సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు! | Two Huge Lift Irrigation Projects On SIngur Reservoir | Sakshi
Sakshi News home page

సింగూరు జలాశయంపై 2 భారీ ఎత్తిపోతలు!

Published Mon, Feb 22 2021 1:57 AM | Last Updated on Mon, Feb 22 2021 8:17 AM

Two Huge Lift Irrigation Projects On SIngur Reservoir - Sakshi

సింగూరు ప్రాజెక్టు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీరు అందని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్న ప్రభుత్వం తాజాగా మరో రెండు కీలక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సింగూరు రిజర్వాయర్‌కు నీటి లభ్యతను పెంచేలా పనులు జరుగుతున్న దృష్ట్యా.. దీనికి కొనసాగింపుగా సింగూరు నీటిని ఆధారం చేసుకొని రెండు భారీ ఎత్తిపోతల పథకాలకు డిజైన్‌ చేస్తోంది. పూర్తిగా వెనకబడ్డ నారాయణఖేడ్, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో సుమారు 2.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఈ రెండు పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇరిగేషన్‌ శాఖ సిద్ధ్దమవుతోంది. 

భారీగా ఎత్తిపోత... అంతే భారీ ఆయకట్టు
ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గి సింగూరు ప్రాజెక్టుకు ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు నీటి లభ్యత కరువై వట్టిపోతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సింగూరుకు నీటి లభ్యత పెంచేలా కాళేశ్వరంలోని మల్లన్నసాగర్‌ నుంచి నీటిని తరలించే పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనులు పూర్తయితే సింగూరుకు నీటి కొరతరాదని చెబుతోంది. సింగూరుకు నీటి లభ్యత పెంచనున్న దృష్ట్యా, ఆ నీటిపై ఆధారపడి.. సాగునీటి వసతి కరువైన ప్రాంతాలకు గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రభుత్వం ఇప్పటినుంచే ఆలోచనలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారాయణఖేడ్‌ ప్రాంతానికి నీరందించేలా బసవేశ్వర ఎత్తిపోతలకు, జహీరాబాద్‌ నియోజకవర్గానికి నీరందించేలా సంగమేశ్వర ఎత్తిపోతలకు ప్రాణం పోస్తోంది.

సింగూరులో 510 లెవల్‌ నుంచి సుమారు 8 టీఎంసీల నీటిని తీసుకుంటూ నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీళ్లందించేలా దీన్ని డిజైన్‌ చేస్తున్నారు. దీనికై 55 మీటర్ల మేర నీటిని లిఫ్టు చేసేలా ఒకటే లిఫ్టును ప్రతిపాదిస్తుండగా, ఈ ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.700– 800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వస్తున్నారు. ఇక జహీరాబాద్‌ నియోజకవర్గంలో నీటి వసతి కల్పించేందుకు సింగూరులో అదే 510 లెవల్‌ నుంచి రెండు దశల్లో 125 మీటర్ల మేర నీటిని ఎత్తిపోసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. దీనికి 15 టీఎంసీల మేర నీటి అవసరాలను లెక్కగట్టారు. ఈ పథకానికి రూ.1,300 కోట్ల మేర ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా.

మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటిని తీసుకునేందుకు... అంచనా వ్యయం రూ.2 వేల కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఈ స్థాయిలో ఆయకట్టుకు నీరందించేందుకు భారీగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. భూసేకరణ అవసరాలతో పాటు కెనాల్‌ అలైన్‌మెంట్, పంప్‌హౌస్‌ల నిర్మాణ ప్రాంతాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సి ఉంది. అనంతరం విద్యుత్‌ అవసరాలు, నిర్మాణ వ్యయాలపై కచ్చితమైన అంచనాలు రూపొందించేందుకు డీపీఆర్‌ సిధ్దం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ డీపీఆర్‌ తయారు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. 

సీఎం సూచనల మేరకు డీపీఆర్‌కి సిద్ధమవుతున్న ఇరిగేషన్‌ శాఖ

  • బసవేశ్వర ఎత్తిపోతలతో నారాయణఖేడ్‌లో 80 వేల ఎకరాలు.. సంగమేశ్వరతో జహీరాబాద్‌లో 1.50 లక్షల ఎకరాలకు మొత్తంగా 2,30,000 ఎకరాలకు సాగునీరు
  • రెండు ప్రాజెక్టులకు కలిపి 23 టీఎంసీల నీటి అవసరం
  • రెండు ప్రాజెక్టులకు కలిపి 2,000 కోట్ల వ్యయ అంచనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement