‘కృష్ణా’పై మరో ఎత్తిపోతలు | Another Lift Irrigation Project On Krishna River In Telangana | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’పై మరో ఎత్తిపోతలు

Published Sat, Jan 25 2020 1:08 AM | Last Updated on Sat, Jan 25 2020 1:08 AM

Another Lift Irrigation Project On Krishna River In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా నదీ జలాలను వినియోగిస్తూ మరో కొత్త ఎత్తిపోతల చేపట్టే ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటివరకు సాగునీటి వసతి లేని అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి నీరిచ్చేలా డిండి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా అమ్రాబాద్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎంకు అందజేసింది. పాలమూరు–రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్‌ నుంచి   
నీటిని తీసుకుంటూ 75 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఈ ప్రతిపాదనలు రూపొందించారు. పాలమూరు–రంగారెడ్డి ద్వారా తీసుకుంటున్న కృష్ణా జలాలను డిండికి సైతం 30 టీఎంసీల మేర తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏదుల రిజర్వాయర్‌ ద్వారా డిండికి తరలించేలా ఇటీవలే తుది ప్రతిపాదన సిద్ధమైంది. ఇదే ఏదుల నుంచి నల్లమల ప్రాంతంలో నీరందని ప్రాంతాలకు నీరిచ్చేలా అమ్రాబాద్‌ ఎత్తిపోతలను ప్రతిపాదించారు. ఏదుల నుంచి గ్రావిటీ పైప్‌లైన్‌ ద్వారా తరలించి అక్కడినుంచి జిలుగుపల్లి పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేసే 20.5 మెగావాట్ల సామర్థ్యం గల 2 పంపుల ద్వారా ప్రతిరోజు 0.1 టీఎంసీ నీటిని తరలించాలని ప్రతిపాదించారు. 60 రోజుల పాటు నీటిని తరలించడమంటే 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు.

ఇక్కడ ఎత్తిపోసే నీటిని 2.57 టీఎంసీ సామర్థ్యంతో ప్రతిపాదించిన మైలారం రిజర్వాయర్‌కు తరలిస్తారు. దీనికింద నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బల్మూరు, అచ్చంపేట, లింగాల, టేకులపల్లి, ఉప్పనూతల మండలాల పరిధిలో మొత్తంగా 50 వేల ఎకరాలకు నీరు పంపిణీ చేస్తారు. ఇక్కడి నుంచి చంద్రవాగు ద్వారా చంద్రసాగర్‌ చెరువుకు నీటిని తరలించి అక్కడి నుంచి మరో లిఫ్టు ద్వారా మన్ననూర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. ఈ రిజర్వాయర్‌ కింద అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మరో 25 వేల ఎకరాలకు నీరందించనున్నారు. మొత్తంగా 75 వేల ఎకరాలకు నీరందించేలా దీన్ని చేపట్టనున్నారు. ఈ మొత్తం ప్రతిపాదనకు రూ.2,351 కోట్లు అవుతుందని రిటైర్డ్‌ ఇంజనీర్లు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement