సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో మంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలపై కర్ణాటక అభ్యంతరాలను అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. శనివారం అమిత్ షా అధ్యక్షతన తిరువనంతపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రాజెక్టులపై చర్చించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా జలాల్లో హక్కుగా రావాల్సిన వాటాను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ (ముందు జలాలు) నుంచి నీటిని తరలించడానికి ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలంగాణ స్పష్టం చేసింది.
కర్ణాటక ఆందోళనలు, అభ్యంతరాలకు తావు లేదని పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్‌ను ఇప్పటికే సీడబ్ల్యూసీకి సమర్పించామని, నక్కలగండి డీపీఆర్‌కి తుదిరూపు ఇస్తున్నామని కౌన్సిల్‌కి నివేదించింది. ఈ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కోరగా.. సదరన్ కౌన్సిల్ కేవలం సలహా మండలి మాత్రమేనని, సమస్యను అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని అమిత్ షా సూచించారు.
మాకే రూ.17,828 కోట్లు రావాలి
ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్ల బకాయిలను పరిగణనలోకి తీసుకోకుండానే.. ఏపీ విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.6,756 కోట్ల బకాయిలను చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ తమను ఏకపక్షంగా ఆదేశించిందని తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ బకాయిలపై సదరన్ కౌన్సిల్‌లో పరిశీలన జరపాలని గత మార్చి 28న 12వ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నప్పటికీ, కేంద్రం తొందరపడి ఉత్తర్వులిచ్చిందని తప్పుబట్టింది.
పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటాం
►ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన సమస్యను పరస్పర అంగీకారంతో ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకుంటాయని తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హామీ ఇచ్చారు.
►మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, అత్యాచారాల కేసుల త్వరితగతిన విచారణ, పురోగతిపై అదనపు డీజీ స్వాతి లక్రా ఇచ్చిన ప్రజెంటేషన్‌ను అమిత్‌షా ప్రశంసించి ఇతర రాష్ట్రాలకు సైతం సహకరించాలని సూచించారు.
►పన్నుల విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కొన్ని నిబంధనలు తెలంగాణకు, మరికొన్ని ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఇప్పుడు చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. చట్ట సవరణ జరపాలని ఏపీ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకించింది.
►సెక్షన్ 10లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజనతోపాటు సెక్షన్ 66పై ఏపీ అభ్యంతరాల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర హోంశాఖను అమిత్ షా ఆదేశించారు.
►షెడ్యూల్–9లోని 90 ప్రభుత్వరంగ సంస్థల విభజనను ఏకకాలంలో జరపాలని ఏపీ కోరగా, ఎలాంటి వివాదా లు లేని 53 సంస్థల విభజనను ముందుగా పూర్తి చేయాలని అమిత్ షా పేర్కొన్నారు. మిగిలిన వివాదాలను క్రమంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
జల వివాదాలను ఉమ్మడిగా పరిష్కరించుకోండి: అమిత్ షా
నీటి వివాదాలకు ఉమ్మడి పరిష్కార మార్గాలు వెదకాలని దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హితవు పలికారు. ఏపీ, తెలంగాణ తమ పెండింగ్ సమస్యలన్నింటినీ పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.
తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం, తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపకంపై గొడవలున్నాయని మంత్రి గుర్తు చేశారు. అనంతరం భేటీ విశేషాలపై అధికారిక ప్రకటన వెలువడింది. ‘భేటీలో 26 అంశాలపై చర్చ జరిగింది. తొమ్మిదింటికి పరిష్కారం లభించింది. మిగతా 17 అంశాలపై మళ్లీ చర్చించాలని నిర్ణయం జరిగింది. వీటిలో 9 అంశాలు ఏపీ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించినవే’అని పేర్కొంది.
విభజన సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం: హోంమంత్రి మహమూద్
రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతుండటం పట్ల రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా ఉద్యోగుల విభజన, ప్రభుత్వ, ఇతర సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు, ఇతర సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో ఆయన రాష్ట్రం తరపున పాల్గొని మాట్లాడారు.
కేంద్ర హోంశాఖ చొరవతో ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు వేగవంతంగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ భేటీలో పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment