సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌పై కేంద్రం మరో గుబులు రేపింది. విదేశీ బొగ్గు కొనుగోళ్లను రాష్ట్రాలకు తప్పనిసరి చేసింది. గత ఆదేశాల మేరకు ఈ నెల 31లోగా 10 శాతం విదేశీ బొగ్గు దిగుమతుల కోసం రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లు ఆర్డర్ ఇవ్వకపోయినా, వచ్చే నెల 15 నాటికి జెన్‌కోల విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొగ్గు రాక ప్రారంభం కాకపోయినా.. ఈ కొరతను తీర్చడానికి వచ్చే ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఏకంగా 15 శాతం వరకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేసింది. దీనికి తోడు సంబంధిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు దేశీయ బొగ్గు కేటాయింపులనూ ప్రతి నెలా 5 శాతం వరకు తగ్గించుకుంటూ పోతామని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినట్టు కేంద్ర విద్యుత్ శాఖ స్వయంగా బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
దేశంలో బొగ్గు కొరత తీర్చేందుకు..
దేశంలో బొగ్గు కొరతను తీర్చడానికి దేశీయ బొగ్గులో తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును కలిపి విద్యుదుత్పత్తి జరపాలని గత ఏప్రిల్ 30న రాష్ట్రాలను కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది. వచ్చే అక్టోబర్ 31 వరకు అవసరం కానున్న విదేశీ బొగ్గులో.. 50 శాతం వచ్చే జూన్ 30లోగా, 40 శాతం వచ్చే ఆగస్టు 31లోగా, 10 శాతం వచ్చే అక్టోబర్ 31లోగా రప్పించుకోవడానికి వీలుగా ప్రస్తుత మే 31లోగా ఆర్డర్ ఇవ్వాలంది. ఈ ఆదేశాలనుసరించి ఇప్పటి వరకు 10 శాతంవిదేశీ బొగ్గు వినియోగాన్ని ప్రారంభించని థర్మల్ ప్లాంట్లు.. వచ్చే అక్టోబర్‌లోగా 15 శాతం, ఆ తర్వాత నవంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 10 శాతం విదేశీ బొగ్గును కలిపి విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుందని తాజాగా కేంద్రం ఆదేశించింది.
రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి
రాష్ట్ర జెన్‌కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సింగరేణి బొగ్గు లభ్యత పుష్కళంగా ఉన్నా తప్పనిసరిగా విదేశీ బొగ్గును కొనాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, ఆ శాఖ అధికారులు రెండ్రోజులకోసారి రాష్ట్రాల జెన్‌కోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విదేశీ బొగ్గు కొనుగోళ్లలో పురోగతిపై ఆరా తీస్తున్నారు. అయితే రాష్ట్రంలోని ప్లాంట్లకు బొగ్గు కొరత లేదని, విదేశీ బొగ్గు అవసరం లేదని కేంద్ర మంత్రికి రాష్ట్ర ఇంధన శాఖ, జెన్‌కో అధికారులు తేల్చి చెప్పారు. లేఖ కూడా రాశారు. తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలు ఒప్పుకోకపోవడంతో తాజాగా కేంద్రం బెదిరిస్తోందని జెన్‌కో అధికారులు చెబుతున్నారు.
విదేశీ బొగ్గు.. తలకు మించిన భారం
రాష్ట్రంలో పోర్టు లేదు. 450 కిలోమీటర్ల దూరంలోని కృష్ణపట్నం పోర్టు నుంచి రైలు/రోడ్డు మార్గంలో విదేశీ బొగ్గును తీసుకురావడంరాష్ట్రానికి తలకుమించిన భారం. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో విదేశీ బొగ్గు ధరలు భారీగా పెరిగి టన్నుకు రూ. 35 వేలు (400 డాలర్ల పైన)కు చేరింది. సింగరేణి బొగ్గు ధర టన్నుకు రూ.5 వేలే ఉంది. కేంద్రం ఒత్తిళ్లతో విదేశీ బొగ్గు కొంటే ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరింతగా కుంగిపోతాయి. వినియోగదారులపై చార్జీల భారం పెరగనుంది.
విద్యుత్‌పై మరో గుబులు రేపిన కేంద్రం...రాష్ట్రాలకు అల్టిమేటం జారీ
Published Thu, May 19 2022 1:58 AM | Last Updated on Thu, May 19 2022 11:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment