సమర్థంగా నేర పరిశోధన | Amit Shah suggests states on second dose vaccination should be accelerated | Sakshi
Sakshi News home page

సమర్థంగా నేర పరిశోధన

Published Mon, Nov 15 2021 2:22 AM | Last Updated on Mon, Nov 15 2021 8:11 AM

Amit Shah suggests states on second dose vaccination should be accelerated - Sakshi

తిరుపతిలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమా వేశంలో ప్రస్తావనకు వచ్చిన 51 సమస్యల్లో 40 సమస్యలు పరిష్కారమయ్యాయి. 
– అమిత్‌షా ట్వీట్‌

తిరుపతి నుంచి సాక్షి ప్రతినిధి: నేర పరిశోధన, కోవిడ్‌ రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రాష్ట్రాలకు సూచించారు. ముఖ్యమంత్రులు ఈ అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని చెప్పారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేర పరిశోధనను వేగవంతం చేసేందుకు ఐపీసీ, సీఆర్‌పీసీ, సాక్ష్యాధారాల చట్టాలకు కేంద్రం సవరణలు చేసేందుకు ఉపక్రమించిందని చెప్పారు. ఈ అంశంలో రాష్ట్రాలు.. అధికారులు, నిపుణులతో చర్చించి తగిన ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. యువతను బలిగొంటున్న డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రులు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

న్యాయ విచారణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్రాలు ప్రత్యేకంగా ఓ స్వయం ప్రతిపత్తిగల సంస్థను నెలకొల్పాలని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఫోరెన్సిక్‌ విశ్వవిద్యాలయం, జాతీయ రక్షా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారన్నారు. ప్రతి రాష్ట్రం కనీసం స్థానిక భాష సిలబస్‌తో ఒక ఫోరెన్సిక్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా నేర పరిశోధనను వేగవంతం చేసేందుకు అవసరమైన ఫోరెన్సిక్‌ నిపుణులను తయారు చేయొచ్చన్నారు. బాలలపై నేరాలను ఏమాత్రం ఉపేక్షించకుండా తీవ్రంగా పరిగణించాలని స్పష్టం చేశారు. పోక్సో కేసుల దర్యాప్తునకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చెబుతూ ఆ కేసుల దర్యాప్తును నిర్దేశిత 60 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అమిత్‌ షా ఇంకా ఏమన్నారంటే..


కరోనాపై పోరు దేశ సమాఖ్య వ్యవస్థ ఘనత
► భారత్‌లో ఇప్పటి దాకా 111 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేయడం విజయవంతమైన సమాఖ్య వ్యవస్థ గొప్పదనానికి నిదర్శనం. సహకార సమాఖ్య విధానం ద్వారానే దేశ సమగ్రాభివృద్ధి సాధించగలమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విశ్వసిస్తున్నారు. 
► కరోనా మహమ్మారి ప్రబలిన వెంటనే వైద్య, మౌలిక వసతులను అమాంతంగా పెంపొందించుకోవడమే కాకుండా దేశీయంగానే కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి భారత్‌ తన సమర్థతను నిరూపించుకుంది.  వ్యాక్సినేషన్‌తో పాటు కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుంది.   

సీఎం జగన్‌ ప్రారంభోపన్యాసం
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు ఇతర విశిష్ట అతిథుల గౌరవార్థం ఆయన ఆదివారం రాత్రి తిరుపతిలో విందు ఇచ్చారు. అంతకు ముందు సమావేశంలో పుదుచ్చేరి ఇన్‌చార్జ్‌ గవర్నర్, తెలంగాణ గవర్నర్‌ తమిళ సై, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై, పుదుచ్చేరి సీఎం ఆర్‌.రంగస్వామి, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, తమిళనాడు మంత్రులు పొన్‌ముడి, శేఖర్‌బాబు, కేరళ మంత్రులు బాలగోపాల్, రాజన్, అండమాన్‌ నికోబార్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ బీకే జోషి, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రపూల్‌ పటేల్, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, పలువురు కేంద్ర అధికారులు, దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గిరిజనుల కృషికి తగిన గుర్తింపు
► దేశ స్వాతంత్య్ర పోరాటం, దేశ అభివృద్ధిలో గిరిజనుల అద్వితీయ భాగస్వామ్యాన్ని తగిన రీతిలో గుర్తించాలి. అందుకే ఏటా నవంబరు 15న ‘జన్‌ జాతీయ గౌరవ దినోత్సవం’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
► స్వాతంత్య్రోద్యమంలో గిరిజనులు పోషించిన గొప్ప భూమిక, దేశ అభివృద్ధిలో వారి కృషి గురించి రాష్ట్రాలు వారం రోజులపాటు వివిధ వేదికలు, మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించాలి. 
► నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని భాషలకు పూర్తి స్థాయిలో గుర్తింపు, గౌరవాన్ని ఇస్తోంది. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు దేశ సాంస్కృతిక వైభవాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement