10 లక్షల ఎకరాలకు సాగు నీరు
నారాయణఖేడ్/జహీరాబాద్/జోగిపేట, న్యూస్‌లైన్: తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేటలలో జరిగినబహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు.
నారాయణఖేడ్‌లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఖేడ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టు నీరు కాల్వల ద్వారా వ్యవసాయ భూములకు అందాల్సి ఉందన్నారు. నల్లవాగు డైవర్షన్‌తో మరో ఐదు వేల ఎకరాలకు సాగు నీటిని అందించవచ్చన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం మాయం కావాలన్నారు. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రైతులు వ్యవసాయం కోసం వాడుకునే యంత్రాలకు రవాణా పన్ను రద్దు చేస్తామన్నారు.
తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇక పని లేదన్నారు. ఈసారి ఖేడ్‌లో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలని కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డిలను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
జహీరాబాద్‌లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సింగూరు, నారింజ ప్రాజెక్టుల నీటిని జహీరాబాద్ ప్రాంత వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
జహీరాబాద్‌కు పక్కనే ఉన్న సింగూరుతో పాటు సాగుకు ఏ మాత్రం ఉపయోగపడకుండా ఉన్న నారింజ ప్రాజెక్టు నీటిని, స్థానికంగా ఉన్న బడంపేట, ఏడాకులపల్లి, జీర్లపల్లి ప్రాంతాల్లోని చిన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా నియోజకవర్గంలో లక్ష ఎకరాల వ్యవసాయ భూమిని సాగులోకి తీసుకురావచ్చన్నారు. దీంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. జహీ రాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్‌కు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, పార్టీలోనూ ఎలాంటి ప్రాధాన్యతనివ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ను వీడి తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
జహీరాబాద్ ప్రాంతం బాగా వెనుకబడి ఉందన్నారు. దీనిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జహీరాబాద్ నియోజకవర్గంలో 5వేల ఇళ్లను పేదలకు కట్టించి ఇస్తామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి భీంరావు బసంత్‌రావు పాటిల్, అసెంబ్లీ స్థానం నుంచి కె.మాణిక్‌రావులను కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.
జోగిపేటలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని అన్నారు. జోగిపేట ప్రజలు కూడా బస్సు మిస్సు కావద్దని, అధికార పార్టీలో ఉంటేనే లాభపడతామని, లేకుంటే నష్టపోతామని అన్నారు. మన తలరాత మనమే రాసుకుందామని సూచించారు. జోగిపేటను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. తాను మొదట్లో బాబూమోహన్‌ను అందోల్ నియోజకవర్గంలో పోటీ చేయించినప్పుడు.
ఇక్కడేమి గెలుస్తారంటూ చాలా మంది వెటకారం చేశారని, అయినా అందరం కలిసి గెలిపించుకుని రూ.100 కోట్ల అభివృద్ధి చేశామన్నారు. రైతులకు రుణ మాఫీ, పక్కాఇళ్ల నిర్మాణం వంటి పథకాలను పకడ్బంధీగా అమలు చేస్తామన్నారు. అందోల్ అసెంబ్లీ అభ్యర్థి పి.బాబూమోహన్, ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.
దామోదర ఊసెత్తని కేసీఆర్
మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ ప్రతిరోజూ ప్రచారంలో కేసీఆర్‌పై దుమ్మెత్తి పోస్తున్నా.. కేసీఆర్ మాత్రం పల్లెత్తుమాట అనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఏ పార్టీని కానీ, అభ్యర్థులను కానీ విమర్శించకుండా తన ప్రసంగాన్ని ముగించారు.