రూ.కోట్లు కొల్లగొట్టారు.. | crores of rupees scam | Sakshi
Sakshi News home page

రూ.కోట్లు కొల్లగొట్టారు..

Published Mon, Jan 29 2018 7:38 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

crores of rupees scam - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌ :  నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల కట్ట నిర్మాణానికి వినియోగిస్తున్న ఒండ్రుమట్టి ఇటు రైతులకు, అటు జిల్లాలోని నాయకులకు కాసులు కురిపిస్తోంది. నల్లరేగడి పొలాలు ఉన్న రైతులతో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టర్లు రూ.లక్షలు వెచ్చించి నల్లమట్టి కొనుగోలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా రైతుల పొలాలనే కొనుగోలు చేసి కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా ఒండ్రుమట్టిని తవ్వుతున్నారు. కొన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోని ఒండ్రుమట్టిని తరలించుకుపోయేందుకు ఆయాగ్రామాల ప్రజాప్రతినిధులకు, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు ’లక్షలు ముట్టజెప్తున్నారు. దీంతో జిల్లాలోని చెరువులు, కుంటలలో వందల సంవత్సరాల నాటి నుంచి పోగవుతూ వస్తున్న ఒండ్రుమట్టి క్షణాలలో మాయమవుతోంది.  

రిజర్వాయర్ల నిర్మాణంలో ఒండ్రు తప్పనిసరి  
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పాలమూరు –రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వట్టెం గ్రామంలో భారీ రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారు. దీనికితోడు కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని నార్లాపూర్‌ రిజర్వాయర్‌తోపాటు కోడేరు మండలంలోని తీగలపల్లి వద్ద ఏదుల రిజర్వాయర్‌ను ప్రభుత్వం పెద్దఎత్తున నిర్మించి కృష్ణా జలాలను నిల్వ ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రిజర్వాయర్ల నిర్మాణంలో చెరువు కట్టనుంచి నీరు బయటకు ఉసరకుండా ఉండేందుకు తప్పనిసరిగా ఒండ్రుమట్టిని వాడతారు. ఈ మట్టి బంకమట్టి మాదిరిగా ఉండి నీటిని కట్టనుంచి బయటకు వెళ్లకుండా చూస్తుంది. దీంతో ఇంజనీర్లు తప్పనిసరిగా ఒండ్రుమట్టిని వాడాలని నిబంధన విధించడంతో కాంట్రాక్టర్లు దీనికోసం ఎంత దూరమైనా వెళ్లి తెచ్చుకుంటున్నారు.

ఇందులో భాగంగా వట్టెం రిజర్వాయర్‌ కోసం బిజినేపల్లి మండలంలో పెద్దఎత్తున చెరువుల్లోని ఒండ్రును అక్రమంగా తరలించారు. ఇదే విషయంలో గ్రామాలలో గొడవలూ చోటుచేసుకున్నాయి. బిజినేపల్లి మండలం మంగనూరు, నందివడ్డెమాన్, పాలెం గ్రామాలలో కొందరు ఏకపక్షంగా చెరువు ఒండ్రును సొంత ప్రయోజనాల కోసం అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నేత చక్రం తిప్పడంతో గ్రామాలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండానే దీనిని అప్పనంగా కాంట్రాక్టర్‌కు అప్పగించడం జిల్లాలో వివాదాస్పదమైంది. మరోపక్క బిజినేపల్లి మండలం మంగనూర్‌ గ్రామంలోని ఊరచెరువు ఒండ్రుమట్టి విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం రేగింది. ఈ విషయం గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

మంగనూరు చెరువు ఒండ్రుకు రూ.70లక్షల బేరం  
మంగనూర్‌ గ్రామ ఊర చెరువులోని 70 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఒండ్రును తీసుకునేందుకు గానూ ఓ కంపెనీ కాంట్రాక్టర్‌ కొందరితో అక్రమ ఒప్పందం కుదుర్చుకుని ’70లక్షలకు బేరం మాట్లాడుకున్నట్లు ఓ వర్గం ఫిర్యాదు చేసింది. దీంతో మరో వర్గం అదే గ్రామంలోని నక్కలకుంటలోని ఒండ్రును రూ.42 లక్షలకు అమ్ముకున్నారంటూ వీరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.  

పాలెం పెంటోని చెరువులో చేతులు మారిన రూ.3కోట్లు  
జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరున్న బిజినేపల్లి మండలం పాలెం పెంటోనిచెరువులోని ఒండ్రును తరలించేందుకు కాంట్రాక్టర్‌ నుంచి కొందరు నాయకులు రూ.3కోట్ల ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రేయింబవళ్లు వందలాది భారీ టిప్పర్ల ద్వారా ఇక్కడి ఒండుమట్టిని తరలిస్తున్నా ఒక్కరు కూడా అభ్యంతరం తెలపకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్‌ నుంచి అన్ని స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులకు పెద్దఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఐబీ అధికారుల పరిధిలోని చెరువుల్లోని ఒండ్రుమట్టిపై దోపిడీ జరుగుతున్నా ఆ శాఖ అధికారులు కనీసం అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

పాలమూరు ప్రాజెక్టు పట్ల రైతుల్లో సానుకూల దృక్పథం ఉండటాన్ని నాయకులు క్యాష్‌ చేసుకున్నారు. మన ప్రాజెక్టుల కోసమేనంటూ రైతులను నమ్మబలికి రూ.కోట్లలో లంచాలు దిగమింగారు. ఇదే ఒండ్రుకు మెట్రిక్‌ టన్నుల ప్రకారం రాయల్టీ చెల్లిస్తే ఆయా గ్రామ పంచాయతీలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరేది. వాస్తవానికి గ్రామ పంచాయతీ పరిధిలోని సహజ వనరులపై పూర్తి హక్కు పంచాయతీలకే ఉంటుంది. పంచాయతీ తీర్మానం, అనుమతి లేకుండా ఒండ్రు తరలించడం చూస్తుంటే దోపిడీదారులను ప్రశ్నించేవారు కరువయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

నందివడ్డెమాన్‌లోనూ...  
బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లోనూ భారీగా చెరువుల్లోని ఒండ్రుమట్టితోపాటు రేగడి భూముల్లోని ఒండ్రును ప్రాజెక్టుల పేరుతో అక్రమంగా తరలించారు. కొందరు కాంట్రాక్టర్లు రైతులతో భూములు కొనుగోలు చేసి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గుంతలు పెట్టి ఒండ్రును తరలించారు. మరి కొన్ని చోట్ల శిఖం భూములు, ప్రభుత్వ భూముల్లోనూ ఒండ్రు తరలింపు యదేచ్ఛగా సాగింది. బినామీ రైతులను సృష్టించి పెద్ద ఎత్తున ఈ గ్రామంలో భూ మాయ చేశారు. ఇంత జరిగినా ఈ అంశంపై పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్లినా సంబంధిత అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కొల్లాపూర్‌ నియోజకవర్గంలోనూ..

కొల్లాపూర్‌ నియోజకవర్గం నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్‌కు భారీగా ఒండ్రును తరలించారు. ఈ నియోజకవర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చెరువుల్లోని ఒండ్రుమట్టిని ప్రొక్లెయిన్ల ద్వారా ఒడ్డుకు చేర్చి పెద్దలుగా కుప్పలు పోసి ఆ తర్వాత కాంట్రాక్టర్లకు విక్రయించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలు ఈవిషయమై గగ్గోలు పెట్టినా స్పందించకపోవడం గమనార్హం.  

రైతు నోట్లో మట్టి... 

నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని కేసరి సముద్రంలోని ఒండ్రుమట్టిని కొల్లగొట్టేందుకు కొందరు చెరువులో బుద్ధ విగ్రహాన్ని నిర్మించేందుకంటూ అందులోని నీటిని పూర్తిగా బయటకు వదిలేశారు. ఆ సాకుతో చెరువులోని ఒండ్రును యదేచ్ఛగా ప్రాజెక్టుకు అమ్ముకుంటున్నారు. ఈ అంశం వివాదాస్పదంగా మారినప్పటికీ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఈ చెరువు నిండితే పలుగ్రామాల పొలాలు పంటలతో కళకళలాడతాయి. స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లాలోని అన్ని చెరువులు నీటితో కళకళలాడుతున్నా, నాగర్‌కర్నూల్‌ కేసరి సముద్రంలో నీరు లేకుండా చేసి రైతుల ఆగ్రహానికి గురవుతున్నారు. వట్టెం రిజర్వాయర్‌కు నిత్యం ఇక్కడి నుంచి వందలాది టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా జిల్లా అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ నోరు విప్పడం లేదు.  

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి
వడ్డెమాన్‌ గ్రామంలో బినామీ రైతులను సృష్టించి విలువైన ప్రభుత్వ భూములు, శిఖం భూములను కాంట్రాక్టర్లకు విక్రయించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. ఈ విషయం డీఆర్వో మధుసూదన్‌నాయక్‌ దృష్టికి తీసుకొచ్చాం. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఒండ్రుమట్టిని పెద్ద ఎత్తున విక్రయించడంతోపాటు పర్యావరణానికి ఆటంకం సృష్టించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.                 

– సుధాకర్, నందివడ్డెమాన్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement