వానలున్నా.. వచ్చింది 15 టీఎంసీలే!
♦ కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు పెరగని ప్రవాహాలు
♦ కర్ణాటక, మహారాష్ట్రలను కలిపి చూసినా రెండు బేసిన్‌లలో నిరాశాజనకం
♦ ఒక్క జూరాలలోనే 5 టీఎంసీల మేర వచ్చిన నీరు ∙మిగతా అన్ని ప్రాజెక్టులకు నీటి కొరత
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం మొదలై ఇరవై ఐదు రోజులు గడుస్తున్నా కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు చేరకపోవడం రాష్ట్రాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. రాష్ట్ర పరీవాహకంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో కలిపి ఇప్పటివరకు కేవలం 15 టీఎంసీల నీరే వచ్చింది. దీంతో ప్రాజెక్టులన్నీ వెలితిగా కనిపిస్తున్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులే నీటి కొరతను ఎదుర్కోవడం.. సమస్యను మరింత తీవ్రం చేసేలా కనిపిస్తోంది.
జూరాలలో మాత్రమే...
ఇక జూరాలలో మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. పరీవాహకంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటిరవకు 5.25 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ఇది మినహా ఎక్కడా చుక్క నీరు ఇతర ప్రాజెక్టుల్లోకి చేరలేదు. దీనికి తోడు ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు పరీవాహకం తక్కువగా ఉండటంతో ఎగువ ప్రాజెక్టులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అక్కడ ప్రాజెక్టులు నిండి దిగువకు నీరొస్తేనే మన ప్రాజెక్టులు నిండుతాయి. ప్రస్తుతం ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో మొత్తంగా 205 టీఎంసీల నీటి కొరత ఉంది. గడచిన 25 రోజుల్లో ఎగువ ప్రాజెక్టుల్లో మొత్తంగా కేవలం 3 టీఎంసీల కొత్త నీరు వచ్చింది.
ఎగువనే ఈ స్థాయిలో నీటి లోటు ఉంటే, అవి పూర్తి స్థాయిలో నిండి దిగువకు నీరెప్పుడు రావాలన్నది ఇప్పుడు పెద్దగా ప్రశ్నగా మారుతోంది. ఇక గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, కడెం, లోయర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్ధ్యం198 టీఎంసీల మేర ఉండగా ప్రస్తుతం లభ్యతగా ఉన్నది కేవలం 45 టీఎంసీలు మాత్రమే. గత ఏడాది నిల్వలతో పోలిస్తే నిల్వలు ఎక్కువగా ఉన్నా, పెద్దగా ప్రవాహాలు లేకపోవడం, కొత్తగా వచ్చింది 7 టీఎంసీల వరకే ఉండటం రాష్ట్రాన్ని కలవర పెట్టే అంశమే. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నా అవి దిగువకు వచ్చేందుకు సమయం పడుతుండటంతో ప్రవాహాల కోసం ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
573 టీఎంసీల కొరత..
కృష్ణా, గోదావరి పరిధిలోని అన్ని ప్రధాన ప్రాజె క్టుల నీటి నిల్వ సామర్థ్యం 773.16 టీఎంసీలు కాగా లభ్యతగా ఉన్నది 199.56 టీఎంసీలు మాత్రమే. ఫలితంగా మరో 573.6 టీఎంసీల లోటు కనబడుతోంది. ఇందులో కృష్ణా బేసిన్ ప్రాజెక్టు ల్లో నాలుగైదు టీఎంసీలకు మించి వినియోగార్హమైన నీరు లేదు. సాగర్ పూర్తిస్థాయి మట్టం 590 అడుగులకు గానూ ప్రస్తుతం 501.5 అడుగులకు చేరగా, నీటి నిల్వ 117.69 టీఎంసీలకు చేరిం ది. ఇక్కడ ఒక్క టీఎంసీ కూడా తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఎగువన శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ నీరు విడుదల చేయకపోవ డంతో మోటార్లు కిందకు దింపి హైదరాబాద్ తాగునీటి అవసరా లకు రోజుకు 300 క్యూసెక్కుల మేర నీటిని తీసుకుంటున్నారు. శ్రీశైలంలో వాస్తవ మట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 778 అడుగులకు పడిపోయింది.