కాళేశ్వరం డిమాండ్‌.. 2,550 మెగావాట్లు | Kaleshwaram lift scheme power needs | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం డిమాండ్‌.. 2,550 మెగావాట్లు

Published Fri, May 18 2018 3:49 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

Kaleshwaram lift scheme power needs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ఈ ఏడాది అవసరమయ్యే విద్యుత్, దాని సరఫరాపై ట్రాన్స్‌కో, నీటిపారుదల శాఖలు ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేశాయి. రానున్న జూన్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు విద్యుత్‌ అవసరాలపై ఓ స్పష్టతకు వచ్చాయి. ఈ ఏడాది కాళేశ్వరంలోని అన్ని స్టేజీల్లో ఉన్న పంపులు, మోటార్లను నడిపేందుకు గరిష్టంగా 2,550 మెగావాట్ల డిమాండ్‌ అంచనా వేశాయి. ఈ మేరకు ఈ నెలాఖరులోగా విద్యుత్‌ సబ్‌స్టేన్లను సిద్ధం చేస్తున్నాయి.

25 రోజుల్లో సబ్‌స్టేషన్లు సిద్ధం..
వచ్చే వర్షాకాల సీజన్‌ నుంచి కాళేశ్వరం ద్వారా ఒక టీఎంసీ చొప్పున 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లింక్‌–1లో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌజ్‌ల మొదలు కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటిని తరలించేందుకు మొత్తంగా 82 మోటార్‌పంపులను నడపాల్సి ఉంది. వీటిని నడిపేందుకు మొత్తంగా 4,627 మెగావాట్ల విద్యుత్‌ అవసరముంది.

పంప్‌హౌజ్‌ల్లో మోటార్ల ఏర్పాటు ప్రక్రియ లింక్‌–1లో మొదలు కావాల్సి ఉండగా, లింక్‌–2, 3లో ఉన్న ప్యాకేజీలు –6, 8, 10, 11, 12లలో ఇప్పటికే పాక్షికంగా పూర్తయింది. విద్యుత్‌ సరఫరా వ్యవస్థను సిద్ధం చేసేందుకు సబ్‌స్టేషన్ల నిర్మాణాలు, ట్రాన్స్‌మిషన్‌ లైన్ల ఏర్పాటు జరుగుతోంది. మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 40 మెగావాట్ల సామర్థ్యంతో 11 మోటార్లు ఉండగా ఇందులో ఐదింటిని జూన్‌ నాటికి పూర్తి చేయాల్సి ఉంది.

ఇక్కడ ఇప్పటికే 220/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అన్నారం పంప్‌ హౌజ్‌లోని 8 మోటార్లలో 4, సుందిళ్లలో 9లో 4 మోటార్లను జూన్‌ నాటికి సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ సబ్‌స్టేషన్ల పనులు 85 శాతం మేర పూర్తయ్యాయి. వచ్చే నెల రెండో వారానికి విద్యుత్‌ సరఫరా వ్యవస్థను సిద్ధం చేసేలా ట్రాన్స్‌కో పనులు చేస్తోంది. ఇక ప్యాకేజీ–6లో 7 మోటార్‌ పంపుల్లో 4, ప్యాకేజీ–8లో 5, ప్యాకేజీ– 10లో 2, ప్యాకేజీ –11లో 2, ప్యాకేజీ– 12లో 4 మోటార్‌ పంపులను వచ్చే నెల ప్రథమార్ధానికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఆ ఐదు నెలలు అధిక డిమాండ్‌..
మేడిగడ్డ మొదలు కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటిని తరలించేందుకు మొత్తంగా 30 మోటార్లను నడపాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయగా, ఇందుకు 2,550 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని ట్రాన్స్‌కో, నీటి పారుదల శాఖలు అంచనా వేశాయి.

వచ్చే జూన్‌ నుంచి మోటార్లు నడిపేందుకు 190 మెగావాట్ల మేర విద్యుత్‌ అవసరం ఉండగా, జూలైలో 1,000 మెగావాట్లు, ఆగస్టులో 1,500ల మెగావాట్ల మేర విద్యుత్‌ అవసరం ఉండనుంది. గోదావరిలో వరదల తీవ్రత ఎక్కువగా ఉండే సెప్టెంబర్‌ మొదలు 2019 జనవరి వరకు 5 నెలలు ప్రతి నెలా గరిష్టంగా 2 వేల మెగావాట్ల నుంచి 2,550 మెగావాట్ల అవసరం ఉంటుందని రెండు శాఖలు అంచనా వేశాయి. ఈ 5 నెలల కాలంలో గరిష్ట నీటిని పంపింగ్‌ చేసి రిజర్వాయర్లలో నింపాలని నీటి పారుదల శాఖ భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement