సాక్షి, అమరావతి: లగడపాటి సర్వేల కోసం ప్రభుత్వ నిధుల ‘ఎత్తిపోత’ కార్యక్రమం జరుగుతోంది. ప్రజల సొమ్ముతోనే ప్రజా నాడి తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణ ఎన్నికల్లో ‘టీడీపీ–కాంగ్రెస్’ కూటమి తరఫున సర్వే లు చేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కే ఈ సర్వేల బాధ్యత అప్పగించారు. ఈ సర్వేలకయ్యే నిధులను సమకూర్చేందుకుగానూ రూ.వేల కోట్ల విలువైన ఎత్తిపోతల పథకాల పనులు అప్పగి స్తున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ జలవనరుల శాఖ అధికారవర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్)–యోగి వేమన రిజర్వాయర్(వైవీఆర్)–హంద్రీ–నీవా (హెచ్‌ఎన్ ఎస్‌ఎస్) రెండో దశ ఎత్తిపోతల పథకం టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలే ఇందుకు తార్కాణమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వివరాలు.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ)లో అంతర్భాగమైన సీబీఆర్ నుంచి రెండు వేల క్యూసెక్కులను వైవీఆర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడ్నుంచి హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ(386.90 కి.మీ వద్ద)లోకి ఎత్తిపోసి.. కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే పనులకు రూ.1,796.99 కోట్లతో జనవరి 29న ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది. సీబీఆర్‌లో నీటి లభ్యత లేదని హైడ్రాలజీ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక వైపు వెళ్లకుండా.. కేవలం ఉజ్జాయింపు అంచనాలు ఆధారంగా ఈ పథకాన్ని మంజూరు చేసింది. ఇదే అంశాన్ని పరిపాలన అనుమతులిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని అనంతపురం జిల్లా చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనలను సాక్షాత్తూ సీఎం చంద్రబాబే బుట్టదాఖలు చేయించారు.
సర్వేల కోసం లగడపాటితో ఒప్పందం..
ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు, వెలువడిన తర్వాత, పోలింగ్‌కు మూడు రోజుల ముందు వరకు.. ఇలా విడతల వారీగా సర్వేలు చేసి రాజకీయ పరిస్థితులు, టీడీపీ అభ్యర్థుల విజయావకాశాలపై ఎప్పటికప్పుడు నివేదికలిచ్చే అంశంపై ఇటీవల మాజీ ఎంపీ లగడపాటితో సీఎం చంద్రబాబు పలుమార్లు సమావేశమై చర్చించారు. ఈ సర్వేలకయ్యే నిధులను ప్రభుత్వ ఖజానా నుంచే సమకూర్చడానికి చంద్రబాబు ప్రణాళిక రచించారు. లగడపాటి బినామీకి చెందిన ఒక కాంట్రాక్టు సంస్థకు సీబీఆర్–వైవీఆర్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశ పనులు అప్పగించేసి.. మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చే మొత్తాన్ని సర్వేలకు వినియోగించేలా ఇరువురి మధ్య ఒప్పందం కుదిరినట్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ఆ ఒప్పందంలో భాగంగానే సీబీఆర్–వైవీఆర్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశ ఎత్తిపోతల పనులకు రూ.1,182.33 కోట్ల అంచనా వ్యయంతో ఒకే ప్యాకేజీ కింద జనవరి 30న టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు.
ఎక్కడైనా జాయింట్ వెంచర్లు చెల్లవ్.. కానీ ఇక్కడ కాదు!
కర్నూలు జిల్లాలోని రాజోలిబండ కుడి కాలువ ప్రాజెక్టుకు రూ.1,557.37 కోట్లతోనూ.. వేదవతి ఎత్తిపోతల పథకం పనులకు రూ.1,536.28 కోట్లతోనూ ఎల్‌ఎస్(లంప్సమ్) ఓపెన్ విధానంలో జనవరి 29న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు ప్రాజెక్టుల టెండర్లలో జాయింట్ వెంచర్లు.. అంటే ఒక కాంట్రాక్టు సంస్థ కంటే ఎక్కువ సంస్థలు జట్టుగా ఏర్పడి షెడ్యూల్ దాఖలు చేయడానికి అవకాశం లేదనే నిబంధన పెట్టారు. కానీ సీబీఆర్–వైవీఆర్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశ ఎత్తిపోతల టెండర్‌లో మాత్రం జాయింట్ వెంచర్లు కూడా షెడ్యూల్ దాఖలు చేయడానికి అర్హులే అంటూ నిబంధనలు మార్చారు. మరోవైపు లగడపాటి బినామీకి చెందిన సంస్థకు ఇంతకుముందు సాగునీటి ప్రాజెక్టుల పనులు చేసిన అనుభవం లేదు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తన కోటరీలోని ఒక ప్రధాన సంస్థను లగడపాటి బినామీ సంస్థతో జట్టు కట్టేలా చేసి.. షెడ్యూల్ దాఖలు చేయించడానికే ఈ నిబంధన పెట్టారన్నది స్పష్టమవుతోంది. టెండర్‌లో నిబంధనల ప్రకారం 5 శాతం వరకూ అధిక(ఎక్సెస్) ధరకు షెడ్యూల్ దాఖలు చేయొచ్చు. అంత కంటే ఎక్కువ ధరకు షెడ్యూల్ కోట్ చేస్తే వాటిని రద్దు చేయాలి. కానీ.. ఎక్కువ ధరకు షెడ్యూల్ దాఖలు చేసినా కూడా ప్రభుత్వ అనుమతి మేరకు ఆమోదించవచ్చని, లేదా టెండర్‌లో పేర్కొన్న ధరకు.. అంటే రూ.1,182.33 కోట్లకు ఎవరైనా కాంట్రాక్టర్‌కు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఉందని నిబంధన పెట్టారు. లగడపాటి బినామీ సంస్థకు ఈ పనులు కట్టబెట్టడానికే ఈ నిబంధనలు పెట్టారన్నది స్పష్టమవుతోంది. ఈ టెండర్‌లో ఈనెల 25 వరకు షెడ్యూల్ దాఖలు చేసుకోవచ్చు. అదే రోజు సాయంత్రం 5కి టెక్నికల్ బిడ్.. 26న ప్రైస్ బిడ్ తెరిచి ప్రభుత్వ అనుమతితో లగడపాటి సంస్థకు పనులు కట్టబెట్టడం ఖాయమని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రూ.410 కోట్లకుపైగా అంచనా వ్యయం పెంపు..
బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ రూపొందించిన 2018–19 స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్(ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి పనికి సగటున రూ.90 చెల్లించాలి. క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పనులకు సగటున రూ.4,859 చెల్లించాలి. సీబీఆర్–వైవీఆర్–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశ ఎత్తిపోతల్లో 1,69,35,436 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాలి. ఇందుకు రూ.458,12,30,908 ఖర్చు అవుతుందని టెండర్‌లో పేర్కొన్నారు. అంటే ఒక క్యూబిక్ మీటర్ మట్టి పనికి రూ.270.51 చెల్లిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎస్‌ఎస్‌ఆర్‌లో పేర్కొన్న ధర కంటే ఇది మూడింతలు ఎక్కువ. ఒక్క మట్టి పనుల్లోనే రూ.300 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేశారు.
ఇక ఈ ఎత్తిపోతల పనుల్లో 2,52,708 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. ఇందుకు రూ.159,39,66,732 ఖర్చు అవుతుందని టెండర్‌లో పేర్కొన్నారు. అంటే ఒక క్యూబిక్ మీటర్‌కు సగటున రూ.6,307.54 చెల్లిస్తున్నట్లు లెక్క. దీన్ని బట్టి ఒక్క కాంక్రీట్ పనుల్లోనే అంచనా వ్యయాన్ని రూ.110 కోట్లకు పైగా పెంచేసినట్లు స్పష్టమవుతోంది. సీబీఆర్ నుంచి ఆరు దశల్లో నీటిని ఎత్తిపోయడానికి పంప్ హౌస్‌ల నిర్మాణం కోసం రూ.482,24,64,331, ప్రెజర్ మైన్ కోసం రూ.82,58,21,723 వ్యయం అవుతుందని అంచనా వేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అంచనా వ్యయాన్ని పెంచేయడం ద్వారా లగడపాటి బినామీ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చబోతున్నట్లు స్పష్టమవుతోంది.
చిలక జోస్యాలకు రూ.400 కోట్లు ‘ఎక్సెస్’
Published Wed, Feb 20 2019 3:34 AM | Last Updated on Wed, Feb 20 2019 3:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment