2 నెలల్లో డీపీఆర్లు.. ‘పాలమూరు, నక్కలగండి’పై సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సూచన | Southern Zonal Council Asked Palamuru Nakkalagandi Dpr In 2 Months | Sakshi
Sakshi News home page

2 నెలల్లో డీపీఆర్లు.. ‘పాలమూరు, నక్కలగండి’పై సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సూచన

Published Mon, Nov 15 2021 2:42 AM | Last Updated on Mon, Nov 15 2021 2:51 AM

Southern Zonal Council Asked Palamuru Nakkalagandi Dpr In 2 Months - Sakshi

ఆదివారం తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. చిత్రంలో వరుసగా లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్, తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగసామి

సాక్షి, హైదరాబాద్‌:  పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను జనవరి 15లోగా కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమర్పించాలని దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ మండలి (సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌) సమావేశం సూచించింది. ఇవి మిగులు జలాలపై ఆధారపడి ఉమ్మడి ఏపీలో చేపట్టిన పాత ప్రాజెక్టులేనని.. ఈ రెండు ప్రాజెక్టులకు బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ చేసే కేటాయింపులకు లోబడి ఉంటామని తెలంగాణ వినిపించిన వాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఆదివారం తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి 29వ సమావేశం జరిగింది. అందులో హోంమంత్రి మహమూద్‌ అలీ పాల్గొని తెలంగాణ తరఫున వాదనలు వినిపించారు.  

ఆ అభ్యంతరాలకు విలువ లేదు 
కృష్ణా పరీవాహకంలో దిగువన ఉన్న ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన మిగులు జలాల ఆధారంగా.. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని తెలంగాణ వివరించింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు తమ కోటాలను వినియోగించుకున్నాకే కృష్ణా జలాలు దిగువన ఉన్న తెలంగాణ, ఏపీలకు వస్తున్నాయని.. అందువల్ల ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై కర్ణాటక అభ్యంతరాలకు విలువ లేదని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల కేటాయింపు అంశం బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ పరిధిలో ఉందని.. ఈ రెండు పథకాలకు ట్రిబ్యునల్‌ చేసే కేటాయింపులకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సదరన్‌ కౌన్సిల్‌ సమావేశం.. జనవరి 15లోగా సీడబ్ల్యూసీకి పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని సూచించింది. ఇక సంగంబండ బ్యారేజీ నిర్మాణంతో కర్ణాటకలో ముంపునకు గురికానున్న గ్రామాలు/భూముల సమస్యను పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాల బృందాల ఆధ్వర్యంలో జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించాలని కౌన్సిల్‌ సమావేశంలో మరో నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణకే రూ.4,457 కోట్లు రావాలి 
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ నుంచి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ డిస్కంలు రూ.6,015 కోట్లను ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉందని ఏపీ ఈ సమావేశంలో వాదించింది. అయితే ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సిన బకాయిలను సర్దుబాటు చేశాక కూడా.. తమకే ఏపీ నుంచి రూ.4,457 కోట్లు రావాల్సి ఉంటుందని తెలంగాణ పేర్కొంది. వాస్తవానికి ఏపీజెన్‌కోకు తెలంగాణ డిస్కంలు కేవలం రూ.3,442 కోట్లను మాత్రమే చెల్లించాల్సి ఉందని తెలిపింది. విద్యుత్‌ సంస్థల విభజన వివాదాలన్నింటినీ పరిష్కరించుకుందామని తెలంగాణ డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఏపీజెన్‌కో పెడచెవిన పెట్టిందని, దివాలా స్మృతి(ఐబీసీ) కింద చర్యలు తీసుకోవాలని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేసిందని గుర్తుచేసింది. గత సెప్టెంబర్‌లో ఆ కేసును ఉపసంహరించుకున్నా.. వెంటనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని పేర్కొంది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నా.. ఇరు రాష్ట్రాలు మరోసారి సమావేశమై సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇటీవల కేంద్రం చేసిన సూచనతో మళ్లీ చర్చల్లో పాల్గొనడానికి సుముఖత తెలిపినట్టు వెల్లడించింది. 

ఏపీ భవన్‌ విభజనకు కొత్త ప్రతిపాదన 
ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఆస్తుల విభజన విషయంలో ఏపీ ప్రభుత్వం గతంలో చేసిన రెండు ప్రతిపాదనలతో అసమానతలు వస్తాయని, అందువల్ల త్వరలో తామే కొత్త పరిష్కారాన్ని ప్రతిపాదించనున్నామని తెలంగాణ పేర్కొంది. 

ఏపీకి అభ్యంతరాలు తెలిపాం 
షీలాభిడే కమిటీ సిఫార్సుల మేరకు షెడ్యూల్‌–9లోని 68 ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ స్పష్టం చేసింది. అయితే 23 సంస్థల విభజన విషయంలో ఉన్న అభ్యంతరాలను ఏపీకి ఇప్పటికే తెలిపామని.. వాటిపై ఏపీ స్పందన తెలియజేయాల్సి ఉందని పేర్కొంది. 

గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయండి 
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేంద్రాన్ని కోరారు. వర్సిటీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 335 ఎకరాలను గుర్తించిందని.. ములుగులోని యువజన శిక్షణ కేంద్రంలో తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటుకు 200 ఎకరాలను సైతం గుర్తించిందని ఆయన వివరించారు. దీనికి హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ రూ.849 కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసిందని, ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున ఆర్థిక, విద్యుత్, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణారావు, సునీల్‌ శర్మ, రజత్‌కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement