర్వాయర్‌కు నీటి లభ్యతను పెంచేలా పనులు జరుగుతున్న దృష్ట్యా.. దీనికి కొనసాగింపుగా సింగూరు నీటిని ఆధారం చేసుకొని రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు డిజైన్ చేస్తోంది. పూర్తిగా వెనకబడ్డ నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో సుమారు 2.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఈ రెండు పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇరిగేషన్ శాఖ సిద్ధ్దమవుతోంది. భారీగా ఎత్తిపోత... అంతే భారీ ఆయకట్టు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గి సింగూరు ప్రాజెక్టుకు ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు నీటి లభ్యత కరువై వట్టిపోతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సింగూరుకు నీటి లభ్యత పెంచేలా కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులు పూర్తయితే సింగూరుకు నీటి కొరతరాదని చెబుతోంది. సింగూరుకు నీటి లభ్యత పెంచనున్న దృష్ట్యా, ఆ నీటిపై ఆధారపడి.. సాగునీటి వసతి కరువైన ప్రాంతాలకు గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రభుత్వం ఇప్పటినుంచే ఆలోచనలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారాయణఖేడ్ ప్రాంతానికి నీరందించేలా బసవేశ్వర ఎత్తిపోతలకు, జహీరాబాద్ నియోజకవర్గానికి నీరందించేలా సంగమేశ్వర ఎత్తిపోతలకు ప్రాణం పోస్తోంది. సింగూరులో 510 లెవల్ నుంచి సుమారు 8 టీఎంసీల నీటిని తీసుకుంటూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీళ్లందించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీనికై 55 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేసేలా ఒకటే లిఫ్టును ప్రతిపాదిస్తుండగా, ఈ ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.700– 800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వస్తున్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో నీటి వసతి కల్పించేందుకు సింగూరులో అదే 510 లెవల్ నుంచి రెండు దశల్లో 125 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. దీనికి 15 టీఎంసీల మేర నీటి అవసరాలను లెక్కగట్టారు. ఈ పథకానికి రూ.1,300 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటిని తీసుకునేందుకు... అంచనా వ్యయం రూ.2 వేల కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఈ స్థాయిలో ఆయకట్టుకు నీరందించేందుకు భారీగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. భూసేకరణ అవసరాలతో పాటు కెనాల్ అలైన్మెంట్, పంప్‌హౌస్‌ల నిర్మాణ ప్రాంతాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది. అనంతరం విద్యుత్ అవసరాలు, నిర్మాణ వ్యయాలపై కచ్చితమైన అంచనాలు రూపొందించేందుకు డీపీఆర్ సిధ్దం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ డీపీఆర్ తయారు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం సూచనల మేరకు డీపీఆర్‌కి సిద్ధమవుతున్న ఇరిగేషన్ శాఖ బసవేశ్వర ఎత్తిపోతలతో నారాయణఖేడ్‌లో 80 వేల ఎకరాలు.. సంగమేశ్వరతో జహీరాబాద్‌లో 1.50 లక్షల ఎకరాలకు మొత్తంగా 2,30,000 ఎకరాలకు సాగునీరు రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటి అవసరం రెండు ప్రాజెక్టులకు కలిపి 2,000 కోట్ల వ్యయ అంచనా -
‘రాయలసీమ ఎత్తిపోతల’ కొత్త ప్రాజెక్టు కాదు
సాక్షి, అమరావతి: పాత ప్రాజెక్టులైన తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ), గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుకు మెరుగ్గా నీటిని సరఫరా చేయడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని.. ఇది ఏ విధంగానూ కొత్త ప్రాజెక్టు కాదని.. కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం ఈ ఎత్తిపోతలకు అనుమతిచ్చి, అపెక్స్ కౌన్సిల్‌కు పంపాలని విజ్ఞప్తి చేసింది. దీంతో.. డీపీఐ (సమగ్ర ప్రాజెక్టు సమాచారం)ని పరిశీలిస్తామని.. వారం తర్వాత మరోసారి సమావేశమవుదామని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే చేసిన సూచనకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి అంగీకరించారు. కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం సెలవులో ఉన్నారని.. మళ్లీ సోమవారం సమావేశమవ్వాలని నిర్ణయించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సూచన మేరకు సోమవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు కార్యాలయానికి ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, కర్నూల్ జిల్లా ప్రాజెక్టŠస్ సీఈ మురళీనాథ్‌రెడ్డి వెళ్లారు. బోర్డు చైర్మన్ పరమేశం సెలవులో ఉండటంతో సభ్య కార్యదర్శి రాయ్‌పురే, డైరెక్టర్ హెచ్‌కే మీనాలతో వారు భేటీ అయ్యారు. విభజన చట్టం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతివ్వాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతలను కొత్త ప్రాజెక్టుగా తెలంగాణ సర్కార్ చెబుతోందని బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే లేవనెత్తడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ట్రిబ్యునల్, విభజన చట్టం ద్వారా ఎస్సార్బీసీ, తెలుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు నీటి కేటాయింపులు ఉన్నాయని గుర్తుచేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 881 అడుగుల కంటే ఎక్కువ నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా ఈ ప్రాజెక్టులకు ప్రస్తుతమున్న డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించవచ్చునని.. కానీ, ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి 15 నుంచి 20 రోజులకు మించి ఉండదని వారు వివరించారు. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు ఉంటే పీహెచ్ఆర్ ద్వారా శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి ఏడు వేలు, 841 అడుగుల నీటిమట్టం ఉంటే రెండు వేల క్యూసెక్కులు మాత్రమే చేరుతాయని.. అదే 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీరు కూడా కాలువలోకి చేరదన్నారు. ఇతర ప్రాజెక్టుల ఆయకట్టుకు విఘాతం కలగదు రాయలసీమ ఎత్తిపోతలవల్ల తమ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలంగాణ ఫిర్యాదు చేసిందని బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే ప్రస్తావించగా.. వాటిని ఈఎన్సీ నారాయణరెడ్డి కొట్టిపారేశారు. విభజన చట్టం ప్రకారం కల్వకుర్తి ఎత్తిపోతలకు మాత్రమే అనుమతి ఉందని, మిగిలిన ప్రాజెక్టులకు అనుమతిలేదని గుర్తుచేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంవల్ల ఏ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు విఘతం కలగదన్నారు. దీంతో డీపీఐని సమగ్రంగా పరిశీలిస్తామని.. సోమవారం మరోసారి సమావేశమవుదామని రాయ్‌పురే చేసిన సూచనకు ఈఎన్సీ అంగీకరించారు. కేంద్ర కార్యాలయాలన్నీ విశాఖలోనే కేంద్ర ప్రభుత్వరంగ కార్యాలయాలన్నీ విశాఖలోనే ఉన్నాయని.. కృష్ణా బోర్డు కార్యాలయాన్నీ అక్కడే ఏర్పాటుచేస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి చెప్పారు. కృష్ణా బోర్డు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు ఏపీలోనే ఉండాలన్నారు. అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్లో కృష్ణా బోర్డును ఏపీకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ఇక చట్ట ప్రకారం అన్ని అనుమతులతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడతామని ఈఎన్సీ స్పష్టం చేశారు. ఏటా నీటి మట్టం 800 అడుగులకు తగ్గుతోంది.. మరోవైపు.. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం నుంచే సాగునీటి ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా రోజుకు ఏడు టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏటా నీటిని తరలిస్తోందని.. దీనివల్ల నీటి మట్టం 800 అడుగులకు తగ్గిపోతోందని ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. కానీ, కేటాయింపులున్నా సరే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు ఏపీలో నీళ్లందించలేని దుస్థితి నెలకొందని.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నామని ఆయన వివరించారు. ఈ పరిస్థితి దృష్ట్యా శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీలను పీహెచ్‌ఆర్‌కు దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా ‘రాయలసీమ’ పథకాన్ని చేపట్టామన్నారు. పీహెచ్‌ఆర్‌కు దిగువన కాలువలో 5 కి.మీ వద్ద కృష్ణా బోర్డు టెలీమీటర్లు ఏర్పాటుచేసిందని.. వీటి ద్వారా ఎత్తిపోతల ద్వారా తరలించే ప్రతి నీటి బొట్టునూ లెక్కించవచ్చన్నారు. -
రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లు
సాక్షి, విజయవాడ: రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ రోజు(సోమవారం) నుంచి టెండర్లు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేసింది. జ్యుడిషియల్ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించి 19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని రూపకల్పన చేసినట్టు చెప్పారు. -
నిర్వహణ నెత్తిమీదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలకు, వాటికయ్యే నిర్వహణ ఖర్చును భరించాలన్న వినతిపై కేంద్ర ప్రభుత్వం విముఖత చూప డం రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. దీంతో ఈ ఏడాది వర్షాకాలం నుంచి అందుబాటులోకి రానున్న భారీ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్ అవసరాలకయ్యే ఖర్చు భారమంతా రాష్ట్రమే భరించాల్సి రానుంది. దీని కోసం ఏటా గరిష్టంగా రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి రావడం రాష్ట్రానికి కత్తిమీద సాములా మారనుంది. ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం... రాష్ట్రంలో ఇప్పటికే 14ఎత్తిపోతల పథకాల కింద నీటి పంపింగ్ జరుగుతుండగా వాటికి 1,500 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం ఉంటోం ది. వాటిపైనే ఏటా రూ.1,800 కోట్ల మేర విద్యుత్ బిల్లుల రూపేణా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ. 3,200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో గరిష్టంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల పరిధిలోనే రూ. 1,600 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండగా దేవాదులలో రూ. 800 కోట్లు, ఏఎంఆర్‌పీలో రూ. 650 కోట్ల మేర విద్యుత్ బిల్లుల బకాయిలున్నాయి. ఈ బిల్లుల చెల్లింపే కష్టసాధ్యమవుండగా ఈ ఏడాది ఖరీఫ్ నుంచి విద్యుత్ వినియోగం మొత్తంగా 4,500–5,000 మెగావాట్ల మేర పెరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది జూన్ నుంచే 2 టీఎంసీల నీటిని కనీసం 6 నెలలపాటు ఎత్తిపోసేలా పంపులను సిద్ధం చేస్తున్నా రు. ఈ నీటిని ఎత్తిపోసేందుకు గరిష్టంగా 2,800 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కగట్టారు. ఈ విద్యుత్ అవసరాలకు మిడ్‌మానేరు ఎగువ వరకే రూ. 2,500 కోట్ల మేర ఖర్చు కానుండగా మిడ్‌మానేరు దిగువన పంపింగ్‌కు మరో రూ. 1,500 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది జూన్ నుంచే సీతారామ ఎత్తిపోతలను పాక్షికంగా ప్రారంభించనున్నారు. వాటితోపాటే ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును కలుపుకొని ఈ ఏడాది నుంచి రూ. 8 వేల కోట్ల మేర ఖర్చు జరిగే అవకాశం ఉంది. 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల కాలా నికి విద్యుత్ అవసరాలకు రూ. 37,796 కోట్లు అవసరం ఉంటుందని నీటిపారుదల శాఖ గతంలోనే తేల్చింది. వాటితోపాటే పంప్‌హౌస్‌ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఐదేళ్ల కాలానికి రూ. 2,374 కోట్లు ఉంటుందని లెక్కగట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే భారీ ఎత్తిపోతల పథకాల విద్యుత్, ఓఅండ్‌ఎంకు సంబంధించి రూ. 40,170 కోట్లు అవసరం అవుతుందని, ఈ ఖర్చులో కొంతైనా భరించాలని కేంద్రానికి విన్నవించింది. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆర్థిక సాయం చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదు. నిర్వహణ భారం మోసే అంశంపై కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రాజెక్టులకుగానీ, నిర్వహణకుగానీ నిధులు కేటాయించలేదు. దీంతో ఈ నిర్వహణ భారాన్ని మొత్తంగా రాష్ట్రమే భరించాల్సి రానుంది. అసలే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఇది రాష్ట్రానికి గుదిబండగా మారనుంది. -
‘కృష్ణా’పై మరో ఎత్తిపోతలు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ జలాలను వినియోగిస్తూ మరో కొత్త ఎత్తిపోతల చేపట్టే ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటివరకు సాగునీటి వసతి లేని అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి నీరిచ్చేలా డిండి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా అమ్రాబాద్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎంకు అందజేసింది. పాలమూరు–రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుంటూ 75 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఈ ప్రతిపాదనలు రూపొందించారు. పాలమూరు–రంగారెడ్డి ద్వారా తీసుకుంటున్న కృష్ణా జలాలను డిండికి సైతం 30 టీఎంసీల మేర తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏదుల రిజర్వాయర్ ద్వారా డిండికి తరలించేలా ఇటీవలే తుది ప్రతిపాదన సిద్ధమైంది. ఇదే ఏదుల నుంచి నల్లమల ప్రాంతంలో నీరందని ప్రాంతాలకు నీరిచ్చేలా అమ్రాబాద్ ఎత్తిపోతలను ప్రతిపాదించారు. ఏదుల నుంచి గ్రావిటీ పైప్‌లైన్ ద్వారా తరలించి అక్కడినుంచి జిలుగుపల్లి పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసే 20.5 మెగావాట్ల సామర్థ్యం గల 2 పంపుల ద్వారా ప్రతిరోజు 0.1 టీఎంసీ నీటిని తరలించాలని ప్రతిపాదించారు. 60 రోజుల పాటు నీటిని తరలించడమంటే 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఇక్కడ ఎత్తిపోసే నీటిని 2.57 టీఎంసీ సామర్థ్యంతో ప్రతిపాదించిన మైలారం రిజర్వాయర్‌కు తరలిస్తారు. దీనికింద నాగర్‌కర్నూల్ జిల్లాలో బల్మూరు, అచ్చంపేట, లింగాల, టేకులపల్లి, ఉప్పనూతల మండలాల పరిధిలో మొత్తంగా 50 వేల ఎకరాలకు నీరు పంపిణీ చేస్తారు. ఇక్కడి నుంచి చంద్రవాగు ద్వారా చంద్రసాగర్ చెరువుకు నీటిని తరలించి అక్కడి నుంచి మరో లిఫ్టు ద్వారా మన్ననూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. ఈ రిజర్వాయర్ కింద అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మరో 25 వేల ఎకరాలకు నీరందించనున్నారు. మొత్తంగా 75 వేల ఎకరాలకు నీరందించేలా దీన్ని చేపట్టనున్నారు. ఈ మొత్తం ప్రతిపాదనకు రూ.2,351 కోట్లు అవుతుందని రిటైర్డ్ ఇంజనీర్లు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. -
బకాయిల ‘ఎత్తిపోత’
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(డిస్కం)కి బకాయిల షాక్. రాష్ట్రంలోని ప్రధాన ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ.3,500 కోట్ల మేర బకాయిలను డిస్కంకు చెల్లించాలి. ఇందులో ఆగస్టు వరకు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద రూ.3,181.38 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నిర్మాణ పనులు పూర్తయినా, కొనసాగుతున్న 22 ఎత్తిపోతల ప్రాజెక్టులతో 61.65 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 27.87 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రభుత్వ లక్ష్యం. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి వస్తే 12,084 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం. ప్రస్తుతం అలీసాగర్, గుత్పా, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు నిర్దేశిత ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నాయి. ఆయా ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 357 మోటార్లు ఉండగా, 217 పంపులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఏఎమ్మార్పీ కింద రూ.రూ.638 కోట్లు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎలిమి నేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ) నుంచి ఏటా 16.50 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నా రు. ఒక్క టీఎంసీకి రూ.8 కోట్ల మేర ఖర్చవుతోంది. ఈ మూడేళ్లలో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా ఇప్పటివరకు ఒక్క రూపా యి కూడా చెల్లించలేదు. ఈ ప్రాజెక్టుపైనే రూ.638 కోట్ల బకాయిలున్నాయి. ప్రతిసారి విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేస్తోంది. అప్పుడప్పుడూ క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేస్తోంది. అయితే, ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వస్థాయిలో మాట్లాడి బయటపడుతున్నారు. ఇతర ప్రాజెక్టులపై... గత ఏడాది నెట్టెంపాడు కింద 6.7 టీఎంసీ, బీమా 12 టీఎంసీ, కోయిల్‌సాగర్ 5 టీఎంసీ, కల్వకుర్తి 31 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. వీటి బిల్లులే రూ.957 కోట్ల మేర ఉండగా, ఈ ఏడాది ప్రస్తుత సీజన్లో అన్ని ప్రాజెక్టుల కింద 30 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. దీంతో బకాయిలు రూ.1,650 కోట్లకు చేరాయి. మొత్తంగా మేజర్ ఇరిగేషన్ పథకాల కిందే రూ.3,181 కోట్లు, మైనర్ ఇరిగేషన్, ఐడీసీ పథకాల కింద మరో రూ.123 కోట్ల బకాయిలున్నాయి. వీటికి ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం ఎత్తిపోతలకు అయిన చార్జీలను కలిపితే మొత్తంగా రూ.3,500 కోట్ల మేర బకాయిలున్నట్లు లెక్క తేలుతోంది. -
చిలక జోస్యాలకు రూ.400 కోట్లు ‘ఎక్సెస్’
సాక్షి, అమరావతి: లగడపాటి సర్వేల కోసం ప్రభుత్వ నిధుల ‘ఎత్తిపోత’ కార్యక్రమం జరుగుతోంది. ప్రజల సొమ్ముతోనే ప్రజా నాడి తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణ ఎన్నికల్లో ‘టీడీపీ–కాంగ్రెస్’ కూటమి తరఫున సర్వే లు చేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కే ఈ సర్వేల బాధ్యత అప్పగించారు. ఈ సర్వేలకయ్యే నిధులను సమకూర్చేందుకుగానూ రూ.వేల కోట్ల విలువైన ఎత్తిపోతల పథకాల పనులు అప్పగి స్తున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ జలవనరుల శాఖ అధికారవర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్)–యోగి వేమన రిజర్వాయర్(వైవీఆర్)–హంద్రీ–నీవా (హెచ్ఎన్ ఎస్ఎస్) రెండో దశ ఎత్తిపోతల పథకం టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలే ఇందుకు తార్కాణమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వివరాలు.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ)లో అంతర్భాగమైన సీబీఆర్ నుంచి రెండు వేల క్యూసెక్కులను వైవీఆర్లోకి ఎత్తిపోసి.. అక్కడ్నుంచి హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ(386.90 కి.మీ వద్ద)లోకి ఎత్తిపోసి.. కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే పనులకు రూ.1,796.99 కోట్లతో జనవరి 29న ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది. సీబీఆర్‌లో నీటి లభ్యత లేదని హైడ్రాలజీ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక వైపు వెళ్లకుండా.. కేవలం ఉజ్జాయింపు అంచనాలు ఆధారంగా ఈ పథకాన్ని మంజూరు చేసింది. ఇదే అంశాన్ని పరిపాలన అనుమతులిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని అనంతపురం జిల్లా చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనలను సాక్షాత్తూ సీఎం చంద్రబాబే బుట్టదాఖలు చేయించారు. సర్వేల కోసం లగడపాటితో ఒప్పందం.. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు, వెలువడిన తర్వాత, పోలింగ్‌కు మూడు రోజుల ముందు వరకు.. ఇలా విడతల వారీగా సర్వేలు చేసి రాజకీయ పరిస్థితులు, టీడీపీ అభ్యర్థుల విజయావకాశాలపై ఎప్పటికప్పుడు నివేదికలిచ్చే అంశంపై ఇటీవల మాజీ ఎంపీ లగడపాటితో సీఎం చంద్రబాబు పలుమార్లు సమావేశమై చర్చించారు. ఈ సర్వేలకయ్యే నిధులను ప్రభుత్వ ఖజానా నుంచే సమకూర్చడానికి చంద్రబాబు ప్రణాళిక రచించారు. లగడపాటి బినామీకి చెందిన ఒక కాంట్రాక్టు సంస్థకు సీబీఆర్–వైవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ పనులు అప్పగించేసి.. మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చే మొత్తాన్ని సర్వేలకు వినియోగించేలా ఇరువురి మధ్య ఒప్పందం కుదిరినట్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ఆ ఒప్పందంలో భాగంగానే సీబీఆర్–వైవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ ఎత్తిపోతల పనులకు రూ.1,182.33 కోట్ల అంచనా వ్యయంతో ఒకే ప్యాకేజీ కింద జనవరి 30న టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. ఎక్కడైనా జాయింట్ వెంచర్లు చెల్లవ్.. కానీ ఇక్కడ కాదు! కర్నూలు జిల్లాలోని రాజోలిబండ కుడి కాలువ ప్రాజెక్టుకు రూ.1,557.37 కోట్లతోనూ.. వేదవతి ఎత్తిపోతల పథకం పనులకు రూ.1,536.28 కోట్లతోనూ ఎల్ఎస్(లంప్సమ్) ఓపెన్ విధానంలో జనవరి 29న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల టెండర్లలో జాయింట్ వెంచర్లు.. అంటే ఒక కాంట్రాక్టు సంస్థ కంటే ఎక్కువ సంస్థలు జట్టుగా ఏర్పడి షెడ్యూల్ దాఖలు చేయడానికి అవకాశం లేదనే నిబంధన పెట్టారు. కానీ సీబీఆర్–వైవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ ఎత్తిపోతల టెండర్లో మాత్రం జాయింట్ వెంచర్లు కూడా షెడ్యూల్ దాఖలు చేయడానికి అర్హులే అంటూ నిబంధనలు మార్చారు. మరోవైపు లగడపాటి బినామీకి చెందిన సంస్థకు ఇంతకుముందు సాగునీటి ప్రాజెక్టుల పనులు చేసిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తన కోటరీలోని ఒక ప్రధాన సంస్థను లగడపాటి బినామీ సంస్థతో జట్టు కట్టేలా చేసి.. షెడ్యూల్ దాఖలు చేయించడానికే ఈ నిబంధన పెట్టారన్నది స్పష్టమవుతోంది. టెండర్లో నిబంధనల ప్రకారం 5 శాతం వరకూ అధిక(ఎక్సెస్) ధరకు షెడ్యూల్ దాఖలు చేయొచ్చు. అంత కంటే ఎక్కువ ధరకు షెడ్యూల్ కోట్ చేస్తే వాటిని రద్దు చేయాలి. కానీ.. ఎక్కువ ధరకు షెడ్యూల్ దాఖలు చేసినా కూడా ప్రభుత్వ అనుమతి మేరకు ఆమోదించవచ్చని, లేదా టెండర్లో పేర్కొన్న ధరకు.. అంటే రూ.1,182.33 కోట్లకు ఎవరైనా కాంట్రాక్టర్‌కు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఉందని నిబంధన పెట్టారు. లగడపాటి బినామీ సంస్థకు ఈ పనులు కట్టబెట్టడానికే ఈ నిబంధనలు పెట్టారన్నది స్పష్టమవుతోంది. ఈ టెండర్లో ఈనెల 25 వరకు షెడ్యూల్ దాఖలు చేసుకోవచ్చు. అదే రోజు సాయంత్రం 5కి టెక్నికల్ బిడ్.. 26న ప్రైస్ బిడ్ తెరిచి ప్రభుత్వ అనుమతితో లగడపాటి సంస్థకు పనులు కట్టబెట్టడం ఖాయమని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.410 కోట్లకుపైగా అంచనా వ్యయం పెంపు.. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ రూపొందించిన 2018–19 స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్(ఎస్ఎస్ఆర్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి పనికి సగటున రూ.90 చెల్లించాలి. క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పనులకు సగటున రూ.4,859 చెల్లించాలి. సీబీఆర్–వైవీఆర్–హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ ఎత్తిపోతల్లో 1,69,35,436 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాలి. ఇందుకు రూ.458,12,30,908 ఖర్చు అవుతుందని టెండర్లో పేర్కొన్నారు. అంటే ఒక క్యూబిక్ మీటర్ మట్టి పనికి రూ.270.51 చెల్లిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎస్‌ఎస్‌ఆర్‌లో పేర్కొన్న ధర కంటే ఇది మూడింతలు ఎక్కువ. ఒక్క మట్టి పనుల్లోనే రూ.300 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేశారు. ఇక ఈ ఎత్తిపోతల పనుల్లో 2,52,708 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. ఇందుకు రూ.159,39,66,732 ఖర్చు అవుతుందని టెండర్లో పేర్కొన్నారు. అంటే ఒక క్యూబిక్ మీటర్‌కు సగటున రూ.6,307.54 చెల్లిస్తున్నట్లు లెక్క. దీన్ని బట్టి ఒక్క కాంక్రీట్ పనుల్లోనే అంచనా వ్యయాన్ని రూ.110 కోట్లకు పైగా పెంచేసినట్లు స్పష్టమవుతోంది. సీబీఆర్ నుంచి ఆరు దశల్లో నీటిని ఎత్తిపోయడానికి పంప్ హౌస్‌ల నిర్మాణం కోసం రూ.482,24,64,331, ప్రెజర్ మైన్ కోసం రూ.82,58,21,723 వ్యయం అవుతుందని అంచనా వేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అంచనా వ్యయాన్ని పెంచేయడం ద్వారా లగడపాటి బినామీ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చబోతున్నట్లు స్పష్టమవుతోంది. -
కొత్త పనులకు బ్రేక్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రాధాన్యతలు, ఆర్థిక పరిస్థితి, రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి శాఖ పరిధిలో ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇచ్చిన పనులకు సంబంధించి కొత్తగా ఎలాంటి టెండర్లు పిలవరాదని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్కు అనుకూల ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న దృష్ట్యా, ఆరు నెలల తర్వాత ప్రవేశపెట్టే పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ అనంతరం ఈ పనులను గాడిలో పెట్టే యోచనలో ఉంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో టెండర్ల ప్రక్రియకు అధికారులు ఫుల్స్టాప్ పెట్టారు. కేంద్ర నిధులపై స్పష్టత వచ్చాకే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్‌లోనే కాళేశ్వరం ద్వారా కనిష్టంగా 6 లక్షల ఎకరాలకు ఆయకట్టునివ్వాలని భావిస్తోంది. ఈ దృష్ట్యా ఆ ప్రాజెక్టుకు అధిక నిధులు వెచ్చిస్తోంది. దీంతోపాటే ఈ ఏడాది నుంచి సీతారామ, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు అధిక నిధులు వెచ్చించాలని నిర్ణయించింది. ఇప్పటికే శాఖ పరిధిలో సుమారు రూ.8వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో, ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా నిధుల సేకరణచేసే పనిలో పడింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ గడువు ముగుస్తుండటం, ఏప్రిల్‌లో లోక్‌సభకు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో రాష్ట్రానికి ఇచ్చే నిధులపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగాక పూర్తి స్థాయిలో పెట్టే బడ్జెట్లో రాష్ట్ర కేటాయింపులపై స్పష్టత రానుంది. వచ్చే కొత్త ప్రభుత్వంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సాగునీటి ప్రాజెక్టులకు రూ.30 వేల నుంచి రూ.40వేల కోట్ల మేరకు నిధులు రాబట్టుకోవచ్చని ఇటీవల తన సమీక్షల సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత నిధుల కొరత, కేంద్ర బడ్జెట్ నుంచి అందే ఆర్థిక సాయంపై ఓ స్పష్టత వచ్చేవరకు కొత్తగా ఎలాంటి పనులకు టెండర్లు పిలవవద్దని ఇటీవలే అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. నాలుగు రిజర్వాయర్లపై ప్రభావం.. ఈ ఆదేశాల ప్రభావం నాలుగు రిజర్వాయర్ పనులపై పడనుంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి పరిధిలో ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు నీటిని తరలించే పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.4,268 కోట్ల పనులకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. ఆ పనులకు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇందులో రూ.915 కోట్లతో చేపట్టనున్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ పనులూ ఉన్నాయి. ఇక కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు స్థిరీకరణతో పాటు అవసరమైనప్పుడు కుంటాల జలపాతానికి నీరు విడుదల చేసేలా కుఫ్టి ఎత్తిపోతలకు ప్రభుత్వం గత ఏడాది ఆమోదం తెలిపింది. 5.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.744 కోట్లతో రిజర్వాయర్ నిర్మించేందుకు అనుమతించగా, దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టేందుకు ఇటీవల అధికారులు ప్రభుత్వ అనుమతి కోరగా, పెండింగ్ లో పెట్టమని తెలిపింది. వీటితో పాటే పెన్‌గంగ ప్రాజెక్టు పిప్పల్‌కోఠి దగ్గర 1.42 టీఎంసీల సామర్థ్యం రిజర్వాయర్, 0.7 టీఎంసీలతో గోమూత్రి రిజర్వాయర్ నిర్మాణానికి రూ.583.78 కోట్లతో అనుమతినిచ్చారు. ఈ పనులకూ టెం డర్లు పిలవాల్సి ఉండగా ఆరు నెలలపాటు బ్రేక్ వేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన దేవాదులలోని మల్కాపూర్ పనుల ఒప్పందాలను ఆపాలని ఇదివరకే ఆదేశాలు వెళ్లాయి. వీటితోపాటే నిజాంసాగర్ కింద మంజీరా నదిపై పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 30,646 ఎకరాలకు నీరిచ్చేలా.. నిజాంసాగర్ మండలం మల్లూర్ సమీపంలో రూ.456 కోట్లతో మంజీరా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభు త్వం నిర్ణయించింది. 2.90 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే ఈ పథకానికి టెండర్లు పిలవాల్సి ఉన్నా ఆ పనులకూ బ్రేకులు పడ్డాయి. -
కన్నీరింకిన చోటే జల కళ
తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసిన పాలమూరు ప్రజల కష్టాల కొలిమిని కేసీఆర్ ఉద్యమ సమయంలో ప్రపంచానికి విడమరిచి చాటిచెప్పారు. ఆనాడు నెర్రలుబాసిన ఎర్రసెలకల్లో జలాలను రప్పించేందుకు పాలమూరు ఊరూరా పాదయాత్రలు చేసి ఉద్యమ జలస్వప్నాలను స్వప్నించారు. అదే కేసీఆర్ నేడు నదుల నడకను మార్చి తరాల పాలమూరు కరువును తరిమేస్తున్నారు. నదులను గండికొట్టి బాజాప్తాగా నెర్రలు బారిన భూములకు గంగమ్మను అందిస్తున్నారు. నిన్నటిదాకా కన్నీరు పెట్టిన పాలమూరు పల్లెలు నేడు ఆనంద భాష్పాలను వర్షిస్తున్నాయి. కరువుకు నెర్రలు బాసిన నేలకు ముఖచిత్రంగా తెలంగాణ అంచు చివరన సరిహద్దులో ఎడారిగా మారిన గట్టు, కెటిదొడ్డి, ధరూర్ మండలాలకు సాగునీరందించేందుకు రూ. 553 కోట్ల నిధులతో 33 వేల ఎకరాల సాగు విస్తీర్ణం లక్ష్యంగా నేడు గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. పేదరికం వల్ల చదువుకు దూరమైన గట్టుమండలం 34.8% అత్యల్ప అక్షరాస్యత రేటుతో దక్షిణాసియాలోనే దిగువస్థానంలో మిగిలిపోయింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తున ఉన్న గట్టు ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర మొచ్చినా, మిగిలిన ప్రాంతానికి నీళ్లు వస్తాయోమో గానీ ఈ ప్రాంత నేలలకు సాగునీరివ్వడం అసాధ్యమనే అభిప్రాయం అందరిలో బలపడి ఉంది. కానీ, తెలంగాణలో పారే ప్రతి నీటిబొట్టుపైన లెక్కలేసి పెట్టుకున్న కేసీఆర్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. దాదాపు రూ. 783 కోట్ల నిధులతో 55,600 ఎకరాలకు సాగునీరందించేందుకు నిర్దిష్ట ప్రణాళికతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను కూడా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. 2003 జూలైలో ఆలంపూర్ జోగుళాంబ ఆలయం నుంచి గద్వాల వరకు 150 కిలోమీటర్ల మేరకు చేసిన పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ‘‘మల్దకల్’’ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నడిగడ్డకు న్యాయంగా దక్కాల్సిన చివరి నీటిబొట్టు దక్కేదాకా విశ్రమించనని చేసిన ప్రకటనను నిజం చేస్తున్నారు. 87,500 ఎకరాలకు నీరందించాల్సిన ఆర్డీయస్ ఏనాడూ 50వేల ఎకరాలకు కూడా కనీసం ఒక పంటకు నీరవ్వని దుస్థితి, ఒక లక్షా రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన జూరాల ప్రాజెక్టు దశాబ్దాల పాటు ఏనాడూ 40 వేల ఎకరాలను కూడా తడపకుండా తరలిపోయిన చరిత్ర, దాని వెనకున్న పాలకుల వివక్షా పూరిత విధానాలు, వత్తాసుగా నిలిచిన స్థానిక భూస్వామ్య రాజకీయాలు మరిచిపోలేని వాస్తవాలు. కానీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే పాలమూరు పొలాల తరాల దాహం తీర్చే నిర్దిష్ట చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. గద్వాల, ఆలంపూర్‌లతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 నియోజక వర్గాల నీటి కష్టాలకు ముగింపు పలుకుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 35 లక్షల మందికి పైగా మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రజలు కరువు కుంపటిని మోశారు. జురాల, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టుల నిర్మాణాన్ని తాబేలు నడకలా మార్చిన ఫలితంగా దాదాపు 28 లక్షల సాగుయోగ్యమైన భూమి ఉన్నా పాలమూరు రైతు బక్కచిక్కి బలవన్మరణాల బాధితుడిగా మారాడు. ఇక్కడి జనం దశాబ్దాల పాటు అనుభవించిన దారిద్య్రాన్ని బద్దలు కొడుతూ కేసీఆర్ పల్లెల తలలపై నీటి సంతకాలు చేస్తున్నారు. నెట్టెంపాడు పెండింగ్ పనులు పూర్తి చేసి జోగుళాంబ గద్వాల్ జిల్లాలో, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్‌కర్నూల్, భీమా2 ద్వారా వనపర్తి, కోయిల్ సాగర్ తదితర ప్రాజెక్టుల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో నూతనంగా నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 944 కోట్లతో మిషన్ కాకతీయ పథకం ద్వారా మూడు విడతలలో 3,633 చెరువుల పునరుద్ధరణ చేసి మరో 2 లక్షల 38 వేల ఎకరాల ఆయకట్టును అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు రూ. 35,200 కోట్ల అంచనాలతో పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి కరువును కూకటివేళ్లతో పెకిలించేందుకు పునాదులేశారు. ఇప్పుడు పాలమూరు నేల తల్లి కడుపారా పంటను కంటున్నది. దశాబ్దాల దారిద్య్రం మీద గెలుపు సాధించే దిశగా వడివడిగా అడుగులేస్తున్నది. నాగేటి సాళ్ళల్ల... నా తెలంగాణ...నవ్వేటి బతుకుల్ల... నా తెలంగాణ పాట నిన్నటి జ్ఞాపకం. ఇప్పుడు నాగళ్లు నేలతల్లిపై రేపటి భవితాక్షరాలను దున్నుతున్నాయి. 99% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్న పాలమూరు ఉమ్మడి జిల్లా గత చరిత్రను విడిచి తలెత్తుకుని నిలబడుతున్నది. నీటికి అలమటించిన నేలపై కాలువలు పరుగులు పెట్టబోతున్నాయి. ముందు చూపు, ప్రజలపై ప్రేమ, మానవీయ దృక్పథంతో చేపడుతున్న సాగునీటి పథకాలు అతి స్వల్పకాలంలోనే గ్రామాల స్వరూపాన్ని సమగ్రంగా మార్చబోతున్నాయి. (ఈ నెల 29న గట్టు ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా) డా. ఆంజనేయగౌడ్, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు 98661 65308 -
తుంగభద్రపై ఏపీ మరో ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర నదీ జలాలను వినియోగించుకుంటూ భారీ ఎత్తిపోతల చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. 40 టీఎంసీల మేర నీటిని వినియోగించుకుంటూ ఏకంగా రూ.12వేల కోట్లతో ‘నాగల్‌దిన్నె, అనంతపూర్ ఎత్తిపోతల పథకం’చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తుంగభద్ర జలాలపై ఆధారపడ్డ శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా చేపడుతున్న ఈ ఎత్తిపోతలను ఎట్టి పరిస్థితుల్లో నిలువరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. తెలంగాణకు జరిగే నష్టాలను వివరిస్తూ త్వరలోనే కేంద్రానికి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా నందవరం మండలం నాగల్‌దిన్నె సమీపంలో 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక రూపొందించింది. ఈ నీటిని నిల్వ చేసేందుకు 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రతిపాదిస్తోంది. దీనిద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు సాగు, తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తోంది. మహబూబ్‌నగర్‌కు ముంపు.. ఈ పథకం చేపట్టిన పక్షంలో దిగువన ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులకు, వాటి నీటి అవసరాలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు జరిగే నష్టాన్ని పేర్కొంటూ ఓ నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలిసింది. దాని ప్రకారం ‘కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–1 ప్రకారం కృష్ణా బేసిన్ పరిధిలో ఎలాంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు చేపట్టినా తెలంగాణ అనుమతులు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏపీ ఎలాంటి అనుమతినీ తీసుకోలేదు. దీనికితోడు తుంగభద్ర జలాలు శ్రీశైలం ప్రాజెక్టు అవసరాలను తీరుస్తున్నాయి. శ్రీశైలం నిండితే సాగర్‌కు నీటి లభ్యత పెరుగుతుంది. ప్రస్తుతం తుంగభద్ర జలాలను ఎగువే వినియోగిస్తే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్లు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొనే ప్రభావం ఉంటుంది. ఇక నీటి నిల్వలకు అనుగుణంగా 15 నుంచి 20 టీఎంసీల రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రణాళిక వేసింది. దీనివల్ల మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలా ప్రాంతాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. ఈ దృష్ట్యా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టకుండా కేంద్రం జోక్యం చేసుకుని ఏపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలి’అని నివేదికలో పేర్కొన్నట్లుగా తెలిసింది. ఈ నివేదికలోని అంశాలతో త్వరలోనే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. -
ఇదీ చింతలపూడి..!
భూమంతా కోల్పోయారు ఈ రైతు పేరు అనపర్తి కృష్ణారావు. స్వగ్రామం పోచవరం. గోదావరికి చెంతనే ఈయనకి పొలం ఉంది. గతంలో తాడిపూడి ఎత్తిపోతల పథకంలో 1.10 ఎకరాల భూమి కోల్పోయారు. గూటాల ఎత్తిపోతల పథకంలో 15 సెంట్లు భూమి పోయింది. ఇంకా ఈ రైతుకు 2.54 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు చింతలపూడి పథకం వచ్చింది. మొదటి ఫేజ్‌లో ఇతని నుంచి 54 సెంట్ల భూమిని సేకరించారు. మళ్లీ ఇప్పుడు 2 ఎకరాల భూమి సర్వే చేసి రాళ్లు వేశారు. ఈయనకు ఉన్న భూమి మొత్తం ప్రభుత్వం లాగేసుకుంటోంది. గతంలో ఇదే భూమిని కుమార్తెకి కట్నంగా ఇచ్చారు. ఇప్పుడు భూమి పోయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కృష్ణారావు ఒక్కరే కాదు, ఎంతో మంది రైతులు భూసేకరణలో భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. చింతలపూడి ఎత్తిపోతల వివరాలు కాలువ పొడవు 106 కిలోమీటర్లు పథకం లక్ష్యం 4.08 లక్షల ఎకరాలకు సాగునీరు ఖర్చు వివరాలు (రూ. కోట్లలో) ప్రాథమిక అంచనా వ్యయం : 1,701 సవరించిన అంచనాలతో : 4909.80 ఇప్పటివరకు చేసిన ఖర్చు : 804.82 భూసేకరణ వివరాలు (ఎకరాల్లో) అవసరమైన భూమి 22,962 రైతుల భూమి 13,403 సేకరించింది 8,815 అటవీ భూమి 9,559 సేకరించింది 1,282 కొవ్వూరు: మెట్ట ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు సర్కారు శీతకన్ను వేసింది. రూ. 4,909.80 కోట్ల వ్యయం తో చేపట్టాల్సిన పథకానికి 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.90 కోట్లు మాత్రమే కేటాయించింది. మరో వైపు వచ్చే నవంబర్ నాటికి ఈ పథకం పూర్తి చేసి పొలాలకు నీళ్లిస్తామంటూ రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. నాలుగేళ్ల కాలంలో పూర్తి కావాలని నిర్దేశించిన పథకం ఇప్పటికి ఎనిమిదేళ్లు పూర్తయినా నేటికీ ఓ కోలిక్కి రాలేదు. క్షేత్రస్థాయిలో చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియ ప్రహసనంగా మారింది. రైతులకు పరిహారం చెల్లింపుల్లో వ్యత్యాసాలు చూపుతున్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు సాగుతోంది. భూసేకరణలో భాగంగా ఎంతోమంది చిన్న, సన్నకారు రైతులు పూర్తిగా భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఒక్కోచోట ఒక్కోరకం పరిహారం చెల్లించడాన్ని రైతులు తీవ్రంగా తప్పు బడుతున్నారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించిన ఈ పథకం సామర్థ్యాన్ని 4.80 లక్షలకు పెంచారు. దీంతో నిర్మాణ వ్యయం రూ.1,701 కోట్లు నుంచి రూ.4909. 80 కోట్లకి పెరిగింది. భూసేకరణ కూడా 17,122 ఎకరాల నుంచి ఇప్పుడు 22,962 ఎకరాలకు పెరిగింది. ఇంత వరకు భూసేకరణ ప్రక్రియతో కలిపి రూ.804.82 కోట్లు విలువైన పనులు చేపట్టారు. భూసేకరణ నిమిత్తం రూ.209.86 కోట్లు, పనుల నిమిత్తం రూ.594.96 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో రూ.344 కోట్లు ఖర్చు చేయగా టీడీపీ నాలుగేళ్ల పాలనలో రూ.467.82 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కడి పనులు అక్కడే ప్రస్తుతం ఈ పథకం పనులు నాలుగు ప్యాకేజీలుగా నడుస్తున్నాయి. మొదటి ప్యాకేజీలో మూడు పంపుహౌస్‌లు, లీడింగ్ ఛానల్ 0 నుంచి 13.22 కిలోమీటరు వరకు, మెయిన్ కెనాల్ 0–36 కిలోమీటరు వరకు డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు చేపడతారు. దీనిలో లీడింగ్ ఛానల్ 13.2 కిలో మీటర్లకి 8.3 కిలోమీటర్లు పనులు పూర్తి చేశారు. మెయిన్ కెనాల్ 36 కి.మీ.లకు గాను 27.6 కి.మీ. మేరకు పనులు చేశారు. ఈ పనులను నాలుగు కాంట్రాక్టు సంస్థలు చేస్తున్నాయి. మొదటి అంచనా ప్రకారం 110 స్ట్రక్చర్స్ నిర్మించాల్సి ఉండగా 24 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తయ్యాయి. మరో మూడు స్ట్రక్చర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి సామర్థ్యం విస్తరిస్తున్న కాలువ సామర్ధ్యం మేరకు పెంచాల్సి ఉంది. ఇప్పుడు సామర్ధ్యం పెంచిన దృష్ట్యా లీడింగ్ ఛానల్లో 26, మొయిన్ కెనాల్లో 121 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రెండో ప్యాకేజీలో 36 కిలోమీటర్ నుంచి 68 కిలోమీటరు వరకు మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటర్లతో కలిపి తవ్వాల్సి ఉంది. ఈ ప్యాకేజీలో 32 కిలోమీటర్లకి గాను 28.875 కిలోమీటర్లు పనులు పూర్తి చేశారు. దీనిలో 83 స్ట్రక్చర్లకు గాను మూడు పురోగతిలో ఉన్నాయి. మూడో ప్యాకేజీ రూ.681.21 కోట్లతో పంప్ హౌస్‌లోను పెరిగిన సామర్థ్యం మేరకు డిస్చార్జీలను నిర్మించాల్సి ఉంది. నాలుగో ప్యాకేజీలో 68వ కిలోమీటరు నుంచి 106 కిలో మీటరు వరకు మెయిన్ కెనాల్, కొవ్వాడ, తమ్మిలేరు స్థిరీకరణ పనులు ఉన్నాయి. దీనిలో 85 స్ట్రక్చర్ల నిర్మించాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్కటీ ప్రారంభం కాలేదు. రానున్న రోజుల్లో జల్లేరు జలశయం సామర్ధ్యం 8 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచనున్నారు. దీన్ని ఐదో ప్యాకేజీగా పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రహసనంగా భూసేకరణ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి మారిన అంచనా ప్రకారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 22,962 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనిలో అటవీశాఖకు చెందిన భూమి ఏకంగా 9,559 ఎకరాలుంది. ఇంత వరకు రైతుల నుంచి 8,815 ఎకరాల సేకరణ పూర్తికాగా ఇంకా 4,588 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అటవీ శాఖ కోల్పోతున్న భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వేరేచోట భూమి సూచించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఇటీవలే విశాఖపట్నం జిల్లాలో 1,282 ఎకరాల (859 హెక్టార్లు) భూమిని అటవీ భూమిగా అభివృద్ధి పరచడానికి అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫేజ్–1 క్లియరెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ అటవీ ప్రాంతంగా అభివృద్ధికి రూ.32 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు. ఇంకా 8,277 ఎకరాల అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూములు చూపిస్తే తప్ప అటవీ భూముల్లో పనులు చేయడానికి వీలు ఉండదు. ఆరెకరాలకు తొంభై సెంట్లు మిగిలింది ఈయన పేరు కాకర్ల వెంకటేశ్వరరావు. తాళ్లపూడి మండలం పోచవరం గ్రామం. ఈయన ఒకప్పుడు 6.30 ఎకరాల రైతు. ఉన్న భూమంతా తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు కేవలం ముప్పై సెంట్లు మాత్రం మిగిలింది. తాడిపూడి పథకంలో ఎకరం పోయింది. చింతపూడి పథకం పేజ్–1లో 1.30 సెంట్లు, ఫేజ్–2 లో తాజాగా 3.10 ఎకరాలు పోతోంది. ఇక మిగిలింది కేవలం 90 సెంట్లు మాత్రమే. చింతలపూడి పథకం పేరుతో ఈ రైతు జీవితం తారుమారైంది. చింతలపూడి మొదటి విడతలో ఎకరాకు రూ.12.50 లక్షలు ఇస్తామని నమ్మించి అధికారులు రూ.8.35 లక్షలు చొప్పున ఇచ్చారు. రెండో విడతలో ఎకరాకి రూ.26.50 లక్షలు అన్నారు. మంత్రి రూ.28 లక్షలు ఇప్పిస్తామన్నారు. చివరికి ఎకరానికి రూ.23.74 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సొమ్ముతో మళ్లీ భూమి కొందా మంటే ఆ రేటుకు మార్కెట్లో పొలం అందుబాటులో లేదని ఆయన వాపోతున్నారు. 20 శాతం పనులు పూర్తి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఇరవై శాతం పూర్తయ్యాయి. పథకం విస్తరణ కారణంగా నీటి సామరŠాధ్యన్ని 15.5 టీఎంసీల నంచి 53.5 టీఎంసీలకు పెంచుతున్నారు. నీటి విడుదల రెండు వేల క్యూసెక్కుల నుంచి 6,875 క్యూసెక్కులకు పెరుగుతుంది. మొదటి విడతలో నిర్మించిన స్ట్రక్చర్లు సర్దుబాటు చేయడానికి వీలులేనివి ఉంటే తొలగిస్తాం. అటవీ భూములు ముందుగా కాలువ తవ్వకాలకు అవసరమైనవి ఇచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం సమయంలో మరికొన్ని భూములు అవసరమవుతాయి. వాటిని కూడా సేకరిస్తాం. – డీఎస్ఎస్ శ్రీనివాసయాదవ్, ఎస్ఈ, చింతలపూడి ఎత్తిపోతల పథకం -
పరిహారం ఇప్పించాలి
పీసీపల్లి: యర్రంచినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కొరిశపాడు గ్రామస్తులు సోమవారం ప్రజా సంకల్పయాత్రలో జగన్ ను కలిసి విన్నవించారు. రూ. 177 కోట్లతో ప్రారంభించిన ఈ ఎత్తిపోతల పథకం కింద 100 మంది నిర్వాసితులైన తూరుపుపాలెం, పెద్దూరు గ్రామస్తులకు ముంపు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయని మిగిలిన పనులు పూర్తి చేసి బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. దివ్యాంగులకు సాగు భూములివ్వండి చీరాలటౌన్: దివ్యాంగులకు రాష్ట్రంలో ఉన్న దేవాలయ భూములు సాగు కోసం అందించాలని.. ఆ భూముల్లో బోర్లు వేసేలా చర్యలు తీసుకోవాలని వెంకటాపురానికి చెందిన జార్షి లక్ష్మీనారాయణ ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి విన్నవించారు. దివ్యాంగుల పట్ల టీడీపీ ప్రభుత్వం వివక్షత చూపుతూ సబ్సిడీ రుణాలను అందించడం లేదని, తమకు దేవాదాయ భూములను సాగుకు అందించి ఆదుకోవాలని అభ్యర్థించారు. -
తెలంగాణలోనే పెద్ద‘పల్లి’
సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: వ్యవసాయ, పారిశ్రామీకరణలో గణనీయ వృద్దిని సాధించి రాష్ట్రంలోనే ధనిక జిల్లాగా పెద్దపల్లి అవతరించబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జోస్యం చెప్పారు. అంతర్గాం మండలం ముర్మూరు వద్ద రూ.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి మంగళవారం సీఎం శంకుస్థాపన చేశారు. లిఫ్ట్‌ల నిర్మాణానికి సంబంధించి అధికారులు మ్యాప్ ద్వారా సీఎంకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీళ్లతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎండిపోవడమనేది జరగదన్నారు. గోదావరి నది జలకళను సంతరించుకొంటుందదన్నారు. ఫలితంగా ఈ ప్రాంతం సుభిక్షంగా మారబోతుందన్నారు. ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా, 1600 మెగావాట్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరో 2400 మెగావాట్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఓ వైపు వ్యవసాయం, మరో వైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ, రాష్ట్రంలోనే పెద్దపల్లి ధనిక జిల్లాగా ఏర్పడబోతుందన్నారు. కాగా ముర్మూరు ఎత్తిపోతల పథకాన్ని ఐదు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా, అక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరం బ్రాంచి కాలువ ద్వారా, మరో 16 కిలోమీటర్ల దూరం పిల్ల కాలువ ద్వారా సాగునీళ్లు ఈ ప్రాంతానికి రాని పరిస్థితి ఏర్పడిందన్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు చెంతనే ఉన్నా రామగుండంలోని వ్యవసాయ భూములకు సాగునీరు రావడం లేదనే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. రెండు లిఫ్ట్‌లతో పాటు, మూడో లిఫ్ట్‌కు కావాల్సిన రూ.12 కోట్లు కూడా ఇస్తామన్నారు. ఈ పథకంతో దాదాపు 20 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని, 22 వేల ఎకరాలకు సాగునీళ్లు అందుతాయన్నారు. ప్రారంభోత్సవానికి మళ్లీ వస్తా... రామగుండం ఎత్తిపోతల పథకాన్ని శంఖుస్థాపన చేసిన తాను తిరిగి, ప్రారంభోత్సవానికి కూడా వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ పథకం త్వరగా పూర్తి కావాలంటే అక్కడక్కడ కొంత స్థలం అవసరముంటుందని, దానిని ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ ప్రాంతం తొందరగా బాగుపడాలనేది తన ఆకాంక్ష అన్నారు. ఎమ్మెల్యే గ్రూప్ జోష్ సీఎం కే సీఆర్ సభలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణపై ప్రశంసలు కురిపించడంతో ఆయన వర్గీయులు సంబరాల్లో మునిగిపోయారు. రామగుండంలో వర్గపోరు, ఆశావాహులు అధికంగా ఉన్న ‘ప్రత్యేక’ పరిస్థితుల్లో, స్వయంగా గులాబీ బాస్ బహిరంగంగా పొగడడంతో వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ‘ఇగ దుకాణాలు బంద్’ అంటూ వ్యాఖ్యానిస్తూ, ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. ఆర్టీసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కె.కేశవరావు, బాల్క సుమన్, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రభుత్వ సలహదారు డాక్టర్ జి.వివేక్, పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ శ్రీదేవసేన, పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, మాతా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ ఆడెపు రాజేశం, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రూ.కోట్లు కొల్లగొట్టారు..
సాక్షి, నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల కట్ట నిర్మాణానికి వినియోగిస్తున్న ఒండ్రుమట్టి ఇటు రైతులకు, అటు జిల్లాలోని నాయకులకు కాసులు కురిపిస్తోంది. నల్లరేగడి పొలాలు ఉన్న రైతులతో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టర్లు రూ.లక్షలు వెచ్చించి నల్లమట్టి కొనుగోలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా రైతుల పొలాలనే కొనుగోలు చేసి కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా ఒండ్రుమట్టిని తవ్వుతున్నారు. కొన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోని ఒండ్రుమట్టిని తరలించుకుపోయేందుకు ఆయాగ్రామాల ప్రజాప్రతినిధులకు, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు ’లక్షలు ముట్టజెప్తున్నారు. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలలో వందల సంవత్సరాల నాటి నుంచి పోగవుతూ వస్తున్న ఒండ్రుమట్టి క్షణాలలో మాయమవుతోంది. రిజర్వాయర్ల నిర్మాణంలో ఒండ్రు తప్పనిసరి నాగర్‌కర్నూల్ జిల్లాలో పాలమూరు –రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వట్టెం గ్రామంలో భారీ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీనికితోడు కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌తోపాటు కోడేరు మండలంలోని తీగలపల్లి వద్ద ఏదుల రిజర్వాయర్‌ను ప్రభుత్వం పెద్దఎత్తున నిర్మించి కృష్ణా జలాలను నిల్వ ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రిజర్వాయర్ల నిర్మాణంలో చెరువు కట్టనుంచి నీరు బయటకు ఉసరకుండా ఉండేందుకు తప్పనిసరిగా ఒండ్రుమట్టిని వాడతారు. ఈ మట్టి బంకమట్టి మాదిరిగా ఉండి నీటిని కట్టనుంచి బయటకు వెళ్లకుండా చూస్తుంది. దీంతో ఇంజనీర్లు తప్పనిసరిగా ఒండ్రుమట్టిని వాడాలని నిబంధన విధించడంతో కాంట్రాక్టర్లు దీనికోసం ఎంత దూరమైనా వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా వట్టెం రిజర్వాయర్ కోసం బిజినేపల్లి మండలంలో పెద్దఎత్తున చెరువుల్లోని ఒండ్రును అక్రమంగా తరలించారు. ఇదే విషయంలో గ్రామాలలో గొడవలూ చోటుచేసుకున్నాయి. బిజినేపల్లి మండలం మంగనూరు, నందివడ్డెమాన్, పాలెం గ్రామాలలో కొందరు ఏకపక్షంగా చెరువు ఒండ్రును సొంత ప్రయోజనాల కోసం అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నేత చక్రం తిప్పడంతో గ్రామాలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండానే దీనిని అప్పనంగా కాంట్రాక్టర్‌కు అప్పగించడం జిల్లాలో వివాదాస్పదమైంది. మరోపక్క బిజినేపల్లి మండలం మంగనూర్ గ్రామంలోని ఊరచెరువు ఒండ్రుమట్టి విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం రేగింది. ఈ విషయం గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. మంగనూరు చెరువు ఒండ్రుకు రూ.70లక్షల బేరం మంగనూర్ గ్రామ ఊర చెరువులోని 70 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఒండ్రును తీసుకునేందుకు గానూ ఓ కంపెనీ కాంట్రాక్టర్ కొందరితో అక్రమ ఒప్పందం కుదుర్చుకుని ’70లక్షలకు బేరం మాట్లాడుకున్నట్లు ఓ వర్గం ఫిర్యాదు చేసింది. దీంతో మరో వర్గం అదే గ్రామంలోని నక్కలకుంటలోని ఒండ్రును రూ.42 లక్షలకు అమ్ముకున్నారంటూ వీరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. పాలెం పెంటోని చెరువులో చేతులు మారిన రూ.3కోట్లు జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరున్న బిజినేపల్లి మండలం పాలెం పెంటోనిచెరువులోని ఒండ్రును తరలించేందుకు కాంట్రాక్టర్ నుంచి కొందరు నాయకులు రూ.3కోట్ల ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రేయింబవళ్లు వందలాది భారీ టిప్పర్ల ద్వారా ఇక్కడి ఒండుమట్టిని తరలిస్తున్నా ఒక్కరు కూడా అభ్యంతరం తెలపకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ నుంచి అన్ని స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులకు పెద్దఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఐబీ అధికారుల పరిధిలోని చెరువుల్లోని ఒండ్రుమట్టిపై దోపిడీ జరుగుతున్నా ఆ శాఖ అధికారులు కనీసం అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పాలమూరు ప్రాజెక్టు పట్ల రైతుల్లో సానుకూల దృక్పథం ఉండటాన్ని నాయకులు క్యాష్ చేసుకున్నారు. మన ప్రాజెక్టుల కోసమేనంటూ రైతులను నమ్మబలికి రూ.కోట్లలో లంచాలు దిగమింగారు. ఇదే ఒండ్రుకు మెట్రిక్ టన్నుల ప్రకారం రాయల్టీ చెల్లిస్తే ఆయా గ్రామ పంచాయతీలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరేది. వాస్తవానికి గ్రామ పంచాయతీ పరిధిలోని సహజ వనరులపై పూర్తి హక్కు పంచాయతీలకే ఉంటుంది. పంచాయతీ తీర్మానం, అనుమతి లేకుండా ఒండ్రు తరలించడం చూస్తుంటే దోపిడీదారులను ప్రశ్నించేవారు కరువయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందివడ్డెమాన్‌లోనూ... బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లోనూ భారీగా చెరువుల్లోని ఒండ్రుమట్టితోపాటు రేగడి భూముల్లోని ఒండ్రును ప్రాజెక్టుల పేరుతో అక్రమంగా తరలించారు. కొందరు కాంట్రాక్టర్లు రైతులతో భూములు కొనుగోలు చేసి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గుంతలు పెట్టి ఒండ్రును తరలించారు. మరి కొన్ని చోట్ల శిఖం భూములు, ప్రభుత్వ భూముల్లోనూ ఒండ్రు తరలింపు యదేచ్ఛగా సాగింది. బినామీ రైతులను సృష్టించి పెద్ద ఎత్తున ఈ గ్రామంలో భూ మాయ చేశారు. ఇంత జరిగినా ఈ అంశంపై పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్లినా సంబంధిత అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ.. కొల్లాపూర్ నియోజకవర్గం నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్‌కు భారీగా ఒండ్రును తరలించారు. ఈ నియోజకవర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చెరువుల్లోని ఒండ్రుమట్టిని ప్రొక్లెయిన్ల ద్వారా ఒడ్డుకు చేర్చి పెద్దలుగా కుప్పలు పోసి ఆ తర్వాత కాంట్రాక్టర్లకు విక్రయించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలు ఈవిషయమై గగ్గోలు పెట్టినా స్పందించకపోవడం గమనార్హం. రైతు నోట్లో మట్టి... నాగర్‌కర్నూల్ పట్టణంలోని కేసరి సముద్రంలోని ఒండ్రుమట్టిని కొల్లగొట్టేందుకు కొందరు చెరువులో బుద్ధ విగ్రహాన్ని నిర్మించేందుకంటూ అందులోని నీటిని పూర్తిగా బయటకు వదిలేశారు. ఆ సాకుతో చెరువులోని ఒండ్రును యదేచ్ఛగా ప్రాజెక్టుకు అమ్ముకుంటున్నారు. ఈ అంశం వివాదాస్పదంగా మారినప్పటికీ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఈ చెరువు నిండితే పలుగ్రామాల పొలాలు పంటలతో కళకళలాడతాయి. స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లాలోని అన్ని చెరువులు నీటితో కళకళలాడుతున్నా, నాగర్‌కర్నూల్ కేసరి సముద్రంలో నీరు లేకుండా చేసి రైతుల ఆగ్రహానికి గురవుతున్నారు. వట్టెం రిజర్వాయర్‌కు నిత్యం ఇక్కడి నుంచి వందలాది టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా జిల్లా అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ నోరు విప్పడం లేదు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వడ్డెమాన్ గ్రామంలో బినామీ రైతులను సృష్టించి విలువైన ప్రభుత్వ భూములు, శిఖం భూములను కాంట్రాక్టర్లకు విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఈ విషయం డీఆర్వో మధుసూదన్‌నాయక్ దృష్టికి తీసుకొచ్చాం. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఒండ్రుమట్టిని పెద్ద ఎత్తున విక్రయించడంతోపాటు పర్యావరణానికి ఆటంకం సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. – సుధాకర్, నందివడ్డెమాన్ -
ఎత్తిపోతలకు ‘పవర్’ పంచ్!
12 వేల మెగావాట్లకు చేరిన విద్యుత్ అవసరాలు - మూడు నెలల కిందటి అంచనాతో పోలిస్తే 2 వేల మె.వా. అధికం - కాళేశ్వరం, ప్రాణహితకు 5,229.43 మెగావాట్లు - పాలమూరు, డిండికి 4,705 మెగావాట్లు - ఈ జూన్ నాటికి 1,338.01 మెగావాట్ల విద్యుత్ అవసరం - అంచనాలు సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లను ఎత్తిపోసేందుకు అవసరమైన విద్యుత్ అంచనా లెక్క కొలిక్కి వచ్చింది. నీటి పారుదల శాఖ అంచనా మేరకు మొత్తంగా 12 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండబోతోంది. మూడు నెలల కింద సీఎం కె.చంద్రశేఖర్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో వేసిన అంచనాతో పోలిస్తే విద్యుత్ అవసరాలు మరో 2 వేల మెగావాట్ల మేర పెరిగింది. కాళేశ్వరం-ప్రాణహిత, పాలమూరు-డిండి ప్రాజెక్టుల పరిధిలో గతంలో వేసిన అంచనా లు పెరిగినందున విద్యుత్ అవసరాలు సైతం పెరిగినట్లు అధికారుల లెక్కలు తేట తెల్లం చేస్తున్నాయి. ఈ సీజన్లో అందుబాటులోకి రానున్న ఎత్తిపోతలకే సుమారు 1,338 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ తేల్చింది. విద్యుత్ ఖర్చు రూ.15 వేల కోట్లు! రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణం చేపట్టిన 18 ఎత్తిపోతల ప్రాజెక్టుల కింద మొత్తం 60 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. మూడు నెలల కింద ఈ ఎత్తిపోతల పథకాలకు మొత్తంగా 9,975 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని లెక్కగట్టింది. అయితే తాజా లెక్కల మేరకు.. కొత్తగా చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను మినహాయిస్తే మిగతా ఎత్తిపోతలకు 7,308.41 మెగావాట్ల విద్యుత్ అవసరాలను లెక్కలేశారు. ఇందులో ప్రాణహిత-కాళేశ్వరం ప్రాజెక్టు కింద గతంలో 3,600 మెగావాట్ల మేర అంచనా ఉండగా.. రీ ఇంజనీరింగ్ కారణంగా అది 5,229.43 మెగావాట్లకు పెరిగింది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలోనూ విద్యుత్ అవసరం 148 మెగావాట్ల నుంచి 168 మెగావాట్లకు పెరి గింది. ఇక పాలమూరు-డిండిలకు కలిపి గతంలో 3,500 మెగావాట్లు ఉండగా.. ప్రస్తుతం అది 4,705 మెగావాట్లకు చేరింది. అంతా కలిపి 12,013.41 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ తేల్చింది. మొత్తమ్మీద విద్యుత్ అవసరాలు తొలి అంచనాల కన్నా.. 2 వేల మెగావాట్ల మేర పెరిగా యి. అయితే ఇందులో కంతనపల్లికి ప్రత్యామ్నాయంగా చేపడుతున్న తుపాకులగూడెం ప్రాజెక్టు అంచనాలను పేర్కొనలేదు. ఇక్కడ సైతం 800 మెగావాట్ల వరకు అవసరాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం విద్యుత్ అవసరాలు 13 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉంది. తాజా అంచనాల ప్రకారం అది రూ.15 వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ ఏడాది 1,338 మెగావాట్లు ఈ ఏడాది నుంచి పాక్షికంగా అందుబాటులోకి వచ్చే ఎత్తిపోతల పథకాల నిర్వహణకు 1,338.01 మెగావాట్ల విద్యుత్ కావాల్సి. ఈ ఏడాది జూన్-జూలై నాటికి రాష్ట్రంలో 8 ప్రాజెక్టులు పూర్తిగా 11 ప్రాజెక్టుల పాక్షికంగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ ప్రణాళిక రచించింది. వీటి ద్వారా మొత్తంగా 6.36 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో కల్వకుర్తికి 40 మెగావాట్లు, నెట్టెంపాడుకు 119, భీమాకు 96, దేవాదులకు 347 మెగావాట్ల మేర విద్యు త్ అవసరముంటుంది. 2017-18 నాటికి ప్రాణహిత, పాలమూరు కింద పాక్షికంగానైనా ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. వచ్చే ఏడాది ప్రాణహితకు 1,660, పాలమూరుకు 1,000 మెగావాట్ల మేర అవ సరం కానుంది. -
‘ఎత్తిపోతల’ విద్యుత్ బాధ్యత ట్రాన్స్‌కోకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమయ్యే విద్యుత్‌ను సమకూర్చే బాధ్యత పూర్తిగా ట్రాన్స్‌కోకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సబ్స్టేషన్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతను కూడా పూర్తిగా ట్రాన్స్‌కోకే కట్టబెట్టాలని నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత ప్రాజెక్టుల్లో 400 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టే విషయమై సోమవారం ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సబ్స్టేషన్ల నిర్మాణంపై వీరు చర్చించారు. తెలంగాణ ప్రాంతమంతా దక్కన్ పీఠభూమి అయినందున ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతలవే కావడంతో ప్రాజెక్టులకు అధికమొత్తంలో విద్యుత్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాలమూరు, ప్రాణహిత ప్రాజెక్టులకు అత్యధికంగా చెరో 4వేల మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉంటుందని ఇప్పటికే అధికారులు లెక్కలు కట్టారు. గతంలో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులతో పోలిస్తే ఈ అవసరాలు దాదాపు రెట్టింపు ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇచ్చి వాటిని సత్వరం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎత్తిపోతల ప్రాజెక్టులకు విద్యుత్‌ను సరఫరా చేసే సబ్స్టేషన్ల నిర్మాణ బాధ్యతలను ట్రాన్స్‌కో చేతిలో పెట్టాలని నిర్ణయించింది. నిజానికి గతంలో నిర్మించిన ప్రాజెక్టులకు ఈ స్థాయిలో అవసరాలు లేకపోవడంతో 133 కేవీ నుంచి 220 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణాలను ప్రాజెక్టు అథారిటీలే చేపట్టాయి. వీటి నిర్వహణ బాధ్యతలను మాత్రం ట్రాన్స్‌కోకు అప్పగించాయి. ప్రస్తుతం 400 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం అవసరం ఉండటం, ఆ స్థాయి నిర్మాణాలు చేపట్టే సామర్థ్యం నీటి పారుదల శాఖ వద్ద లేకపోవడంతో వీటి బాధ్యతను ట్రాన్స్‌కోకు అప్పగించాలనే ప్రతిపాదనను తెచ్చింది. ప్రాజెక్టు వ్యయంలోంచే నిర్మాణం.. పాలమూరు విద్యుత్ అవసరాలకు 4, ప్రాణహిత కోసం 6 సబ్స్టేషన్లను నిర్మించాలని నీటి పారుదల శాఖ భావిస్తోంది. ఒక్కో 400 కేవీ సబ్‌స్టేషన్, లైనింగ్‌ల నిర్మాణానికి సుమారు రూ.400 కోట్ల మేర ఖర్చుతో మొత్తం 10 సబ్స్టేషన్లకు రూ.4వేల కోట్ల మేర నిధులు అవసరమవుతాయి. ఈ నిర్మాణ వ్యయాన్నంతా ప్రాజెక్టు నిధుల్లోంచే ఖర్చు చేయాల్సి ఉంటుం ది. ఈ విషయంపై మంత్రి హరీశ్‌రావు, ట్రాన్స్‌కో సీఎండీతో చర్చలు జరిపారు. అయితే సబ్స్టేషన్ల నిర్మాణంపై సీఎండీ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిసింది. మరోమారు పూర్తిస్థాయిలో చర్చించి ఓ ఒప్పందానికి రావాలని వీరు నిర్ణయించినట్లు సమాచారం.