Southern Zonal Council Meeting
-
‘అపెక్స్’కు పాలమూరు, నక్కలగండి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలపై కర్ణాటక అభ్యంతరాలను అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. శనివారం అమిత్ షా అధ్యక్షతన తిరువనంతపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రాజెక్టులపై చర్చించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా జలాల్లో హక్కుగా రావాల్సిన వాటాను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ (ముందు జలాలు) నుంచి నీటిని తరలించడానికి ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. కర్ణాటక ఆందోళనలు, అభ్యంతరాలకు తావు లేదని పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్‌ను ఇప్పటికే సీడబ్ల్యూసీకి సమర్పించామని, నక్కలగండి డీపీఆర్‌కి తుదిరూపు ఇస్తున్నామని కౌన్సిల్‌కి నివేదించింది. ఈ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కోరగా.. సదరన్ కౌన్సిల్ కేవలం సలహా మండలి మాత్రమేనని, సమస్యను అపెక్స్ కౌన్సిల్ ముందుంచాలని అమిత్ షా సూచించారు. మాకే రూ.17,828 కోట్లు రావాలి ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్ల బకాయిలను పరిగణనలోకి తీసుకోకుండానే.. ఏపీ విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.6,756 కోట్ల బకాయిలను చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ తమను ఏకపక్షంగా ఆదేశించిందని తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ బకాయిలపై సదరన్ కౌన్సిల్లో పరిశీలన జరపాలని గత మార్చి 28న 12వ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నప్పటికీ, కేంద్రం తొందరపడి ఉత్తర్వులిచ్చిందని తప్పుబట్టింది. పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటాం ►ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన సమస్యను పరస్పర అంగీకారంతో ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకుంటాయని తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హామీ ఇచ్చారు. ►మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, అత్యాచారాల కేసుల త్వరితగతిన విచారణ, పురోగతిపై అదనపు డీజీ స్వాతి లక్రా ఇచ్చిన ప్రజెంటేషన్‌ను అమిత్‌షా ప్రశంసించి ఇతర రాష్ట్రాలకు సైతం సహకరించాలని సూచించారు. ►పన్నుల విషయంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కొన్ని నిబంధనలు తెలంగాణకు, మరికొన్ని ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఇప్పుడు చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. చట్ట సవరణ జరపాలని ఏపీ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకించింది. ►సెక్షన్ 10లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజనతోపాటు సెక్షన్ 66పై ఏపీ అభ్యంతరాల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర హోంశాఖను అమిత్ షా ఆదేశించారు. ►షెడ్యూల్–9లోని 90 ప్రభుత్వరంగ సంస్థల విభజనను ఏకకాలంలో జరపాలని ఏపీ కోరగా, ఎలాంటి వివాదా లు లేని 53 సంస్థల విభజనను ముందుగా పూర్తి చేయాలని అమిత్ షా పేర్కొన్నారు. మిగిలిన వివాదాలను క్రమంగా పరిష్కరించుకోవాలని సూచించారు. జల వివాదాలను ఉమ్మడిగా పరిష్కరించుకోండి: అమిత్ షా నీటి వివాదాలకు ఉమ్మడి పరిష్కార మార్గాలు వెదకాలని దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హితవు పలికారు. ఏపీ, తెలంగాణ తమ పెండింగ్ సమస్యలన్నింటినీ పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం, తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపకంపై గొడవలున్నాయని మంత్రి గుర్తు చేశారు. అనంతరం భేటీ విశేషాలపై అధికారిక ప్రకటన వెలువడింది. ‘భేటీలో 26 అంశాలపై చర్చ జరిగింది. తొమ్మిదింటికి పరిష్కారం లభించింది. మిగతా 17 అంశాలపై మళ్లీ చర్చించాలని నిర్ణయం జరిగింది. వీటిలో 9 అంశాలు ఏపీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవే’అని పేర్కొంది. విభజన సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం: హోంమంత్రి మహమూద్ రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతుండటం పట్ల రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా ఉద్యోగుల విభజన, ప్రభుత్వ, ఇతర సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు, ఇతర సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో ఆయన రాష్ట్రం తరపున పాల్గొని మాట్లాడారు. కేంద్ర హోంశాఖ చొరవతో ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు వేగవంతంగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ భేటీలో పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. -
దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీ.. హాజరైన ఏపీ మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి
సాక్షి, తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ కేరళ రాజధాని తిరువనంతపురంలో శనివారం సమావేశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన సమస్యలను మంత్రులు ప్రస్తావించారు. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు గ్రాంట్, 7 జిల్లాల ప్యాకేజీ నిధులు, రామాయపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి సైతం ప్రస్తావించారు. మరోవైపు ఈ సమావేశానికి తెలంగాణ తరపున హోంమంత్రి మహమూద్ ఆలీ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరు ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, కృష్ణా జలాల పంపిణీ, నీటిపారుదలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చదవండి: పులివెందులను టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?: జోగి రమేష్ -
కెఎస్ఆర్ లైవ్ షో @ 15 November 2021
-
విభజన హామీలు నెరవేర్చాలి
-
సీఎం కాన్వాయ్ వెంట మహిళ పరుగు..ఓఎస్డీని పంపిన సీఎం..!
రేణిగుంట: తిరుపతిలో 29వ సదరన్ జోనల్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆదివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి వెళుతున్న సీఎం కాన్వాయ్ వెనుక ఓ మహిళ అర్జీ చేత పట్టుకుని సార్.. సార్.. అంటూ పరుగులు తీసింది. కారు అద్దంలో నుంచి గమనించిన సీఎం వైఎస్ జగన్.. వెంటనే కారు ఆపి వెనుక కూర్చున్న ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిని ఆమె వద్దకు పంపించారు. ఆయన వెళ్లి సమస్యను తెలుసుకుని అర్జీ స్వీకరించారు. విజయకుమారి సమస్య తెలుసుకుంటున్న ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విజయకుమారి తనకు ఉద్యోగం ఇప్పించాలని, జీవనం కష్టతరంగా మారిందని అర్జీలో పేర్కొంది. సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థినులు కూడా అనారోగ్య విషయమై అర్జీ ఇచ్చారు. స్పందించి వాహనాన్ని ఆపిన సీఎంకు విజయకుమారి ధన్యవాదాలు తెలిపారు. -
నదీ జలాల పంపిణీ విధానం మారాలి
తిరుపతి నుంచి సాక్షి ప్రతినిధి: ‘ప్రస్తుత నదీ జలాల పంపిణీ విధానంతో దిగువ రాష్ట్రాలు నష్టపోతున్నాయి. కాబట్టి నీటి పంపిణీ విధానాన్ని పునఃసమీక్షించాలి. ప్రతి 15 రోజులకు ఓసారి అంచనా వేసి నీటి పంపిణీ చేయాలి’ అని సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో నదీ జలాల అంశంపై ఆయన మాట్లాడుతూ చేసిన కీలక సూచనలను పరిశీలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ సమావేశంలో ‘ఇంద్రావతి–కావేరి–కృష్ణా–పెన్నా–గోదావరి’ నదుల అనుసంధానంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడిన విషయాలు విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. ‘రాష్ట్రంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు 2,500 టీఎంసీల ప్రవాహం ఉంటుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, బనకచర్ల, సోమశిల వరకు భూ భాగం అంతా ఏపీలోనే ఉంది. కాబట్టి ఆ నాలుగైదు నెలల్లో నీటిని తరలించుకోవచ్చు. నదుల్లో సమృద్ధిగా నీళ్లు ఉన్న సమయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. నీటి కొరత ఉన్నప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని ఒడిసి పడుతున్నాయి. మరోవైపు అకస్మాత్తుగా వరదలు వస్తే దిగువ ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. నదుల్లో నీరు లేనప్పుడు నీటి కొరతతో, భారీగా నీళ్లు ఉన్నప్పుడు వరదలతో దిగువన ఉన్న రాష్ట్రాల వారు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రతి 15 రోజులకోసారి రిజర్వాయర్లు, డ్యాంలలో నీటిని పరిగణనలోకి తీసుకుని కేటాయింపుల ప్రాతిపదిక నిష్పత్తిన పంపిణీని చేపట్టాలి. దాంతో ఎవ్వరికీ ఇబ్బంది రాదు’ అని సీఎం జగన్ చెప్పారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందిస్తూ డీపీఆర్ రూపొందించిన తర్వాత అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశంలో కీలకాంశాలు ఇలా.. ► వివిధ కీలక అంశాలపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతోపాటు మరికొన్నింటిని సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ► పులికాట్ సరస్సులో తమిళనాడుతో నెలకొన్న వివాద పరిష్కారానికి ఏపీ సూచనలను కేంద్రం ఆమోదించింది. చేపల వేట కోసం పులికాట్ సముద్ర తీర ముఖ ద్వారాన్ని తెరిచేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని షార్ తెలిపింది. కళంగిని, స్వర్ణముఖి నదీ ద్వారాలను తెరవడానికి అభ్యంతరం లేదని చెప్పింది. దాంతో ఏపీ సూచించిన మేరకు చేపల వేట సమస్య పరిష్కారానికి సాంకేతిక కమిటీ సిఫార్సులను ఆమోదించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ► చేపల వేటపై ఏపీ, తమిళనాడు మత్స్యకారులు ఒకరి సరిహద్దులు మరొకరు అతిక్రమించకూడదన్నారు. అందుకోసం ఇరు రాష్ట్రాల మత్స్యకారులకు ఇచ్చే గుర్తింపు కార్డుల్లో ప్రత్యేక కలర్ కోడ్‌ను ఇవ్వాలని ప్రతిపాదించారు. ► రొయ్యల్లో యాంటి బయాటిక్ అవశేషాల నిరోధానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రశంసించింది. అందుకు ఏపీ ప్రత్యేక చట్టాన్ని చేయడంతోపాటు టాస్క్‌ఫోర్స్‌లను కూడా ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని పలువురు పేర్కొన్నారు. ఈ తరహా చర్యలను కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి చేపట్టాలని మండలి సూచించింది. 3 నెలల్లో చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్రాలు తెలిపాయి. ► తాము తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీటిని ఇస్తున్న విషయాన్ని తమిళనాడు గుర్తుంచుకొని పాలారు ప్రాజెక్టుకు సహకరించాలని మంత్రి బుగ్గన కోరారు. ► తెలుగు గంగ బకాయిల గురించి తమిళనాడు మంత్రి పొన్ముడి స్పందిస్తూ.. ఇప్పటికే కొంత మొత్తం చెల్లించామని, మిగిలిన రూ.300 కోట్లు త్వరలో ఇస్తామని చెప్పారు. ► తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6 వేల కోట్ల విద్యుత్ బకాయిలకు సంబంధించి ఇరు రాష్ట్రాలతో మరోసారి సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని అమిత్ షా చెప్పారు. మధ్యప్రదేశ్, యూపీ, బిహార్ రాష్ట్రాల విభజన సమయంలో ఎలా వ్యవహరించారో ఈ విషయంలో అలా వ్యవహరించాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన విజ్ఞప్తి చేశారు. ► పాలమూరు –రంగారెడ్డి, నక్కల గండి ఎత్తిపోతల పథకంపై çకర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్టులపై జనవరి 15లోగా తెలంగాణ డీపీఆర్ సమర్పిస్తుందని కేంద్ర జల శక్తి శాఖ తెలిపింది. -
2 నెలల్లో డీపీఆర్‌లు.. ‘పాలమూరు, నక్కలగండి’పై సదరన్ జోనల్ కౌన్సిల్ సూచన
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను జనవరి 15లోగా కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమర్పించాలని దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) సమావేశం సూచించింది. ఇవి మిగులు జలాలపై ఆధారపడి ఉమ్మడి ఏపీలో చేపట్టిన పాత ప్రాజెక్టులేనని.. ఈ రెండు ప్రాజెక్టులకు బ్రిజేష్ ట్రిబ్యునల్ చేసే కేటాయింపులకు లోబడి ఉంటామని తెలంగాణ వినిపించిన వాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఆదివారం తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి 29వ సమావేశం జరిగింది. అందులో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని తెలంగాణ తరఫున వాదనలు వినిపించారు. ఆ అభ్యంతరాలకు విలువ లేదు కృష్ణా పరీవాహకంలో దిగువన ఉన్న ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మిగులు జలాల ఆధారంగా.. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని తెలంగాణ వివరించింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు తమ కోటాలను వినియోగించుకున్నాకే కృష్ణా జలాలు దిగువన ఉన్న తెలంగాణ, ఏపీలకు వస్తున్నాయని.. అందువల్ల ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై కర్ణాటక అభ్యంతరాలకు విలువ లేదని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల కేటాయింపు అంశం బ్రిజేశ్ ట్రిబ్యునల్ పరిధిలో ఉందని.. ఈ రెండు పథకాలకు ట్రిబ్యునల్ చేసే కేటాయింపులకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సదరన్ కౌన్సిల్ సమావేశం.. జనవరి 15లోగా సీడబ్ల్యూసీకి పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని సూచించింది. ఇక సంగంబండ బ్యారేజీ నిర్మాణంతో కర్ణాటకలో ముంపునకు గురికానున్న గ్రామాలు/భూముల సమస్యను పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాల బృందాల ఆధ్వర్యంలో జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించాలని కౌన్సిల్ సమావేశంలో మరో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకే రూ.4,457 కోట్లు రావాలి రాష్ట్ర విభజన అనంతరం ఏపీ నుంచి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ డిస్కంలు రూ.6,015 కోట్లను ఏపీ జెన్కోకు చెల్లించాల్సి ఉందని ఏపీ ఈ సమావేశంలో వాదించింది. అయితే ఏపీ జెన్కోకు చెల్లించాల్సిన బకాయిలను సర్దుబాటు చేశాక కూడా.. తమకే ఏపీ నుంచి రూ.4,457 కోట్లు రావాల్సి ఉంటుందని తెలంగాణ పేర్కొంది. వాస్తవానికి ఏపీజెన్కోకు తెలంగాణ డిస్కంలు కేవలం రూ.3,442 కోట్లను మాత్రమే చెల్లించాల్సి ఉందని తెలిపింది. విద్యుత్ సంస్థల విభజన వివాదాలన్నింటినీ పరిష్కరించుకుందామని తెలంగాణ డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఏపీజెన్కో పెడచెవిన పెట్టిందని, దివాలా స్మృతి(ఐబీసీ) కింద చర్యలు తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేసిందని గుర్తుచేసింది. గత సెప్టెంబర్‌లో ఆ కేసును ఉపసంహరించుకున్నా.. వెంటనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని పేర్కొంది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నా.. ఇరు రాష్ట్రాలు మరోసారి సమావేశమై సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇటీవల కేంద్రం చేసిన సూచనతో మళ్లీ చర్చల్లో పాల్గొనడానికి సుముఖత తెలిపినట్టు వెల్లడించింది. ఏపీ భవన్ విభజనకు కొత్త ప్రతిపాదన ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల విభజన విషయంలో ఏపీ ప్రభుత్వం గతంలో చేసిన రెండు ప్రతిపాదనలతో అసమానతలు వస్తాయని, అందువల్ల త్వరలో తామే కొత్త పరిష్కారాన్ని ప్రతిపాదించనున్నామని తెలంగాణ పేర్కొంది. ఏపీకి అభ్యంతరాలు తెలిపాం షీలాభిడే కమిటీ సిఫార్సుల మేరకు షెడ్యూల్–9లోని 68 ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ స్పష్టం చేసింది. అయితే 23 సంస్థల విభజన విషయంలో ఉన్న అభ్యంతరాలను ఏపీకి ఇప్పటికే తెలిపామని.. వాటిపై ఏపీ స్పందన తెలియజేయాల్సి ఉందని పేర్కొంది. గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయండి రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేంద్రాన్ని కోరారు. వర్సిటీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 335 ఎకరాలను గుర్తించిందని.. ములుగులోని యువజన శిక్షణ కేంద్రంలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటుకు 200 ఎకరాలను సైతం గుర్తించిందని ఆయన వివరించారు. దీనికి హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ రూ.849 కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసిందని, ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున ఆర్థిక, విద్యుత్, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణారావు, సునీల్ శర్మ, రజత్‌కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా నేర పరిశోధన
తిరుపతిలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమా వేశంలో ప్రస్తావనకు వచ్చిన 51 సమస్యల్లో 40 సమస్యలు పరిష్కారమయ్యాయి. – అమిత్‌షా ట్వీట్ తిరుపతి నుంచి సాక్షి ప్రతినిధి: నేర పరిశోధన, కోవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు సూచించారు. ముఖ్యమంత్రులు ఈ అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని చెప్పారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేర పరిశోధనను వేగవంతం చేసేందుకు ఐపీసీ, సీఆర్పీసీ, సాక్ష్యాధారాల చట్టాలకు కేంద్రం సవరణలు చేసేందుకు ఉపక్రమించిందని చెప్పారు. ఈ అంశంలో రాష్ట్రాలు.. అధికారులు, నిపుణులతో చర్చించి తగిన ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. యువతను బలిగొంటున్న డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రులు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. న్యాయ విచారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్రాలు ప్రత్యేకంగా ఓ స్వయం ప్రతిపత్తిగల సంస్థను నెలకొల్పాలని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం, జాతీయ రక్షా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారన్నారు. ప్రతి రాష్ట్రం కనీసం స్థానిక భాష సిలబస్‌తో ఒక ఫోరెన్సిక్ కాలేజీని ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా నేర పరిశోధనను వేగవంతం చేసేందుకు అవసరమైన ఫోరెన్సిక్ నిపుణులను తయారు చేయొచ్చన్నారు. బాలలపై నేరాలను ఏమాత్రం ఉపేక్షించకుండా తీవ్రంగా పరిగణించాలని స్పష్టం చేశారు. పోక్సో కేసుల దర్యాప్తునకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చెబుతూ ఆ కేసుల దర్యాప్తును నిర్దేశిత 60 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా ఇంకా ఏమన్నారంటే.. కరోనాపై పోరు దేశ సమాఖ్య వ్యవస్థ ఘనత ► భారత్‌లో ఇప్పటి దాకా 111 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేయడం విజయవంతమైన సమాఖ్య వ్యవస్థ గొప్పదనానికి నిదర్శనం. సహకార సమాఖ్య విధానం ద్వారానే దేశ సమగ్రాభివృద్ధి సాధించగలమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విశ్వసిస్తున్నారు. ► కరోనా మహమ్మారి ప్రబలిన వెంటనే వైద్య, మౌలిక వసతులను అమాంతంగా పెంపొందించుకోవడమే కాకుండా దేశీయంగానే కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి భారత్ తన సమర్థతను నిరూపించుకుంది. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుంది. సీఎం జగన్ ప్రారంభోపన్యాసం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు ఇతర విశిష్ట అతిథుల గౌరవార్థం ఆయన ఆదివారం రాత్రి తిరుపతిలో విందు ఇచ్చారు. అంతకు ముందు సమావేశంలో పుదుచ్చేరి ఇన్చార్జ్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళ సై, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి సీఎం ఆర్.రంగస్వామి, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, తమిళనాడు మంత్రులు పొన్ముడి, శేఖర్‌బాబు, కేరళ మంత్రులు బాలగోపాల్, రాజన్, అండమాన్ నికోబార్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ బీకే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రపూల్ పటేల్, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, పలువురు కేంద్ర అధికారులు, దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గిరిజనుల కృషికి తగిన గుర్తింపు ► దేశ స్వాతంత్య్ర పోరాటం, దేశ అభివృద్ధిలో గిరిజనుల అద్వితీయ భాగస్వామ్యాన్ని తగిన రీతిలో గుర్తించాలి. అందుకే ఏటా నవంబరు 15న ‘జన్ జాతీయ గౌరవ దినోత్సవం’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ► స్వాతంత్య్రోద్యమంలో గిరిజనులు పోషించిన గొప్ప భూమిక, దేశ అభివృద్ధిలో వారి కృషి గురించి రాష్ట్రాలు వారం రోజులపాటు వివిధ వేదికలు, మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించాలి. ► నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని భాషలకు పూర్తి స్థాయిలో గుర్తింపు, గౌరవాన్ని ఇస్తోంది. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు దేశ సాంస్కృతిక వైభవాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. -
విభజన హామీలు నెరవేర్చాలి
దేశ సమగ్ర పురోగతికి కేంద్ర రాష్ట్రాల సంబంధాలతో పాటు, అంతర్రాష్ట్ర సంబంధాల పరిపుష్టి కూడా ఎంతో ముఖ్యం. రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను నిర్ణీత వ్యవధిలో సామరస్య పూర్వకంగా పరిష్కరించే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నిర్ణీత వ్యవధిలో రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యేలా కేంద్ర హోం శాఖ మంత్రి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ఏడేళ్లు దాటినప్పటికీ పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఇప్పటికీ పూర్తిగా అమలు చేయడం లేదు. దాంతో రాష్ట్రం మరింతగా నష్టపోతోంది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని విభజన చట్టం హామీలను అమలు చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతిలో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన అనేక కీలక అంశాలపై కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజనకు సంబంధించి అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని చెప్పారు. దాంతో రెండు రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపై కూడా అవి ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా ఏపీ ఎంతగానో నష్టపోతున్న దృష్ట్యా పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అమిత్ షాకు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే ► రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ మేరకు కేంద్రమే ఈ ప్రాజెక్టును పూర్తిగా కట్టాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు పనుల్లో జాప్యం, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంలో 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉండడం వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది. ► సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ), సవరించిన వ్యయ కమిటీ (ఆర్సీసీ) వంటి పలు కేంద్ర కమిటీలు కూడా పెరిగిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని అనుమతించాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2013–14 నాటి వ్యయం అంచనా మేరకే నిధులిస్తామని, మిగిలిన వనరులను రాష్ట్రమే స్వయంగా సమకూర్చుకోవాలని కేంద్రం చెబుతోంది. ఇది విభజన చట్టంలో ఇచ్చిన హామీని నేరుగా ఉల్లంఘించడమే. ► ప్రాజెక్టులో తాగునీటి కాంపొనెంట్‌కు నిధులు విడుదల చేయకుండా తప్పుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఏ జాతీయ సాగునీటి ప్రాజెక్టులో అయినా, సాగునీటి సరఫరాతో పాటు, తాగు నీటి సరఫరా పనులను కలిపి చూస్తారు. ఈ రెండింటినీ కలిపే.. ప్రాజెక్టు ఖర్చులను నిర్ధారిస్తారు. ► అయితే ఇక్కడ చోటుచేసుకుంటున్న దురదృష్టకర పరిణామాల వల్ల రాష్ట్రానికి జీవనాడి, ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలో పడేసే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల పెరిగిన ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా నిధులు మంజూరు చేయాలి. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యేందుకు పూర్తి నిధులను కేంద్రం మంజూరు చేసి విడుదల చేయాలి. రెవెన్యూ లోటు కేంద్రమే పూడ్చాలి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ► రాష్ట్ర విభజన జరిగాక మొదటి ఆర్థిక సంవత్సరం.. 13వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు జరుగుతున్న కాల వ్యవధిలో ఉంది. ఆ మేరకు నాటి ప్రధాని రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజించిన తేదీ (అపాయింటెడ్ డేట్), 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుకు మధ్య కాలంలో ఉత్పన్నమయ్యే రీసోర్స్ గ్యాప్‌ను, ఒక పరిహారంగా 2014–15 కేంద్ర బడ్జెట్ ద్వారా నిధులు ఇచ్చి పూడుస్తామని స్పష్టంగా చెప్పారు. ► రీసోర్స్ గ్యాప్ అన్న పదాన్ని ఎక్కడా నిర్వచించనప్పటికీ, అది రెవెన్యూ లోటు అని స్పష్టంగా చెప్పవచ్చు. 2014–15కు సంబంధించి కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లు. మరోవైపు నిధుల కొరత వల్ల కీలకమైన ఆర్థిక లావాదేవీలు కూడా రాష్ట్రం పూర్తి చేయలేకపోయింది. నిజానికి అవి నాడు కేంద్రం స్పష్టంగా ఇచ్చిన హామీ రీసోర్స్ గ్యాప్ చెల్లింపులకు సంబంధించినవే. ► ఆ నేపథ్యంలో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర మొత్తం రెవెన్యూ లోటు (రీసోర్స్ గ్యాప్) ఏకంగా రూ.22,948.76 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘ప్రామాణిక వ్యయం’ (స్టాండర్డైజ్డ్ ఎక్స్పెండీచర్) అన్న విధానాన్ని తీసుకువచ్చింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.4,117.89 కోట్ల లోటు మాత్రమే పూడ్చగలమని తెలిపింది. దాంతో నాడు కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల ఆ లోటు అలాగే మిగిలిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దష్ట్యా ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలి. విద్యుత్ బకాయిలు రూ.6,112 కోట్లు సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్ల విందులో వైఎస్ జగన్‌తో ముచ్చటిస్తున్న అమిత్ షా ► రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల చెల్లింపు అంశం అపరిష్కృతంగా ఉంది. తెలంగాణలో విద్యుత్ పంపిణీకి సంబంధించి ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ► రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్కో)కు ఆ మేరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణ డిస్కమ్‌లు ఆ మొత్తం చెల్లించలేదు. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయలేమని ఏపీ జెన్కో స్పష్టం చేసింది. ► అయినప్పటికీ కేంద్ర విద్యుత్ శాఖ ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకుని, తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాల్సిందేనని నిర్దేశించింది. దీంతో అనివార్యంగా ఏపీ జె¯న్కో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల పాటు కొంత మొత్తం చెల్లించగా, ఇంకా రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ► ఆ బకాయిలు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఒక వైఖరి తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ (ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్ డీమెర్జర్ ప్లాన్) ఇంకా తేలలేదు కాబట్టి, అవి పూర్తయిన తర్వాత ఈ బకాయిల గురించి ఆలోచిస్తామంటూ ముడి పెట్టింది. మూడేళ్ల పాటు కొంత మొత్తం చెల్లించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ మెలిక పెట్టింది. అది పూర్తిగా అసమంజస నిర్ణయం. ► బకాయిలు రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఏపీ జెన్కో కూడా సతమతమతుండటం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. నాడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఏపీ జెన్కో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, సమస్యను పరిష్కరించాలి. ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందే పుదుచ్చేరి ఇన్చార్జి గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళి సైకి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ ► విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాల్లో ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ ఒక ప్రధాన అంశం. ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ, నిబంధనతోనే రాష్ట్రాన్ని విభజించారు. అయితే ఏళ్లు గడిచినా, ఎంతో కీలకమైనా ఆ హామీని మాత్రం ఇప్పటికీ నెరవేర్చలేదు. ► విభజన చట్టంలోని 8వ షెడ్యూల్ ప్రకారం, 8 మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, జాతీయ ప్రాధాన్యం ఉన్న 11 సంస్థలను పూర్తి స్థాయిలో 2024 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉంది. ► బుందేల్‌ఖండ్‌కు ఇచ్చిన విధంగా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. అత్యంత అల్పంగా దీన్ని అమలు చేశారు. ► షెడ్యూల్ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించి చట్టపరంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ అంశం ఉంది. వాటి విలువ దాదాపు రూ.1,42,601 కోట్లు. అయితే ఆయా సంస్థలను విభజన చట్టంలో ప్రస్తావించకపోవడంతో ఆస్తుల పంపిణీ జరగక ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దష్ట్యా వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వ అత్యవసర జోక్యం తప్పనిసరి. కర్ణాటక సీఎం బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగస్వామికి జ్ఞాపికలు అందజేస్తున్న ముఖ్యమంత్రి కోరినప్పుడల్లా నీరిస్తున్నా.. ► 1976, 1977, 1983 నాటి అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు పూర్వ ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిలో తమకు కేటాయించిన నీటిలో 5 టీఎంసీల చొప్పున చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం కేటాయించాల్సి ఉంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల సహకారం లేకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం తమిళనాడు ప్రభుత్వం కోరినప్పుడల్లా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం ‘తెలుగు గంగ’ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు సరఫరా చేస్తూనే ఉంది. ► అయితే ఇందు కోసం తగిన వసతుల కల్పన, నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణకు సంబంధించి పదేళ్లుగా ఆ రాష్ట్రం నుంచి రూ.338.48 కోట్లు రావాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వీలైనంత త్వరగా ఆ బకాయిలు చెల్లించేలా చూడాలి. ► పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కుప్పం ప్రజలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. పాలారు ప్రాజెక్టు ద్వారా కేవలం 0.6 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నాం. మరోవైపు తమిళనాడు అవసరాల కోసం ఏటా దాదాపు 10 టీఎంసీల నీటిని పంపుతున్నాం. ఇలాంటి నేపథ్యంలో పాలారు నిర్మాణానికి కేంద్రం సహకరించాలి. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ పటేల్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ జోషికి జ్ఞాపికలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నికర రుణ పరిమితిలో కోత అన్యాయం ► ఈ ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి నికర రుణ పరిమితి (ఎన్బీసీ)ని రూ.42,472 కోట్లుగా నిర్థారించింది. అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ద్రవ్య బాధ్యత బడ్జెట్ యాజమాన్యం (ఎఫ్ఆర్బీఎం)కు అనుగుణంగా ఆ మొత్తం నిర్థారించారు. ► అయితే గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారని చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ... ఈ ఏడాది నిర్ధారించిన నికర రుణ పరిమితిలో రూ.19,923.24 కోట్లు సర్దుబాటు చేసే విధంగా రుణ పరిమితిలో ఆ మేరకు కోత విధించింది. గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఇలా చేయడం సరి కాదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించ లేదు. పైగా నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించింది. ► 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది ఆడిట్ ఖాతాల వివరాలను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడంతో పాటు, ఆ వివరాలను 2018 ఏప్రిల్ 6 నాటికి అందరికీ (పబ్లిక్) అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడే ఒక కీలక ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పరిమితికి మించి రుణం సేకరించిన విషయం అప్పటికే తేటతెల్లమైనప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదు? దాన్ని కట్టడి చేస్తూ ఆ తర్వాత ఏడాది అంటే 2018–19లోనే రుణ సేకరణలో పరిమితి ఎందుకు విధించలేదు? ► ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. పరిమితికి మించి అంటూ కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తోంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవి గ్రాంట్ కాదు. వివిధ అవసరాల కోసం ప్రభుత్వం సేకరిస్తున్న రుణాలు అవి. ఈ రుణాలను సక్రమంగా తీరుస్తోంది కూడా. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. ► గత ప్రభుత్వం తమ ఐదేళ్ల పాలనలో అధిక మొత్తంలో రుణాలు సేకరించిందంటూ.. ఊహించని విధంగా కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. మరోవైపు ఇప్పటికే కోవిడ్ మహమ్మారితో ప్రభుత్వం ఆర్థికంగా సతమతమవుతోంది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి చైర్మన్‌గా కేంద్ర హోంమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలి. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ముచ్చటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరింత మంది లబ్ధిదారులకు రేషన్ అందించాలి ► రేషన్ బియ్యం కేటాయింపులో హేతు బద్ధత లేని రీతిలో కేంద్రం నిర్ణయాలు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో రాష్ట్రాల్లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో అసమానతలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 2.68 కోట్ల మందికి రేషన్ అందుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 61 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41 శాతం మందికి మాత్రమే రేషన్ సరుకులు అందుతున్నాయి. ► నిజానికి ఇది ఏ మాత్రం సరికాదు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మందిని ప్రజా పంపిణీ వ్యవస్థలోకి తీసుకు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ కంటే ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇక్కడి కంటే కనీసం 10 శాతం ఎక్కువ మందికి రేషన్ సరుకులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి. అక్కడ మాదిరిగా టయర్–1 నగరాలు ఏపీలో లేవు. ► జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో కేంద్రం గుర్తించిన లబ్ధిదారుల (పీడీఎస్ లబ్ధిదారులు)కు తోడు మరో 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రేషన్ సరుకులు ఇస్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. రాష్ట్ర జనాభా, ఇక్కడి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పీడీఎస్‌లో మరింత మంది లబ్ధిదారులను చేరుస్తూ, ఆ గణాంకాలు సవరించాలి. విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఆర్థిక సంవత్సరం 2015–16లో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అది కేవలం రూ.8,979 మాత్రమే. ఈ లెక్కన విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో నష్టపోయిందో చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రుణ పరిమితిలో కోత ఎలా విధిస్తారు? అనాడే కేంద్ర ఆర్థిక శాఖ ఎందుకు అభ్యంతరం తెలుప లేదు? 2018–19 లోనే రుణ పరిమితిలో ఎందుకు కోత విధించ లేదు? ప్రస్తుత ప్రభుత్వంలో రుణ పరిమితిలో కోత విధిస్తామనడం అన్యాయం కాదా? -
తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
-
సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజనకు సంబంధించి నెల రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని అమిత్ షా ఆదేశించారు. ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు స్థలం మార్పును నోటిషికేషన్ ద్వారా ప్రకటించాలన్న సీఎం జగన్ విజ్ఞప్తికి అమిత్ షా అంగీకరించారు. (చదవండి: ‘విభజనతో భారీగా నష్టపోయాం.. ఏడేళ్లు గడిచినా హమీలు అమలు కాలేదు’) అలానే ఏపీ ప్రస్తావించిన గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపై అమిత్ షా స్పందిస్తూ.. భూమిని ఇస్తే.. ఖర్చు తామే భరించి సెంటర్‌ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
‘విభజనతో భారీగా నష్టపోయాం.. ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కాలేదు’
తిరుపతి: ‘‘విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలి. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి’’ అని తిరుపతిలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే. రీసోర్స్ గ్యాప్‌నూ భర్తీచేయలేదు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించండి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వండి’’ అన్నారు. . ‘‘రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదు. వెంటనే సరవణలు చేయాలి’’ అని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. ►దేశ సమగ్ర పురోగతికి కేంద్రం–రాష్ట్రాలతో పాటు, అంతర్ రాష్ట్ర సంబంధాల పరిపుష్టి కూడా ఎంతో ముఖ్యం.రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను నిర్ణీత వ్యవధిలో సామరస్యపూర్వకంగా పరిష్కరించే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ►2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణతో పాటు, విభజిత ఆంధ్రప్రదేశ్ మధ్య విభజనకు సంబంధించి ఇప్పటికీ అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. దీంతో పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీర్ఘకాలంగా అనేక అంశాలు అలాగే అపరిష్కృతంగా ఉండడం వల్ల రెండు రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపైనా అవి ప్రభావం చూపేలా ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ సమావేశం దృష్టికి తీసుకువస్తున్నాను. ►విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజన తర్వాత, తొలి ఆర్థిక సంవత్సరం 2015–16లో.. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం కేవలం రూ.8,979 మాత్రమే. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో నష్టపోయింది అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. ►పార్లమెంటులో రాష్ట్ర పునర్విభజన బిల్లు–2014 ఆమోదం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు పలు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిని నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు పూరై్తనా ఇప్పటికీ అనేక హామీలను అమలు చేయకపోవడంతో, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అవి ఏవంటే.. పోలవరం నిర్మాణానికి పూర్తి నిధులను మంజూరు చేయాలి పోలవరం ప్రాజెక్టు... బహుళార్థసాధక సాగునీటి ప్రాజెక్టు. రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ మేరకు కేంద్రమే ఈ ప్రాజెక్టును పూర్తిగా కట్టాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు పనుల్లో జాప్యం, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంలో 2013 నాటి చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉండడం వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది. సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ), సవరించిన వ్యయ కమిటీ (ఆర్సీసీ) వంటి పలు కేంద్ర కమిటీలు కూడా పెరిగిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని అనుమతించాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2013–14 నాటి వ్యయం అంచనా మేరకే నిధులిస్తామని, మిగిలిన వనరులను రాష్ట్రమే స్వయంగా సమకూర్చుకోవాలని కేంద్రం చెబుతోంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇది విభజన చట్టంలో ఇచ్చిన హామీని నేరుగా ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదు. అంతే కాకుండా ప్రాజెక్టులో డ్రింకింగ్ వాటర్ కాంపొనెంట్‌కు నిధుల విడుదల చేయకుండా తప్పుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఏ జాతీయ సాగునీటి ప్రాజెక్టులో అయినా, సాగునీటి సరఫరాతో పాటు, తాగు నీటి సరఫరా పనులను కలిపి చూస్తారు. ఈ రెండింటినీ కలిపే ప్రాజెక్టు ఖర్చులను నిర్ధారిస్తారు. అయితే ఇక్కడ చోటుచేసుకుంటున్న దురదృష్టకర పరిణామాలు, రాష్ట్రానికి జీవనాడి, ప్రజల చిరకాల స్వప్నం అయినటు వంటి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలో పడవేసే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల పెరిగిన ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా నిధులు మంజూరు చేస్తూ, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి నిధులను కేంద్రం మంజూరు చేసి, విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రిసోర్స్ గ్యాప్ సమస్యను త్వరగా పరిష్కరించాలి రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన మరో హామీని కూడా మరోసారి మీకు గుర్తుచేస్తున్నాను. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరం... 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు జరుగుతున్న కాల వ్యవధిలో ఉంది. ఆ మేరకు నాటి ప్రధాని రాజ్యసభలో ఫిబ్రవరి 20, 2014న స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజించిన తేదీ ( అపాయింటెడ్ డేట్), మరియు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలుకు మధ్య కాలంలో ఉత్పన్నమయ్యే రీసోర్స్ గ్యాప్‌ను, ఒక పరిహారంగా 2014–15 కేంద్ర బడ్జెట్‌ద్వారా నిధులు ఇస్తామని, ఆ గ్యాప్‌ను పూడుస్తామని స్పష్టంగా చెప్పారు. రీసోర్స్ గ్యాప్ అన్న పదాన్ని ఎక్కడా నిర్వచించనప్పటికీ, అది రెవెన్యూ లోటు అని స్పష్టంగా చెప్పవచ్చు. 2014–15కు సంబంధించి కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2, 2014 నుంచి మార్చి 31, 2015 వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లు. మరోవైపు నిధుల కొరత వల్ల కీలకమైన ఆర్థిక లావాదేవీలు కూడా రాష్ట్రం పూర్తి చేయలేకపోయింది. నిజానికి అవి నాడు కేంద్రం స్పష్టంగా ఇచ్చిన హామీ రీసోర్స్ గ్యాప్ చెల్లింపులకు సంబంధించినవే. ఆ నేపథ్యంలో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర మొత్తం రెవెన్యూ లోటు (రీసోర్స్ గ్యాప్) ఏకంగా రూ.22,948.76 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘ప్రామాణిక వ్యయం’ (స్టాండడైజ్జ్ ఎక్స్పెండీచర్) అన్న విధానాన్ని తీసుకువచ్చింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.4,117.89 కోట్ల లోటు మాత్రమే పూడ్చగలమని తెలియజేసింది. దీంతో కేంద్రం నాడు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల ఆ లోటు అలాగే మిగిలిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను. విద్యుత్ బకాయిల విషయంలో కేంద్రం చొరవ చూపాలి రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న మరో అపరిష్కృత సమస్య విద్యుత్ బకాయిల చెల్లింపు. తెలంగాణలో విద్యుత్ పంపిణీకి సంబంధించి ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2, 2014 నుంచి జూన్ 10, 2017 వరకు ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్కో)కు ఆ మేరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణ డిస్కమ్‌లు ఆ మొత్తం చెల్లించలేదు. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయలేమని ఏపీ జెన్కో స్పష్టం చేసింది. అయినప్పటికీ కేంద్ర విద్యుత్ శాఖ ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకుని, తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాల్సిందే అని నిర్దేశించింది. దీంతో అనివార్యంగా ఏపీ జెన్కో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లపాటు కొంత మొత్తం చెల్లించగా, ఇంకా రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఆ బకాయిలు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఒక వైఖరి తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ (ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్ డీమెర్జర్ ప్లాన్) ఇంకా తేలలేదు కాబట్టి, అవి పూర్తైన తర్వాత ఈ బకాయిల గురించి ఆలోచిస్తామంటూ ముడి పెట్టింది. మూడేళ్ల పాటు కొంత మొత్తం చెల్లించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ మెలిక పెట్టింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పూర్తిగా అసమంజసం. బకాయిలు రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఏపీ జెన్కో కూడా సతమతమవుతోంది. ఇది ఒక విధంగా విద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతోంది. నిజానికి నాడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఏపీ జెన్కో తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవే కాకుండా విభజనకు సంబంధించి అనేక అంశాలు ఇంకా అమలు చేయాల్సి ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని తప్పకుండా ప్రస్తావించాల్సి ఉంది. అదే ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’. ఆ హామీ, నిబంధనతోనే రాష్ట్ర విభజన జరిగింది. అయితే ఏళ్లు గడిచినా, ఎంతో కీలకమైనా ఆ హామీని మాత్రం ఇప్పటికీ నెరవేర్చలేదు. అదే విధంగా విభజన చట్టంలోని 8వ షెడ్యూల్ ప్రకారం, 8 మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, జాతీయ ప్రాధాన్యం ఉన్న 11 సంస్థలను పూర్తి స్థాయిలో 2024 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకా, బుందేల్‌ఖండ్‌లో ఇచ్చిన విధంగా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. అత్యంత అల్పంగా దీన్ని అమలు చేశారు. ఇక షెడ్యూల్ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించి చట్టపరంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ. వాటి విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా అంచనా. అయితే ఆయా సంస్థలను విభజన చట్టంలో ప్రస్తావించకపోవడం వల్ల, ఆస్తుల పంపిణీ జరగకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరుగుతోంది. అందువల్ల వీటన్నింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ అత్యవసర జోక్యం తప్పనిసరి. జల వనరుల వినియోగం... రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన మరో సమస్య.. అంతర్రాష్ట్ర, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉత్పన్నమవుతున్న జలవివాదాలు. ఆ కోవలో ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ సమస్యను మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. అదే తెలుగు గంగ ప్రాజెక్టు. 1976, 1977, 1983 నాటి అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు, పూర్వ ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిలో తమకు కేటాయించిన నీటిలో 5 టీఎంసీల చొప్పున నాటి మద్రాస్ ఇప్పటి చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం కేటాయించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో ఇతర రాష్ట్రాల సహకారం లేకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం తమ పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం కోరినప్పుడల్లా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం కృష్ణా నీరు సరఫరా చేస్తూనే ఉంది. అయితే ఇందు కోసం తగిన వసతుల కల్పన, నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణకు సంబంధించి గత 10 ఏళ్లుగా ఆ రాష్ట్రం నుంచి రూ.338.48 కోట్లు రావాల్సి ఉంది. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా ఆ బకాయిలు చెల్లించేలా చూడాలని కోరుతున్నాను. పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం కాలడ్డుతోందని, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కుప్పం ప్రజలకు తాగునీరు అందుతుందని, ఈ విషయంలో తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పాలారు ప్రాజెక్టు ద్వారా కేవలం 0.6 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేస్తున్నాం. మరోవైపు తమిళనాడు అవసరాలకోసం ఏటా దాదాపు 10 టీఎంసీల నీటిని పంతున్నాం. ఇలాంటి నేపథ్యంలో పాలారు నిర్మాణానికి సహకరించేలా చూడాలని కేంద్రాన్ని కోరుతున్నాను. ఎన్సీబీలో కోత విధించడం సరికాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత సంకట స్థితిలోకి తీసుకుపోయే అవకాశం ఉన్న మరో అంశాన్ని ఈ వేదికపై అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి నికర రుణ పరిమితి (ఎన్బీసీ)ని రూ.42,472 కోట్లుగా నిర్థారించడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ద్రవ్య బాధ్యత బడ్జెట్ యాజమాన్యం (ఎఫ్ఆర్బీఎం)కు అనుగుణంగా ఆ మొత్తం నిర్థారించారు. అయితే గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారన్న కేంద్ర ఆర్థిక శాఖ, ఈ ఏడాది నిర్ధారించిన నికర రుణ పరిమితి (ఎన్బీసీ)లో రూ.19,923.24 కోట్లు సర్దుబాటు చేసే విధంగా రుణ పరిమితిలో ఆ మేరకు కోత విధించింది. గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఎన్బీసీలో కోత విధించడం సరి కాదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించకపోగా, నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించింది. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది ఆడిట్ ఖాతాల వివరాలను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడంతో పాటు, ఆ వివరాలను ఏప్రిల్ 6, 2018 నాటికి అందరికీ (పబ్లిక్) అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడే ఒక కీలకప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పరిమితికి మించి రుణం సేకరించిన విషయం అప్పటికే తేటతెల్లం అయిన నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదు?. దాన్ని కట్టడి చేస్తూ ఆ తర్వాత ఏడాది, అంటే 2018–19లోనే రుణ సేకరణలో పరిమితి ఎందుకు విధించలేదు?. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. పరిమితికి మించి అంటూ కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తోంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవి గ్రాంట్‌కాదు. వివిధ అవసరాల కోసం ప్రభుత్వం సేకరిస్తున్న రుణాల ఇవి. ఈ రుణాలను సక్రమంగా తీరుస్తోంది కూడా. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. గత ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలనలో అధిక మొత్తంలో రుణాలు సేకరించిందంటూ.. ఊహించని విధంగా కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. మరోవైపు ఇప్పటికే కోవిడ్ మహమ్మారితో ప్రభుత్వం సతమతమవుతోంది. అందువల్ల ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా కేంద్ర హోంమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను. రేషన్ బియ్యంలో కేటాయింపులో హేతు బద్దత లేని కేంద్ర నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న మరో సమస్య రేషన్ బియ్యం కేటాయింపులో హేతు బద్ధత లేని రీతిలో కేంద్రం నిర్ణయాలు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో రాష్ట్రాల్లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో అసమానతలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ద్వారా 2.68 కోట్ల మందికి రేషన్ అందుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 61 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41 శాతం మందికి మాత్రమే రేషన్ సరుకులు అందుతున్నాయి. నిజానికి ఇది ఏ మాత్రం సరికాదు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మందిని ప్రజా పంపిణీ వ్యవస్థలోకి తీసుకు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ కంటే ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలలో కూడా ఇక్కడి కంటే కనీసం 10 శాతం ఎక్కువ మందికి రేషన్ సరుకులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి. అదే విధంగా అక్కడ మాదిరిగా టయర్–1 నగరాలు ఏపీలో లేవు. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో కేంద్రం గుర్తించిన లబ్ధిదారుల (పీడీఎస్ లబ్ధిదారులు)కు తోడు మరో 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రేషన్ సరుకులు ఇస్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. అందువల్ల రాష్ట్ర జనాభా, ఇక్కడి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పీడీఎస్‌లో మరింత మంది లబ్ధిదారులను చేరుస్తూ, ఆ గణాంకాలు సవరించాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల స్థితిగతులను అర్థం చేసుకుని పరిస్థితులు మారేలా తగిన సిఫార్సులు చేయాలని గౌరవ ఎస్‌జడ్‌సీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా అంశాలవారీగా జరిగే చర్చల్లో రాష్ట్రానికి సంబంధించి విస్తృతస్థాయిలో ప్రస్తావన కొనసాగాలని ఆశిస్తున్నాను. ఇంకా నిర్ణీత వ్యవధిలో రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యేలా స్వీయ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిగారిని కోరుతున్నాను. ఈ సమావేశానికి వేదికగా రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు హోం మంత్రి అమిత్ షాకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరిగింది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సహా లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. సమావేశంలో విలువైన సమాచారాన్ని, తగిన సూచనలు, సలహాలు అందించిన కర్ణాటక ముఖ్యమంత్రి గారితో పాటు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చదవండి: వినతి కోసం మహిళ యత్నం.. కాన్వాయ్ ఆపిన సీఎం జగన్ సీఎం జగన్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు -
వినతి కోసం మహిళ యత్నం.. కాన్వాయ్ ఆపిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: సౌత్‌జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడ నుంచి తాజ్ హోటల్‌కు పయనమైన సమయంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విజయకుమారి సీఎం కాన్వాయ్ వద్దకు వచ్చి సహాయం చేయాలని కోరింది. ఇది గమనించిన సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌ను ఆపి ఓఎస్డీని పంపి ఆమె సమస్య తెలుసుకోవాలని చెప్పారు. అనారోగ్యం, వయసు భారం పెరుగుతండటంతో కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా ఉద్యోగం కావాలని విజయకుమారి కోరింది. -
సదరన్ జోనల్ కౌన్సిల్‌కు మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఆదివారం తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బదులు రాష్ట్రం తరఫున ప్రతినిధిగా హోంమంత్రి ఎం.మహమూద్ అలీ హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిసోమేశ్కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7.30 గంటల వరకు జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళినాడు, కేరళ ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్లు పాల్గొననున్నారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య సంబంధాలు, సహకార సమాఖ్య విధానం అమలు, రాష్ట్రాల మధ్య వివాదాలు, సమస్యలను ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు, నీళ్ల పంపకాలు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలు, విద్యుత్ బకాయిలు వంటి అంశాలను ఇరు రాష్ట్రాలు ఈ సమావేశంలో ప్రస్తావించి తమ వాదనలు వినిపించే అవకాశముంది. -
అగ్రవర్ణ పేదలకు అండగా..
-
రాష్ట్ర కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలి: సీఎం జగన్
-
రాష్ట్ర కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: నవంబర్ 14న తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సదరన్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దానివల్ల సమావేశంలో చర్చ జరిగి మేలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలు, రెవిన్యూలోటు, రేషన్ బియ్యంలో హేతుబద్ధతలేని రీతిలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిల అంశాలపై చర్చించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఎఫ్డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సదరన్‌జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల మీద సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై వివరాలు తయారుచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు. కౌన్సిల్ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే.. వాటిపై కూడా తగిన రీతిలో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ అతిథ్యమిస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాండిచ్చేరి, అండమాన్నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం.. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ (స్టేట్ రీఆర్గనైజేషన్) ఎల్ ప్రేమచంద్రారెడ్డి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్ కుమార్, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎ రవిశంకర్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (చూడముచ్చటగా ఒకే రీతిలో.. ఇక ప్రభుత్వ భవనాలకు ఏకీకృత డిజైన్లు)