Coal imports
-
బొగ్గు దిగుమతుల బిల్లు రూ.3.85 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ గత ఏడాది బొగ్గు దిగుమతులపై రూ.3.85 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో దేశం మొత్తం బొగ్గు వినియోగంలో దిగుమతి వాటా 26 శాతం నుండి 21 శాతానికి తగ్గింది. అయితే భారతదేశం ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల (ఎంటీ) కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశం నుంచి భారీ విదేశీ మారకపు ద్రవ్య ప్రవాహానికి దారితీస్తోంది. అడవుల సంరక్షణకు పెద్దపీట: బొగ్గు మంత్రిత్వశాఖ ఇదిలా ఉండగా, అడవులను సంరక్షించే అంశానికి పెద్ద పీట వేస్తున్నట్లు బొగ్గు మంత్రిత్వశాఖ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచనలను పట్టించుకోకుండా బొగ్గు గనులను వేటినీ వేలం వేయలేదని కూడా స్పష్టం చేసింది. ఉదాహరణకు, లెమ్రు ఎలిఫెంట్ కారిడార్ పరిధిలోకి వచ్చే బొగ్గు గనులను డి–నోటిఫై చేయాలన్న ఛత్తీస్‌గఢ్ విజ్ఞప్తిని అంగీకరించినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు లెమ్రు ఎలిఫెంట్ కారిడార్‌కు ఆవల ఉన్న ప్రాంతాలను కూడా మినహాయింపు కోసం పరిశీలించినట్లు పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో 10 శాతం నిల్వలు ఉన్న 40కి పైగా కొత్త బొగ్గు బ్లాకులను బొగ్గు తవ్వకాల నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. దట్టమైన హాస్డియో–అరాండ్ బొగ్గు క్షేత్రం పరిధిలోని తొమ్మిది బొగ్గు గనులను కూడా బొగ్గు బ్లాకుల తదుపరి రౌండ్ వేలం నుంచి దూరంగా ఉంచిన్నట్లు తెలిపింది. అదేవిధంగా, తదుపరి వేలం ప్రక్రియ నుండి మూడు లిగ్నైట్ గనులను మినహాయించాలన్న తమిళనాడు అభ్యర్థన కూడా అంగీకరించినట్లు పేర్కొంది. ‘‘బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు... అటవీ ప్రాంతాలను వేలంలో పెట్టాలని పరిశ్రమ డిమాండ్లు ఉన్నప్పటికీ వాటిని రక్షించడం మా బాధ్యత అని మంత్రిత్వశాఖ స్పష్టంగా సూచిస్తోంది’’అని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
జనాన్ని దోచుకుంటున్న అదానీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మీద కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపణలు ఎక్కుపెట్టారు. బొగ్గు దిగుమతులను విపరీతంగా పెంచి చూపడం ద్వారా ప్రజల నుంచి అదానీ గ్రూప్ ఏకంగా రూ.12 వేల కోట్లు దోచుకుందని బుధవారం ఆరోపించారు. ఈ మేరకు పలు మీడియా రిపోర్టులను విలేకరుల ముందు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై తక్షణం విచారణకు ఆదేశించి తన నిర్దోíÙత్వాన్ని రుజువు చేసుకోవాలని సవాల్ విసిరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి కాంగ్రెస్ అధికారంలోకి ఈ ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశిస్తుందని ప్రకటించారు. దీనిపై మోదీకి మౌనమెందుకని ప్రశ్నించారు. విచారణకు ఆదేశించి తన విశ్వసనీయతను నిరూపించుకోవచ్చు కదా అని నిలదీశారు. ‘అదానీ ఇండొనేసియాలో కొనుగోలుచేసిన బొగ్గు ధర భారత్‌కు వచ్చేసరికి రెట్టింపు అవుతోంది! ఈ అడ్డగోలు పెంపు కారణంగా భారత్‌లో కరెంట్ చార్జీలు పెరిగాయి. వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై సబ్సిడీ భారం పెరిగింది’ అని రాహుల్ ఆరోపించారు. ఇలాంటివి ఇంకే దేశంలో జరిగినా ప్రభుత్వాలే పడిపోయేవని ఆయన వ్యాఖ్యానించారు. కానీ మన దగ్గర ఇంత జరిగినా కనీస చర్యలు లేదని ఆరోపించారు. ‘ఒకే ఒక్క వ్యక్తి చేస్తున్న ఈ దారుణ దోపిడీని ప్రధాని చూసీచూడనట్టు పోతున్నారు. ఆయనను పదేపదే కాపాడుతున్నారు’ అని రాహుల్ మండిపడ్డారు. గాందీలది అవినీతి కుటుంబం: బీజేపీ గాం«దీల కుటుంబమే అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ విమర్శించింది. వారిపై అవినీతి కేసులున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ అన్నారు. అదానీ అంశం సుప్రీంకోర్టులో ఉన్నా రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయనకు కోర్టు మీద గౌరవం లేదని స్పష్టమవుతోందన్నారు. ‘రాహులే నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద ఉన్నారు. వారిది ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతిమయమైన కుటుంబం’ అంటూ మండిపడ్డారు. -
దటీజ్ టాటా.. ఆ కంపెనీకంటూ కొన్ని విలువలు ఉన్నాయ్!
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం పట్ల ఇండియన్ కార్పోరేట్ కంపెనీలు తమ వైఖరికి బయటపడకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ టాటాగ్రూపు ఇలా ఊరుకోలేదు. యుద్ధం కారణంగా పెచ్చరిల్లే హింస, రక్తపాతాలు, ఆర్తానాదాలను నిరసిస్తూ రష్యాతో వ్యాపార సంబంధాలు గుడ్‌బై చెప్పింది. రష్యాతో కట్ టాటా గ్రూపు ఆధ్వర్యంలో టాటా స్టీలు పరిశ్రమలు ఉన్నాయి. స్టీలు తయారీలో పల్వ్రైజ్డ్ బొగ్గును వినియోగిస్తారు. ఇంత కాలం ఈ బొగ్గును రష్యా నుంచి టాటా స్టీల్స్ దిగుమతి చేసుకునేది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిరసిస్తూ ఆ దేశం నుంచి బొగ్గు దిగుమతి చేసుకోరాదని టాటాస్టీల్స్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల రష్యా నుంచి 75 వేల టన్నుల బొగ్గు రష్యా నుంచి టాటా స్టీల్‌కు సరఫరా అయ్యింది. దీంతో రష్యా యుద్ధం నేపథ్యంలో టాటా స్టీల్స్ గతంలో చేసిన ప్రకటన కేవలం ప్రచార ఆర్భాటం తప్పతే ఆచరణలో అమలు అయ్యేది కాదనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన టాటా స్టీల్స్, రష్యా నుంచి బొగ్గు దిగుమతికి సంబంధించి వివరణ ఇచ్చింది. అది మా బాధ్యత ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఫిబ్రవరి 24న మొదలైందని, అయితే అప్పటికే బొగ్గు దిగుమతికి సంబంధించి రష్యాతో సంప్రదింపులు జరుగుతున్నాయని టాటా స్టీల్స్ చెప్పింది. వీటికి సంబంధించిన ఒప్పందాలు మార్చిలో తుది దశకు చేరుకున్నాయంది. ఒక బాధ్యత కలిగిన కార్పోరేట్ కంపెనీగా ఒప్పందాలను గౌరవించడం తమ బాధ్యతని టాటా తెలిపింది. అందుకే మార్చితో కుదిరిన అగ్రిమెంట్‌కి సంబంధించిన బొగ్గు మేలో దిగుమతి అయ్యిందని తెలిపింది. ప్రత్యామ్నాయం యుద్దాన్ని ఖండిస్తూ బొగ్గు దిగుమతికి సంబంధించి ఏప్రిల్ నుంచి రష్యాతో ఎటువంటి అగ్రిమెంట్లు చేసుకోలేదని టాటా స్టీల్స్ చెప్పింది. రష్యా ప్రత్యామ్నాయంగా యూకే, నెదర్లాండ్స్ నుంచి బొగ్గు దిగుమతి చేసుకోబోతున్నట్లు టాటా స్టీల్స్ వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్ష దండయాత్రను నిరసిస్తూ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అమెరికా అయితే రష్యాను ఏకాకి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. రష్యాతో ఉన్న పూర్వ సంబంధాల నేపథ్యంలో ఈ అంశంపై భారత ప్రభుత్వం ఆచీతూచీ వ్యవహరించింది. చదవండి: ఎయిర్‌ఫోర్స్‌కు 100వ లాంచర్..అందించిన టీఏఎస్ఎల్, ఎల్అండ్టీ! -
విద్యుత్‌పై మరో గుబులు రేపిన కేంద్రం...రాష్ట్రాలకు అల్టిమేటం జారీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌పై కేంద్రం మరో గుబులు రేపింది. విదేశీ బొగ్గు కొనుగోళ్లను రాష్ట్రాలకు తప్పనిసరి చేసింది. గత ఆదేశాల మేరకు ఈ నెల 31లోగా 10 శాతం విదేశీ బొగ్గు దిగుమతుల కోసం రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లు ఆర్డర్ ఇవ్వకపోయినా, వచ్చే నెల 15 నాటికి జెన్కోల విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొగ్గు రాక ప్రారంభం కాకపోయినా.. ఈ కొరతను తీర్చడానికి వచ్చే ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఏకంగా 15 శాతం వరకు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేసింది. దీనికి తోడు సంబంధిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు దేశీయ బొగ్గు కేటాయింపులనూ ప్రతి నెలా 5 శాతం వరకు తగ్గించుకుంటూ పోతామని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినట్టు కేంద్ర విద్యుత్ శాఖ స్వయంగా బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. దేశంలో బొగ్గు కొరత తీర్చేందుకు.. దేశంలో బొగ్గు కొరతను తీర్చడానికి దేశీయ బొగ్గులో తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును కలిపి విద్యుదుత్పత్తి జరపాలని గత ఏప్రిల్ 30న రాష్ట్రాలను కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది. వచ్చే అక్టోబర్ 31 వరకు అవసరం కానున్న విదేశీ బొగ్గులో.. 50 శాతం వచ్చే జూన్ 30లోగా, 40 శాతం వచ్చే ఆగస్టు 31లోగా, 10 శాతం వచ్చే అక్టోబర్ 31లోగా రప్పించుకోవడానికి వీలుగా ప్రస్తుత మే 31లోగా ఆర్డర్ ఇవ్వాలంది. ఈ ఆదేశాలనుసరించి ఇప్పటి వరకు 10 శాతంవిదేశీ బొగ్గు వినియోగాన్ని ప్రారంభించని థర్మల్ ప్లాంట్లు.. వచ్చే అక్టోబర్‌లోగా 15 శాతం, ఆ తర్వాత నవంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 10 శాతం విదేశీ బొగ్గును కలిపి విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుందని తాజాగా కేంద్రం ఆదేశించింది. రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి రాష్ట్ర జెన్కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సింగరేణి బొగ్గు లభ్యత పుష్కళంగా ఉన్నా తప్పనిసరిగా విదేశీ బొగ్గును కొనాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, ఆ శాఖ అధికారులు రెండ్రోజులకోసారి రాష్ట్రాల జెన్కోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విదేశీ బొగ్గు కొనుగోళ్లలో పురోగతిపై ఆరా తీస్తున్నారు. అయితే రాష్ట్రంలోని ప్లాంట్లకు బొగ్గు కొరత లేదని, విదేశీ బొగ్గు అవసరం లేదని కేంద్ర మంత్రికి రాష్ట్ర ఇంధన శాఖ, జెన్కో అధికారులు తేల్చి చెప్పారు. లేఖ కూడా రాశారు. తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలు ఒప్పుకోకపోవడంతో తాజాగా కేంద్రం బెదిరిస్తోందని జెన్కో అధికారులు చెబుతున్నారు. విదేశీ బొగ్గు.. తలకు మించిన భారం రాష్ట్రంలో పోర్టు లేదు. 450 కిలోమీటర్ల దూరంలోని కృష్ణపట్నం పోర్టు నుంచి రైలు/రోడ్డు మార్గంలో విదేశీ బొగ్గును తీసుకురావడంరాష్ట్రానికి తలకుమించిన భారం. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో విదేశీ బొగ్గు ధరలు భారీగా పెరిగి టన్నుకు రూ. 35 వేలు (400 డాలర్ల పైన)కు చేరింది. సింగరేణి బొగ్గు ధర టన్నుకు రూ.5 వేలే ఉంది. కేంద్రం ఒత్తిళ్లతో విదేశీ బొగ్గు కొంటే ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరింతగా కుంగిపోతాయి. వినియోగదారులపై చార్జీల భారం పెరగనుంది. -
విశాఖ పోర్టులో తగ్గిన బొగ్గు దిగుమతులు
► ప్రైవేటు పోర్టుల వైపు మొగ్గుచూపుతున్న దిగుమతిదారులు ► పోర్టు చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో బొగ్గు దిగుమతులు తగ్గాయని పోర్టు చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ «థర్మల్, స్టీమ్, కుకింగ్ రకాల బొగ్గు పోర్టులో దిగుమతి అవుతుందని చెప్పారు. వీటిలో థర్మల్, స్టీమ్ బొగ్గు దిగుమతి తగ్గిందని, కుకింగ్ రకం బొగ్గు దిగుమతి యథావిధిగా జరుగుతుందన్నారు. విశాఖ పోర్టులో దిగుమతి అయిన సరుకును పది రోజుల వరకూ నిల్వ చేసుకోవచ్చని, తరువాతి రోజు నుంచి దీనిపై చార్జీలు వర్తిస్తాయని, ప్రైవేటు పోర్టుల్లో దిగుమతయిన సరుకును తొంభై రోజుల వరకూ ఎటువంటి రుసుం చెల్లించకుండా నిల్వ చేసుకోవచ్చని చెప్పారు. ఈ వెసులుబాటు వల్లే దిగుమతిదారులు ప్రైవేటు పోర్టుల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. కృష్ణపట్నం పోర్టుకు వచ్చే నౌకలకు భారీ రాయితీ ప్రకటించడంతోపాటు ఒక నౌకలోని కార్గోని మరో నౌకలోకి ఉచితంగా చేరవేస్తుండటంతో దిగుమతి దారులు ఆ పోర్టువైపు మొగ్గుతున్నారని వివరించారు. గతేడాదితో పొల్చితే ఒక మిలియన్ టన్ను వరకు బొగ్గు దిగుమతి తగ్గిందన్నారు. టేంప్ ప్రైవేటు పోర్టులకు వర్తించదు టారిఫ్ అథారిటీ ఆఫ్ మేజర్ పోర్ట్స్ (టేంప్) నిబంధనలు ప్రైవేటు పోర్టులకు వర్తించనందున.. ఆయా పోర్టుల యాజమాన్యాలు ఎగుమతి, దిగుమతి ధరలను నిర్ణయించుకునే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న మేజర్ పోర్టు బిల్లు అనుమతి పొందితే టేంప్ ఎత్తివేయబడుతుందని, దీని వల్ల మేజర్ పోర్టులు ఎగుమతి దిగుమతి ధరలను నిర్ణయించుకొనే వెసులుబాటు లభిస్తుందన్నారు. పోర్టు స్థలాల అభివృద్ధి: విశాఖ పోర్టుకు సాలిగ్రామపురం, ఎయిర్‌పోర్టు, ఎన్ఏడీ ప్రాంతాలలో సుమారుగా 100 ఎకరాల స్థలం ఉందని చెప్పారు. ఈ స్థలాలను కమర్షియల్ డెవలప్మెంట్కు ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. ఎయిర్‌పోర్టు వద్దనున్న 70 ఎకరాల స్థలాన్ని కమర్షియల్ డెవలప్మెంట్కు ఇచ్చే అవకాశం ఉందన్నారు.