కేటాయింపునకు కేంద్రం అంగీకారం
నైని కోల్ బ్లాక్‌లో మైనింగ్‌కు అనుమతివ్వాలని వినతి
కేంద్ర మంత్రి జోషితో ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి చర్చలు
విద్యుత్ ఉత్పత్తికి సహకరించాలని ఆ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి
కేంద్ర మంత్రులతో భట్టి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థకి తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేయగా, ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడానికి అన్ని అనుకూలతలున్నాయని భట్టి వివరించారు. త్వరలో సింగరేణికి బొగ్గు గని కేటాయింపులకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామని ప్రహ్లద్ జోషీ హామీ ఇచ్చారని భట్టి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బ్లాక్‌లోనూ ఉత్పత్తిని ప్రారంభించే నిమిత్తం అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని భట్టి తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా రాష్ట్రంలోని సబ్‌స్టేషన్ల పరిసరాల్లో సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సహకరించాలని విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌ను కోరామన్నారు.
ఈ అంశాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. భట్టి వెంట ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, సింగరేణి ఇన్‌చార్జీ సీఎండీ బలరామ్ ఉన్నారు. కాగా, తాడిచెర్ల బ్లాక్–2 గనిని సింగరేణికి కేటాయిస్తే సంస్థ వార్షిక బొగ్గు ఉత్పత్తి ఏటా 5మిలియన్ టన్నులకు పెరగనుంది. తాడిచర్ల బ్లాక్ 2 గని ద్వారా 30 ఏళ్లలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదు
మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేరు చేస్తే సరిపోతుందని చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంజనీర్లు కాదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఎవరికి వారే ఇంజనీర్లమని ఊహించుకుని చెప్పడంవల్లనే అవి కూలిపోయాయని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
అధికారం పోయిన తర్వాత బీఆర్‌ఎస్ వాళ్తు ఆలోచనా జ్ఞానం కోల్పోయారని భట్టి మండిపడ్డారు. డ్యామ్ సేఫ్టీ, ఇంజనీరింగ్ అధికారులు చెప్పినట్లు చేయడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం చర్చలు జరుపుతోందని, సమయం, సందర్భాన్ని బట్టి జాబితా ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరో ముందుగా ప్రకటించారని తాము తొందరపడబోమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment