సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎండలు పుంజుకోకమందే గోదావరి, కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్రమేపీ అడుగంటుతుండగా, గోదావరిలో ఇప్పటికే ప్రాజెక్టులన్నీ వట్టిపోయాయి. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో మరో ఐదు నెలల పాటు నెట్టుకురావాల్సిన పరిస్థితుల నేపథ్యంలో మున్ముందు నీటి ఎద్దడి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గోదావరి బేసిన్‌లోని సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు ఖాళీ అయ్యాయి. నిజాంసాగర్‌లో 17.8 టీఎంసీల నీటి నిల్వలకు గాను ఇప్పుడు అక్కడంతా బురదే కనిపిస్తోంది. కనీసం పశువులు తాగేందుకు నీరు సైతం లేకపోవడంతో ఆ ప్రాంతమంతా మైదానంలా కనిపిస్తోంది. గతేడాదిలో కనిష్టంగా 5.91 టీఎంసీల నిల్వలుండగా ఈ ఏడాది కేవలం 0.65 టీఎంసీలే ఉండటం, పరీవాహకంలో నీటి కష్టాలను తెచ్చిపెడుతోంది.
ఇక సింగూరులోనూ దారుణ పరిస్థితులున్నాయి. ఇక్కడ 29.31 టీఎంసీల నీటి నిల్వలకు గానూ కేవలం 1.17 టీఎంసీల నిల్వలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 9 టీఎంసీల మేర నిల్వలు తక్కువగా ఉండటంతో ఈ ప్రభావం సంగారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇక ఎస్సారెస్పీ పరిధిలో రబీ అవసరాలకు తాగునీటిని విడుదల చేయడంతో అక్కడ ఉండాల్సిన 90 టీఎంసీల నిల్వలకు గాను ప్రస్తుతం 13 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం రబీ అవసరాల కోసం 6,805 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మట్టం మరింత తగ్గేలా ఉంది. ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11 టీఎంసీలే ఉండగా, ఇక్కడి నుంచి నిత్యం 180 క్యూసెక్కులు తాగునీటికి, 1,422 క్యూసెక్కులు సాగునీటికి వినియోగిస్తున్నారు.
శ్రీశైలంలో వేగంగా పడిపోతున్న మట్టం
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. శ్రీశైలంలో 885 అడుగులకు గాను, కనీస నీటిమట్టం 834 అడుగులకు దిగువన 826 అడుగుల్లో 45.76 టీఎంసీల నీరు ఉంది. ఇక్కడి నుంచి వెయ్యి క్యూసెక్కుల మేర నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి.ఇప్పటికే 800 అడుగుల దిగువ వరకు నీటిని తీసుకోవాలని ఇటీవలి కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయించారు.
18 టీఎంసీల లభ్యత నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకుంటే త్వరలోనే ప్రాజెక్టు ఖాళీ అయ్యే పరిస్థితులున్నాయి. ఇక సాగర్‌లో ప్రస్తుతం 590 అడుగులకు గానూ,520.8 అడుగుల మట్టంలో 150 టీఎంసీల నీరుంది. కనీస నీటి మట్టం 510 అడుగులకు పైన వినియోగించుకునే నీరు కేవలం 15 టీఎంసీలే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు గానూ కనీస నీటిమట్టం 510 అడుగులకు దిగువన 505 అడుగుల వరకు వెళ్లి మొత్తంగా 33.71 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. ప్రస్తుత నీటితో మూడు నెలల అవసరాలు తీరినా, జూన్ నుంచి నీటి కష్టాలు తప్పవని నీటి పారుదల వర్గాలే చెబుతున్నాయి.
ప్రాజెక్టులకు వేసవి గండం..!
Published Sun, Mar 24 2019 3:47 AM | Last Updated on Sun, Mar 24 2019 3:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment