కొత్త పనులకు బ్రేక్‌..! | Temporary break for new reservoirs and lubricants tenders | Sakshi
Sakshi News home page

కొత్త పనులకు బ్రేక్‌..!

Published Mon, Jan 14 2019 2:50 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

Temporary break for new reservoirs and lubricants tenders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల పనులకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. రాష్ట్ర ప్రాధాన్యతలు, ఆర్థిక పరిస్థితి, రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి శాఖ పరిధిలో ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇచ్చిన పనులకు సంబంధించి కొత్తగా ఎలాంటి టెండర్లు పిలవరాదని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌కు అనుకూల ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్న దృష్ట్యా, ఆరు నెలల తర్వాత ప్రవేశపెట్టే పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ అనంతరం ఈ పనులను గాడిలో పెట్టే యోచనలో ఉంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో టెండర్ల ప్రక్రియకు అధికారులు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.  

కేంద్ర నిధులపై స్పష్టత వచ్చాకే.. 
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్‌లోనే కాళేశ్వరం ద్వారా కనిష్టంగా 6 లక్షల ఎకరాలకు ఆయకట్టునివ్వాలని భావిస్తోంది. ఈ దృష్ట్యా ఆ ప్రాజెక్టుకు అధిక నిధులు వెచ్చిస్తోంది. దీంతోపాటే ఈ ఏడాది నుంచి సీతారామ, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు అధిక నిధులు వెచ్చించాలని నిర్ణయించింది. ఇప్పటికే శాఖ పరిధిలో సుమారు రూ.8వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో, ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా నిధుల సేకరణచేసే పనిలో పడింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ గడువు ముగుస్తుండటం, ఏప్రిల్‌లో లోక్‌సభకు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో రాష్ట్రానికి ఇచ్చే నిధులపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగాక పూర్తి స్థాయిలో పెట్టే బడ్జెట్‌లో రాష్ట్ర కేటాయింపులపై స్పష్టత రానుంది. వచ్చే కొత్త ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సాగునీటి ప్రాజెక్టులకు రూ.30 వేల నుంచి రూ.40వేల కోట్ల మేరకు నిధులు రాబట్టుకోవచ్చని ఇటీవల తన సమీక్షల సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత నిధుల కొరత, కేంద్ర బడ్జెట్‌ నుంచి అందే ఆర్థిక సాయంపై ఓ స్పష్టత వచ్చేవరకు కొత్తగా ఎలాంటి పనులకు టెండర్లు పిలవవద్దని ఇటీవలే అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

నాలుగు రిజర్వాయర్లపై ప్రభావం.. 
ఈ ఆదేశాల ప్రభావం నాలుగు రిజర్వాయర్‌ పనులపై పడనుంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి పరిధిలో ఉద్దండాపూర్‌ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు నీటిని తరలించే పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.4,268 కోట్ల పనులకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. ఆ పనులకు ప్రస్తుతం బ్రేక్‌ పడింది. ఇందులో రూ.915 కోట్లతో చేపట్టనున్న కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌ పనులూ ఉన్నాయి. ఇక కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు స్థిరీకరణతో పాటు అవసరమైనప్పుడు కుంటాల జలపాతానికి నీరు విడుదల చేసేలా కుఫ్టి ఎత్తిపోతలకు ప్రభుత్వం గత ఏడాది ఆమోదం తెలిపింది. 5.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.744 కోట్లతో రిజర్వాయర్‌ నిర్మించేందుకు అనుమతించగా, దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టేందుకు ఇటీవల అధికారులు ప్రభుత్వ అనుమతి కోరగా, పెండింగ్‌ లో పెట్టమని తెలిపింది.

వీటితో పాటే పెన్‌గంగ ప్రాజెక్టు పిప్పల్‌కోఠి దగ్గర 1.42 టీఎంసీల సామర్థ్యం రిజర్వాయర్, 0.7 టీఎంసీలతో గోమూత్రి రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.583.78 కోట్లతో అనుమతినిచ్చారు. ఈ పనులకూ టెం డర్లు పిలవాల్సి ఉండగా ఆరు నెలలపాటు బ్రేక్‌ వేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన దేవాదులలోని మల్కాపూర్‌ పనుల ఒప్పందాలను ఆపాలని ఇదివరకే ఆదేశాలు వెళ్లాయి. వీటితోపాటే నిజాంసాగర్‌ కింద మంజీరా నదిపై పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని 21 గ్రామాల్లో 30,646 ఎకరాలకు నీరిచ్చేలా.. నిజాంసాగర్‌ మండలం మల్లూర్‌ సమీపంలో రూ.456 కోట్లతో మంజీరా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభు త్వం నిర్ణయించింది. 2.90 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే ఈ పథకానికి టెండర్లు పిలవాల్సి ఉన్నా ఆ పనులకూ బ్రేకులు పడ్డాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement