సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ఈనెల 24న ఏకకాలంలో శంకుస్థాపన చేసేందుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. శంకుస్థాపన ఏర్పాట్లపై పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు శనివారం మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, పార్టీ ముఖ్యనేతలతో జిల్లాల వారీగా ఫోన్‌లో సమీక్షించారు. భూమి పూజ జరిగే స్థలాలను శనివారం సాయంత్రంలోగా పరిశీలించి, ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిందిగా సూచించారు. నూతనంగా నిర్మించే పార్టీ భవనాల నమూనాను సీఎం కేసీఆర్ త్వరలో ఎంపిక చేస్తారని వెల్లడించారు. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల నడుమ మంచి ముహూర్తం ఉన్నందున శంకుస్థాపన నిర్వహించాలన్నారు.
మంత్రుల ప్రాతినిథ్యం ఉన్నచోట ఆయా జిల్లా కేంద్రాల్లో వారే శంకుస్థాపన చేస్తారని, మిగతా జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లు నిర్వహిస్తారన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పార్టీ పక్షాన ఎన్నికైన ప్రాదేశిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్‌లు, పార్టీ సీనియర్ నేతలను కూడా ఆహ్వానించాలని పార్టీ కీలక నేతలకు సూచించారు. భూమి పూజలో పాల్గొనే తొమ్మిది మంది మంత్రులతోపాటు, 19 మంది జిల్లా పరిషత్ చైర్మన్ల జాబితాను కేటీఆర్ విడుదల చేశారు.
జిల్లాకు ఎకరా చొప్పున కేటాయింపు
జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణానికి వీలుగా ఈ నెల 18న సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ ఒక్కో జిల్లాలో ఎకరా చొప్పున భూమి కేటాయించింది. సీఎం ప్రకటనకు అనుగుణంగా ఈ నెల 21న 24 జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్ పార్టీ భవనాల నిర్మాణానికి భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 34 జిల్లాలకుగాను ఖమ్మంలో ఇదివరకే పార్టీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ కొద్ది రోజులకే గత ఏడాది డిసెంబర్ 20న వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఉన్నా, నగర శాఖ కోసం మరో కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అయితే హైదరాబాద్ నగరంతో పాటు, వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంలో కార్యాలయ నిర్మాణం కోసం అనువైన స్థలం కోసం పార్టీ అన్వేషిస్తోంది. మరో ఆరు జిల్లా కేంద్రాల్లో భూ కేటాయింపుపై స్పష్టత రావాల్సి ఉంది.
రూ.19.20 కోట్లు పార్టీ నిధులు
క్షేత్ర స్థాయిలో పార్టీని వ్యవస్థీకృతం చేయాలని భావిస్తున్న టీఆర్‌ఎస్.. తొలుత జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం పార్టీ పేరిట రూ.225 కోట్ల డిపాజిట్లు ఉండగా, వడ్డీ రూపంలో రూ.1.25 కోట్ల ఆదాయం వస్తోంది. పార్టీ నిధుల నుంచే ఒక్కో భవనానికి రూ.60లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తమిళనాడులో డీఎంకే తరహాలో ఇంటికో పార్టీ కార్యకర్త ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్న టీఆర్‌ఎస్.. త్వరలో నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ కార్యాలయాలను నిర్మించాలనే యోచనలో ఉంది. నియోజకవర్గ కేంద్రాల్లో స్థల కేటాయింపులో సాధ్యాసాధ్యాలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment