జాతీయ హోదా చాన్స్‌ లేదు | Jal Shakti says No chance of national status to Palamuru Ranga Reddy | Sakshi
Sakshi News home page

జాతీయ హోదా చాన్స్‌ లేదు

Published Fri, Jan 5 2024 3:43 AM | Last Updated on Fri, Jan 5 2024 8:01 AM

Jal Shakti says No chance of national status to Palamuru Ranga Reddy - Sakshi

షెకావత్‌కు వినతిపత్రం ఇస్తున్న సీఎం రేవంత్‌. చిత్రంలో మంత్రి ఉత్తమ్‌

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్టుకు మరో రకంగా సాయం అందిస్తామని పేర్కొంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కూడిన రాష్ట్ర బృందానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఏఐసీసీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్, ఉత్తమ్‌.. గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. షెకావత్‌తో సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీఎస్‌ శాంతికుమారి, సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీ మురళీధర్, సీఈ హమీద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

జాతీయ హోదా పరిశీలనే లేదు.. 
పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదాతో పాటు వివిధ అనుమతులకు సంబంధించిన రెండు వినతిపత్రాలను రాష్ట్ర బృందం షెకావత్‌కు అందజేసింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. ‘‘ప్రస్తుతం దేశంలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విషయాన్ని కేంద్రం పరిశీలించడంగానీ, పరిగణనలోకి తీసుకోవడంగానీ లేదు. జాతీయ హోదా అంశాన్ని కేంద్రం పక్కనపెట్టింది.

పోలవరం తర్వాత కర్ణాటకలోని అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు ఇచ్చిన జాతీయ హోదానే వెనక్కి తీసుకోవాలనే యోచన ఉంది. అయితే జాతీయ హోదాకు బదులు పాలమూరు ప్రాజెక్టుకు మరో రకంగా సాయం చేస్తాం. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిన నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తాం. ఈ పథకం ద్వారా గరిష్ట సాయం అందేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. 

అనుమతులు ఇప్పించండి 
పాలమూరు ప్రాజెక్టును మిగులు జలాల ఆధారంగా చేపట్టినా.. తర్వాత ప్రభుత్వం 75శాతం డిపెండబులిటీ ఆధారంగా ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటిని కేటాయించిందని కేంద్ర మంత్రికి రాష్ట్ర బృందం తెలిపింది. ఇందులో మైనర్‌ ఇరిగేషన్‌ కింద వినియోగించుకోలేని 45 టీఎంసీలు, గోదావరి మళ్లింపు జలాల ఆధారంగా రాష్ట్రానికి దక్కే వాటా 45 టీఎంసీలు ఉన్నాయని వివరించింది.

రూ.55,086 కోట్ల వ్యయఅంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంంఘం పరిశీలనకు పంపామని వెల్లడించింది. ప్రాజెక్టుకు ఇప్పటివరకు అటవీ, పర్యావరణ, వైల్డ్‌లైఫ్‌  వంటి అనుమతులు వచ్చాయని.. హైడ్రాలజీ, ఇరిగేషన్‌ ప్లానింగ్, కాస్ట్‌ ఎస్టిమేట్, అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అనుమతులు రావాల్సి ఉందని తెలిపింది. ఈ అనుమతులు వీలైనంత త్వరగా ఇప్పించేలా చొరవ చూపాలని కోరింది. 

సానుకూలంగా స్పందించారు: ఉత్తమ్‌ 
ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా విధానం లేదని కేంద్ర‡ మంత్రి షెకావత్‌ చెప్పారని భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్‌ మీడియాకు తెలిపారు. ఇతర పథకాల కింద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రాజెక్టుకు ఇంకా రావాల్సిన అనుమతులు ఇప్పించే అంశంపై సానుకూలంగా స్పందించారని వివరించారు. కేంద్రం వేరే విధంగా సాయం చేస్తామన్న కేంద్ర మంత్రి హామీకి రాష్ట్రం ఓకే చెప్పిందా? అని ప్రశ్నించగా.. దీనిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 
 
‘విభజన’ను పూర్తి చేయండి 
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్‌లనే కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్‌ పోస్టులు ఇవ్వాలని కోరారు. దీనిపై అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్‌ బ్యాచ్‌ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రేవంత్‌ తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. ఢిల్లీ నార్త్‌బ్లాక్‌లోని అమిత్‌ షా కార్యాలయంలో గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలి. పదో షెడ్యూల్‌ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలి. ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్‌ విభజనను సాఫీగా పూర్తి చేయాలి.

చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ క్లెయిమ్‌ చేసుకుంటున్న విషయంపై దృష్టి సారించాలి. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలి. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్‌హెచ్‌ఆర్సీ వంటి భవనాలను వినియోగించుకున్నందున.. ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలి..’’ అని వినతిపత్రంలో కోరారు. 
 
‘మెట్రో’ సవరణలను ఆమోదించండి 
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీతో భేటీ అయిన సీఎం రేవంత్‌ బృందం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించింది. ‘‘హైదరాబాద్‌ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించండి. సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిశీలించండి. హైదరాబాద్‌లోని మూసీ రివర్‌ ఫ్రంట్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.

అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, వాటర్‌ ఫాల్స్, చిల్డ్రన్స్‌ వాటర్‌ స్పోర్ట్స్, బిజినెస్‌ ఏరియా, దుకాణ సముదాయాలతో బహుళ విధాలా ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించాం. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అవసరమైన మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో పేదలకు నిర్మించి ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరు చేసేలా అనుమతి ఇవ్వాలి. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయడంతోపాటు పెండింగ్‌ నిధులు వెంటనే విడుదల చేయాలి..’’ అని రాష్ట్ర బృందం కోరింది. 
  
నేడు యూపీఎస్సీ చైర్మన్‌తో భేటీ 
సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌ శుక్రవారం ఉదయం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్‌ మనోజ్‌ సోనితో భేటీ కానున్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని రూపొందించాలన్న ఉద్దేశంతో ఈ భేటీ జరగనుందని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. గత ప్రభుత్వం పేపర్‌ లీక్‌లతో టీఎస్‌పీఎస్సీని భ్రష్టు పట్టించిందని.. దానిని ప్రక్షాళన చేసే దిశగా అవసరమైన చర్యలపై యూపీఎస్సీ చైర్మన్‌తో చర్చిస్తామని వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement