గుండె ‘చెరువు’!
► వర్షాల్లేక వట్టిపోతున్న చెరువులు
► 25 శాతం కూడా నిండని చెరువులు 20,681
► కృష్ణా, గోదావరి బేసిన్‌లో గడ్డు పరిస్థితులు
► 20 లక్షల ఎకరాలపై ప్రభావం!
గ్రామీణ వ్యవసాయానికి పట్టుగొమ్మలాంటి చెరువు చిన్నబోతోంది. ఏటా ఈ సమయానికల్లా నీటి గలగలలతో కళకళలాడాల్సిన చెరువులన్నీ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వట్టిపోతున్నాయి. రాష్ట్రంలో 44 వేలకు పైగా ఉన్న చెరువుల్లో ఏకంగా 20 వేల పైచిలుకు చెరువుల్లో నీటి జాడ కానరావడం లేదు. పూర్వ మహబూబ్‌నగర్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని చెరువులు, వాటికింది ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇది ఏకంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రభావితం చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్
పడిపోయిన సాగు విస్తీర్ణం..
నీటి కొరతతో చెరువుల కింద సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. గత ఏడాదితో పోలిస్తే 15 శాతం ఆయకట్టులో కూడా సాగు జరగని పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది విస్తారంగా వర్షాలు కురవడం, ఆ సమయానికే పెద్ద సంఖ్యలో చెరువుల పునరుద్ధరణ జరగడంతో ఏకంగా 13 లక్షల ఎకరాల్లో సాగునీరందించారు. కానీ ప్రస్తుత ఖరీఫ్‌లో అధికారుల అంచనా ప్రకారం చెరువుల కింద సాగు 3.5 లక్షల ఎకరాలు దాటలేదు.
నోరెళ్ల బెట్టిన కృష్ణా బేసిన్ చెరువులు
కృష్ణా బేసిన్ పరిధిలోని చెరువుల పరిస్థితి దారుణంగా ఉంది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో మొత్తంగా 23,366 చెరువులు ఉండగా ఇందులో 6,800కు పైగా చెరువుల్లో చుక్కనీరు చేరలేదు. 25 శాతం మాత్రమే నీరు చేరిన చెరువులు 8,100 వేల వరకున్నాయి. కేవలం 810 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు చేరింది.
గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలో 75 శాతం చెరువులు చుక్కనీటికి నోచుకోలేకపోయాయి. జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి లోటు ప్రభావం చెరువులపై పడింది. గతేడాది కల్వకుర్తి కింద 283 చెరువులు నింపగా.. ఈ ఏడాది ఒక్క చెరువుకు నీటి జాడ లేదు. సిద్దిపేట జిల్లాలో 3,256 చెరువులు ఉండగా.. 2,311 చెరువుల్లో 25 శాతం కంటే తక్కువ నీళ్లొచ్చాయి. చెరువుల్లోకి నీరు చేరకపోవడంతో కృష్ణా బేసిన్ పరిధిలో మొత్తంగా 11.13 లక్షల ఎకరాలపై ప్రభావం పడుతోంది. చివరికి గణేశ్ విగ్రహాల నిమజ్జనం కూడా కష్టతరంగా మారింది.
గోదావరిలోనూ అంతంతే..
గోదావరి బేసిన్‌లో కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదు. పాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని చెరువులు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని చెరువుల పరిస్థితి మాత్రం కాస్త మెరుగ్గా ఉంది. ఈ బేసిన్ పరిధిలో మొత్తంగా 20,814 చెరువులు ఉండగా 5,737 చెరువుల్లో 25 శాతం కంటే తక్కువ నీరు చేరింది. 7,380 చెరువుల్లోనే 75 శాతానికి పైగా నీరు చేరింది. మొత్తంగా బేసిన్ పరిధిలో 13.26 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. అందులో సుమారు 9 లక్షల ఎకరాలపై నీటి కొరత ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది.
చెరువుల పరిస్థితి ఇదీ
మొత్తం చెరువులు 44,180
25% లోపు నిండినవి 20,681
25–50% నిండినవి 9,796
50–75% నిండినవి 5,203
75–100% నిండినవి 8,500