
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) కింద యాసంగి కార్యాచరణను నీటిపారుదల శాఖ ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం కల్పించి, మిగతా లభ్యత నీటితో యాసంగికి నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. లభ్యతగా ఉన్న నీటిలో 38.4 టీఎంసీలను సాగు అవసరాలకు, 12.6 టీఎంసీలను తాగు అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించింది. మొత్తంగా ఎస్సారెస్పీ పరిధిలో 5.60 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించింది.
రెండు రోజుల కిందట ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అంశమై సమీక్షించిన ముఖ్యమంత్రి, మిషన్ భగీరథ అవసరాలకు పోనూ, మిగతా నీటితో యాసంగి ప్రణాళిక రూపొందించాలని సూచించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఎస్సారెస్పీలో లభ్యతగా ఉన్న 55.16 టీఎంసీలకు అదనంగా సింగూరు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా మరో 5 టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఎస్సారెస్పీలో నీటి నిల్వలు 60.16 టీఎంసీలకు చేరుతాయి. ఈ నీటిలో 15 టీఎంసీలను లోయర్ మానేరు డ్యామ్(ఎల్‌ఎండీ)కు కాకతీయ కెనాల్ ద్వారా విడుదల చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో ఆవిరి, సరఫరా నష్టాలు పోనూ 11.5 టీఎంసీల మేర ఎల్‌ఎండీని చేరినా, ప్రాజెక్టులో ఇప్పటికే లభ్యతగా ఉన్న నీటితో ప్రాజెక్టు నిల్వ 19.39 టీఎంసీలకు చేరనుంది.
ఎగువన 4 లక్షలు.. దిగువన 1.60 లక్షలు
ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీలో నిల్వలకు అనుగుణంగా ఎల్‌ఎండీ ఎగువన, దిగువన యాసంగి ప్రణాళిక ఖరారు చేశారు. ఎగువన తాగునీటికి 6.5 టీఎంసీలు పక్కనపెట్టి, 28.88 టీఎంసీలతో ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఏడు తడులకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 4 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయిం చారు. ఇందులో లక్ష్మీ కెనాల్ కింద 16,055 ఎకరాలు, సరస్వతి కెనాల్ కింద 16,300 ఎకరాలు, కాకతీయ కెనాల్ కింద 3,63,645 ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందిం చారు. ఇందులో లక్ష్మీ కెనాల్ కింద ఇవ్వాల్సిన ఆయకట్టులోనే చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం ఆయకట్టు ఉండనుంది.
ఇక ఎల్‌ఎండీ దిగువన మిషన్ భగీరథకు 6.16 టీఎంసీలు పక్కనపెట్టి, 9.53 టీఎంసీలను సాగుకు ఇవ్వనున్నారు. డిసెంబర్ 15 నుంచి మార్చి 14 వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 6 తడుల్లో 1.60 లక్షల ఎకరాలకు నీళ్లివ్వను న్నారు. ఇక వీటితో పాటే సింగూరు కింద 5.7 టీఎంసీలు తాగునీటి అవసరాలకు కేటా యించి, 5 టీఎంసీలు దిగువ నిజాం సాగర్‌కు విడుదల చేయనున్నారు. సింగూరు కింద 2 టీఎంసీలతో 30 వేల ఎకరాలు, నిజాం సాగర్‌లో మొత్తంగా లభ్యమయ్యే 18 టీఎంసీల నీటితో 1.50 లక్షల ఎకరాలు, గుత్పా, అలీసాగర్ ఎత్తిపోతల కింద 2 టీఎంసీ లతో 20 వేల ఎకరాలు కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment