ఎత్తిపోతలకు ‘పవర్’ పంచ్!
12 వేల మెగావాట్లకు చేరిన విద్యుత్ అవసరాలు
- మూడు నెలల కిందటి అంచనాతో పోలిస్తే 2 వేల మె.వా. అధికం
- కాళేశ్వరం, ప్రాణహితకు 5,229.43 మెగావాట్లు
- పాలమూరు, డిండికి 4,705 మెగావాట్లు
- ఈ జూన్ నాటికి 1,338.01 మెగావాట్ల విద్యుత్ అవసరం
- అంచనాలు సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లను ఎత్తిపోసేందుకు అవసరమైన విద్యుత్ అంచనా లెక్క కొలిక్కి వచ్చింది. నీటి పారుదల శాఖ అంచనా మేరకు మొత్తంగా 12 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండబోతోంది. మూడు నెలల కింద సీఎం కె.చంద్రశేఖర్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో వేసిన అంచనాతో పోలిస్తే విద్యుత్ అవసరాలు మరో 2 వేల మెగావాట్ల మేర పెరిగింది. కాళేశ్వరం-ప్రాణహిత, పాలమూరు-డిండి ప్రాజెక్టుల పరిధిలో గతంలో వేసిన అంచనా లు పెరిగినందున విద్యుత్ అవసరాలు సైతం పెరిగినట్లు అధికారుల లెక్కలు తేట తెల్లం చేస్తున్నాయి. ఈ సీజన్‌లో అందుబాటులోకి రానున్న ఎత్తిపోతలకే సుమారు 1,338 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ తేల్చింది.
విద్యుత్ ఖర్చు రూ.15 వేల కోట్లు!
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణం చేపట్టిన 18 ఎత్తిపోతల ప్రాజెక్టుల కింద మొత్తం 60 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. మూడు నెలల కింద ఈ ఎత్తిపోతల పథకాలకు మొత్తంగా 9,975 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని లెక్కగట్టింది. అయితే తాజా లెక్కల మేరకు.. కొత్తగా చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను మినహాయిస్తే మిగతా ఎత్తిపోతలకు 7,308.41 మెగావాట్ల విద్యుత్ అవసరాలను లెక్కలేశారు.
ఇందులో ప్రాణహిత-కాళేశ్వరం ప్రాజెక్టు కింద గతంలో 3,600 మెగావాట్ల మేర అంచనా ఉండగా.. రీ ఇంజనీరింగ్ కారణంగా అది 5,229.43 మెగావాట్లకు పెరిగింది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలోనూ విద్యుత్ అవసరం 148 మెగావాట్ల నుంచి 168 మెగావాట్లకు పెరి గింది. ఇక పాలమూరు-డిండిలకు కలిపి గతంలో 3,500 మెగావాట్లు ఉండగా.. ప్రస్తుతం అది 4,705 మెగావాట్లకు చేరింది. అంతా కలిపి 12,013.41 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ తేల్చింది. మొత్తమ్మీద విద్యుత్ అవసరాలు తొలి అంచనాల కన్నా.. 2 వేల మెగావాట్ల మేర పెరిగా యి. అయితే ఇందులో కంతనపల్లికి ప్రత్యామ్నాయంగా చేపడుతున్న తుపాకులగూడెం ప్రాజెక్టు అంచనాలను పేర్కొనలేదు. ఇక్కడ సైతం 800 మెగావాట్ల వరకు అవసరాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం విద్యుత్ అవసరాలు 13 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉంది. తాజా అంచనాల ప్రకారం అది రూ.15 వేల కోట్లకు చేరే అవకాశం ఉంది.
ఈ ఏడాది 1,338 మెగావాట్లు
ఈ ఏడాది నుంచి పాక్షికంగా అందుబాటులోకి వచ్చే ఎత్తిపోతల పథకాల నిర్వహణకు 1,338.01 మెగావాట్ల విద్యుత్ కావాల్సి. ఈ ఏడాది జూన్-జూలై నాటికి రాష్ట్రంలో 8 ప్రాజెక్టులు పూర్తిగా 11 ప్రాజెక్టుల పాక్షికంగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ ప్రణాళిక రచించింది. వీటి ద్వారా మొత్తంగా 6.36 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో కల్వకుర్తికి 40 మెగావాట్లు, నెట్టెంపాడుకు 119, భీమాకు 96, దేవాదులకు 347 మెగావాట్ల మేర విద్యు త్ అవసరముంటుంది. 2017-18 నాటికి ప్రాణహిత, పాలమూరు కింద పాక్షికంగానైనా ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. వచ్చే ఏడాది ప్రాణహితకు 1,660, పాలమూరుకు 1,000 మెగావాట్ల మేర అవ సరం కానుంది.