ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , పక్కన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
చక్రాయపేట/బి.కొత్తకోట: గాలేరు–నగరి సుజల స్రవంతి, ఏవీఆర్ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులను అనుసంధానిస్తూ వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో నిర్మించే ఎత్తిపోతల పథకాల్లో భాగంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని ములకల చెరువు మండలం నాయనిచెరువు వద్ద చేపట్టే పనులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేసి ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు.
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నీటి పారుదల రంగానికి సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. రూ.4,373 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్లలో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయించనున్నట్టు చెప్పారు. గండికోట రిజర్వాయర్ నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ ద్వారా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం వరకు కృష్ణా జలాలను తరలిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా, వెంకటేగౌడ పాల్గొన్నారు.
3 లక్షల ఎకరాలకు సాగునీరు
రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం కాలేటివాగు వద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ పథకం నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపి కృష్ణా జలాలతో చక్రాయపేట మండలంలోని 45 చెరువులతోపాటు రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లె, వీరబల్లి మండలాల్లోని 90 చెరువులకు కాలేటివాగు నుంచి నీటిని నింపనున్నట్టు
వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment