‘ఎత్తిపోతల’ విద్యుత్ బాధ్యత ట్రాన్స్‌కోకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమయ్యే విద్యుత్‌ను సమకూర్చే బాధ్యత పూర్తిగా ట్రాన్స్‌కోకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సబ్‌స్టేషన్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతను కూడా పూర్తిగా ట్రాన్స్‌కోకే కట్టబెట్టాలని నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత ప్రాజెక్టుల్లో 400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టే విషయమై సోమవారం ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సబ్‌స్టేషన్ల నిర్మాణంపై వీరు చర్చించారు.
తెలంగాణ ప్రాంతమంతా దక్కన్ పీఠభూమి అయినందున ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతలవే కావడంతో ప్రాజెక్టులకు అధికమొత్తంలో విద్యుత్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాలమూరు, ప్రాణహిత ప్రాజెక్టులకు అత్యధికంగా చెరో 4వేల మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉంటుందని ఇప్పటికే అధికారులు లెక్కలు కట్టారు. గతంలో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులతో పోలిస్తే ఈ అవసరాలు దాదాపు రెట్టింపు ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇచ్చి వాటిని సత్వరం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగానే ఎత్తిపోతల ప్రాజెక్టులకు విద్యుత్‌ను సరఫరా చేసే సబ్‌స్టేషన్ల నిర్మాణ బాధ్యతలను ట్రాన్స్‌కో చేతిలో పెట్టాలని నిర్ణయించింది. నిజానికి గతంలో నిర్మించిన ప్రాజెక్టులకు ఈ స్థాయిలో అవసరాలు లేకపోవడంతో 133 కేవీ నుంచి 220 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణాలను ప్రాజెక్టు అథారిటీలే చేపట్టాయి. వీటి నిర్వహణ బాధ్యతలను మాత్రం ట్రాన్స్‌కోకు అప్పగించాయి. ప్రస్తుతం 400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం అవసరం ఉండటం, ఆ స్థాయి నిర్మాణాలు చేపట్టే సామర్థ్యం నీటి పారుదల శాఖ వద్ద లేకపోవడంతో వీటి బాధ్యతను ట్రాన్స్‌కోకు అప్పగించాలనే ప్రతిపాదనను తెచ్చింది.
ప్రాజెక్టు వ్యయంలోంచే నిర్మాణం..
పాలమూరు విద్యుత్ అవసరాలకు 4, ప్రాణహిత కోసం 6 సబ్‌స్టేషన్లను నిర్మించాలని నీటి పారుదల శాఖ భావిస్తోంది. ఒక్కో 400 కేవీ సబ్‌స్టేషన్, లైనింగ్‌ల నిర్మాణానికి సుమారు రూ.400 కోట్ల మేర ఖర్చుతో మొత్తం 10 సబ్‌స్టేషన్లకు రూ.4వేల కోట్ల మేర నిధులు అవసరమవుతాయి. ఈ నిర్మాణ వ్యయాన్నంతా ప్రాజెక్టు నిధుల్లోంచే ఖర్చు చేయాల్సి ఉంటుం ది. ఈ విషయంపై మంత్రి హరీశ్‌రావు, ట్రాన్స్‌కో సీఎండీతో చర్చలు జరిపారు. అయితే సబ్‌స్టేషన్ల నిర్మాణంపై సీఎండీ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిసింది. మరోమారు పూర్తిస్థాయిలో చర్చించి ఓ ఒప్పందానికి రావాలని వీరు నిర్ణయించినట్లు సమాచారం.