సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: వ్యవసాయ, పారిశ్రామీకరణలో గణనీయ వృద్దిని సాధించి రాష్ట్రంలోనే ధనిక జిల్లాగా పెద్దపల్లి అవతరించబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జోస్యం చెప్పారు. అంతర్గాం మండలం ముర్మూరు వద్ద రూ.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి మంగళవారం సీఎం శంకుస్థాపన చేశారు. లిఫ్ట్‌ల నిర్మాణానికి సంబంధించి అధికారులు మ్యాప్ ద్వారా సీఎంకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీళ్లతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎండిపోవడమనేది జరగదన్నారు. గోదావరి నది జలకళను సంతరించుకొంటుందదన్నారు. ఫలితంగా ఈ ప్రాంతం సుభిక్షంగా మారబోతుందన్నారు. ఎన్‌టీపీసీలో 4 వేల మెగావాట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా, 1600 మెగావాట్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరో 2400 మెగావాట్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఓ వైపు వ్యవసాయం, మరో వైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ, రాష్ట్రంలోనే పెద్దపల్లి ధనిక జిల్లాగా ఏర్పడబోతుందన్నారు.
కాగా ముర్మూరు ఎత్తిపోతల పథకాన్ని ఐదు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా, అక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరం బ్రాంచి కాలువ ద్వారా, మరో 16 కిలోమీటర్ల దూరం పిల్ల కాలువ ద్వారా సాగునీళ్లు ఈ ప్రాంతానికి రాని పరిస్థితి ఏర్పడిందన్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు చెంతనే ఉన్నా రామగుండంలోని వ్యవసాయ భూములకు సాగునీరు రావడం లేదనే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. రెండు లిఫ్ట్‌లతో పాటు, మూడో లిఫ్ట్‌కు కావాల్సిన రూ.12 కోట్లు కూడా ఇస్తామన్నారు. ఈ పథకంతో దాదాపు 20 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని, 22 వేల ఎకరాలకు సాగునీళ్లు అందుతాయన్నారు.
ప్రారంభోత్సవానికి మళ్లీ వస్తా...
రామగుండం ఎత్తిపోతల పథకాన్ని శంఖుస్థాపన చేసిన తాను తిరిగి, ప్రారంభోత్సవానికి కూడా వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ పథకం త్వరగా పూర్తి కావాలంటే అక్కడక్కడ కొంత స్థలం అవసరముంటుందని, దానిని ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ ప్రాంతం తొందరగా బాగుపడాలనేది తన ఆకాంక్ష అన్నారు.
ఎమ్మెల్యే గ్రూప్ జోష్
సీఎం కే సీఆర్ సభలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణపై ప్రశంసలు కురిపించడంతో ఆయన వర్గీయులు సంబరాల్లో మునిగిపోయారు. రామగుండంలో వర్గపోరు, ఆశావాహులు అధికంగా ఉన్న ‘ప్రత్యేక’ పరిస్థితుల్లో, స్వయంగా గులాబీ బాస్ బహిరంగంగా పొగడడంతో వారు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ‘ఇగ దుకాణాలు బంద్’ అంటూ వ్యాఖ్యానిస్తూ, ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు.
ఆర్టీసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కె.కేశవరావు, బాల్క సుమన్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ప్రభుత్వ సలహదారు డాక్టర్ జి.వివేక్, పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, టీఎస్‌టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ శ్రీదేవసేన, పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ అనిల్, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, మాతా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ ఆడెపు రాజేశం, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment