ప్రతీకాత్మక చిత్రం
భూమంతా కోల్పోయారు
ఈ రైతు పేరు అనపర్తి కృష్ణారావు. స్వగ్రామం పోచవరం. గోదావరికి చెంతనే ఈయనకి పొలం ఉంది. గతంలో తాడిపూడి ఎత్తిపోతల పథకంలో 1.10 ఎకరాల భూమి కోల్పోయారు. గూటాల ఎత్తిపోతల పథకంలో 15 సెంట్లు భూమి పోయింది. ఇంకా ఈ రైతుకు 2.54 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు చింతలపూడి పథకం వచ్చింది. మొదటి ఫేజ్‌లో ఇతని నుంచి 54 సెంట్ల భూమిని సేకరించారు. మళ్లీ ఇప్పుడు 2 ఎకరాల భూమి సర్వే చేసి రాళ్లు వేశారు. ఈయనకు ఉన్న భూమి మొత్తం ప్రభుత్వం లాగేసుకుంటోంది. గతంలో ఇదే భూమిని కుమార్తెకి కట్నంగా ఇచ్చారు. ఇప్పుడు భూమి పోయింది.
ఏం చేయాలో పాలుపోవడం లేదని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కృష్ణారావు ఒక్కరే కాదు, ఎంతో మంది రైతులు భూసేకరణలో భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నారు.
చింతలపూడి ఎత్తిపోతల వివరాలు
కాలువ పొడవు 106 కిలోమీటర్లు
పథకం లక్ష్యం 4.08 లక్షల ఎకరాలకు సాగునీరు
ఖర్చు వివరాలు (రూ. కోట్లలో)
ప్రాథమిక అంచనా వ్యయం : 1,701
సవరించిన అంచనాలతో : 4909.80
ఇప్పటివరకు చేసిన ఖర్చు : 804.82
భూసేకరణ వివరాలు (ఎకరాల్లో)
అవసరమైన భూమి 22,962
రైతుల భూమి 13,403 సేకరించింది 8,815
అటవీ భూమి 9,559 సేకరించింది 1,282
కొవ్వూరు: మెట్ట ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు సర్కారు శీతకన్ను వేసింది. రూ. 4,909.80 కోట్ల వ్యయం తో చేపట్టాల్సిన పథకానికి 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.90 కోట్లు మాత్రమే కేటాయించింది. మరో వైపు వచ్చే నవంబర్ నాటికి ఈ పథకం పూర్తి చేసి పొలాలకు నీళ్లిస్తామంటూ రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. నాలుగేళ్ల కాలంలో పూర్తి కావాలని నిర్దేశించిన పథకం ఇప్పటికి ఎనిమిదేళ్లు పూర్తయినా నేటికీ ఓ కోలిక్కి రాలేదు.
క్షేత్రస్థాయిలో చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియ ప్రహసనంగా మారింది. రైతులకు పరిహారం చెల్లింపుల్లో వ్యత్యాసాలు చూపుతున్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు సాగుతోంది. భూసేకరణలో భాగంగా ఎంతోమంది చిన్న, సన్నకారు రైతులు పూర్తిగా భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఒక్కోచోట ఒక్కోరకం పరిహారం చెల్లించడాన్ని రైతులు తీవ్రంగా తప్పు బడుతున్నారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించిన ఈ పథకం సామర్థ్యాన్ని 4.80 లక్షలకు పెంచారు.
దీంతో నిర్మాణ వ్యయం రూ.1,701 కోట్లు నుంచి రూ.4909. 80 కోట్లకి పెరిగింది. భూసేకరణ కూడా 17,122 ఎకరాల నుంచి ఇప్పుడు 22,962 ఎకరాలకు పెరిగింది. ఇంత వరకు భూసేకరణ ప్రక్రియతో కలిపి రూ.804.82 కోట్లు విలువైన పనులు చేపట్టారు. భూసేకరణ నిమిత్తం రూ.209.86 కోట్లు, పనుల నిమిత్తం రూ.594.96 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో రూ.344 కోట్లు ఖర్చు చేయగా టీడీపీ నాలుగేళ్ల పాలనలో రూ.467.82 కోట్లు ఖర్చు చేశారు.
ఎక్కడి పనులు అక్కడే
ప్రస్తుతం ఈ పథకం పనులు నాలుగు ప్యాకేజీలుగా నడుస్తున్నాయి. మొదటి ప్యాకేజీలో మూడు పంపుహౌస్‌లు, లీడింగ్ ఛానల్ 0 నుంచి 13.22 కిలోమీటరు వరకు, మెయిన్ కెనాల్ 0–36 కిలోమీటరు వరకు డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు చేపడతారు. దీనిలో లీడింగ్ ఛానల్ 13.2 కిలో మీటర్లకి 8.3 కిలోమీటర్లు పనులు పూర్తి చేశారు. మెయిన్ కెనాల్ 36 కి.మీ.లకు గాను 27.6 కి.మీ. మేరకు పనులు చేశారు. ఈ పనులను నాలుగు కాంట్రాక్టు సంస్థలు చేస్తున్నాయి. మొదటి అంచనా ప్రకారం 110 స్ట్రక్చర్స్ నిర్మించాల్సి ఉండగా 24 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
వీటిలో కొన్ని పూర్తయ్యాయి. మరో మూడు స్ట్రక్చర్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి సామర్థ్యం విస్తరిస్తున్న కాలువ సామర్ధ్యం మేరకు పెంచాల్సి ఉంది. ఇప్పుడు సామర్ధ్యం పెంచిన దృష్ట్యా లీడింగ్ ఛానల్‌లో 26, మొయిన్ కెనాల్‌లో 121 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రెండో ప్యాకేజీలో 36 కిలోమీటర్ నుంచి 68 కిలోమీటరు వరకు మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటర్‌లతో కలిపి తవ్వాల్సి ఉంది. ఈ ప్యాకేజీలో 32 కిలోమీటర్లకి గాను 28.875 కిలోమీటర్లు పనులు పూర్తి చేశారు. దీనిలో 83 స్ట్రక్చర్లకు గాను మూడు పురోగతిలో ఉన్నాయి.
మూడో ప్యాకేజీ రూ.681.21 కోట్లతో పంప్ హౌస్‌లోను పెరిగిన సామర్థ్యం మేరకు డిస్‌చార్జీలను నిర్మించాల్సి ఉంది. నాలుగో ప్యాకేజీలో 68వ కిలోమీటరు నుంచి 106 కిలో మీటరు వరకు మెయిన్ కెనాల్, కొవ్వాడ, తమ్మిలేరు స్థిరీకరణ పనులు ఉన్నాయి. దీనిలో 85 స్ట్రక్చర్ల నిర్మించాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్కటీ ప్రారంభం కాలేదు. రానున్న రోజుల్లో జల్లేరు జలశయం సామర్ధ్యం 8 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచనున్నారు. దీన్ని ఐదో ప్యాకేజీగా పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు.
ప్రహసనంగా భూసేకరణ
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి మారిన అంచనా ప్రకారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 22,962 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనిలో అటవీశాఖకు చెందిన భూమి ఏకంగా 9,559 ఎకరాలుంది. ఇంత వరకు రైతుల నుంచి 8,815 ఎకరాల సేకరణ పూర్తికాగా ఇంకా 4,588 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అటవీ శాఖ కోల్పోతున్న భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వేరేచోట భూమి సూచించాల్సి ఉంది.
దీనిలో భాగంగా ఇటీవలే విశాఖపట్నం జిల్లాలో 1,282 ఎకరాల (859 హెక్టార్లు) భూమిని అటవీ భూమిగా అభివృద్ధి పరచడానికి అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫేజ్–1 క్లియరెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ అటవీ ప్రాంతంగా అభివృద్ధికి రూ.32 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు. ఇంకా 8,277 ఎకరాల అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూములు చూపిస్తే తప్ప అటవీ భూముల్లో పనులు చేయడానికి వీలు ఉండదు.
ఆరెకరాలకు తొంభై సెంట్లు మిగిలింది
ఈయన పేరు కాకర్ల వెంకటేశ్వరరావు. తాళ్లపూడి మండలం పోచవరం గ్రామం. ఈయన ఒకప్పుడు 6.30 ఎకరాల రైతు. ఉన్న భూమంతా తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు కేవలం ముప్పై సెంట్లు మాత్రం మిగిలింది. తాడిపూడి పథకంలో ఎకరం పోయింది. చింతపూడి పథకం పేజ్–1లో 1.30 సెంట్లు, ఫేజ్–2 లో తాజాగా 3.10 ఎకరాలు పోతోంది. ఇక మిగిలింది కేవలం 90 సెంట్లు మాత్రమే. చింతలపూడి పథకం పేరుతో ఈ రైతు జీవితం తారుమారైంది.
చింతలపూడి మొదటి విడతలో ఎకరాకు రూ.12.50 లక్షలు ఇస్తామని నమ్మించి అధికారులు రూ.8.35 లక్షలు చొప్పున ఇచ్చారు. రెండో విడతలో ఎకరాకి రూ.26.50 లక్షలు అన్నారు. మంత్రి రూ.28 లక్షలు ఇప్పిస్తామన్నారు. చివరికి ఎకరానికి రూ.23.74 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సొమ్ముతో మళ్లీ భూమి కొందా మంటే ఆ రేటుకు మార్కెట్‌లో పొలం అందుబాటులో లేదని ఆయన వాపోతున్నారు.
20 శాతం పనులు పూర్తి
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఇరవై శాతం పూర్తయ్యాయి. పథకం విస్తరణ కారణంగా నీటి సామరŠాధ్యన్ని 15.5 టీఎంసీల నంచి 53.5 టీఎంసీలకు పెంచుతున్నారు. నీటి విడుదల రెండు వేల క్యూసెక్కుల నుంచి 6,875 క్యూసెక్కులకు పెరుగుతుంది. మొదటి విడతలో నిర్మించిన స్ట్రక్చర్‌లు సర్దుబాటు చేయడానికి వీలులేనివి ఉంటే తొలగిస్తాం. అటవీ భూములు ముందుగా కాలువ తవ్వకాలకు అవసరమైనవి ఇచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం సమయంలో మరికొన్ని భూములు అవసరమవుతాయి. వాటిని కూడా సేకరిస్తాం.
– డీఎస్‌ఎస్ శ్రీనివాసయాదవ్, ఎస్‌ఈ, చింతలపూడి ఎత్తిపోతల పథకం
Comments
Please login to add a commentAdd a comment