సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలకు చరమగీతం పాడటానికి కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుల అప్పగింత, పరిధిపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నోటిఫికేషన్ అమలును కేంద్రం పొడిగించిన ఆరు నెలల గడువు కూడా జూలై 15కే పూర్తయింది.
అయినా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో బోర్డులు విఫలమయ్యాయి. దీనిపై బోర్డులు, కేంద్ర జల్ శక్తి శాఖ స్పందించడం లేదు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సద్దుమణగడం లేదు. రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కోరారు.
గతేడాది శ్రీశైలంలోకి వరద ప్రవాహం లేకున్నా, నీటి నిల్వ కనిష్ట స్థాయిలో ఉన్నా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు లేకున్నప్పటికీ, బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. దీనివల్ల కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
దాంతో కేంద్రంలో కదలిక వచ్చింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతేడాది జూలై 15న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెల్లలో కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆర్నెల్లలో అనుమతి తెచ్చుకోవాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు.
కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఏపీ భూభాగంలోని శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, తెలంగాణ సర్కారు దాని పరిధిలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ అమలు గడువు జనవరి 15తో పూర్తయినా, ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. దీంతో కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ గడువును జూలై 15 వరకు పొడిగించింది.
ఈ క్రమంలోనే విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి (పాతది), నెట్టెంపాడు (పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా పూర్తయి మూడు నెలలు దాటింది. అయినా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్త రామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు.
గోదావరి బేసిన్‌లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు డీపీఆర్‌లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు రిజర్వాయర్ల మేనేజ్‌మెంట్ కమిటీ రూపొందించిన విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకిస్తోంది.
ఇదే అదనుగా తెలంగాణ ఇటీవల వరద తగ్గాక కూడా శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దీనివల్ల పది రోజుల్లోనే సుమారు 32 టీఎంసీల జలాలు ప్రకాశం బ్యారేజి మీదుగా సముద్రంలో కలిసిపోయాయి. అయినా కేంద్ర జల్‌శక్తి శాఖ గానీ, బోర్డులు గానీ పట్టించుకోవడంలేదు.
గడువు ముగిసినా గొడవలే..!
Published Thu, Nov 10 2022 4:19 AM | Last Updated on Thu, Nov 10 2022 4:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment