వరుణుడే దిక్కు | No water reserves | Sakshi
Sakshi News home page

వరుణుడే దిక్కు

Published Thu, Jun 18 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

వరుణుడే దిక్కు

వరుణుడే దిక్కు

- జలాశయాల్లో అడుగంటిన సాగునీటి నిల్వలు
- ఖరీఫ్‌కు 32 టీఎంసీలు అవసరం
- రిజర్వాయర్లు, చెరువుల్లో ఉన్నది కేవలం 4 టీఎంసీలు
- జూలై నెలాఖరుకు నిండితేనే నీరు విడుదల
- లేదంటే కష్టమేనంటున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం:
ఖరీఫ్ సీజన్...ఆరంభంలోనే రైతులను కలవరపెడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా అడుగంటిన సాగునీటి నిల్వలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. జిల్లాలో వరిసాగు విస్తీర్ణంలో సగం వర్షాధార ప్రాంతమే. జలాశయాల్లో పుష్కలంగా నీరు లేదు. వచ్చే నెలాఖరుకు అవి నిండితేనే సాగునీరు విడుదల చేస్తామని, లేదంటే కష్టమేనని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో భారమంతా వరుణుడిపైనే వేసి అన్నదాతలు కాడి నెత్తుకుంటున్నారు.

జిల్లాలో సాగు లక్ష్యం 2,08,988 హెక్టార్లు. ఇందులో వరి లక్షా ఆరువేల హెక్టార్లు. ప్రాజెక్టులు, కాలువలు, ఇతర సాగునీటి వనరుల కింద 1.99లక్షల ఎకరాలు, వర్షాధారంగా మరో 65,233 ఎకరాల సాగవుతాయి. ఇందుకు 32 టీఎంసీల నీరు అవసరం. వర్షాధార ప్రాంతాలు మినహాయిస్తే కనీసం 26 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం కేవలం 3.66 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.

ముఖ్యంగా తాండవ, రైవాడ, కోనం, పెద్దేరు జలాశయాల పరిధిలో అత్యధికంగా 92వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 11.6 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం వీటిల్లో 2.66 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వంద ఎకరాలకు పైబడి 232 సాగునీటి చెరువులున్నాయి. వీటి పరిధిలో 59వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి 6.5 టీఎంసీల నీరు అవసరం ఉండగా, ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు మాత్రమే వీటిల్లో అందుబాటులో ఉంది. ఇక మిగిలిన సాగునీటి వనరుల్లో చుక్కనీరులేని దుస్థితి.  సీజన్ ప్రారంభంలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని నీటిపారుదలశాఖ అధికారులే అంగీకరిస్తున్నారు.

ఈసారి పూర్తిగా వర్షాలపైనే సాగునీటి వనరుల కింద ఆయకట్టు కూడా ఆధారపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుతుపవనాల ప్రవేశంతో వారం రోజుల నుంచి అడపా దడపా వర్షాలు కురుస్తున్నప్పటికీ క్యాచ్‌మెంట్ ఏరియాలో మాత్రం సింగిల్ సెంటీమీటర్ వర్షపాతం నమోదు కాలేదు. ఒకటి రెండు రిజర్వాయర్ల ఎగువ ప్రాంతాల్లో మాత్రమే అత్యల్ప వర్షపాతం నమోదుతో ఈ ప్రాజెక్టుల్లో నీటిమట్టం కేవలం అడుగులోపేఉంది. మిగిలిన ప్రాజెక్టుల్లో ఆ పరిస్థితీ లేదు. గతేడాది ఇదే సమయంలో జలాశయాల్లో సమృద్ధిగా నీటి నిల్వలున్నాయి.

ఉదాహరణకు గతేడాది తాండవలో 3 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క టీఎంసీ నీరు ఉంది. దీంతో రానున్న నెలరోజులు క్యాచ్‌మెంట్ ఏరియాలో కుంభవృష్టి ఉంటే తప్ప ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రాజెక్టుల నుంచి నీరు వదలాల్సిఉంటుంది. అంటే జూలై నెలాఖరులోగా ప్రాజెక్టులు,  మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్(చెరువులు) నిండాలి. ఏమాత్రం వరుణుడు ముఖం చాటేసినా అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరమే.
 
ప్రాజెక్టులు నిండితేనే నీరు విడుదల
జిల్లాలో తాండవ, రైవాడ, కోనాం పెద్దేరు జలాశయాల్లో నీటి మట్టాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. పంటలకు ఆగస్టు రెండోవారం నుంచి నీరు అవసరం ఉంటుంది. ఈలోగా ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో వాటి సామర్ధ్ద్యానికి తగ్గట్టుగా నిండితేనా పంటలకు నీరు విడుదల  చేయగలం. లేకుంటే కష్టమే. వర్షాలు మైదాన ప్రాంతాల్లో కాకుండా క్యాచ్‌మెంట్ ఏరియాలో పడితేనే ప్రాజెక్టులకు..రైతులకు ఉపయోగం..
నాగేశ్వరరావు,
ఎస్‌ఈ, నీటిపారుదల శాఖ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement