సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలకు, వాటికయ్యే నిర్వహణ ఖర్చును భరించాలన్న వినతిపై కేంద్ర ప్రభుత్వం విముఖత చూప డం రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. దీంతో ఈ ఏడాది వర్షాకాలం నుంచి అందుబాటులోకి రానున్న భారీ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్ అవసరాలకయ్యే ఖర్చు భారమంతా రాష్ట్రమే భరించాల్సి రానుంది. దీని కోసం ఏటా గరిష్టంగా రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి రావడం రాష్ట్రానికి కత్తిమీద సాములా మారనుంది.
ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం...
రాష్ట్రంలో ఇప్పటికే 14ఎత్తిపోతల పథకాల కింద నీటి పంపింగ్ జరుగుతుండగా వాటికి 1,500 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం ఉంటోం ది. వాటిపైనే ఏటా రూ.1,800 కోట్ల మేర విద్యుత్ బిల్లుల రూపేణా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ. 3,200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో గరిష్టంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల పరిధిలోనే రూ. 1,600 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండగా దేవాదులలో రూ. 800 కోట్లు, ఏఎంఆర్‌పీలో రూ. 650 కోట్ల మేర విద్యుత్ బిల్లుల బకాయిలున్నాయి. ఈ బిల్లుల చెల్లింపే కష్టసాధ్యమవుండగా ఈ ఏడాది ఖరీఫ్ నుంచి విద్యుత్ వినియోగం మొత్తంగా 4,500–5,000 మెగావాట్ల మేర పెరిగే అవకాశం ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది జూన్ నుంచే 2 టీఎంసీల నీటిని కనీసం 6 నెలలపాటు ఎత్తిపోసేలా పంపులను సిద్ధం చేస్తున్నా రు. ఈ నీటిని ఎత్తిపోసేందుకు గరిష్టంగా 2,800 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కగట్టారు. ఈ విద్యుత్ అవసరాలకు మిడ్‌మానేరు ఎగువ వరకే రూ. 2,500 కోట్ల మేర ఖర్చు కానుండగా మిడ్‌మానేరు దిగువన పంపింగ్‌కు మరో రూ. 1,500 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది జూన్ నుంచే సీతారామ ఎత్తిపోతలను పాక్షికంగా ప్రారంభించనున్నారు. వాటితోపాటే ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును కలుపుకొని ఈ ఏడాది నుంచి రూ. 8 వేల కోట్ల మేర ఖర్చు జరిగే అవకాశం ఉంది. 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల కాలా నికి విద్యుత్ అవసరాలకు రూ. 37,796 కోట్లు అవసరం ఉంటుందని నీటిపారుదల శాఖ గతంలోనే తేల్చింది.
వాటితోపాటే పంప్‌హౌస్‌ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) ఐదేళ్ల కాలానికి రూ. 2,374 కోట్లు ఉంటుందని లెక్కగట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే భారీ ఎత్తిపోతల పథకాల విద్యుత్, ఓఅండ్‌ఎంకు సంబంధించి రూ. 40,170 కోట్లు అవసరం అవుతుందని, ఈ ఖర్చులో కొంతైనా భరించాలని కేంద్రానికి విన్నవించింది. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆర్థిక సాయం చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదు. నిర్వహణ భారం మోసే అంశంపై కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రాజెక్టులకుగానీ, నిర్వహణకుగానీ నిధులు కేటాయించలేదు. దీంతో ఈ నిర్వహణ భారాన్ని మొత్తంగా రాష్ట్రమే భరించాల్సి రానుంది. అసలే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఇది రాష్ట్రానికి గుదిబండగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment