సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులు చివరిదశలో చతికిలపడ్డాయి. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చి పరుగులు పెట్టించిన ఎస్సారెస్పీ రెండో దశ, మహాత్మాగాంధీ కల్వకుర్తి, రాజీవ్ భీమా, జవహర్ నెట్టెంపాడు, జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాల పనులు రెండేళ్లుగా నిధుల కొరత, భూసేకరణ సమస్యల కారణంగా నిలిచిపోయాయి. ఫలితంగా కృష్ణా, గోదావరి నదులకు వస్తున్న భారీ వరదలు సముద్రం పాలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు కేటాయిస్తే వీటి నిర్మాణం పూర్తి చేసుకుని 5,78,463 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశముంది.
రూ.500 కోట్లతో కల్వకుర్తి పూర్తి!
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం జలాశయం వెనక నుంచి కృష్ణా జలాలను తరలించి అదే జిల్లాలో 4,24,186 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉండగా, ప్రస్తుతం 3,07,00 ఎకరాలకు మాత్రమే అందిస్తున్నారు. ప్రాజెక్టును మూడు దశలుగా విభజించి పనులు ప్రారంభించగా, ప్రస్తుతం ఒకటి, రెండోదశలోని 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే ఐదేసి మోటార్లు పనిచేస్తున్నాయి.
మూడోదశ కింద 42.80 కిలోమీటర్ల మేర నీటిని తరలించేందుకు పంప్‌హౌస్, రిజర్వాయర్‌లను నిర్మించేందుకు 2005–06లో కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. 13 మెగావాట్ల సామర్థ్యంగల ఐదు పంపులు 800 క్యూసెక్కుల నీటిని 117 మీటర్ల ఎత్తుకు పంప్ చేసేలా డిజైన్ చేశారు. ఈ పనులను 2010లోగా పూర్తి చేయాల్సి ఉండగా, జాప్యం కారణంగా గడువు పొడిగిస్తూ వస్తున్నారు.
టన్నెల్ లైనింగ్ పనులు పూర్తికాక పంప్‌హౌస్‌లోని సర్జ్‌పూల్‌కు సరిపడా నీటిని తరలించడం సాధ్యం కావడం లేదు. రూ.4896.24 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించగా, తర్వాత రూ.5600.40 కోట్లకు పెంచారు. రూ.5,100 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో రూ.500 కోట్ల పనులు పూర్తైతే ఈ ప్రాజెక్టు కింద 1,17,816 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
నెట్టె్టంపాడు..ముందుకు నెట్టేది ఎవరు?
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి 21.425 టీఎంసీల కృష్ణా జలాలను 110 మీటర్లకు ఎత్తుకు లిఫ్టు చేసి జోగుళాంబ–గద్వాల జిల్లాలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందించడానికి జవహర్ నెట్టెంపాడును 2005లో చేపట్టారు. అప్పట్లో రూ.1,428 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించగా, తర్వాత పలుమార్లు సవరించి చివరకు రూ.2547.69 కోట్లకు పెంచారు. ఇప్పటివరకు రూ.2,300 కోట్ల పనులు పూర్తయ్యాయి. 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. మరో రూ.300 కోట్లను ఖర్చు చేస్తే మిగిలిన 58 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశముంది. 557 ఎకరాల భూసే కరణ పెండింగ్‌లో ఉండటంతో రెండేళ్లుగా పనులు ముందుకు సాగడం లేదు.
భూసేకరణలో ఆగిన భీమా
కృష్ణానది నుంచి రెండు లిఫ్టుల ద్వారా 20 టీఎంసీలను తరలించి వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని 2.03 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి 2003లో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి నాటి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీని కింద ఇప్పటివరకు 1.58 లక్షల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుతోంది. రూ.2689.25 కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచగా, ఇప్పటివరకు రూ.2,753 కోట్లకుపైగా ఖర్చు చేశారు. 270 ఎకరాల భూసేకరణ పూర్తికాకపోవడంతో మిగిలిన 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. భూసేకరణ పూర్తి చేయడానికి రూ.1,300 కోట్లు కావాల్సి ఉంది.
ఎస్సారెస్పీ–2కి అనుమతుల్లో జాప్యం
ఎస్సారెస్పీ–2 దశ ప్రాజెక్టు సైతం భూసేకరణ, నిధుల సమస్యలతో చివరిదశలో నిలిచిపోయింది. శ్రీరాంసాగర్ నుంచి ప్రారంభమయ్యే కాకతీయ ప్రధానకాల్వ పొడవును 284 కి.మీ. నుంచి 346 కి.మీ.కు పెంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని 4.4 లక్షల ఎకరాల ఆయ కట్టుకు 24.4 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి రూ.1,220 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టగా, రూ.1,200 కోట్ల పనులు పూర్తయ్యాయి. ప్రధానంగా భూసేకరణ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం, హెచ్‌పీసీఎల్/ గెయిల్, జాతీయ రహదారుల సంస్థ నుంచి అనుమతులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు విస్తరణ పనులకు బ్రేక్ పడింది. మిగులు పనులు పూర్తైతే రూ.32,996 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
రూ.6 వేల కోట్లతో దేవాదుల పూర్తి!
వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం గంగారం వద్ద గోదావరి నుంచి 60 టీఎంసీలను తరలించి కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ పట్టణ/గ్రామీణ, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని 5,58,722 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని మూడు దశల్లో చేపట్టగా, తొలిదశ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మిగిలిన రెండుదశల పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి.
రూ.13,445 కోట్ల పనులు ప్రారంభించి రూ.16,645 కోట్లకు పెంచారు. ఇప్పటివరకు రూ.11 వేల కోట్లతో పనులు పూర్తి కాగా, 2,34,071 ఎకరాలకు సాగునీరు అందించగలుగుతున్నారు. మరో రూ.ఐదారు వేల కోట్లను కేటాయించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న 5,357 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తే ఈ ప్రాజెక్టు పనులు పూర్తికానున్నాయి. మరో 3.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment