‘విభజనతో భారీగా నష్టపోయాం.. ఏడేళ్లు​ గడిచినా హామీలు అమలు కాలేదు’ | CM YS Jagan Speech At Southern Zonal Council Meeting Tirupati | Sakshi
Sakshi News home page

‘విభజనతో భారీగా నష్టపోయాం.. ఏడేళ్లు​ గడిచినా హామీలు అమలు కాలేదు’

Published Sun, Nov 14 2021 5:29 PM | Last Updated on Sun, Nov 14 2021 8:03 PM

CM YS Jagan Speech At Southern Zonal Council Meeting Tirupati - Sakshi

తిరుపతి: ‘‘విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలి. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి’’ అని తిరుపతిలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 

సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే. రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీచేయలేదు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించండి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వండి’’ అన్నారు. .

‘‘రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రాల్లో రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదు. వెంటనే సరవణలు చేయాలి’’ అని తెలిపారు. 

ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను సీఎం జగన్‌ ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ..
►దేశ సమగ్ర పురోగతికి కేంద్రం–రాష్ట్రాలతో పాటు, అంతర్‌ రాష్ట్ర సంబంధాల పరిపుష్టి కూడా ఎంతో ముఖ్యం.రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను నిర్ణీత వ్యవధిలో సామరస్యపూర్వకంగా పరిష్కరించే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. 

►2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణతో పాటు, విభజిత ఆంధ్రప్రదేశ్‌ మధ్య విభజనకు సంబంధించి ఇప్పటికీ అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. దీంతో పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీర్ఘకాలంగా అనేక అంశాలు అలాగే అపరిష్కృతంగా ఉండడం వల్ల రెండు రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపైనా అవి ప్రభావం చూపేలా ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ సమావేశం దృష్టికి తీసుకువస్తున్నాను. 

►విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజన తర్వాత, తొలి ఆర్థిక సంవత్సరం 2015–16లో.. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం కేవలం రూ.8,979 మాత్రమే. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఏ స్థాయిలో నష్టపోయింది అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. 

►పార్లమెంటులో రాష్ట్ర పునర్విభజన బిల్లు–2014 ఆమోదం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు  పలు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిని నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు పూరై్తనా ఇప్పటికీ అనేక హామీలను అమలు చేయకపోవడంతో, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఎంతో నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అవి ఏవంటే.. 

పోలవరం నిర్మాణానికి పూర్తి నిధులను మంజూరు చేయాలి
పోలవరం ప్రాజెక్టు... బహుళార్థసాధక సాగునీటి ప్రాజెక్టు. రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ మేరకు కేంద్రమే ఈ ప్రాజెక్టును పూర్తిగా కట్టాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు పనుల్లో జాప్యం, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంలో 2013 నాటి చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉండడం వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది. 

సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ), సవరించిన వ్యయ కమిటీ (ఆర్‌సీసీ) వంటి పలు కేంద్ర కమిటీలు కూడా పెరిగిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని అనుమతించాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2013–14 నాటి వ్యయం అంచనా మేరకే నిధులిస్తామని, మిగిలిన వనరులను రాష్ట్రమే స్వయంగా సమకూర్చుకోవాలని కేంద్రం చెబుతోంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు.
 
ఇది విభజన చట్టంలో ఇచ్చిన హామీని నేరుగా ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదు. అంతే కాకుండా ప్రాజెక్టులో డ్రింకింగ్‌ వాటర్‌ కాంపొనెంట్‌కు నిధుల విడుదల చేయకుండా తప్పుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఏ జాతీయ సాగునీటి ప్రాజెక్టులో అయినా, సాగునీటి సరఫరాతో పాటు, తాగు నీటి సరఫరా పనులను కలిపి చూస్తారు. ఈ రెండింటినీ కలిపే ప్రాజెక్టు ఖర్చులను నిర్ధారిస్తారు.

అయితే ఇక్కడ చోటుచేసుకుంటున్న దురదృష్టకర పరిణామాలు, రాష్ట్రానికి జీవనాడి, ప్రజల చిరకాల స్వప్నం అయినటు వంటి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలో పడవేసే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల పెరిగిన ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా నిధులు మంజూరు చేస్తూ, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి నిధులను కేంద్రం మంజూరు చేసి, విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

రిసోర్స్‌ గ్యాప్‌ సమస్యను త్వరగా పరిష్కరించాలి
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన మరో హామీని కూడా మరోసారి మీకు గుర్తుచేస్తున్నాను. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరం... 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు జరుగుతున్న కాల వ్యవధిలో ఉంది. 

ఆ మేరకు నాటి ప్రధాని రాజ్యసభలో ఫిబ్రవరి 20, 2014న స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజించిన తేదీ ( అపాయింటెడ్‌ డేట్‌), మరియు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలుకు మధ్య కాలంలో ఉత్పన్నమయ్యే రీసోర్స్‌ గ్యాప్‌ను, ఒక పరిహారంగా 2014–15 కేంద్ర బడ్జెట్‌ద్వారా నిధులు ఇస్తామని, ఆ గ్యాప్‌ను పూడుస్తామని స్పష్టంగా చెప్పారు. 

రీసోర్స్‌ గ్యాప్‌ అన్న పదాన్ని ఎక్కడా నిర్వచించనప్పటికీ, అది రెవెన్యూ లోటు అని స్పష్టంగా చెప్పవచ్చు. 2014–15కు సంబంధించి కాగ్‌ నివేదిక ప్రకారం, రాష్ట్ర విభజన జరిగిన జూన్‌ 2, 2014 నుంచి మార్చి 31, 2015 వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లు. మరోవైపు నిధుల కొరత వల్ల కీలకమైన ఆర్థిక లావాదేవీలు కూడా రాష్ట్రం పూర్తి చేయలేకపోయింది. నిజానికి అవి నాడు కేంద్రం స్పష్టంగా ఇచ్చిన హామీ రీసోర్స్‌ గ్యాప్‌ చెల్లింపులకు సంబంధించినవే. ఆ నేపథ్యంలో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర మొత్తం రెవెన్యూ లోటు (రీసోర్స్‌ గ్యాప్‌) ఏకంగా రూ.22,948.76 కోట్లకు చేరుకుంది. 

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘ప్రామాణిక వ్యయం’ (స్టాండడైజ్జ్‌ ఎక్స్‌పెండీచర్‌) అన్న విధానాన్ని తీసుకువచ్చింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.4,117.89 కోట్ల లోటు మాత్రమే పూడ్చగలమని తెలియజేసింది. దీంతో కేంద్రం నాడు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల ఆ లోటు అలాగే మిగిలిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను.

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం చొరవ చూపాలి
రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న మరో అపరిష్కృత సమస్య విద్యుత్‌ బకాయిల చెల్లింపు. తెలంగాణలో విద్యుత్‌ పంపిణీకి సంబంధించి ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థకు రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన జూన్‌ 2, 2014 నుంచి జూన్‌ 10, 2017 వరకు ఏపీ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్‌కో)కు ఆ మేరకు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణ డిస్కమ్‌లు ఆ మొత్తం చెల్లించలేదు.

నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయలేమని ఏపీ జెన్‌కో స్పష్టం చేసింది. అయినప్పటికీ కేంద్ర విద్యుత్‌ శాఖ ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకుని, తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయాల్సిందే అని నిర్దేశించింది. దీంతో అనివార్యంగా ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లపాటు కొంత మొత్తం చెల్లించగా, ఇంకా రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఆ బకాయిలు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఒక వైఖరి తీసుకుంది.

ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ కంపెనీల లావాదేవీల ప్రక్రియ (ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్‌ డీమెర్జర్‌ ప్లాన్‌) ఇంకా తేలలేదు కాబట్టి, అవి పూర్తైన తర్వాత ఈ బకాయిల గురించి ఆలోచిస్తామంటూ ముడి పెట్టింది. మూడేళ్ల పాటు కొంత మొత్తం చెల్లించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ మెలిక పెట్టింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పూర్తిగా అసమంజసం. బకాయిలు రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఏపీ జెన్‌కో కూడా సతమతమవుతోంది. ఇది ఒక విధంగా విద్యుత్‌ ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతోంది.

నిజానికి నాడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా
ఇవే కాకుండా విభజనకు సంబంధించి అనేక అంశాలు ఇంకా అమలు చేయాల్సి ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని తప్పకుండా ప్రస్తావించాల్సి ఉంది. అదే ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’. ఆ హామీ, నిబంధనతోనే రాష్ట్ర విభజన జరిగింది. అయితే ఏళ్లు గడిచినా, ఎంతో కీలకమైనా ఆ హామీని మాత్రం ఇప్పటికీ నెరవేర్చలేదు. 

అదే విధంగా విభజన చట్టంలోని 8వ షెడ్యూల్‌ ప్రకారం, 8 మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, జాతీయ ప్రాధాన్యం ఉన్న 11 సంస్థలను పూర్తి స్థాయిలో 2024 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకా, బుందేల్‌ఖండ్‌లో ఇచ్చిన విధంగా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. అత్యంత అల్పంగా దీన్ని అమలు చేశారు.

ఇక షెడ్యూల్‌ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించి చట్టపరంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ. వాటి విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా అంచనా. అయితే ఆయా సంస్థలను విభజన చట్టంలో ప్రస్తావించకపోవడం వల్ల, ఆస్తుల పంపిణీ జరగకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరుగుతోంది. అందువల్ల వీటన్నింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ అత్యవసర జోక్యం తప్పనిసరి. 

జల వనరుల వినియోగం...
రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన మరో సమస్య.. అంతర్‌రాష్ట్ర, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉత్పన్నమవుతున్న జలవివాదాలు. ఆ కోవలో ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ సమస్యను మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. అదే తెలుగు గంగ ప్రాజెక్టు. 1976, 1977, 1983 నాటి అంతర్‌రాష్ట్ర ఒప్పందాల ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు, పూర్వ ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా నదిలో తమకు కేటాయించిన నీటిలో 5 టీఎంసీల చొప్పున నాటి మద్రాస్‌ ఇప్పటి చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం కేటాయించాల్సి ఉంది. 

అయితే ఈ విషయంలో ఇతర రాష్ట్రాల సహకారం లేకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం తమ పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం కోరినప్పుడల్లా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం కృష్ణా నీరు సరఫరా చేస్తూనే ఉంది. అయితే ఇందు కోసం తగిన వసతుల కల్పన, నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణకు సంబంధించి గత 10 ఏళ్లుగా ఆ రాష్ట్రం నుంచి రూ.338.48 కోట్లు రావాల్సి ఉంది. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా ఆ బకాయిలు చెల్లించేలా చూడాలని కోరుతున్నాను.

పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం కాలడ్డుతోందని, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కుప్పం ప్రజలకు తాగునీరు అందుతుందని, ఈ విషయంలో తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పాలారు ప్రాజెక్టు ద్వారా కేవలం 0.6 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేస్తున్నాం. మరోవైపు తమిళనాడు అవసరాలకోసం ఏటా దాదాపు 10 టీఎంసీల నీటిని పంతున్నాం. ఇలాంటి నేపథ్యంలో పాలారు నిర్మాణానికి సహకరించేలా చూడాలని కేంద్రాన్ని కోరుతున్నాను.

ఎన్‌సీబీలో కోత విధించడం సరికాదు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత సంకట స్థితిలోకి తీసుకుపోయే అవకాశం ఉన్న మరో అంశాన్ని ఈ వేదికపై అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి నికర రుణ పరిమితి (ఎన్‌బీసీ)ని రూ.42,472 కోట్లుగా నిర్థారించడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ద్రవ్య బాధ్యత బడ్జెట్‌ యాజమాన్యం (ఎఫ్‌ఆర్‌బీఎం)కు అనుగుణంగా ఆ మొత్తం నిర్థారించారు.  

అయితే గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారన్న కేంద్ర ఆర్థిక శాఖ, ఈ ఏడాది నిర్ధారించిన నికర రుణ పరిమితి (ఎన్‌బీసీ)లో రూ.19,923.24 కోట్లు సర్దుబాటు చేసే విధంగా రుణ పరిమితిలో ఆ మేరకు కోత విధించింది. గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఎన్‌బీసీలో కోత విధించడం సరి కాదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించకపోగా, నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించింది.

2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది ఆడిట్‌ ఖాతాల వివరాలను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడంతో పాటు, ఆ వివరాలను ఏప్రిల్‌ 6, 2018 నాటికి అందరికీ (పబ్లిక్‌) అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడే ఒక కీలకప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పరిమితికి మించి రుణం సేకరించిన విషయం అప్పటికే తేటతెల్లం అయిన నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదు?. దాన్ని కట్టడి చేస్తూ ఆ తర్వాత ఏడాది, అంటే 2018–19లోనే రుణ సేకరణలో పరిమితి ఎందుకు విధించలేదు?. 

ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. పరిమితికి మించి అంటూ కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తోంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవి గ్రాంట్‌కాదు. వివిధ అవసరాల కోసం ప్రభుత్వం సేకరిస్తున్న రుణాల ఇవి. ఈ రుణాలను సక్రమంగా తీరుస్తోంది కూడా. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు.  

గత ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలనలో అధిక మొత్తంలో రుణాలు సేకరించిందంటూ.. ఊహించని విధంగా కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. మరోవైపు ఇప్పటికే  కోవిడ్‌ మహమ్మారితో ప్రభుత్వం సతమతమవుతోంది. అందువల్ల ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా కేంద్ర హోంమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను.

రేషన్‌ బియ్యంలో కేటాయింపులో హేతు బద్దత లేని కేంద్ర నిర్ణయాలు
రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న మరో సమస్య రేషన్‌ బియ్యం కేటాయింపులో హేతు బద్ధత లేని రీతిలో కేంద్రం నిర్ణయాలు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో రాష్ట్రాల్లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో అసమానతలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)ద్వారా 2.68 కోట్ల మందికి రేషన్‌ అందుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 61 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41 శాతం మందికి మాత్రమే రేషన్‌ సరుకులు అందుతున్నాయి. నిజానికి ఇది ఏ మాత్రం సరికాదు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మందిని ప్రజా పంపిణీ వ్యవస్థలోకి తీసుకు రావాల్సి ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌ కంటే ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ వంటి రాష్ట్రాలలో కూడా ఇక్కడి కంటే కనీసం 10 శాతం ఎక్కువ మందికి రేషన్‌ సరుకులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి. అదే విధంగా అక్కడ మాదిరిగా టయర్‌–1 నగరాలు ఏపీలో లేవు. 

జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో కేంద్రం గుర్తించిన లబ్ధిదారుల (పీడీఎస్‌ లబ్ధిదారులు)కు తోడు మరో 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రేషన్‌ సరుకులు ఇస్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. అందువల్ల రాష్ట్ర జనాభా, ఇక్కడి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పీడీఎస్‌లో మరింత మంది లబ్ధిదారులను చేరుస్తూ, ఆ గణాంకాలు సవరించాలని కోరుతున్నాను.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల స్థితిగతులను అర్థం చేసుకుని పరిస్థితులు మారేలా తగిన సిఫార్సులు చేయాలని గౌరవ ఎస్‌జడ్‌సీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా అంశాలవారీగా జరిగే చర్చల్లో రాష్ట్రానికి సంబంధించి విస్తృతస్థాయిలో ప్రస్తావన కొనసాగాలని ఆశిస్తున్నాను. ఇంకా నిర్ణీత వ్యవధిలో రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యేలా స్వీయ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిగారిని కోరుతున్నాను. 

ఈ సమావేశానికి వేదికగా రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు హోం మంత్రి అమిత్‌ షాకు సీఎం జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలోని తాజ్‌ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరిగింది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సహా లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. సమావేశంలో విలువైన సమాచారాన్ని, తగిన సూచనలు, సలహాలు అందించిన కర్ణాటక ముఖ్యమంత్రి గారితో పాటు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. 

చదవండి:
వినతి కోసం మహిళ యత్నం.. కాన్వాయ్‌ ఆపిన సీఎం జగన్‌
సీఎం జగన్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement